Friday, February 14, 2014

137 Arvind Kejriwal corrected his error

137 Aravind Kejriwal made a mistake and corrected himself by resigning. శ్రీ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ద్వారా తన తప్పును దిద్దుకున్నారు
చర్చనీయాంశాలు: Kejriwal, CPM, ఆమ్ ఆద్మీ, భారతీయ రాజకీయాలు, తిక్కన, మహాభారతం
భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కై (భవిష్యత్ లో కూడ ఇది తరచుగా జరగబోతుంది) జనలోక్ పాల్ బిల్ ను ఢిల్లీ శాసన సభలో ప్రవేశ పెట్టకుండా అడ్డుకోటంతో, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయటం చక్కటి నిర్ణయం. ఆయన, కాంగ్రెస్ నుండి మద్ధతు తీసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి కావటం పొరపాటు నిర్ణయం. అంతే కాదు, ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేయటమే పొరపాటైన నిర్ణయం.

ఆమ్ ఆద్మీ పార్టీ డెల్హీ అసెంబ్లీకి పోటీ చేయటం ఎందుకు పొరపాటు?


ఢిల్లీ అసెంబ్లీ ఒక నగర పాలక సంస్థ. ఢిల్లీ అసెంబ్లీ ఒక మునిసిపల్ కౌన్సిల్ వంటిది. అవినీతి నిర్మూలన అనేది అఖిలభారత సమస్య. అవినీతి నిర్మూలనకు మౌలిక సంస్కరణలు అవసరం. అసెంబ్లీగా పిలువబడే ఒక నగర పాలక సంస్థ అటువంటి మార్పులను అమలు లోకి తేవటం కుదరదు. ఢిల్లీకి ఉన్నది లెఫ్టినెంట్ గవర్నర్, కనీసం గవర్నర్ కూడా కాదు. అంటే కేంద్రప్రభుత్వానికి గుమాస్తాలాంటి వాడు. ఏ మౌలిక మార్పును తేవాలన్నా కేంద్ర హోమ్ శాఖను సంప్రదిస్తానంటాడు. మౌలిక సంస్కరణలు తేవాలనుకునే వాళ్ళు నగరపాలక సంస్థలకే కాదు రాష్ట్ర శాసన సభలకు కూడ పోటీ చేయటమే దండగ.

ఋజువు చేయండి


పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సిపిఎం 40 ఏళ్ళు పాలించింది. కమ్యూనిజాన్ని బెంగాల్లో ప్రవేశపెట్ట గలిగిందా? లేదు. ఎందుకంటే, మౌలిక మార్పులు తేవాలంటే రాజ్యాంగాన్ని తిరగ వ్రాయాలి. అంటే, కనీసం 2/3 మెజారిటీ కావాలి. ఎక్కడ? లోక్ సభలో, రాజ్యసభలో. చివరికే మయింది? సీపీఎమ్ తన పరువు కోల్పోయింది. అధికారాన్నీ కోల్పోయింది.

ఇప్పుడు కేజ్రీవాల్ కి ఉత్తమ మార్గం ఏమిటి?


ఆయన దేశమంతా తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని అఖిల భారత పార్టీగా ప్రమోట్ చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయావకాశాలు మెరుగు కావటంతో, గూండాలు, ఆయారాంలు గయారాంలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన సరియైన వ్యక్తులను తన పార్టీలో చేర్చుకోకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇసుక మేడ లాగా మారుతుంది.

ఆర్ధిక సిధ్దాంతాలు, విధానాలు ఏవి?


ఆం ఆద్మీ పార్టీకి ఇంతవరకు సరియైన ఆర్ధిక సిధ్ధాంతాలు లేవు. ప్రాథమికంగా బిజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఆర్ధిక సిధ్ధాంతాలు ఒకటే. స్పష్టమైన ఆర్ధిక సిధ్ధాంతాలను ఏర్పరుచుకోటమే కాదు, వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. అధికారంలోకి రావటం కన్నా, సిధ్ధాంతాలను, సైధ్ధాంతిక నిబధ్ధత ఉన్న కార్యకర్తలను , సహాయక నేతలను, ఉపనేతలను, నేతలను, ముఖ్యనేతలను సమకూర్చుకోటం అవసరం. మార్టల్స్ అయిన నాయకులు మరణించినా పార్టీలు సజీవ సంస్థలుగా కొనసాగాలి.

సిధ్ధాంతాలు పార్టీలను రిజిడ్ ఇనుప చట్రాలుగా చేయవా?


సిధ్ధాంతాలను మూడు రకాలుగా విభజించు కోటం అవసరం.
మొదటివి: ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడటానికి వీలు కానివి.
రెండవ రకం: కొంత కష్టంతో మార్చుకోటానికి వీలైనవి.
మూడవ రకం: సులభంగా మార్చుకోటానికి వీలైనవి.

మొదటిరకం సిధ్ధాంతాలు: నూటికి నూరుశాతం సభ్యులు ఏకీభవించినా, మొదటిరకం సిధ్ధాంతాలను వదలి వేయటం వీలుకానంతగా అవి గొప్ప పటిష్టంగా ఉండాలి. నూటికి నూరుశాతం సభ్యులు తమ మొదటి రకం సిధ్ధాంతాలను మార్చుకోవాలనుకుంటే కావాలనుకుంటే కొత్త పార్టీని స్థాపించుకోటమే మేలు.

