Thursday, February 13, 2014

136 Andhra vale bhAgo

136 Fake bleeding hearts నకిలీ హృదయ రక్త స్రావాలు
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, భారతీయ రాజకీయాలు, కాంగ్రెస్, బిజెపి, అద్వానీ

12.02.2014 మరియు 13.02.2014 నాడు లోక్ సభలో జరిగిన అంశాలపై సమీక్షించుకోటం అవసరం.

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నదన్న మాటే కానీ, సీమాంధ్ర సామాన్య ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని నేను అనుకోను. సోనియా గాంధీ, బిజేపీలు ఏక పక్షంగా కెసీఆర్ కు లొంగిపోటం వల్ల సీమాంధ్రప్రజలకు గొంతుకోసినట్లయింది. లేకపోతే 1972లో తీవ్రంగా ప్రత్యేకాంధ్ర ఉద్యమం నడిపిన ప్రజలు నేడు సమైక్యాంధ్ర అని ఎందుకంటారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్షలకోట్లనిథులను హైదరాబాదులో కుమ్మరించి, దానిని 23జిల్లాలకు మార్కెట్ గా మార్చి ఒక ఆదాయ కేంద్రంగా మార్చటంలో కేవలం తెలంగాణ 10జిల్లాల ప్రజల శ్రమ కాక ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలే కాక గుల్బర్గా, రాయచూర్, మరియు కర్నాటక, పర్భాని, నాందేడ్, జాల్నా, మొ|| మరాఠా జిల్లావాసుల శ్రమకూడ ఉంది. అంటే హైదరాబాదు అఖిలభారత నగరంగా మారింది. ఇక్కడ బీహార్, ఒరిస్సా నుండి కూలీలు వచ్చి బ్రతుకుతెరువులను వెతుక్కుంటున్నారు. నిరాశ్రితులకు హైదరాబాదు ఉపాధి నగరంగా మారింది. దీనిని తానూ, నిజాం నవాబూ కలిసి నిర్మించామని కెసీఆర్ గారు ప్రచారం చేసుకుంటుంటే, అఖిలభారత నేత్రి సోనియా గాంధీగారు నిజానిజాలను వెతికి తీయాల్సిందిపోయి ఆమెయే గులాబీ కండువా వేసుకొని హైదరాబాదును కేసీఆర్ కి వ్రాసి ఇవ్వటానికి కంకణం కట్టుకోటం ఈసమస్యకు మూలం.

సుష్మా స్వరాజ్, ఎల్ కే అద్వానీలు తమగుండె ద్రవించింది అని నేడు అంటున్నారు. అసలు వాళ్లకి గుండెలు అనేవి ఉంటే కదా. వారు గుండెలు తీసిన బంట్లు.

కోస్తా భూకబ్జాదారులు, రాయలసీమ భూకబ్జాదారులు హైదరాబాదులో భూములను కొనేసి, ఆక్రమించి నేటివ్ తెలంగాణ వారిని భూమి లేని వారిగా చేయలేదా


జవాబు: దీనికీ శ్రామికుల వలసకు మనం లింకు పెట్టకూడదు. కోస్తా భూకబ్జాదారులు, రాయలసీమ భూకబ్జాదారులు, తెలంగాణ నేటివ్ భూకబ్జాదారులు, అఖిలభారత భూకబ్జాదారులు (రాష్ట్రాలవారిగా ఈపట్టీ తయారు చేయాలంటే సూపర్ కంప్యూటర్లు కావాలి), రియాల్టర్లు మధ్య జరుగుతున్న ప్రాక్సీ యుధ్ధమే నేటి తెలంగాణ ఉద్యమం. దానికి నిజమైన పరిష్కారం మార్క్సిజం మాత్రమే. హైదరాబాదులో ఒక శ్రామికుడు స్థిర పడాలంటే ఒక్కోఇంటికి 75/100 గజాల స్థలం చాలు. భూ కబ్జాదారులు, స్పెక్యులేటర్లు, రియాల్టర్లు, పారిశ్రామిక వాణిజ్యవేత్తలు వేల కొలది ఎకరాలు కొని పారేయకుంటే ఈభూమి శ్రామికుల నివాసానికి దొరికేదే. హైదరాబాదులో తెలంగాణా శ్రామికులకే కాక, సీమాంధ్ర శ్రామికులకే కాక, అఖిల భారతీయ శ్రామికులకు కూడ ఉపాధి కొరత ఉండేది కాదు. దీనిని తెలంగాణ సామాన్యప్రజలు అర్ధం చేసుకోకుండా కమ్మిన మబ్బు తెరయే కెసీఆర్ కోదండరాం ల దుర్బోధ.

