Wednesday, April 9, 2014

199 Householder vs non-householder

199 Householder vs non-householder

Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चा विषय, اَجینڈا: బ్రహ్మచర్యం, గృహస్తాశ్రమం, నరేంద్రమోడీ, వివేకానంద, మహాభారతం, తిక్కన

బోధ, ఉద్ బోధ రెండు పదాలను తీసుకుందాం. ఉద్ అంటే పైకి. బోధ కన్నా ఉద్ బోధ స్ట్రాంగు. జండూ బాం, మహాజండూ బాం లాగా.

ఉద్ బోధలు చేయించుకోటాన్ని ఒక తరహా రుగ్మత అనుకుంటే , ఉద్ బోధలు చేయటాన్ని కూడ రుగ్మత అనచ్చు, లేదా మహా రుగ్మత అనచ్చు.

ఉద్ బోధ లు చేయటం రుగ్మతగా పరిణమించటానికి, లౌడ్ థింకింగు కీ (బిగ్గరగా బయటకు వ్యక్తం అయ్యేలా ఆలోచించటం) విభజన రేఖ స్వల్పమే. అంతర్జాలంలో కొన్ని సార్లు లౌడ్ థింకింగును రాంటింగు (ranting) గా పరిగణించటం జరుగుతున్నది. కానీ రెండిటికీ కూడ భేదం ఉన్నది.

ఈ ఉద్ బోధలు చేయటం అనే రుగ్మత (రుగ్మత అనే కన్నా కొన్ని సార్లు బలహీనత అంటే మేలేమో), మహాత్ముల దగ్గర నుండి సాధారణ వ్యక్తుల వరకు అందరిని ఆవహిస్తునే ఉంటుంది.


ప్రస్తుత కాలంలో , మధ్యతరగతిలో (దిగువ, ఎగువ), ధనిక తరగతులలో ఒక విశ్వాసం ప్రబలినట్లు కనిపిస్తున్నది. అదేంటంటే, గృహస్తాశ్రమం కన్నా బ్రహ్మచర్యం గొప్పది, అని. బ్రహ్మచర్యం అనేది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పటం లాంటిది. ఈదినప్పుడు కదా ఈతలో మజా తెలిసేది. ఈతలో కష్టాలు నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఈదను, మీరు కూడ ఈదకండి. నేను ఈదను కాబట్టి మీకన్నా గొప్ప వాడిని. మీకు బోధించే అర్హత నాకు వస్తుంది. నేను పరమహంసను. మీరు నా కాళ్ళమీద పడుతుంటే, నేను మీ నెత్తి మీద చేతులు పెట్తూ ఉంటాను అనే ప్రవృత్తి మనదేశంలో బుధ్ధుడి కాలం నుండీ ప్రబలి ఉన్నది. అదేంట్రా నాయనా అంటే, నా కాషాయ గుడ్డలే, నా మంత్రదండమే, నా అర్హతలు. ఇలాగా అన్ని మతాలలోని బోధకులు గృహస్తుల నెత్తిన కూర్చోటం అలవర్చుకున్నారు. ఘరానా మఠాల సన్యాసుల కన్నా ఒక విధంగా వీధులలో ముష్ఠెత్తుకునే సాధువులు కొన్ని సార్లు మెరుగని పిస్తారు. ఎందుకంటే వీరు పాదాలు పట్టుకునేటందుకు ఛార్జీలు వసూలు చేయరు.

''వినదగు నెవ్వరు చెప్పిన'' అన్నట్లుగా, మహాభారతంలో ధర్మరాజు గారికి మంచి వినికిడి ఓపిక ఉన్నది. మహాభారత యుధ్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయాక, తాతలు, గురువులు, అందరినీ చంపాక, ధర్మరాజు గారికి కిల్బిష భయం (పాప భీతి) పట్టుకుంది. నేను సన్యాసం పుచ్చుకుంటానంటాడు. ఆసమయంలో ఆయనకు ఉద్ బోధ చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు.

