Friday, April 11, 2014

200 Nearing truth

200 Nearing truth

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اَجینڈا: నరేంద్రమోడీ, Narendra Modi, జశోదాబెన్, Jashodaben, బిజెపి, 200ఈ నా 200 వ పోస్ట్ సందర్భంగా చాల సంతోషకరమైన వార్త ఏమిటంటే, భా భా ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ గారు, వడోదారా లోక్ సభ నియోజకవర్గ అభ్యర్ధిగా ఫైల్ చేసిన నామినేషన్ అనుబంధ అఫిడవిట్ లో, శ్రీమతి జశోదాబెన్ గారిని తన భార్యగా అంగీకరించటం. గత అసెంబ్లీ ఎలక్షన్ లలో ఆయన తన అఫిడవిట్ లో భార్య కాలమ్ ను ఖాళీగా ఉంచే వాడు.

గతంలో భారతీయులు ఈవిషయాన్ని ఎక్కువగా పట్టించుకోకపోటానికి ముఖ్య కారణం, గుజరాత్ భారత్ లోని 28 (ఇపుడు 29) రాష్ట్రాలలో ఒకటి కావటం. భారతీయులకు ఇంగ్లీషు వాళ్ళనుండి అంటుకున్న జబ్బుల్లో ముఖ్యమైనది, ప్రక్క రాష్ట్రం వాడు చచ్చిపోతున్నా పట్టించుకోక పోటం. ఉదాహరణకి బీహార్ లో వరదలు వస్తే తెలుగు వాళ్ళు పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ లో వరదలు వస్తే బీహారీలు పట్టించుకోరు.

ఇపుడు శ్రీ మోడి భావి భారత ప్రధాని కనుక తమ ప్రధాని ఎలా ఉండబోతున్నారో తెలుసుకోటం అవసరమైంది.

ఫిబ్రవరి 2014లో జరిగిన ఎన్నికల రాలీలో ఆయన నేను ఒంటి గాడిని, నాకు కుటుంబ బంధాలు లేవు, నేను ఎవరికొరకు అవినీతి చేయాలి!! అని ప్రచారం చేసుకున్నారు. ఆయన నిజానికి చేసిందేమిటి, పెళ్ళైన మూడేళ్ళలోనే చదువుకోమ్మా అని పెళ్ళాన్ని పుట్టింట్లో దించి, అప్పటినుండి ముఖం చాటేశాడు. ఒంటిగాడు అంటే ఇదా!!

ఇపుడు శ్రీమోడీ గారు అఫిడవిట్ లో తన న్యాయవాదుల సలహా ప్రకారం నిజాన్ని బయట పెట్టారా, లేక నిజంగా హృదయ పరివర్తన వచ్చి సత్యాన్ని ప్రకటించారా?

నిజంగా హృదయ పరివర్తన వచ్చి సత్యాన్ని ప్రకటిస్తే జేజేలు. ఇపుడు తరువాత జరగవలసినది, జశోదాబెన్ గారికి గౌరవ ప్రదమైన స్థానాన్ని ఇవ్వటం. దీనిని పలువిధాలుగా చేయవచ్చు. ఎన్నికల రాలీలలో అప్పుడప్పుడు తన ప్రక్కన నిల్చోపెట్టుకోవచ్చు. ఆమె స్వఛ్ఛందంగా ముందుకు వస్తే వడోదారాలో కానీ, వారణాసిలో కానీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు.

జశోదాబెన్ గారు గుజరాత్ కుగ్రామాలలో ప్రాథమిక పాఠశాల అధ్యాపకురాలిగా పనిచేయటం వల్ల, ఆమెకు స్కూల్ డ్రాప్ అవుట్స్ పై మంచి అవగాహన ఉండి ఉంటుంది. దేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తిపై ఆమె ఏవైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే వినచ్చు.

సోమాభాయి దామోదర్ మోడీ , శ్రీ నరేంద్రమోడీ గారి సోదరుడు, ఈసందర్భంగా అన్నమాటలు పరిశీలనార్హం:
"...What happened 45-50 years ago should be seen in the context of a poor and superstitious family. ..."

తెలుగుసారం: ''... 45-50 సంవత్సరముల క్రితం జరిగిన దానిని బీద మరియు మూఢవిశ్వాసాల కుటుంబ నేపథ్యంలో చూడాలి. ...''


ఈ ''పేద , మూఢ విశ్వాసాల కుటుంబం'' అనే పదం సోమాభాయి దామోదర్ మోడీ గారు తన కుటుంబానికి వర్తింప చేయాలా , లేక జశోదా బెన్ గారి పుట్టింటి వారి కి వర్తింప చేయాలా, లేక రెండు కుటుంబాలకు వర్తింప చేయాలో చెప్తే బాగుండేది.

