Sunday, December 1, 2013

081 Were Aryans also as much obsessed about color of body as Europeans and Americans? శరీరం రంగుల పిచ్చి యూరోపియన్లకే , అమెరికన్లకే కాక ఆర్యులకి కూడా ఉండేదా?చర్చాంశాలు:
మహాభారతం, సమాజం, కులాలు, వ్యాసుడు,తిక్కన, పద్యకవిత్వం

శరీరం రంగుల పిచ్చి యూరోపియన్లకి, అమెరికన్లకే కాక, ఆర్యులకి కూడ ఉండేదా?వ్యాస భారతం, సంస్కృతం, శాంతి పర్వం, 181వ ఆధ్యాయం (ప్రతిని బట్టి స్వల్పంగా నంబర్ మారచ్చు), 5వ శ్లోకం.
--Santi Parva 181 005 (bhrigu explained to bharadvAja):
brahmaNAnAm sito varNah kshatriyANAm tu lohitah-
vaiSyAnAm pItako varNah SUdrANAm asitas tathA

brahmins white color. kshatriyas red color. vaisyas yellow color. sUdras black color.

బ్రాహ్మణానాం సితో వర్ణః
క్షత్రియాణాం లోహితః
వైశ్యానాం పీతకో
శూద్రానాం అసితస్ తథా.

శ్లోకసారం: బ్రాహ్మణులది తెలుపు రంగు. క్షత్రియులది ఎరుపు రంగు. వైశ్యులది పసుపు రంగు. శూద్రులది నలుపు రంగు.

మహా భారతంలో సందర్భం: మహాభారత మహా సంగ్రామం అయి పోయింది. అంతా పోయారు. ఇప్పుడు యుథిష్ఠిరుడికి కిల్బిషం భయం (పాపం అనే మకిల భీతి) అంటుకుంది. భీష్మ పితామహుడు ఇంకా అంపశయ్య పై పండుకునే ఉన్నాడు. యుధిష్ఠిరుడు ఆయన దగ్గరే కూర్చుని ఆయన బోధించిన నీతులు ఓపికగా విన్నాడు. శాంతి పర్వం చాలా సుదీర్ఘమైనది. కొన్ని వందల ఆథ్యాయాలతో ఒక్కసారి చదవగలగటమే గగనం. నీతులన్నీ నిజంగా భీష్ముడే చెప్పాడో, ఆయన పేరుతో పురాణ బోధక పండాలు దానిలోకి చొప్పించారో కానీ, ఆనీతులన్నీ దండకారణ్యం లాగా దుర్భేద్యంగా అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి. తిక్కన ఆ శాంతి పర్వాన్ని ఎంతో ఓపికగా అనువదించాడు, అందులో ఛందో బధ్ధంగా పద్యాల్లో చెప్పాడు, అంటే ఎంతో గొప్ప తపశ్శీలి, మహా శక్తిశాలి అయితే తప్ప అసాథ్యం.

తిక్కన తన ఆరాథ్య దైవమైన హరిహరనాధుడి ఆజ్ఞమేరకు మహాభారతాన్ని తెనిగిస్తున్నట్లు చెప్పుకున్నాడు.

మహాభారతం, భీష్మ పర్వంలో నిక్షిప్తమై 700 శ్లోకాలతో నిండి ఉన్న భగవద్ గీతను 70 పద్యాలకు కుదించిన సంగతి విదితమే.

తిక్కన శాంతి పర్వాన్ని కూడ బాగానే కుదించాడు. వావిళ్ళ వారి 1915 ప్రచురణలో 295 పేజీలు వచ్చింది. అహో!

పైశ్లోకాన్ని ఎలా అనువదించాడో చూద్దాం.

భారద్వాజ ముని ప్రశ్నలకు భృగు మహర్షి ఇచ్చిన జవాబులుగా ,భీష్ముడు ధర్మరాజుకి బోధించాడు.
శాంతిపర్వం, చతుర్ధాశ్వాసం, 97వ పద్యం. సీసపద్యం.

ఆగమ సత్య ధర్మాచార తపముల
    కునికిపట్టుకాగ వనజభవుడు
కలిగించె మును బ్రాహ్మణుల మఱి కల్పించె
   నృప వైశ్య శూద్రుల నిర్మలాత్మ
బ్రాహ్మణాదికముగఁ బరగు నన్నాలుగు
   జాతుల యుజ్జ్వల ఛాయ లోలి
సొంపారు తెలుపునుఁ గెంపును బసపుచా
   యయుఁ గప్పునయ్యు నండ్రార్య వర్యు

ఆటవెలది పద్యం.
లాత్మ కర్మ మెడలి యనులోమ వృత్తి నె
జ్జాతి సొచ్చు నన్యజాతి పనికి
దానికట్టి భంగి దలకొనుఁ బెక్కులు
పనులఁ జేసి జారతనము వచ్చు.


98వ పద్యం. కందం.
సిత రక్త పీత నీలము,
లతులమతీ మొదలు తొడఁగి యంతంతకు హీ
నత దాల్చుగాన యెఱిగిం
చితి నీ పరిపాటి కర్మశీలత కొరకున్.


సితం= తెలుపు. రక్త = ఎరుపు. పీత = పసుపు. నీలము = బ్లూ లేక బహుశా నలుపు (శ్యామ వర్ణం). వ్యాసుడు అసితం అనేశాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య.

