Friday, February 7, 2014

129 Unjust bifurcation

129 Center persisting with its unjust Telangana bill తన అన్యాయపూరిత తెలంగాణ బిల్లును పట్టుకొని ఇంకా వేళ్ళాడుతున్న కేంద్రం
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, సుప్రీంకోర్టు, తెలంగాణ, సీమాంధ్ర

8.2.2014 నాటి వార్తల ఆధారంగా

ముందుగా ఒక వాస్తవం


సీమాంధ్ర ప్రజలు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు. 1972లో వారు జైఆంధ్రా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు. తెలంగాణ నేతలు 1972లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అపుడే సీమాంధ్ర ప్రజలు కోరినట్లుగా రాష్ట్ర విభజన చేసి ఉంటే సీమాంధ్ర 2014 నాటికి ఎంతో కొంత అభివృధ్ధిని సాధించి ఉండేది. 1972 - 2014 మధ్యకాలంలో హైదరాబాదులో విపరీతంగా పెట్టుబడులు పెట్టి ఆనగరాన్ని ఉపాధి ఆశా నగరంగా తయారు చేశారు. హైదరాబాదు పోయి ఇడ్లీలు అమ్మో కూల్ డ్రింకులు అమ్మో బతకచ్చనే ఆశ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కలిగింది. సీమాంధ్ర పట్టణాలను అశ్రధ్ధ చేయటం వలన అవి వెలవెలా పోతున్నాయి. జనాభా ఉండటం వల్ల ఇళ్ళు భారీగా కనపడటం వల్ల అక్కడేదో అభివృధ్ధి జరిగిందన్న భ్రమ కలుగుతున్నది, తప్ప గ్రామీణ తెలంగాణ లోని పేదల దైన్యానికి సీమాంధ్ర పేదల దైన్యానికి భేదమేమీ లేదు.

సీమాంధ్ర నేతల పొరపాటు


టీ నేతల దుర్బోధల వల్ల తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజలను ద్వేషిస్తున్నారు. ఈద్వేషం పోవటానికి ఒక శతాబ్దం పైగానే పట్టవచ్చు. ఈలోగా బలవంతంగా కలిసి ఉండాలనుకోటం, తెలంగాణ ప్రజలను కలిసి ఉండమని బలవంతం చేయటం కుదరని పని. సీమాంధ్ర ప్రజలు, నేతలు చేపట్టవలసిన ఉద్యమం సమ న్యాయ ఉద్యమమే తప్ప సమైక్యాంధ్ర ఉద్యమం కాదు. విభజన ఆలస్యం అయ్యే కొద్దీ సీమాంధ్ర ఇంకా ఎక్కువ నష్టపోతుంది. సీమాంధ్ర పట్టణాలు అభివృధ్ధి కావు.

విభజన వల్ల తెలంగాణకే నష్టం


విభజన వల్ల తాము బాగా లాభపడతామని తెలంగాణ ప్రజలు ఆశ పడుతున్నారు. 23 జిల్లాల రాష్ట్ర రాజధానిగా హైదరాబాదుకు ఉండబోయే మార్కెట్ కన్నా, 10 జిల్లాల రాజధానిగా హైదరాబాదుకి ఉండబోయే మార్కెట్ తగ్గబోతున్నది. ఫ్లోటింగ్ జనాభా సగం కన్నా తగ్గుతుంది. కొనుగోలుదారులు లేక షాపులు మాల్స్ విలవిల లాడతాయి. హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింటుంది. మార్కెట్ లు దెబ్బతింటే పన్నుల వసూళ్ళు తగ్గుతాయి. ఇపుడు హైదరాబాదునుండి వస్తున్న ఆదాయంపై , రియల్ ఎస్టేట్లపై టీ-నేతలకు గుత్తస్వామ్యం లభించినా అది పది ఏళ్ళకన్నా ఉండదు. ఈదూరదృష్టి తెలంగాణ నేతలకు , వారి దుర్బోధలను వినే తెలంగాణ ప్రజలకు లేకపోతే వారు పశ్చాత్తాప పడేరోజులు ముందు ఉంటాయి. ఈసందర్భంగా వారు అమెరికా లోని డిట్రాయిట్ నగరంయొక్క అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.

9000 సవరణలు చెత్తకుండీలోకి


ఆంధ్రప్రదేశ్ శాసనసభపై, మరీ మాట్లాడితే దేశంలోని రాష్ట్రాల శాసనసభలకూ కేంద్ర పాలకులు ఎంత విలువ ఇస్తున్నారో కదా, ఆహా!!! రాష్ట్రశాసనసభలో శాసనసభ్యులు ప్రతిపాదించిన సవరణలను కేంద్రపాలకులు కనీసం పార్సెల్ విప్పి చూడలేదు. చెత్తకుండీలో పారేసినట్లయింది.

సీమాంధ్ర రాజధాని ఎక్కడ


కేంద్ర ప్రభుత్వం, 2009 లోనే విభజన అనివార్యం అనే విషయాన్ని స్పష్టం చేసి, రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని ప్రజల్లో, సీమాంధ్రనేతల్లో చర్చకు పెట్టి ఉంటే, ఇప్పటికల్లా ప్రజలు, నేతలు స్పష్టమైన డిమాండ్లతో ముందుకు వచ్చేవాళ్ళు. బహుశా వారు రాయలసీమ (బహుశా కర్నూలు రాజధానిగా), దక్షిణాంధ్ర (బహుశా వి-గుం-తె రాజధానిగా), ఉత్తరాంధ్ర (విశాఖ రాజధానిగా) ప్రత్యేక రాష్ట్రాలను కోరి ఉండేవాళ్ళు. ఈ రాష్ట్రాలు జనాభాలో గానీ కేరళ, హిమాచల్, గోవా వంటి రాష్ట్రాలకు తీసి పోవు కాబట్టి, దేశానికి 50 శాశ్వత చిన్నరాష్ట్రాల ప్రతిపాదనలో భాగంగా ఇవ్వటం తేలికయ్యేది.

