Tuesday, November 19, 2013

066 గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! A wedding cannot be stopped by hiding pestle stone
bifurcation, విభజన, మనుచరిత్ర, పెద్దన, పద్యకవిత్వం
తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు,అంటారు. అల్లసాని పెద్దనామాత్యుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. ఈమహాకవి విరచితమైన మనుచరిత్ర ప్రబంధం తెలుగువారు నిత్యం కాకపోయినా, నెలకొకసారి కనీసం ఒక్క పద్యాన్నైనా చదువ తగిన గ్రంధరాజము.

పైపద్యం, మనుచరిత్ర పంచమాశ్వాసంలో, 17 వపద్యం. అల్లిక జిగిబిగియే కాక, పైపద్యం లో మనమేమి గమనించవచ్చు? జవాబు: సుందరమైన తెలుగు నుడికారం. నాలుగవ లైనులో వాడిన ఈలోకోక్తిని చూడండి. 'గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!'

ఈసామెత తెలుగు వారిలోకి 16వ శతాబ్దం నాటినుండే ఎలా ప్రవేశించింది?

ఆకాలంలో తెలుగువారిలో వోలికాశపడి కానీ, ఇతరకారణాల వల్లకానీ, బాలలను అతివృధ్దులకు ఇచ్చి వివాహంచేసే ఆచారం ఉండేది. రెండు మూడేళ్ళలోనే ఆవృధ్ధుడు గతించటం, అబ్బాల విధవ పుట్టింటికి చేరటం జరిగేది. ఇలా జరగటం ఆఇంటి ఇల్లాలికి ,అంటే పెళ్లి కూతురు తల్లికి ఇష్టం ఉండేది కాదు. ఆమె నిరసనలను ఇంటి యజమానిగానీ, బంధువులుగానీ పట్టించుకోకుండా పెళ్ళిని ముందుకు నెట్టుకెళ్ళేవారు. ఆతల్లి ఏడుస్తూ కూర్చునేది.

ఆనాటి వివాహాల్లో ఒకానొక దశలో గుండ్రాయి అవసరం పడేది. దాన్ని ముందుగా సిధ్ధం చేసుకోటం జరగనిచోట, అప్పటికప్పుడు, పెళ్ళి పందిరిలో గుండ్రాయి కొరకు వెతికేవాళ్ళు. దొరకకపోతే, వివాహం కొన్ని నిమిషాలు ఆలస్యం అయ్యేది. ఒకపెళ్ళిలో, పెళ్ళికూతురు తల్లి ఏంచేసిందంటే, గుండ్రాయి దొరకకుండా, దానిని దాచిపెట్టింది. అలాగైనా ఆపెళ్ళి ఆగిపోతుందని, ఆ అమాయక తల్లి ఆశ. ఆపెళ్ళికూతురు తండ్రి, బంధువులు మొండి ముండా కొడుకులు, ఎక్కడి నుండో మరో గుండ్రాయిని తెచ్చి ఆపెండ్లిని పూర్తి చేశారు. అలాగా, 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా', అనే సామెత వ్యాప్తమయ్యింది.

మనుచరిత్రలో ఈసామెతను వాడిన సందర్భం


బ్రహ్మ మిత్రుడు అనే పండితుడు, తన శిష్యులకు ఆయుర్వేదాన్ని నేర్పే వాడు. ఇందీవరాక్షుడు అనే రాజు , బ్రహ్మ మిత్రుడి దగ్గరకు వెళ్ళి తనకు ఆయుర్వేదాన్ని నేర్ప వలసినదిగా ప్రార్ధించాడు.

గురువుకి రాజులపై ఏవో దురభిప్రాయాలుండటం వల్ల ఆయన దానిని కొంత కటువుగానిరాకరించాడు. ఇక్కడ పెద్దన పద్యం అవశ్యం పఠనీయం, కమనీయం.
గురువు, బ్రహ్మ మిత్రుడు : నటవిట గాయక గణికా
కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
గటు వీ శాస్త్రము వల ది
చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్‌?


రాజు, ఇందీవరాక్షుడు :
తేటగీతి. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
యించుకించుక మీవంటి యెఱుక గలుగు
పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు.


గురువు, బ్రహ్మ మిత్రుడు :
కందం. ధన రాజ్య రమా మదమునఁ
గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
టెను నేరము గలదే? ననుఁ
గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్‌.


రాజు, ఇందీవరాక్షుడు :

తేటగీతి. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
వెజ్జుఁదన మేల? (యని మది లజ్జవొడమి).


ఇందీవరాక్షుడు ఇంటికెళ్ళి నిద్ర పోలేదు. మారువేషంలోతిరిగి వచ్చి గురువుగారిని మభ్యపెట్టి ఆయుర్వేదాన్ని బాగానే నేర్చుకున్నాడు. అంతటితో ఆగి, ఇంటికెళ్ళి ఉంటే బాగుండేది.

కానీ రాజులకుండే నోటి దురుసుతనం , అహంకారం ఆపని చేయనివ్వ లేదు.
శార్దూలం. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


రాజు గురువుని 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా' అని హేళన చేశాడు. గురువుకి కడుపులో మండి పోయింది.

మత్తేభం. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.