సాధారణంగా, నకుల సహదేవులకి ఉద్ బోధలు చేసే ఛాన్సులు రావు. శాంతి పర్వంలో, ప్రథమాశ్వాసంలో, నకులుడికి అలాంటి ఛాన్స్ ఒకటి వచ్చింది. నకులుడు, సన్యాసం తీసుకోవద్దు, గృహస్తాశ్రమమే మిన్న అని ధర్మరాజుకి ఉద్ బోధ చేశాడు. ఆ ఉద్ బోధలోంచి కొన్ని పద్యాలను ఈక్రింద ఇస్తున్నాను.

తిక్కన ప్రణీత శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతి పర్వం, ప్రథమాశ్వాసం, 76వ పద్యం.


కంద పద్యం.
తక్కిన మూడాశ్రమములు
నొక్క దెస, గృహస్థ ధర్మ మొక దెసఁ తులయం
దెక్కింప వానితో న,
య్యొక్కటి సరి తూఁగె నందురు ర్వీశ బుధుల్.

తెలుగు సారం: గృహస్థాశ్రమాన్ని త్రాసులో ఒక పళ్ళెంలో వేసి, రెండవ పళ్ళెంలో మిగిలిన మూడాశ్రమాలను అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ (అడవులలో ఉండటం), సన్యాసాశ్రమాలను పడేస్తే, మొగ్గు గృహస్తాశ్రమం వంకే ఉంటుంది అని పండితులు చెప్తారు.

81 వ పద్యం. కందం.
పరుల వధింపక యెవ్వడు,
ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక,
యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.

తెలుగు సారం: ఓ రాజా, పూర్వపు రాజులలో, ఇతరులను చంపక ఏ రాజు భూమిని యేలాడు చెప్పు, వారు సుగతికి అంటే మంచి లోకాలకే వెళ్ళారు, నీవు కూడ అలాగే వెళ్తావు.

82 వపద్యం. కందం.
రక్ష ప్రజ గోరు నిజయో
గ క్షేమార్ధముగ జన సుఖ స్థితి నడపన్
దక్షుడగు రాజు నడప కు
పేక్షించినఁ పాపమొందడే కురు ముఖ్యా.

ఓ కురు ముఖ్యా, జనం తమ యోగ క్షేమాలు చక్కగ సుఖంగా గడచి, రక్షణ కావాలని కోరుతుంటే సమర్ధుడైన రాజు పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే, పాపం పొందడా?

82 వపద్యం. తేటగీతి.
గోవులను ఘోటకంబులఁ, కుంజరముల
దాసులను ప్రీతి నిమ్మెల్ల ధాన్యములను
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క
నొసగు తత్తత్ సుపాత్రత్వ యుక్త విధుల. అర్ధము

తెలుగు సారం: గోవులంటే ఆవులు. ఘోటకాలు అంటే గుర్రాలు. కుంజరాలు అంటే ఏనుగులు. దాసులంటే సేవకులు. ధాన్యాలు, గ్రామాలు, ఇళ్లు, నిష్కాలు అంటే ఆనాటి నాణెములు, ఇలాగా అన్నిటినీ వేడుకతో, ప్రీతితో, రాజు, సుపాత్రులు అంటే అర్హులైన వారికి తగినట్లుగా ఇస్తాడు.

ఆధునిక కాలం


భా భా ప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారి రోల్ మాడెల్ స్వామి వివేకానంద గారికి బ్రహ్మ చర్యం గురించి ఉద్ బోధలు చేయటం అంటే మహా మక్కువ. తల్లిని పోషించటానికి, సోదరీ సోదరులను పైకి తీసుకురావటానికి ఉద్ యోగం చేయటం అంటే చిన్న చూపు. ఉద్యోగం అంటే ప్రొద్దున నుండి సాయంకాలం దాకా, కష్ట పడాలి కదా. తన పోషణకు నెలకో వంద రూపాయలు, తల్లి పోషణకు నెలకో వంద రూపాయలు భృతి ఏర్పాటు చేయమని ఖేత్రీ రాజును ఆశ్రయించుకున్నాడు. (ఖేత్రీ రాజుకు తన పుత్ర సంతానం వివేకానందుడి దయ వలన కలిగిందని ఒక నమ్మకం. అందుకే రెండు భృతులూ ఏర్పాటు చేశాడు. అంతే కాక, వివేకానంద గారి కోరికపై ఆయన తెల్లతోళ్ళ శిష్యులకి ధ్యానం కోసం పులి తోళ్ళు ఏర్పాటు చేశాడు).


