Saturday, March 1, 2014

162 Narendra Modi

162 Killing the mother during childbirth పురుడు పోసి తల్లిని చంపటం
చర్చనీయాంశాలు: Narendra Modi, నరేంద్ర మోడీ,bjp,బిజెపి,సీమాంధ్ర,తిక్కన,విభజన,మహాభారతం
---->ఇతగాడు నాయకుడు కాదు, రక్షకుడు.

పురుడు పోసి తల్లిని చంపేశారు.


...బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనేచంపేసిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించింది. ...

... తామే గనుక అధికారంలో ఉండి ఉంటే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉండేలా రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేసి చూపించే వాళ్ళం. ...

... సీట్ల కోసం సీమాంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ లేదు. 60 ఏళ్ళకి పైగా సుదీర్ఘ పోరాటం, వెయ్యికి పైగా బలి దానాలు, ఎందరో తల్లుల కడుపు కోత వల్లనే ప్రత్యేక రాష్ట్రం సిధ్ధించింది. ...

... సీమాంధ్రకు యూపియే అధినేత్రి చేసిన అన్యాయం పూడ్చలేనిది. అందరూ భారతమాత బిడ్డలే. అన్నదమ్ముల్లా ఉండే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. విభజనతో సీమాంధ్రుల గుండెలు గాయపడ్డాయి. వారందరి వెంటా భాజపా, నరేంద్రమోడీ ఉంటారని భరోసా కల్పిస్తూ కన్నీళ్ళు తుడుస్తా. తెలంగాణ సీమాంధ్ర ప్రయోజనాలు రెండూ ముఖ్యమే. తెలంగాణ పునర్నిర్మాణం లో భాజపా పాత్ర ప్రత్యేకంగా ఉండ బోతుంది. వచ్చే వంద రోజుల అనంతరం రెండు ప్రాంతాలను అభివృధ్ధి దిశగా ముందుకు నడిపేందుకు కృషి చేస్తాం. త్వరలోనే తెలంగాణ, సీమాంధ్రలలో పర్యటిస్తా. ... శ్రీ నరేంద్ర మోడీ.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


పురుడు పోయటానికీ, ఒక రాష్ట్రాన్ని విడగొట్టటానికీ చాల తేడా ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టటాన్ని వందరోజులు వాయిదా వేయ వచ్చు. పురుడును వాయిదా వేయలేరు.

లోక్ సభలో అత్యంత ఘోరమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకునే అవకాశం బిజెపికి వచ్చింది. వందరోజులలోనే అధికారంలోకి వచ్చి ఇరు పక్షాలకు న్యాయం కలిగేలా విభజన చేయగలమనే ఆత్మవిశ్వాసం, న్యాయం చేయాలనే కోరిక ఉంటే, కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యేది కాదు.

తెలంగాణ వోట్లు, సీట్లు లేకుండా తాము అధికారం లోకి రాగలము అనే నమ్మకం బిజెపికి ఉండి ఉంటే, బిల్లును అడ్డుకొని, వంద రోజుల తరువాత రెండు పక్షాలకు న్యాయం కలిగేలా విభజన చేపట్టేది. ఆ కోరిక, తీరిక, ఓపిక బిజెపికి, మోడీకి లేవు.

తెలంగాణ 60 ఏళ్లు ఆలస్యం కావటం వల్ల నష్టపోయింది సీమాంధ్ర ప్రజలే కానీ తెలంగాణ కాదు. ఈ 60 ఏళ్ళలో హైదరాబాదు లో పెట్టబడిన పెట్టుబడులలో కొంత భాగమైనా సీమాంధ్ర పట్టణాలకు చేరి అవి అభివృధ్ధి చెంది ఉండేవి.

చంద్రబాబు లాంటి తెలివితక్కువ నేతలు హైటెక్ సిటీని హైదరాబాదులో స్థాపించి పొరపాటు చేశారు. అలా కాక అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే ఏ నాగార్జునసాగర్ లాంటి చోట స్థాపించినా సరిపోయేది. లేదా మూడు హైటెక్ సిటీలు స్థాపితం అయ్యేవి. సినిమా రంగం ఆనాడే హైదరాబాదు, విశాఖ, తిరుపతి మధ్య విభాగితం అయ్యేది.

1972 లో సీమాంధ్ర ప్రజలు జై ఆంధ్రా ఉద్యమం చేశారు. తెలంగాణ నేతలు విభజన మాకు వద్దని అడ్డుకున్నారు. దీని వల్ల 1969 లో తెలంగాణ వారు చేసిన ఉద్యమానికి చెల్లుకు చెల్లు అయిపోయింది.

