Thursday, February 6, 2014

127 Narendra Modi Marital Status

127 Difficult to understand this Indian Nation ఈ భారత జాతిని అర్ధం చేసుకోవటం కష్టం.
చర్చనీయాంశాలు: నరేంద్రమోడి, బిజెపి, భారతీయ వివాహవ్యవస్థ, వ్యాసభారతం, కాళిదాసు


దీనిగురించే, అహమ్మదాబాద్ అడిషనల్ ఛీఫ్ జుడిషియల్ మెజిష్ట్రెట్ కోర్టు తీర్పుకు సంబంధించినది, చదవటానికి లింకు: పోస్టు నం.౨౮౨ చదవటానికి క్లిక్.

3.2.2014 నాటి పోస్ట్ నంబర్ 126కి ఇది కొనసాగింపు. పోస్ట్ నం. 126 లో నరేంద్రమోడీ భార్యగా చెప్పుకుంటున్న, మోడీ గారు ఇంతవరకు ఖండించని, జశోదా బెన్, రిటైర్డ్ టీచర్ గారిని మనం లవకుశలో సీత తో పోల్చుకోటం పాఠకులకు గుర్తుకు ఉండి ఉంటంది. సందేహించకుమమ్మా రఘురాముప్రేమను అనే పాటను కూడ స్మరించుకున్నాము.


మన బుర్రలో మెదలుతున్న అంశం, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వారికి, జశోదా బెన్ గారికీ టెలిపతీ ద్వారా చేరిందా అన్నట్లుగా (టెలిపతిలో ఒక మస్తిష్కంలోంచి మరో మస్తిష్కానికి సందేశాల వెళ్ళే అధిమానవశక్తి. ఇది ఊహే. ఋజువుల్లేవు), జశోదాబెన్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ౩.2.2౦14 ఫైనాన్సియల్ ఎక్స్ప్ ప్రెస్ లో ప్రచురితం అయ్యింది. చదవాలనుకునే వారికి లింక్.

http://www.financialexpress.com/news/i-like-to-read-about-him-%28narendra-modi%29...-i-know-he-will-become-pm-wife-jashodaben/1222311 చదువుటకు క్లిక్ చేయండి

ఈ ఇంటర్వ్యూ లోని కొన్ని వాక్యాలను పరిశీలించబోయే ముందు ఇంకొక పోలిక.

శకుంతలను తన భార్య అనే విషయం దుష్యంత మహారాజు మరిచిపోయాడు. మహాభారతంలో దుష్యంతుడు-శకుంతలల కథకు, కాళిదాస విరచిత అభిజ్ఞాన శకుంతలానికి ఒక తేడా ఉంది.

కాళిదాస విరచిత అభిజ్ఞాన శకుంతలం


దుర్వాసముని శాపం వల్ల శకుంతల, దుష్యంతుడు ఇచ్చిన రాజముద్రికా ఉంగరాన్ని నదిలో పారేసుకుంటుంది. గర్భవతియైన శకుంతలను, ఆమెభర్త యైన దుష్యంతుడి వద్దకు కణ్వ మహర్షి శిష్యులు తీసుకువెళ్ళినపుడు దుష్యంతుడు రాజసభలో ఆమె ఎవరో తెలియదని ప్రకటించాడు. కణ్వ మహర్షి శిష్యులు చేసేది ఏమీలేక, ఆమెను వెనక్కు తీసుకు వెళ్ళలేక, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నపుడు, దుష్యంతుడి పురోహితుడు గర్భవతియైన శకుంతలకు ఆశ్రయం ఇచ్చాడు.

మేనక - కశ్యపుడు
తరువాత శకుంతల తల్లియైన అప్సర మేనక, శకుంతలను ఆకాశమార్గంలో కశ్యప మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ కశ్యపుడిచేత రక్షణ ఏర్పాటు చేస్తుంది. అక్కడే భరతుడు జన్మించాడు.

శకుంతల పారేసుకున్న ఉంగరాన్ని నదిలోని ఒకచేప మింగి వేస్తుంది. ఆచేపను పట్టుకున్నజాలరి వాడు ఆ ఉంగరాన్ని తీసుకువెళ్ళి రాజుకు సమర్పించినపుడు శకుంతల తన భార్య అనే విషయం దుష్యంతుడికి గుర్తుకు వస్తుంది.