తత్ శిష్యుడు శ్రీ నరేంద్రమోడీ గారికి కూడ బ్రహ్మ చర్యం పై మక్కువో కాదో మనకి తెలియదు కానీ, శ్రీవారి ధర్మపత్ని జశోదా బెన్ గారు మటుకు, నేను శ్రీవారి ధర్మపత్నినే అని మొత్తుకుంటున్నది. శ్రీవారు అవుననరు, కాదనరు. చదువుకో మ్మా అని పుట్టింట్లో దిగబెట్టి 30 ఏళ్ళు పూర్తయ్యింది. ఆమె 10 పాసయి, టీచర్ ట్రైనింగు పూర్తిచేసి, కుగ్రామాలలో గవర్న్మెంటు టీచరుగా పనిచేసి, రిటైర్ అయి ఒంటరి జీవితం గడుపుతున్నది.

ప్రజాసేవకి గృహస్థాశ్రమం పనికి రాదని, ఆర్ ఎస్ ఎస్ లో అలిఖిత నిబంధన ఏదైనా ఉందో ఏమో గానీ, శ్రీవారికి గృహస్తాశ్రమం యొక్క శ్రేష్ఠతను ఆర్ ఎస్ ఎస్ అగ్ర గురువులు బోధిస్తే న్యాయంగా ఉండేది. ఒకవేళ బ్రహ్మచర్యం అవసరమే అనుకున్నా, అది వివాహం కాకముందు తీసుకోవలసిన నిర్ణయం, అగ్ని సాక్షిగా సప్తపదిని పూర్తిచేసి, నాతిచరామి వంటి ప్రతిజ్ఞలు చేసుకున్నాక శోభించదు అని ఉద్ బోధిస్తే బాగుండేది.

భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. అతడు గృహస్థే. తన కొడుకుని రాజకీయాలలోకి దింపి, కూతురుని కూడ దింపాలనుకుంటున్నారు. ప్రొటోకోల్ ప్రకారం, ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి. తృతీయ పౌరుడు ప్రధాని. ఈ శ్రేష్ఠ భారత దేశానికి శ్రీ మోడీ ప్రధాని అయితే శ్రీవారి శ్రేష్ఠ దంపతులు ఉభయులు కనువిందు చేస్తే బాగుంటుందా, లేక ఒక్కడే లింగూ లిటుకూ అంటే బాగుంటుందా?

ఈనాటి పాట

రచన: శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి.
చిత్రం: మంచిరోజులు వచ్చాయి.
ఈ పాట టైపింగు శ్రీ వికీసోర్స్.ఆర్గ్ వారి దానం.

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ||| నేలతో |||

చరణం 1 :
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ, నేను లేనూ, లోకమే లేదులే ||| నేలతో |||

చరణం 2 :
రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే ||| నేలతో |||

చరణం 3 :
అంటరానితనము - ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం ||| నేలతో |||

వైబీరావు గాడిద లౌడ్ థింకింగ్.


మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే అని శ్రీ దేవులపల్లి వ్రాసిన వాక్యాలు అజరామరాలు. బౌధ్ధం యొక్క ప్రభావానికి లోనైన భారత జాతి గుండ్లు గీయించుకొని, కాషాయాలు కట్టుకుంటుంటే, బయటకి వైరాగ్యం ఆర్భాటం చేసినా, పురుష భిక్షువులు, స్త్రీభిక్షువుల మధ్య వ్యభిచారాల కాలనాగులు తిరిగేవి. అదను చూసి కాట్లు వేస్తూ ఉండేవి.

ఈనాటి కేథలిక్ క్రైస్తవ ప్రపంచాన్ని తీసుకోండి. బ్రహ్మచర్యం పాటించాల్సిన మతగురువులు పలు పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో బాలురతో మైథునాలు చేసుకుంటూ కోర్టుకేసుల పాలైతే, వాటిని ఎలా సరిదిద్దాలో తెలియక గతంలో పోప్ బెనెడిక్ట్, నేడు పోప్ ఫ్రాన్సిస్ నానా బాధలు పడుతున్నారు. మైథునం అనేది ఒక జననార్తి. దానిని ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంయోగం ద్వారా అప్పుడప్పుడూ సంతృప్తి పరచకుంటే జననార్తులు వికృత మార్గాలు పట్టే అవకాశం ఉంది.