వచనం. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర
ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున
విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని
కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు
మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి
గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా
మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె
జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి.


గుటగుటలు గురువుతోనా! అని గురువు ఇందీవరాక్షుడిని రాక్షసుడివై పొమ్మని శపించాడు.

తరువాతి కథ ఇంకోసారి.

పై సామెతను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి గారి శాసనసభ ప్రోరోగ్ మంత్రాంగానికి వర్తింప చేయవచ్చా?

పరిశీలన:
ముందుగా, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రే అయినప్పటికీ , లోలోపల ఏస్వార్ధాలున్నప్పటికీ, మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి ధైర్యాన్ని అభినందించి తీరాలి. కిరణ్ కుమార్ రెడ్డి

కాకపోతే రాష్ట్ర విభజనను అడ్డుకోటానికి ఆయన వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో అనుమానాస్పదం.
పైన వ్రాసిన బాల్య వివాహం కథలో , పెళ్లికూతురు తల్లి గుండ్రాయిని దాచకుండా, ఏనుయ్యో గొయ్యో చూసుకొని ఉంటే వివాహం కనీసం మైల కారణం వల్లనైనా ఆగేది. గ్రామస్థులు కూడ చొరవ తీసుకుని ఆపించి ఉండే వాళ్ళేమో. ఆమె గుండ్రాయిని దాచటం వల్ల పెళ్ళిని కొన్ని నిమిషాలు ఆలస్యం చేయించకలిగింది కానీ మొండి ముండాకొడుకు మొగుడి, ఇంకా పెద్ద ముండాకొడుకులు బంధువుల మనసులను మార్చలేక పోయింది.

ముఖ్యమంత్రిగారు కూడ, రెండు నెలలక్రితమే శాసనసభను సమావేశం చేయించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు తీర్మానం చేయించి, శాసనసభను ప్రోరోగ్ చేయించి, మర్నాడు తాను రాజీనామా చేసి ఉంటే, బహుశా, పరిస్థితులు భిన్నంగా టర్న్ తీసుకొని ఉండేవేమో.

రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియా భటులు (హోం మంత్రి, గోం మంత్రుల బృందం), రాజ్ నాధ్ సింగ్- సుష్మా స్వరాజ్ వంటి భాజపా నేతలు, పైన వ్రాసిన పెళ్ళికూతురి తండ్రి, బంధువులకు ఏమాత్రం తీసి పోలేదు. మొండి ముండాకొడుకులు అనటానికి సభ్యత అడ్డు వస్తుంది. బిజెపి అండ చూసుకొని కాంగ్రెస్ ఇలా చెలరేగి పోతున్నది. ఎప్పుడో బిజెపి వాగ్దానం చేశానంటున్నది. సీమాంధ్రలో ఎక్కడన్నా సభలను పెట్టి తెలుగు ప్రజలకు నచ్చచెప్పిందా.

దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టు వైఖరి కూడ, ఈబలవంతపు పెళ్ళి తంతును (ఇక్కడ బలవంతపు విడాకులు) ముందుకు తీసుకు వెళ్ళేది గా ఉన్నది. సుప్రీంకోర్టు ఎడల అగౌరవాన్ని వ్యక్తం చేయకుండా, వారి తీర్పులను విమర్శించటం తప్పుకాదు కనుక మనం మరి కొంత పరిశీలన చేయవచ్చు.

రాష్ట్ర విభజన అంశం ఇంకా పక్వానికి రాలేదు,తగిన సమయంలో వస్తే పరిశీలిస్తాం అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం లాగా కనిపిస్తుంది.

కేంద్రం, గోం, హోం మంత్రిగారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ సింగ్ గారు, అందరూకూడ , ఇంక కొద్ది రోజుల్లో బిల్లు నిశ్చయం అని బల్లగుద్ది చెప్తున్నారు. కేంద్రం సీమాంధ్రకు వాతలు పెట్టటానికి శలాకలను ఎర్రగా కాలుస్తున్నది. టీలీడర్లు డప్పులు కూడ వాయిస్తున్నారు. న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళటానికి ఇంతకన్నా తగిన సమయం ఇంకేమి ఉంటుంది? వాతలు పెట్టాక, శరీరం అంతా కవురు కట్టాక, ఎంత శాతం కాలింది అని లెక్క కట్టేదాకా ఆగాలా? అప్పుడు బర్నాల్ పూసి యాంటీ బయటిక్కులు రాస్తే సరిపోతుందా? అన్యాయం జరిగిం తరువాత ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోటంకన్నా ముందుగా నివారించటం మేలు కాదా.

సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అధిష్ఠానం వాతలు పెట్టటంలో, బిజేపీ నేతలు వాతలు పెట్టటంలో, సీమాంధ్రనేతల పాత్ర తక్కువేమీ లేదు.

ఆంధ్రప్రదేశ్ సభాపతి కొన్న నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. వారి మనస్సులో ఏమి తంత్రాలు దాగియున్నాయో మనుకు తెలియదు. ఇప్పుడు శ్రీవారి స్వార్ధ ప్రణాళికలు బయటికి వస్తాయేమో మనం చూడాలి. ఏపుట్టలో ఏపాము ఉంటుందో ఎవరికి తెలుసు?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.