97వ పద్యం లో ఉన్న ఆటవెలది మొదటి లైను లోని, అనులోమ వృత్తి కి వివరణ


ఎక్కువ కులం గల పురుషుడు, తక్కువ కులంగల స్త్రీలను పెళ్ళాడటం, అనులోమం. బ్రాహ్మణుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను,
క్షత్రియుడు వైశ్య శూద్ర కన్యలను,
వైశ్యుడు శూద్ర కన్యలను,
వివాహ మాడే సౌకర్యం అనులోమం.

97వ పద్యం మరియు 98వ పద్యాల సారాన్ని మనం కలిపినపుడు, ఈ అర్ధం తీయచ్చేమో: ఎక్కువ కులంగల పురుషులు అనులోమం ద్వారా తక్కువ కులం గల స్త్రీల ద్వారా పిల్లలను కన్నప్పుడు, 1. జార తనం పెరుగుతుంది. 2. రంగు దిగజారి పోతుంది.

నోట్: విలోమం ఆకాలంలో అనుమతించలేదు కాబట్టి ఇక్కడ ప్రస్తావించినట్లు కనపడదు. విలోమం అంటే, తక్కువ కులం గల పురుషుడు, ఎక్కువ కులంగల స్త్రీని వివాహం చేసుకోటం, విలోమం. అనుమతించక పోటానికి ముఖ్యకా రణం మానవ స్వార్ధ ప్రకృతియే. తాము తక్కువ కులంగల స్త్రీలను స్వేఛ్చగా అనుభవించాలి. కానీ తమ స్త్రీలను (చెల్లెళ్ళను, కూతుళ్ళను మొ||) తక్కువకులంగలవాళ్ళు ఆకర్షించకూడదు.

21వ శతాబ్దపు భారత దేశంలో , పాకిస్థాన్ లో , నేడు జరుగుతున్న పరువు కోసం హత్యలు (honor killings) ఇంచుమించు ఇటువంటి మనస్తత్వాన్నే సూచిస్తున్నాయి.

తిక్కన వ్యాసుడి మూలాన్ని మార్చాలని నేను కోరటం లేదు. ఎలాగో భగవద్గీత 700 శ్లోకాలను కత్తిరించే ధైర్యం చేశాడు కాబట్టి, ఇక్కడ కూడ చిన్న వివరణ పద్యం ఒక కందాన్ని జత చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే తిక్కనకాలపు 13వ శతాబ్దపు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో మనకు తెలియదు కాబట్టి, ఈవ్యాఖ్య కూడ న్యాయంకాదు. పైగా హరిహరనాధుడి ఆజ్ఞ మేరకు వ్రాస్తున్నాడు కదా, ఈరంగుల గోలను వ్యాసుడు వ్రాసి ఉండడు, తరువాత వారెవరో జోడించి ఉంటారు, అనేభావంతో ఎత్తిసినా బాగుండేదేమో. గ్రంధంయొక్క నిడివి కూడ తగ్గేది.

వైబీరావు గాడిద రెండవ వ్యాఖ్య

పలువురు చరిత్రకారులు అంగీకరించిన దేమిటంటే, ఆర్యులు మధ్య ఆసియానుండి వచ్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆర్యులు ధ్రువ ప్రాంతాలనుండి వచ్చినట్లు అభిప్రాయపడినట్లు నాకు గుర్తు. నా మిత్రులు కొందరితో నేను ఈవిషయాన్ని ప్రస్తావించినపుడు, వారు, ఆర్య సంస్కృతి భారతీయులు స్వంతం. ఇక్కడనుండి విదేశాలకు వ్యాపించింది. వారికి గోచీ పెట్టుకోటం రానపుడు మనం వారికి గోచీ పెట్టుకోటం నేర్పాం అన్నారు. నాకు సరియైన సాక్ష్యాలు దొరకక నోరు మూసుకొని ఊరుకున్నాను.

శరీరం రంగుల పిచ్చి (racialism) యూరోపియన్లకు, అమెరికన్లకు ఎక్కువ అనే అభిప్రాయం సర్వత్రా ఆమోదం పొందింది.

మనం వ్యాస భారత శ్లోకం లోను,తిక్కన పద్యం లోనూ, ఏమి గమనించాం? ఆర్యులకు కూడ శరీరం రంగుల పిచ్చి ఉండటమేకాక, ఆరంగులను ఇష్టం వచ్చినట్లుగా కులాలకు అంటగట్టటం చూశాం. ఆర్యులు ఉత్తర యూరప్ నుండి వచ్చారు అనే విషయాన్ని మనం అంగీకరించ గలిగితే, వారికి ఉన్న రంగుల పిచ్చి దిగుమతి చేసుకున్నట్లు అవుతుంది. లేదూ, ఆర్యులు స్వదేశీయులే. విదేశీయులకు గోచీ పెట్టుకోటం నేర్పారు అనుకుంటే, ఈ రంగుల పిచ్చిని కూడ మనం విదేశాలకు ఎగుమతి చేశాం అని అంగీకరించ వలసి వస్తుంది.

రంగుల పిచ్చి ఎగుమతి వస్తువా, దిగుమతి వస్తువా అని నిర్ణయించుకునే స్వేఛ్ఛ భారతీయులకు ఉంది. కాబట్టి వారే నిర్ణయించుకుందురు గాక!

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.