నిజానికి ధనిక కుటుంబాల్లో స్త్రీపురుషులు తమ ఇష్టం వచ్చినట్లు కలిసినా విడిపోయినా సమాజానికి పెద్ద ఇబ్బంది కలుగదు. ఉదాహరణకి ఈమధ్య ఒక సేనా పార్టీ పెడుతున్నానని హంగామా చేసిన ఒక తెలుగు హీరోగారు తమ మొదటి భార్యకి, రెండో భార్యకి విడాకులు ఇస్తే జనం పట్టించుకోలేదు, పట్టించుకోవలసిన అవసరం కూడ లేదు. ఎందుకంటే , వారూ, వీరూ, ఘరానా ధనవంతులు కాబట్టి, వాళ్ళకది అలవాటులే మనకెందుకులే గోల అని ఊరుకోవచ్చు.

ముక్కు పచ్చలారని ఒక ముద్దరాలిని, పేద కుటుంబానికి చెందినది, చదువుకోలేదు అనే కారణంతో కనీసం ఫీజు కూడ కట్టకుండా పుట్టింట్లో విడిచేసి ముఖం తప్పిస్తే దానిని ఏమనాలి? శ్రీనరేంద్రమోడీ అన్నలకు, తల్లి దండ్రులకి ఏబాధ్యతలు ఉండవా?

శ్రీ నరేంద్రమోడీ గారు , ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం లో ఫుల్ టైమ్ చేరకముందు, బస్ స్టాండు సమీపంలో కొద్ది రోజులు టీ బండి నడిపారు అని వార్తలు ఉన్నాయి. ఆసమయంలో , అవకాశం ఇచ్చి ఉంటే, జశోదా బెన్ గారు, ఆబండి వద్దనే తన భర్తకి చాయ్ తయారు చేసి చేదోడు వాదోడుగా ఉండి ఉండేది. మోడీగారు తన సహధర్మచారిణికి ఆఅవకాశాన్ని దక్కకుండా చేశారు. భారత దేశంలో మనం ఏ పట్టణంలో చూసినా, ఇలా పరస్పరం సహకరించుకుంటూ, చాయ్ బండ్లు, చాయ్ బంకులు నడుపుకునే భార్యా భర్తలు, భవిష్యత్ పై గొప్ప ఆశతో జీవిస్తూ, మనకి అసంఖ్యాకంగా దర్శనమిస్తారు.
శ్రీ మోడీ రోల్ మోడల్ స్వామీ వివేకానందగారికి కాష్మీర్ , ఊటీ, ఆల్మోరా వంటి వేసవి విడుదులంటే మక్కువ, దోమలు అంటే విపరీతమైన భయం, కోట్లు, బూట్లు, చుట్టలు అంటే అభిమానం, అని ఆయన సంపూర్ణరచనలు చెప్తాయి.

శ్రీ వివేకానంద గారు కూడ శ్రీరామకృష్ణుడు మరణించిన కొత్తరోజులలో భిక్షాటన చేసే వాళ్ళమని, ఇల్లాళ్ళు రాళ్ళల్లాగా మారిన చద్ది చపాతీలు వేసేవారని తన క్యాలిఫోర్నియా అమెరికా ప్రసంగం ఒకదానిలో చెప్పుకున్నారు. దాని ఫలితమో ఏమో, తరువాత ఆయన భిక్షాటన మానేసి స్వదేశ సంస్థానాధీశుల చుట్టు, సేఠ్ జీల చుట్టూ తిరగటం, పరమహంసలం అని చెప్పుకోటం అలవర్చుకున్నట్లు కనపడుతుంది.

నేడు రాజకీయవేత్తలు అంబానీలు, టాటాలను ఆశ్రయించుకున్నట్లే, నాడు స్వామి వివేకానంద గారు కూడ లెగ్గెట్ అనే అంతర్జాతీయ టీ వర్తకుడిని ఆశ్రయించుకుని, ఆయనకు చెందిన రిసార్టులో నెలల తరబడి బసచేసే వాడు. స్వామీజీ లెగ్గెట్ గారి టీ వ్యాపారానికి బ్రాండ్ అంబాసెడర్ అయ్యే వాడే (ఆకాలంలో ఆపదం వాడుక లేదు కానీ, బ్రాండులను వ్యాపింప చేయటానికి సెలబ్రిటీలను వాడుకోటం ఉండేది) కానీ, కొద్దిలో ఏదో బెడిసింది.