దుష్యంతుడు దేవేంద్రుడికి దేవదానవయుధ్ధంలో సహాయం చేసినందున దేవేంద్రుడు దుష్యంతుడిని స్వర్గానికి తీసుకెళ్ళాడు. రాజు స్వర్గంలో విహరిస్తున్నప్పుడు అక్కడ కశ్యపాశ్రమ సమీపంలో భరతుడు (మరొకపేరు సర్వదమనుడు) ఒక సింహం పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. అతడి ఆగడాలు మితిమీరుతున్నాయని, అతడిని మందలించమని చెలికత్తెలు రాజును కోరగా, అతడు భరతుడిని తన ఒడిలోకి తీసుకుంటాడు. పితృవాత్సల్యం జాలువారుతుంది. ఆసమయంలో బాలుడిచేతికి కశ్యపుడు రక్షగా కట్టిన తాయత్తు ఊడినేలపై పడుతుంది. దుష్యంతుడు దానిని ఎత్తి పైకి తీసాడు.

దీనిని చూసిన శకుంతల చెలికత్తెలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కశ్యపుడు చేసిన ఏర్పాటు ప్రకారం, ఆ తాయత్తుని ఆబాలుడి తండ్రి తప్ప వేరెవరు ముట్టుకున్నా అది పాముగా మారుతుంది. చెలికత్తెలు వెళ్ళి శకుంతలను పిలుచుకు వస్తారు.

తరువాత దుష్యంతుడు శకుంతలను క్షమాపణ వేడుకుంటాడు. శకుంతల దుష్యంతుడి పాదాలపై పడుతుంది. ఇలా పునస్సమాగమం జరుగుతుంది. భరతుడితో శకుంతలా దుష్యంతులు భూలోకానికి వచ్చి కొన్నివేల ఏళ్లు పాలించాక భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ భరతుడి పేరుమీదే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని ఒక నమ్మకం.

ఉత్తర రామాయణం ప్రకారం సీతకు రాముడు మరొకసారి పాతివ్రత్యపరీక్ష పెట్టాలనుకుంటాడు. సీత ఇష్టపడక తన తల్లియైన భూదేవితో లీనమవుతుంది. లవకుశ సినిమాలో ఇంకో పాతివ్రత్య పరిక్షా ప్రతిపాదన వదలివేసి, డైరక్టుగా సీత అంజలీదేవి , తల్లి భూదేవి ఎస్. వరలక్ష్మితో బద్దలైన భూమిలోకి వెళ్ళిపోయినట్లుచూపారు.

వ్యాసభారతం ఆది పర్వం (లో సంభవ పర్వం) ప్రకారం


శకుంతల తన తండ్రియైన కణ్వుడి ఆశ్రమంలోనే భరతుడిని కన్నది. అతడు ఆరు ఏళ్ళ వయసు వచ్చేసరికి సర్వదమనుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అపుడు కణ్వుడికి గుర్తుకి వచ్చింది. వివాహమైన స్త్రీ తండ్రి ఇంట్లో ఎక్కువకాలం ఉండకూడదు, అని. కణ్వుడు శకుంతలను, భరతుడిని, తన శిష్యులని తోడిచ్చి దుష్యంతుడి వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను, భరతుడిని చూచి నాకేమీ తెలియదు, నీఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమన్నాడు.

శకుంతల దుష్యంతుడికి పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. ఇంకోసారి దానిని మనం విశ్లేషించుకోవచ్చు.

సీతను మరల స్వీకరిస్తే జనం ఏమంటారో అనే భయం శ్రీరాముడికి ఉన్నట్లే, దుష్యంతుడికి కూడ ఉన్నది (వ్యాసభారతం ప్రకారం)

శకుంతల సభలోంచి వెళ్ళిపోయాక ఆకాశవాణి (అశరీరవాణి లేక గగనవాణి) దుష్యంతుడికి శకుంతల తన భార్యేనని, భరతుడు తన కొడుకేనని గుర్తు చేసింది. వారిని స్వీకరించమని కూడ చెప్పింది. దుష్యంతుడు చాలా ఆనందించాడు.