రెండవ రకం సిధ్ధాంతాలు: 75శాతం లేక 66శాతం సభ్యులు మద్దతిస్తే ఈసిధ్ధాంతాలను విధానాలను మార్చుకోవచ్చు.

మూడవ రకం సిధ్ధాంతాలను, సాధారణ మెజారిటీ తో మార్చుకోవచ్చు.

కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణకి ఏమి సమాధానం


పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక వర్గం నియంతల్లా వ్యవహరించటం రివర్స్ పిరమిడ్ ఆర్కిటెక్చర్ ఉన్న ప్రతి సంస్థలోను ఉంటుంది. సిధ్ధాంతాలు, విధానాలు, క్రిందనుండి పైకి ప్రవహించాలి. అంతే తప్ప పైనుండి క్రిందికి కాదు. ఇది సఫలం కావాలంటే, తృణమూల స్థాయి సభ్యులు విజ్ఞాన ధనులుగా ఉండాలి. సిధ్ధాంతాలకు కట్టుబడేవాళ్ళుగా ఉండాలి. అపుడు వారు ఎన్నుకునే మండల (తాలూకా) , జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి నేతలు ఉత్తములుగా ఉంటారు.

ఈనాటి పద్యం


తిక్కన కవీంద్రాంధ్రీకృత శ్రీమదాంధ్ర మహాభారతం, 12వది అయిన శాంతి పర్వం, ప్రధమాశ్వాసం. 396వ పద్యం.

విషయం: అధికార పార్టీ ఓడిపోయి వేరొకపార్టీ అధికారంలోకి వచ్చినపుడు, పాతవాళ్ళు ఖాళీ చేసిన బంగళాలను కొత్తవాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇపుడ కేజ్రీవాల్ రాజీనామా చేసాడు కదా, లక్కీగా చిన్న ఇల్లు తీసుకున్నాడు కాబట్టి ఖాళీ చేయటం తేలికవుతుంది.

భారతంలో: ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. బంగళాలను ఎలాట్ చేస్తున్నాడు.

సీసపద్యం.
బహు రత్నమయ ఘనప్రాసాద మండప,
దాసదాసీజనోద్భాసితంబుఁ
దత్తుల్య వైబవ తదధిక ధన ధాన్య,
సుఖ వస్తు సంచయ సుఖకరంబుఁ
గిన్నెర వల్లభ గృహ సమానత్వమ
హావిభూతి స్ఫురణాంచితంబు
సర్వ సంపత్స్ఫూర్తి చారవామాక్షీ ప్ర
చార సంశోభిత స్థల చయంబు

తేటగీతి
నైన వాని రారాజు నిల్లనిజునకు,
దుస్ససేను మందిరము పార్ధునకు వరుస
తోడ దుర్మర్షణునియును, దుర్ముఖునియు,
నిండ్లు కవలకు సంప్రీతి నిచ్చె నృపతి.

సారాంశం


ధర్మరాజు చేసిన ఎలాట్ మెంటు: రత్నాలు పొదిగిన మండపాలు, దాసదాసీలు, ధన ధాన్యాలు, సుఖకరమైన వస్తువులతో నిండినది, సర్వసంపదలు, స్త్రీలతో శోభిల్లే రారాజు ఇల్లు (దుర్యోధనుడి బంగళా) ని అనిలజుడు అంటే భీముడికి ఇచ్చాడు. దుశ్సాసనుడి ఇంటిని అర్జునుడికి ఇచ్చాడు. దుర్మర్షణుడి (దుర్యోధనుడి తమ్ముడి) బంగళాను నకులుడికి ఇచ్చాడు. దుర్ముఖుడి (ఇంకో తమ్ముడి) బంగళాను సహదేవుడికి కేటాయించాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య


ధర్మరాజు కర్ణుడి ఇంటిని ఎవరికి ఎలాట్ మెంట్ చేసి ఉండాలి? పార్ధుడికి (అర్జునుడికి) దుశ్సాసనుడి ఇంటిని ఇచ్చాడు. అర్జునుడు చంపిన భీష్ముడి ఇంటినో, కర్ణుడి ఇంటినో ఎలాట్ చేయవచ్చు కదా. కర్ణుడు సామంతుడు కాబట్టి అతడి ఇల్లు తక్కువ తరగతి బంగళా అయి ఉండవచ్చు. భీష్మ పితామహుడి ఇల్లు ఇవ్వకపోటానికి కారణం ఉంది. భీష్ముడి ఇంకా అంపశయ్యమీదే ఉన్నాడు. ఆయన రణరంగంలో బాణాల మంచం మీద పండుకుని ఉన్నప్పటికీ భీష్ముడి బంగళా ఖాళీ కాలేదు. కనుక ఇవ్వకపోటం సముచితం. దుశ్శాసనుడు ప్రిన్స్. దుష్ట చతుష్టయంలో ఒకడు. అతడి ఇల్లు దుర్యోధనుడి ఇంటి వలె గ్రాండ్ గా ఉండి ఉండాలి. కనుక దుశ్శాసనుడి ఇంటిని అర్జునుడికి ఇచ్చి ఉండవచ్చు. ద్రోణుడు కర్ణుడు వలె సామంతుడు కాదు. ద్రోణుడు ఆచార్యుడే అయినా సేవకుడే కానీ ప్రిన్స్ కానీ, రాజు (సామంత) కానీ కాదు. కాబట్టి ఆయన బంగళా తక్కువ స్థాయికి చెంది ఉండాలి.

ఇంకా ఉంది. ఇంకో సారి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.