మనం అదుపులో పెట్టుకోవలసినది: సంగం, అంతే కాని లింగం కాదు


సంగం అనే పదం, సంఘం అనే పదం ఒకటి కాదు. సంగం అంటే ఆంగ్లంలో attachment. తెలుగులో బంధం. ఏమిటీ ఈ బంధం, అంటే కనిపించే ప్రతి దాన్ని తనది అనుకోటం. సంగాన్ని వదులుకోమని ప్రతి గృహస్థుని మన ఆర్ష సంస్కృతి బోధించినది.

కలిగి ఉండమని బోధించింది, ఏమిటంటే సత్యాసత్యవివేకం, నిత్యానిత్య వివేకం , మిథ్యా మిథ్య వివేచన . ఈ వివేచన కలిగి ఉండక మొండిగా ప్రవర్తించినపుడు, లక్షకోట్లార్జించినా, చివరికి ఏ విమాన ప్రమాదం లోనో, ఏ గన్ మాన్ కాలిస్తేనో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చి, తాను నిజం, నిజం అని నమ్మిన సంపదకే దూరం కావాల్సి వస్తుంది. మెట్లమీదినుండి కాలు జారితే చాలదా, అంతా అసత్యం, అనిత్యం అని ఋజువు కావటానికి.

లింగాన్ని వదిలేయాలా

లింగాన్ని వదిలేయమని ఎవరూ అనరు. లింగాలకు, భగాలకు వాటి పరిమితులు వాటికి ఉంటాయి. మన కుటుంబ వ్యవస్థయే ఆపరిమితుల సరిహద్దులను కొంత మేరకు నిర్దేశించింది. ఈమధ్య కొందరు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, టీవీ ఛానెల్ అధినేతలు, ఐటీ కంపెనీల మహానిర్వాహకులు, దైవమానవులు (గాడ్ మెన్), రకరకాల కారణాల వల్ల విచారణలు ఎదుర్కొంటున్నారు.

కొన్ని కులాలలో ఉపనయనం అనే వ్యవస్థ ఉంది. రోజూ ఉదయాన్నే సంధ్యావందనం అనే ప్రక్రియ ఉంది. ఉపనయనం అంటే sub-eye. మామూలు రెండు కన్నుల కన్నా అదనపు కన్ను అన్న మాట. ఈ అదనపు కన్ను ఏమిటి? జ్ఞాన నేత్రం. ఏమిటా జ్ఞానం? అదే నిత్యానిత్య జ్ఞానం. సదసద్ విజ్ఞానం. మిథ్యామిథ్య వివేచనం. ఈ జ్ఞానం ఏమి చెప్తుందంటే, శరీరం ఒక గుర్రం. అందులో ఉండే మానవుడు రౌతు. రౌతు చెప్పినట్లు గుర్రం వినాలా, లేక గుర్రం చెప్పినట్లు రౌతు వినాలా? లింగాలు, భగాలు అనేవి ఈశరీరంలో భాగాలు మాత్రమే. అంటే రౌతుచెప్పినట్లు నడుచుకోవలసినవే.

ఈపరిశోథనలో భాగంగా అంతర్జాలంలో నేను కొన్ని డజన్ల వెబ్ సైట్లను చూసి కొన్ని వందల వీడీయోలను అథ్యయనం చేయటం జరిగింది. ఈసందర్భంగా గమనించిందేమిటంటే, భారతీయులలో కొన్ని లక్షలమంది ఈ సైట్లను దర్శిస్తున్నారు. తదనంతరం రకరకాలుగా భావోద్వేగాలకు గురియవుతున్నారు. గురువులు పాఠశాలల్లో కీచకులుగా తయారు కావటానికి, తండ్రులు గృహాల్లో కీచకులుగా తయారు కావటానికీ ఈ సైట్ల వలన కలిగే భావోద్వేగాలు ఎంతవరకు కారణం అనే అధ్యయనం న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు , సోషియాలజిస్టులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

మానవుడి లైంగిక ప్రవర్తన పై మిథ్యాహార, విహారాల ప్రభావం , ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే స్ట్రెస్ గూర్చి అధ్యయనాలు జరగాల్సి ఉంటుంది.