1999- 2004 మధ్య బిజెపి ఆధికారంలో ఉంది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ ల డిమాండ్ కన్నా జైతెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలు పాతవి. పాతసమస్యలను పరిష్కరించకుండా బిజెపి కొత్తరాష్ట్రాలను ఎలా చేపట్టింది? నిజంగా తెలంగాణ ప్రజలమీద, వారి ఉద్యమం మీద బిజెపి కీ సానుభూతి ఉంటే చంద్రబాబు వద్దన్నా, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు బిజెపి ప్రత్యేక తెలంగాణ , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాలను ఇచ్చి ఉండేదే. బిజెపి కనీసం ఆదిశలో ప్రయత్నించలేదు. అపుడే తెలంగాణ బిల్లును తయారు చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు బిల్లును పంపి అభిప్రాయం కోరి ఉండాల్సింది. ఎందుకు కోరలేదు?

నేడు సీమాంధ్ర ప్రజలను ''అతి భీభత్సంగా తిడ్తున్న కెసీఆర్ '', ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తెలంగాణను సమర్ధించే వాళ్ళను ప్రోత్సహించకూడదని ప్రసంగించాడా లేదా? తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళదని నమ్మేవాడు తెలంగాణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడ వచ్చా? మంత్రివర్గంలో స్థానం కోల్పోగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలనే తపన ఆయనకు ఎలా కలిగింది?

వేయి మంది తెలంగాణ యువకులు బలి కావటానికి కెసీఆర్ అండ్ కో, కోదండరాం అండ్ కో చేసిన విద్వేషపూరిత ప్రసంగాలే కారణం. వారిపై చర్యలు తీసుకోకపోటం కేంద్ర హోమ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తప్పు.

సీమాంధ్ర ప్రజలను కెసీఆర్ అండ్ కంపెనీ ఛండాలంగా తిడ్తుంటే బిజేపీ గానీ, మోడీగానీ, సుష్మా స్వరాజ్ గానీ, అద్వానీ గానీ, రాజ్ నాథ్ సింగ్ గానీ, వెంకయ్య గానీ ఎప్పుడైనా ఖండించారా? ఎక్కడైనా ఖండించారా? తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టమని వెంట పడ్డారే తప్ప, ఇరు వర్గాలకు ఆమోద యోగ్యమైన బిల్లును తయారు చేయించి, ఎన్ డీఏ బిల్లుగా గానీ, ప్రైవేటు బిల్లుగా గానీ ఎందుకు ప్రవేశ పెట్టలేదు? లోక్ సభ నిబంధనలు, రాజ్యసభ నిబంధనలు, ప్రైవేటు బిల్లులను, ప్రతిపక్షాల బిల్లులను నిషేధించవే?

తెలంగాణను కేవలం వందరోజుల వాయిదా వేసి ఉంటే, ఈరోజు మోడీకి ఈ మొసలి కన్నీళ్ళు కార్చవలసిన అవసరం తప్పేది కదా.

మోడీ గారు ఇక్కడ తెలంగాణ ప్రజల, సీమాంధ్ర ప్రజల కళ్ళనీళ్ళు తుడుస్తూ కూర్చుంటే, అక్కడ శ్రీమతి జశోదా బెన్ గారి కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? ఆమె అశోకవనంలోని సీత వలే ఇంకా ఎన్నాళ్ళు కుమిలి పోవాలి?

సీమాంధ్ర ప్రజలకు తమ దీనస్థితిపై అవగాహన ఉంటే, సీమాంధ్ర ప్రజలు తాగుబోతులు కాకుంటే, చేయవలసిన పని
1. సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు ప్రసంగించే సభలకు, సీమాంధ్ర ప్రజలే కాదు ఒక చీమ కూడ హాజర్ కారాదు. కేవలం మైకుల వాళ్ళే ఉండాలి. ఇది స్వఛ్ఛందంగా, శాంతియుతంగా జరగాలి.

2. నరేంద్ర మోడీతో సహా బిజేపీ నేతలు ప్రసంగించే సభలకు, సీమాంధ్ర ప్రజలే కాదు ఒక చీమ కూడ హాజర్ కారాదు. కేవలం మైకుల వాళ్ళే ఉండాలి. ఇది స్వఛ్ఛందంగా, శాంతియుతంగా జరగాలి.

ఈనాటి పద్యం
తిక్కన కవిబ్రహ్మ ప్రణీత శ్రీమదాంధ్ర మహాభారతంశాంతి పర్వం, ప్రథమాశ్వాసము.

సందర్భం.