ముందు రాజధాని నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిధ్ధం చేసుకోవద్దా


ముందు కాబోయే రాజధానులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిధ్ధం చేసుకొని ఆతరువాత విభజన బిల్లుని పెడితే కార్యాలయాల బదిలీ చాలా తేలికయ్యేది. ఇపుడు హైదరాబాదులో కనీసం నాలుగైదేళ్ళు సీమాంధ్ర తెలంగాణ ప్రభుత్వాల మధ్య తొక్కిసలాట జరగబోతున్నది. గుర్ఱం ముందు బండిని కట్టటం వల్ల బండి ముందుకు వెళ్ళటం కష్టం.

క్రొత్త రాజధానికి 5,౦౦,౦౦౦ కోట్ల కేటాయింపు వార్త


ఈ 5,౦౦,౦౦౦ కోట్లు కాంట్రాక్టర్లకు, నేతలకు గొప్పవరం కాబోతున్నాయి. ఈకాంట్రాక్ట్లలో పర్సెంటేజీల కోసం, రాజధానిని వైజాగ్ లో ఉంచమని, వి-గుం-తె లో ఉంచమని, కర్నూల్ లో ఉంచమని కుమ్ములాటలు మొదలవుతాయి. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం, పైగా పాత ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు యొక్క అర్హతలను కాదనటం న్యాయం కాదు. అంతేకాదు వైజాగ్, వి-గుం-తెలు ఇప్పటికే చీమలు దూరని జనారణ్యాలుగా మారాయి. భూముల ధరలు ఆకాశానికంటాయి.

పై వార్తకు సవరణ, మరియు పాఠకులకు క్షమాపణ


సవరణ చేస్తున్న సమయం 8.2.2014, 6.35 సాయంకాలం. ఉదయం వ్రాసిన పై రాష్ట్రరాజధాని నిర్మాణానికి రూ. 5,౦౦,౦౦౦ కోట్లు కేటాయించిన వార్త ది హాన్స్ ఇండియా THE HANS IDIA ఆంగ్ల దినపత్రిక మొదటి పేజీ పతాక శీర్షికలో వచ్చినది. వారు ఎక్కడో పొరపాటు పడినట్లున్నారు. రూ. 5,౦౦,౦౦౦ కోట్లు ఇవ్వటానికి ఆర్ధికమంత్రి శ్రీచిదంబరం ఒప్పుకున్నారని నేను నమ్మటం నా బుధ్ధి తక్కువ. ఏది ఏమైన పాఠకులకు నా '' ఖేద్ '' .

కర్నూలు రాజధాని అయితే రాబోయే సమస్యలు


రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయనేది అనుభవైక వేద్యం. కాబట్టి ఇఛ్చాపురం నుండి, తడనుండి, నిజాంపట్నం నుండి కూడ ప్రజలు కర్నూలుకి వలస పోవాల్సి వస్తుంది. వలసలు పెరిగినపుడు భూములధరలు ఆకాశాన్నంటటం, సెటిల్ మెంట్లు పెరగటం, మాఫియాలు చెలరేగటం వంటివన్నీ ఉంటాయి. మా ఉద్యోగాలన్నీ సీమాంధ్రులు కొట్టుకెళ్తున్నారు అని తెలంగాణ ప్రజలు అనుకున్నట్లే రాయలసీమ ప్రజలు అనుకోటం తథ్యం.

భవిష్యత్ దృష్టి అవసరం


సోనియా గాంధీకి గుల్బర్గా, రాహుల్ గాంధీకి మెదక్ లేక కరీంనగర్ అన్నట్లు కాకుండా తెలుగుప్రజలు ఇంకా తన్నుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని ఆలోచించటం అవసరం.

ఏకైక పరిష్కారం


ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలే.

ప్రస్తుతానికి ముగింపు


రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే గారు తన స్వంత లోక్ సభ నియోజక వర్గమైన గుల్బర్గాకు రైల్వేడివిజన్ ను సృష్టిస్తూ ఉండటం గమనార్హం. కాజీపేటకు కర్నూలుకు అనకున్న రైల్వే ప్రాజెక్టు నొకదానిని సోనియా నియోజకవర్గం అయిన రాయ్ బెరెలీకి తరలించటం గమనార్హం. శ్రీమతి సోనియా గాంధి ఇటీవల గుల్బర్గా వెళ్ళి ఒక పెద్ద 1000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించి వచ్చారు. దీనిని బట్టి ఒకసంకేతం ఏమిటి? సోనియా గాని రాహుల్ గానీ గుల్ బర్గానుండి పోటీ చేయవచ్చు.

సోనియా సీమాంధ్రను ఎందుకు సందర్శించటం లేదు? ఆమె కెసీఆర్ అంటే ఎందుకు వణికి పోతున్నదో అర్ధం కావటం లేదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.