Tuesday, April 1, 2014

194 Amir's Mercedez

194 Amir's Mercedez

Topics for discussion: Amir Khan, సినిమాలు, కార్లు, ముఖేష్ అంబానీ, మహాభారతం, ఎర్రన, satyamev jayate, నరేంద్రమోడీ


సత్యమేవజయతే అనేది బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ గారు వారంవారం హోస్ట్ చేసే ఒక టివి కార్యక్రమంట. దేశంలోని సాంఘిక సమస్యలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను చూపిస్తుందట. బాగానే ఉంది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయిట. ఎందుకో ఏమిటో, ఈ దేశంలో అన్నీ విచిత్రాలే.


ఇపుడు ఇంకొక గొప్ప మరొక విచిత్రం జరిగింది. శ్రీ ఆమీర్ ఖాన్ గారు ఆత్మరక్షణ కొరకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక మెర్సిడెజ్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నారుట. ఇలాంటి కార్లు దేశంలో మూడే ఉన్నాయిట.

మొదటిది, దేశ ప్రధాన మంత్రి యైన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు గారి దొడ్లో కట్టేసి ఉంటుందట.

రెండోది వణిక్ సార్వభౌమ శ్రీముఖేష్ అంబానీ గారి చావిట్లో పడి ఉంటుందట.

మూడోదే గొప్ప సంఘసేవకుడైన మన ఆమీర్ ఖాన్ గారు ఊరేగే ఈ దివ్యరధం.

ఈనాటి పద్యం

ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన కవీంద్రుడు. శ్రీమదాంధ్ర మహా భారతం. ఆరణ్యపర్వం. షష్ఠాశ్వాసం, 135 వ పద్యం. అడవుల పాలైన పాండవులను ఓదార్చటానికి, వ్యాసుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజుకి నీతి బోధ చేస్తున్నాడు. ముద్గలుడు అనే ముని కథ్ చెప్పాడు. ముద్గలుడు ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్ధుడైన దుర్వాసుడు, ముద్గలుడికి బొందితో స్వర్గానికి వెళ్ళే వరాన్ని ఇచ్చాడు.

దేవదూత ముద్గలుడిని స్వర్గానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. ముద్గలుడు , ఆదేవదూతలను స్వర్గం ఎలా ఉంటుంది, అక్కడి ప్రత్యేకతలు ఏమిటి అని అడిగాడు. దేవదూత చెప్పిన పలు పద్యాలలో ఇవి కొన్ని.

తేట గీతి.
ఇందుఁ జేసిన పుణ్యంబు లెల్ల నందుఁ
గుడుచుఁ గాని మర్త్యున కందు గడఁగి పుణ్య
మాచరింపంగఁ గాదు పుణ్యావసాన
మగుడు భూమికి త్రోతురు మగుడ నతని.

కంద పద్యం
కడు మరగిన సౌఖ్యంబులు,
విడుచుటఁ జిత్తంబు దుఃఖ వివశముగ మహిం
బడుఁ జూవె పుణ్యలోకం,
బెడలిన మనుజుండు తేజ మేది యబలుడై.

కంద పద్యం

తన తక్కువ యునికియు న
న్యుని యున్నత శీలతయుఁ గనుంగొని చిత్తం
బున నెరియుచునికి గలుగును,
జననుత సురలోకవాస జనులకు నెల్లన్.

వచనం.
బ్రహ్మ లోకంబునం దక్కఁ దక్కిన పుణ్యలోకంబులందెల్ల నిదియ మేరయై చెల్లు. ... ... ...

ఈ వివరాలు ముద్గలుడికి నచ్చలేదు. పుణ్యం క్షీణించగానే క్రిందికి తోసేస్తారు, అనగానే, అది వాంఛనీయం కాదని అర్ధం అయ్యింది. పైగా, పాతపుణ్యాల ఫలాలను అనుభవించటమే కాని, కొత్తపుణ్యాలు చేసుకునే అవకాశం స్వర్గంలో ఉండదుట. (భూలోకంలో ఉంటుంది అని వేరే చెప్పనక్కరలేదు).

ముద్గలుడు, దేవదూతను వెనక్కి పంపించి, ఇంకా ఘోర తపస్సు చేసి, ఇంకా ఉన్నత లోకాలను పొందాడు.


ఆమీర్ ఖాన్ గారి మెర్సెడెజ్ బెంజి బుల్లెట్ ప్రూఫ్ కారు దీని ముందెంత? శ్రీనరేంద్రమోడీగారికి కూడ గుజరాత్ ప్రభుత్వ ఖర్చుతో బుల్లేట్ ప్రూఫ్ సువ్ (sports utility vehicle) అమరింది. శ్రీవారు గోవా వెళ్ళినపుడు భద్రత కొరకు ఈ బుల్లెట్ కారును కూడ తీసుకెళ్ళారు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.