భారతయుధ్ధం అయిపోయింది. అందరూ చచ్చారు. ధర్మరాజుకి పాపం అంటుకున్నదన్న భీతి పట్టుకుంది. (మొసలి?) కన్నీళ్ళు కార్చటం మొదలు పెట్టాడు. నారదుడు కర్ణుడి జన్మ వృత్తాంతం చెప్పాడు. ధర్మరాజు గారు, ఆడవాళ్ళ నోళ్ళలో నువ్వు గింజ దాగదని ఒక శాపం పారేశాడు. ఈసందర్భంగా అభినయించిన పశ్చాత్తాపంలో ఒక పద్యం క్రింద ఇస్తున్నాను. ఈ పద్యానికి జవాబుగా అర్జునుడు నీతి బోధ చేశాడు.

౪౫వ పద్యం. సీస పద్యం.
జ్ఞాతుల నందఱఁ జంపితి మది యాత్మ
  వధమ కాదే రాజవర్తనంబు
గాల్పు మహింస నిక్కము దాల్మి మత్సర
    వర్జనమిది వనవాసజనుల
కాగమవిహితంబు లటె యింత యొప్పునే,
   వనమున వసియింప వలయు, వింటె
యసుఖదంబైన రాజ్యామిషంబునకుఁ గు
   క్కల భంగిఁ దమలోనఁ గాటులాడి

తేటగీతి.
కులము నెల్లను బొలియింపఁ గుత్సితంపు
బ్రతుకు వచ్చెనె యను వగ పాలు వడఁగఁ
ప్రమద మొసగదు త్రైలోక్యరాజ్యమైనఁ,
కాన యేనొల్ల మహి మీర కైకొనుండు.

తెలుగు సారం: మనం అంతా మాంసం ముక్కల కోసం కుక్కలు కాట్లాడుకున్నట్లుగా రాజ్యం కోసం కొట్టుకున్నాం. అందుకే ఈకుత్సితం బ్రతుకు వచ్చింది. వగపు వచ్చింది. మూడులోకాలపై ఆధిపత్యం కూడ నాకు సంతోషం ఇవ్వదు. ఈభూమి నంతా మీరే ఉంచుకోండి.
ప్రాధమికంగా ధర్మరాజు మొసలి కన్నీళ్ళకు ధృతరాష్ట్రుడు మొసలి కన్నీళ్ళకు తేడా తక్కువ. అదే విధంగా నరేంద్ర మోడీ మొసలి కన్నీళ్ళకు సోనియా గాంధీ మొసలి కన్నీళ్ళకు కూడ తేడా తక్కువయే.

కొసమెఱుపు

29 సంవత్సరాలు ఎంపీగా పని చేసిన శ్రీకావూరి సాంబశివరావు గారు రైతులకు ''నేనేం చేయాలో చెప్పండి'' అని బహిరంగలేఖ వ్రాశారు.

జవాబులు: నిజంగా నిద్ర పోయే వాడిని లేపచ్చు. నిద్ర పోయినట్లు నటించే వాడిని ఎవరూ లేపలేరు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విభజన బిల్లును టేబుల్ ఐటం గా ప్రవేశ పెట్టినప్పుడు, మీరు దానిని అధ్యయనం చేయటానికి రెండు రోజులు సమయం అడిగినపుడు ధృతరాష్ట్ర మన్మోహన్ సింగ్ గారి సమక్షంలోనే మీకు అవమానం జరిగింది. చీమూ నెత్తురు ఉన్నవాడయితే మరల ఆ గుడ్డి ప్రధానమంత్రి, ఆ దుష్ట మంత్రుల ముఖం చూస్తాడా?

29 సంవత్సరాలు ఎంపీగా సేవ చేశారు కదా, ఈసారికి ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, అని ప్రజలే నిర్ణయిస్తారేమో.

శ్రీ సుశీల్ కుమార్ షిండేశ్రీ సుశీల్ కుమార్ షిండే గారు హోం మంత్రిగా ఇంక మీకు కన్పిస్తానో లేదో, ఇదే ఆఖరిసారేమో, అని పోలీసు ఉద్యోగులతో అన్నారుట.

పరిష్కారం: టీ ఆర్ ఎస్, బీజేపీల మధ్య పొత్తు జరిగే అవకాశమున్నదని వార్తలు వస్తున్నాయి. శ్రీవారు టీ ఆర్ ఎస్. టికెట్ పై తెలంగాణ నుండి లోక్ సభకు పోటీ చేసి, గెలిచి, తెరాస కోటాలో, నరేంద్రమోడీ గారి మంత్రివర్గంలో హోం మంత్రి అవవచ్చు. ఇంకా తెలంగాణ ప్రజలకు ఏమైనా సేవలు చేసుకోవాలనుకుంటే తేలికవుతుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.