మానవ వికాస చరిత్రలో ఇంటర్నెట్ ఒక నూతనాధ్యాయాన్ని తెరిచింది. తాంత్రిక విద్యల కన్నా, దేవాలయాలపై శృంగార శిల్పాలకన్నా మానవులపై ఇంటర్ నెట్ వీడియో ల ప్రభావం లోతుగా ఉండ బోతున్నది. పరాశరాది నాటి ఋషుల వలెనే నేటి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన మేథావులు ఉద్వేగాలకు లొంగిపోటాన్ని గమనించినపుడు, మనం --- లింగాల, భగాల, ఫెరోమోన్ల శక్తియుక్తులను తక్కువగా అంచనా వేయలేము. ప్రస్తుతానికి మేథావులం అనుకునే వారు తెల్లారి లేవగానే, రాత్రి పండుకునే మందు, ఒక భర్తృహరి శ్లోకాన్ని స్మరించుకోవటం విధాయకం.
brahmAmDa mamDaalI mAtram బ్రహ్మాండ మండలీ మాత్రమ్
kim lobhAya manasvinaha; కిమ్ లోభాయ మనస్వినః
Sapharii sphuritE nAbdhEh (naabdhihi) శఫరీ స్ఫురితే నాబ్ధేః
kshubdhO na khalu jAyatE. క్షుబ్ధో న ఖలు జాయతే.

If a female fish dances and leaps in an Ocean, the Ocean does not get tumultous. The mind of an ascetic in Union does not quiver even if the Universe were accrue to him.

తెలుగు సారం: ఒక ఆడ చేప సముద్రంలో గంతులేస్తే , నాట్యం చేస్తే, సముద్రం కల్లోలితం కాదు. యోగి హృదయం కూడ, సర్వ విశ్వం అతడిని సమీపించినా, ఊగిసలాడదు. మేథావులు కూడ అంతే.

తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, ఆరోగ్యం, వృధ్ధాప్యం లో సామాజిక భద్రత


ఇవీ ప్రతి భారతీయుడూ, తపన పడాల్సినవి, అందరు భారతీయులకి అందుబాటులో లేనివి. ప్రతి వ్యక్తి వీటిని తన జీవితకాలంలో సేకరించుకుని తీరవలసినవే. వివిధ కారణాల వల్ల, వారి అదుపులో లేని వివిధ పరిస్థితులలో వలన (factors beyond their control) వారు ఈ లక్ష్యాన్ని చేరుకోలేక పోతే, సమాజం ఈ అవసరాలను పూరించాల్సిందే. పెట్టుబడిదారి విధానం ఈ బాధ్యతను తీసుకోదు. తీసుకున్నట్లుగా నటిస్తుంది. మభ్యపెట్తుంది.


ఈ బాధ్యతను తీసుకునే శక్తి మార్క్సిజానికే ఉన్నది. కాకపోతే అది మావోయిస్టులు భావిస్తున్నట్లుగా తుపాకీగొట్టం ద్వారా రావాల్సినది కాదు. అది బ్యాలెట్ ద్వారా మాత్రమే రావాలి. తుపాకీ గొట్టం ద్వారా వస్తే అది నిలువదు. నియంతృత్వానికి దారి తీసి, పెట్టుబడిదారి విధానం కన్నా దుర్భర ఫలితాలను ఇస్తుంది. గౌ. శ్రీ వరవరరావు వంటి వారు ఉద్ బోధిస్తున్నట్లుగా, ప్రజలు ఎన్నికలను బహిష్కరించినందు వల్ల అది సిధ్ధించదు. ప్రజలు ఎన్నికలలో పాల్గొన వలసినదే. కాకపోతే వారు విజ్ఞాన వంతులైన వోటర్లుగా పాల్గొనటం అవసరం.

ఇంకా ఉంది, ఇంకో సారి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.