ఇపుడు తెలంగాణ ప్రజలు విభజన తప్ప మరిదేనినీ ఒప్పుకోని స్థితి వచ్చింది. పోనీలే తమ్ముడు తింటే తిన్నాడు అని సర్దుకు పోయే అన్నలు భారతజాతిలో ఉన్నారు. శేషాంధ్ర ప్రజలు కూడ హైదరాబాదుని, తెలంగాణ రాష్ట్రానికి వదలటానికి వెనుకాడే వారు కాదేమో.

తెలంగాణకు హైదరాబాదు బదిలీకి, భారత్ ఒక యూనియన్ గా మనుగడకు అవసరమైన షరతు


భారతీయులు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు, స్థిరపడ వచ్చు అని రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, సీమాంధ్రులకే కాదు బీహారీలకు, ఓఢ్రులకు, గుజరాతీలకు వీరు వారని లేకుండా అందరికి లభించాలి, ఈ అఖిల భారత హక్కుకు భంగం కలగకుండా ఏవిభజనలైనా జరగాలి.

హైదరాబాదునే కాదు, 20 లక్షలు జనాభా దాటిన, త్వరలో దాటబోయే ప్రతినగరాన్ని యూనియన్ టెరిటరీగా మార్చాల్సిందే. అప్పుడే శ్రామికుల స్వేఛ్చ్ఛా సంచారం హక్కు సార్ధకం, సాధికారికం అవుతుంది.

కానీ కెసీఆర్ అండ్ కో

ధోరణి ఈ సర్దుబాటు జరగటానికి అడ్డుపడింది. కెసీఆర్ గారి నినాదం చూడండి:

తెలంగాణ జాగో - ఆంధ్రవాలే భాగోఈ నినాదం ఇచ్చిన కెసీఆర్ ను ఆనాడే కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసి చట్టరీత్యా ప్రాసిక్యూట్ చేసి ఉండవలసినది. ఎందుకు చేయలేదు? సోనియా గాంధీకి కెసీఆర్ మధ్య అవగాహనలు ఉన్నాయి కనుక.

ఈనినాదం ఇచ్చిన కెసీఆర్ దొరగారు తమనేదో ఉధ్ధరిస్తారని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకుంటే, అవి నిరాశలు కాకమానవు. హైదరాబాదులో భూకబ్జాలకై, కాంట్ర్టాక్టులకై, కమీషన్లకై, ముందు ముందు ఉత్తర తెలంగాణ జిల్లాల నేతలకు, దక్షిణ తెలంగాణ నేతలకు కుమ్ములాటలు, కొట్లాటలు జరగబోతున్నాయి. అంతం కాదిది ఆరంభం. పాకిస్థాన్ లో, పశ్చిమ పంజాబ్ (రావల్పిండి, లాహోర్) వారికి సింధ్ (కరాచీ) వారికి మధ్యలో జరుగుతున్న కుమ్ములాటల్లో సింధ్ ప్రజలు పడుతున్న బాధలు మనకి ఏమి నిరూపిస్తాయి? మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల స్లోగన్లు పెట్టుబడి దారీ విధానంలో, భూస్వామ్యవిధానంలో చాకలిబానలో కుందేలు పిల్లల్లా ఉడికిపోయే పేదప్రజలకు శాంతిని ఇవ్వకపోగా వారిలో పరస్పరం ద్వేషించుకునే వారిలాగా తయారుచేస్తాయి.

