Sunday, September 28, 2014

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే
చర్చనీయాంశాలు   358, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంద్ఱ, రాజధాని

ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడుగారు భూకబ్జా నేతలు, రియాల్టర్లు, బిల్డర్ల గుప్పిట్లో ఇరుక్కుని రాజధానిని నియంతృత్వ పధ్ధతులలో విజయవాడ పరిసరాలలో నెలకొల్పటానికి పూనుకోటం దురదృష్టకరం.

కృష్ణా నదికిరుప్రక్కలా ఉన్న భూములను ముఖ్యమంత్రిగారు బినామీగా కాకపోయినా, ఆయన చుట్టూ ఉన్నవారు చేజిక్కించుకొని తమ తమ వ్యాపారాలకొరకు బెల్లం చుట్టూ ఈగల్లాగా రాజధాని చుట్టూ చేరటం విచారకరం.

కృష్ణానదిలోకి ఇపుడు విడుదల అవుతున్న హైదరాబాదు డ్రెయినేజి (సరిగా ట్రీట్ చేయబడకుండా నురగలతో, మూసీనది ద్వారా వస్తుంది) తోనే ఇపుడు జనం రోగాలతో చస్తున్నారు.  ఇంక కొత్తరాజధాని డ్రెయినేజీలను కూడ కృష్ణానదిలోకి వదిలితే ఆహా సొగసు చూసి తీరవలసినదే.

చాలా మందికి తెలిసి కూడ పట్టించుకోని విషయాలు. విజయావాడలోని మూడు కాలువలోకి మునిసిపల్ డ్రైనేజీని వదలటం వల్ల అవి మురికి కూపాలుగా మారాయి.

ప్రజలు  యాభయి గజాల స్తలాలకి కూడ నోచుకోక, కొండకొమ్ములలో కూడ ఇళ్ళు కట్టుకున్నారు.  మొగల్రాజపురం, గుణదల, తాడేపల్లి, వన్ టౌన్  మాచవరం ప్రాంతాలలో ఎప్పుడు కొండచరియలు విరిగి పడతాయో ఎవరికీ తెలియదు.  వన్ టౌన్ లో డ్రెయినేజి అదుపుతప్పింది.

విజయవాడ గుంటూరులలో భూకబ్జా మాఫియాలు, ఇతర కిరాయి హంతక ముఠాలు, తమరాజ్యాలను ఇప్పటికే పాలిస్తున్న విషయం అందరికీ తెలుసు.  అవి రాజధాని ఇంకా పెద్దదయ్యే కొలదీ పేట్రేగక మానవు.  వాటిని ఎన్ని క్లోజ్ డ్ సర్క్యూట్ కెమెరాలను పెట్టినా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లను నెలకొల్పినా  ఎవరూ ఆపలేరు.

ఈస్థితిలో విజయవాడ గుంటూరులపై అదనపు భారాన్ని మోపటం ఏమాత్రం సమంజసం కాదు.

ఇప్పటికే విజయవాడ , గుంటూరు, అమరావతి, మంగళగిరి, తెనాలి మధ్య వ్యవసాయభూములను దున్నేసి ప్లాట్లు వేయటం గమనార్హం.

శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లుగా మార్టూరు, దొనకొండ, వినుకొండ ప్రాంతాలలో నే కాక, నేను చెప్పినట్లుగా నాగార్జునసాగర్  విజయపురి సౌత్, లేక దిగువమెట్ట, నందికొట్కూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు వంటి ప్రాంతాలలో రాజధానిని నెలకొల్పుకుంటే రాయలసీమకి న్యాయం చేసినట్లుండేది.  అటవీ భూములు, వ్యవసాయయోగ్యంగాని వృధా భూములు ఉచితంగా లభిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారీ వికారాలు, లంపటాలూ లేకుండా,  రాష్ట్రరాజధానిని షెడ్లలో నెలకొల్పుకున్నా  దొంగమాటల మోడీని, అరుణ్ జైట్లీని, వెంకయ్యనాయుడు లను బిచ్చమెత్తకుండా తక్కువ ఖర్చుతో మనకు రాజధాని అమరేది.  మనం ఇతర కొత్త చిన్న రాష్ట్రాలకు ఆదర్శాన్ని చూపగలిగే వాళ్లం.

లేక, కొంత మేరకైనా పక్వం చెందిన రాజకీయవేత్త శ్రీ పాలడుగు వెంకట్రావు (ఆయన తప్పుడు పార్టీలో ఉండ వచ్చు) చెప్పినట్లుగా నూజివీడు సమీప ప్రభుత్వ భూములలో రాజధానిని నెలకొల్పుకున్నా, రైతుల భూములను గుంజుకోకుండ జాతీయ రహదారికి మరియు కలకత్తా మద్రాసు రైలుమార్గానికి దగ్గరగా సెటిల్ అయ్యే వాళ్ళం.

ఎలాగైనా ఒకమాట తథ్యం.  మనకు మూడు రాష్ట్రాలు కావాలి.  మొదటిది రాయలసీమ. రెండవది ఉత్తరాంధ్ర. మూడవది దక్షిణాంధ్ర.  నెల్లూరులొని కొంత భాగాన్ని రాయలసీమలో కలిపే విషయాన్ని కూడ పరిశీలించు కోవచ్చు.

చంద్రబాబు, జగన్ ల నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నేడు కాకపోయినా అనతి కాలం లోనే ప్రత్యేక రాష్ట్రోద్యమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  అది జరగక ముందే, కొత్తాంధ్రప్రదేశ్  రాష్ట్ర శాసనసభ సమావేశమయి కేంద్రాన్ని మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానంచేసి పంపాలి.  ఎంపీలు, ఎంఎల్ ఏలు సమావేశమయి, ఐక్యకార్యాచరణ జరపాలి.

ఈనాటి వీడియో, శివరంజని రాగంలో లిజనింగ్ ఎక్సర్సైజ్ (ఇయర్ ట్రెయినింగ్).


No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.