అలాగే శ్రీమోడీజీకి ఖరీదైన కుర్తాలు, కోట్లు, డ్రెస్ లు అంటే మక్కువ , అహమ్మదాబాద్ లోని అతి ఖరీదైన డ్రెస్ మేకర్ కు ఆయన ప్రధాన ఖాతాదారు అనే విషయం ప్రజలలో చాలామందికి తెలియదు. పార్టీ సమావేశాలకు గోవా వెళ్ళినా సరే, అహమ్మదాబాదు నుండి బుల్లెట్ ప్రూఫ్ కారు గోవాకి వెళ్ళాలి. మనలో లైఫ్ స్టైల్స్ చిననాటి నుండే రూపులు దిద్దుకుంటాయి. అవి అవకాశాలు దొరకనంతకాలం, అణగి మణిగి ఉంటాయి. దొరికినపుడు, విశ్వస్వరూపాలు చూపిస్తాయి.కనుక సుదీర్ఘ కాలం, బస్ స్టాండ్ వద్ద చాయ్ బండి నడుపుకుంటూ, భార్య సహాయం తీసుకోటం కొందరి ప్రవృత్తులకు, ప్రకృతులకు వ్యతిరేకం అని మనం అర్ధం చేసుకుంటే నేతలను, స్వామీజీలను తప్పు పట్టం.


నీలాంజన్ ముఖోపాధ్యాయ అనే రచయిత గారు శ్రీ మోడీ గారి జీవిత చరిత్ర వ్రాశారుట. దాని ప్రకారం, ఆర్ ఎస్ ఎస్ లో పైకి రావాలంటే, బ్రహ్మచారులకే అవకాశం కాబట్టి శ్రీమోడీజీ తన వివాహ విషయాన్ని గోప్యంగా ఉంచారని వ్రాశారు.

వివాహం కన్ సమ్మేట్ కాకుండానే (అంటే శోభనం, కార్యం జరగకుండానే) శ్రీ మోడీ వివాహం నుండి బయటకి వచ్చేసినట్లు ఆయన సోదరుడు శ్రీ సోమాభాయ్ చెప్పిన మాట నిజమే అయితే, శ్రీ మోడీ సోదరులు , తల్లిదండ్రులు చేయవలసిన పని , న్యాయం గా ఏమి కావాలి? శ్రీమతి జశోదా బెన్ గారి తల్లి దండ్రులతో సంప్రదించి శ్రీ మోడీ గారి చేత ఆమెకు విడాకులు ఇప్పించి, ఇంకొక వరుడిని చూసి వివాహం చేయించి ఉండవలసినది. శోభన కార్యమే జరగనపుడు , మారు మనువు సరియైన పరిష్కారమే అవుతుంది. మొత్తం సమస్యను మాంగల్యబలం సినిమాలో లాగా బాల్యవివాహాలపైకి తోసేయటం కుదరదు.

ఏది ఏమైనా, శ్రీమోడీ గారు సత్యాన్ని ప్రకటించటాన్ని మనం స్వాగతిద్దాం. ఇదే సందర్భంగా ఆయన, బడా పెట్టుబడిదారులు, కార్పోరేట్ ఘరానా వ్యాపారవేత్తల బానిసత్వం నుండి బయట పడాలని ప్రార్ధిద్దాం. గుజరాత్ లో శ్రీమోడీ గారు చేశానని చెప్పుకుంటున్న అభివృధ్ధి అంతా బడా పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి వారిని బాగుచేయటమే తప్ప ప్రజలని బాగుచేయటం కాదు. ఆయన నిజంగా ప్రజలను బాగు చేయాలనుకుంటే, కుటీర పరిశ్రమలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేయాలి. అయితే శ్రీ మోడీ రిపేరబుల్ అని నేననుకోటం లేదు.

ఈనాటి పాటరచన: శ్రీశ్రీ. చిత్రం: మాంగల్యబలం. పాడింది ఘంటసాల, సుశీల. సంగీతం: మాస్టర్ వేణు. కర్నాటక సంగీత రాగం: కల్యాణి. హిందూస్థానీ రాగం: యమన్.

పల్లవి
పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం
విషమాయే మా ప్రేమా విధియే పగాయేయ

చరణం: 1
చిననాటి పరిణయగాధ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాధ తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమా విధియే పగాయే.
చరణం: 2
మొగమైన చూపలేదే, మనసింతలొ మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలనా హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమా విధియే పగాయే.
పెనుచీకటాయే||

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.