నా ఈసిధ్ధాంతాన్ని వాస్తవాలతో నిరూపించటం కష్టం కానే కాదు. మనం తెలంగాణలో ఏగ్రామానికైనా, సీమాంధ్రలో ఏగ్రామానికైనా వెళ్ళవచ్చు. ఆగ్రామంలో ఒక్క కులానిదే పెత్తనం ఉంటుంది. అది ప్రధమ భూకులం (భూములు ఎక్కువగా కలిగి ఉన్న కులం). రెడ్డికావచ్చు. వెలమ కావచ్చు. కమ్మ కావచ్చు. కాపుకావచ్చు. పేరేదైనా కావచ్చు. పేరు అప్రస్తుతం. రెండవ భూకులం వారు, ఇంకా ఆ గ్రామంలో ఉభయకులాల మధ్య పట్టుకోసం కుమ్ములాట జరుగుతూ ఉంటే, కుతకుత లాడుతూ ఉంటారు. వారికి సరియైన పట్టు దొరకకపోతే, తమ కులం ప్రధమ భూకులం గా ఉన్న గ్రామానికి వలస పోతారు. మరి మిగతా కులాల సంగతి ఏమిటి? ఆకులాల పెద్దల పని ఏమిటి? కుల పంచాయితీలను నిర్వహించటం, ఎన్నికలు వచ్చినపుడు అభ్యర్ధుల నుండి నగదు సంచులు, మద్యం దిగుమతి చేసుకొని, పంచినంత పంచి, మిగిలింది దాచుకోటం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, తెలంగాణా రాష్ట్రమైనా, శేషాంధ్ర రాష్ట్రమైనా ఈక్రీడ ఆగదు. ఇదంతా భూస్వామ్య రాజకీయాలలో ఒకభాగం. పట్టణాలు, నగరాలకు వచ్చినపుడు వ్యవసాయ భూమి స్థానంలో వ్యవసాయేతర భూములు రంగంలోకి వస్తాయి. బేసిక్స్ మారవు.

కర్రు గాల్చి వాతలు పెడతాను


ఈ మాటను కెసీఆర్ గారు కొన్న డజన్లసార్లు అన్నాడు. అలా అన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గుండెకాయ ఎందుకు బ్లీడింగ్ అవలేదు? సుష్మా స్వరాజ్, అద్వానీ గారి గుండె ఎందుకు ద్రవించలేదు.

కెసీఆర్, కోదండరాంల దుర్బోధలకు ప్రభావితులై కొందరు తెలంగాణ అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల మంది తెలంగాణ అమాయకులు ఆత్మహత్యలు చేసుకోటం తెరాస నేతలకు ఆనందకరం. ఎందుకంటే అది వారి శవాలమీద మరమరాలను ఏరుకునే రాజకీయాలకు, డిమాండ్లకు బలాన్ని ఇస్తుంది. ఎంతమంది ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటే, అంత భారీగా ఎక్స్ టార్షన్ లు చేసుకోవచ్చు.

మన్మోహన్ సింగ్ గారు విదేశీ పర్యటనలు, అమెరికా, లండన్ లలో సన్మానాలను తగ్గించుకుని ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతున్నది , దీనిని మనం శాంతితో, సమన్వయంతో, ఎలా సరిదిద్దగలం అని దృష్టి పెట్టుకుని హైదరాబాదు, విజయవాడ, విశాఖ, కర్నూల్ లలో ప్రజలను కలిసి ఉంటే ఏదో ఒకదారి దొరికేది.

ఇప్పుడు నా గుండె బ్లీడింగ్ అవుతున్నది అని వాపోవ వలసిన స్థితి వచ్చేది కాదు. పోనీ సుష్మా స్వరాజ్, అద్వానీ గారు తెలంగాణ, శేషాంధ్రలలో పర్యటించి స్నేహపూర్వక విభజన, రాజీకి కృషిచేశారా? స్వరాజ్ గారు మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడి ప్రజలని రెచ్చగొట్టి వెళ్ళింది.

13.2.2014 తేదీ పెప్పర్ స్ప్రే లోక్ సభకి ప్రధాని మన్మోహన్ సింగ్, డీ ఫ్యాక్టో ప్రధాని సోనియా గాంధి హాజర్ కాలేదని వార్తలు వచ్చాయి. ఇంటి చూరుకి నిప్పంటించి, గుండె పట్టుకొని బయట కూర్చోటం, దీనిని ఏమనాలి?

పరిస్థితులు సజావుగా లేనపుడు, 2014 మేలో రానున్న కొత్త లోక్ సభలో, కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని వెతకచ్చు. ఒక దేశ చరిత్రలో 3 నెలలు అనేది పెద్ద సమస్యకాదు. విచిత్రమేమిటంటే తెలంగాణ బిల్లుని లోక్ సభలో ముందుకు నెట్టటానికి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కు కావటం.