ఆకాశవాణి చెప్పకముందే తాను శకుంతలా భరతులను స్వీకరించి ఉంటే జనం అనుమానించే వారు. ఇప్పుడు ఆకాశవాణి చెప్పింది కాబట్టి ఇంక జనం అనుమానించరు. అనుకున్నరాజు శకుంతలను, భరతుడిని తిరిగి వెనక్కి పిల్చుకున్నాడు. రాజు , తాను మొదట ఎందుకు కాదన్నాడో శకుంతలకు చెప్పాడు (జనాపవాద భీతి అనే). కథ సుఖాంతం. భరతుడి పాలన మొదలవుతుంది.

మన అభినవ శ్రీరాముడు, అభినవ దుష్యంతుడు శ్రీనరేంద్ర మోడీ


మన అభినవ శ్రీరాముడు, అభినవ దుష్యంతుడు శ్రీనరేంద్ర మోడీ ఇంత వరకు ఏవిషయం తేల్చటం లేదు. అవునంటే ఏమవుతుందో. కాదంటే ఏమవుతుందో.

శ్రీవారు 2.2.2014 నాడు ఢిల్లీలో ప్రసంగస్తూ పిటిఐ- మరియు- ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఇలా అన్నారు.
“... Some days ago, women from Uganda were mistreated, girls from Manipur were harassed and a boy from Arunachal was killed. The country’s head hangs in shame. ... ”
తెలుగు సారం

''కొన్ని రోజుల క్రితం ఉగాండా నుండి వచ్చిన స్త్రీలు మిస్ ట్రీట్ చేయబడ్డారు. మణిపూర్ నుండి వచ్చిన బాలికలు హెరాస్ చేయబడ్డారు. అరుణాచల్ నుండి వచ్చిన ఒకబాలుడు చంపబడ్డాడు. ఈదేశం యొక్కతల సిగ్గుతో వ్రేలాడుతున్నది.''

ఉగాండా స్త్రీలకు జరిగిన అవమానం గురించి, మణిపూర్ బాలికలకు జరిగిన హెరాస్ మెంటు గురించి మోడీగారి ఆవేదన అర్ధం చేసుకుందాం.

జశోదాబెన్ గారు తన భార్యనా కాదా అనే విషయాన్ని మోడీగారు స్పష్టం చేస్తే బాగుంటుంది. చాలా మబ్బుతెరలు వీడి పోతాయి.

ఒకవేళ జశోదాబెన్ గారిని తన భార్యగా నరేంద్రమోడీగారు అంగీకరిస్తే, ప్రస్తుత భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తన భార్య గురుశరణ్ కౌర్ గారిని విదేశాలకూ, ప్రతి చోటికీ తీసుకెళ్ళినట్లుగా, జశోదాబెన్ గారిని కూడ తీసుకు వెళ్తారా? జర్మనీ అధ్యక్షుడుగారిని రాష్ట్రపతి ఆహ్వానించినపుడు, తనకూతురు అయిన శర్మిష్ఠగారిని ప్రక్కన నిలబెట్టుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారికి ఇందిరా గాంధీ సహాయం చేసేది. రాజీవ్ కి సోనియా సహాయం ఉండేది అని వేరే చెప్పనవసరం లేదు.

మామూలుగా భారతీయ సంస్కృతి ప్రకారం, ధర్మపత్ని పాత్ర కేవలం మతసంబంధమైన కార్యాలలో మాత్రమే, తప్ప విదేశాలకు ప్రత్యేకవిమానాలలో తిప్పటానికి కాదు, అని నరేంద్రమోడీ గారు ఉద్ ఘోషిస్తారా? జశోదాబెన్ గారు అంతర్జాలంలో దొరుకుతున్న ఒకవీడియోలో ''మై ధర్మ పత్నీ హు, మై ధర్మ పత్నీ హు'' అంటున్నారు.

(ఇంకా ఉంది. ఎవరికైనా మనోభావాలు గాయపడితే పాఠకులు కామెంట్లు వ్రాస్తే సరిదిద్దుకోటానికి ప్రయత్నిస్తాను).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.