2004 ఎన్నికల్లో సోనియా తెలంగాణ వాగ్దానాన్నిగులాబి కండువా వేసుకుని చేసింది. రెండవ రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ని నియమించి, వారి సూచనలను పాటిస్తూ, సామరస్యానికి కృషిచేస్తూ 2009 ఎన్నికలకల్లా తెలంగాణ ఇచ్చిఉండవలసిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె ఈవిషయంలో ఎందుకు చొరవతీసుకోలేదో, వైయస్ రాజశేఖరరెడ్డికి ఎందుకు నచ్చచెప్పలేక పోయిందో ఆదేవుడికే తెలియాలి.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరలా తెలంగాణ వాగ్దానాన్నిచేసింది. సీమాంధ్ర ప్రజలకు సీమాంధ్ర వాగ్దానాన్ని చేసిందా? చేయలేదు. ఎందుకని. పోనీ, తరువాతనైనా ఏవైనా ఆమోదయోగ్యమైన ప్రత్యేక సీమాంధ్ర ప్రతిపాదనలను వారి ముందుకు తెచ్చిందా? లేదు.

సోనియా చుట్టు ఉన్న చిదంబరం, కమల్ నాథ్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, షిండే, వంటి నేతలు ఆమెను తప్పుదారి పట్టిస్తున్నారో, లేక ఆమెయే 'నోరుమూసుకుని నేను చెప్పిన పనిచేయ' మని వారిని శాసిస్తున్నదో కానీ మనకి కనిపిస్తున్నది నిరంకుశ మొండి ప్రవృత్తి. కమల్ నాధ్ గారికి ఒక నదీ గర్భాన్ని ఆక్రమించి హోటల్ ని నిర్మించుకున్న ఖ్యాతి ఉన్నది. శ్రీచిదంబరం గారు ఆర్ధిక రంగాన్ని, దేశబ్యాంకింగ్ రంగాన్ని ఎంత భ్రష్టు పట్టించారు అనేది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త ఆర్ధికమంత్రి రంగంలోకి దిగితే గానీ తెలియదు. ముంబాయి ఆదర్శ హౌసింగ్ స్కాంలో షిండేగారి పాత్రపై శ్రీమతి సోనియా గాంధీగారి రియాక్షన్ తెలియదు.

శేషాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు పులుగడిగిన ముత్యాలు అని నేను వ్రాయదలుచుకోలేదు. కానీ సోనియా చుట్టూ ఉన్న నేతలకన్నా వారికి ప్రజలలో ఎక్కువ పలుకుబడి ఉన్నది. సోనియాని భుజంపైపెట్టుకొని మోయటంలో ముప్పు ఏమిటో, తెలంగాణ ఎంపీలకు తెలియకపోయినా, శేషాంధ్ర ఎంపీలకు ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుంది. ఈజ్ఞానోదయానికి మనం స్వాగతం చెప్పాలి.

తెలంగాణ ప్రజలు అడకత్తెరలోని పోకలు కాబోతున్నట్లే (టీ ఆర్ ఎస్ - టీ కాంగ్రెస్ మధ్య, లేక టీఆర్ఎస్ మెర్జిత కాంగ్రెస్, టీడీపీ సమర్ధిత బిజేపి మధ్య ఇరుక్కోటం), శేషాంధ్ర ప్రజలు టీడీపి (ప్లస్ రహస్య బిజెపి అవగాహన) మరియు జగన్ మధ్య ఇరుక్కుని ఊపిరాడక గిలగిల లాడబోయే రోజులు రాబోతున్నాయి. కిరణ్ కొత్త పార్టీ పెట్తే, కొత్త రాజకీయ త్రిశూలం తలెత్తి ప్రజలని బాధిస్తుంది.

కాబట్టి గుండెలు బ్లీడింగ్ కావాల్సింది తెలంగాణ ప్రజలకి, శేషాంధ్ర ప్రజలకి. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి బండరాళ్ళకి కాదు.

ఈనాటి కవిత


రచన మహాకవి శ్రీశ్రీ.


ఇలాంటి కవితలను డీ జ్యూరీ ప్రధాని మన్మోహన్ సింగ్, డీ ఫ్యాక్టో ప్రదాని సోనియా చదివి ఉంటే heart bleeding జరుగుతున్నట్లు నటించవలసిన పరిస్థితిలు తెచ్చుకునేవాళ్ళుకాదు.

బాటసారి


కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిన పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కుతెలియక-
నడిసముద్రపు నావరీతిగ
సంచరిస్తూ సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండచండం, తీవ్రతీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!

కళ్లు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్లో తల్లి ఏమని
పలవరిస్తోందో...?

చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్లదృశ్యం
కళ్లముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!
అతని బ్రతుకున కదే ఆఖరు!

గ్రుడ్డి చీకటిలోను గూబలు
ఘాకరించాయి;
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;

వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.