Tuesday, November 19, 2013

065 ఎవరికి వారే యమునాతీరే!

065 ఎవరికి వారే యమునాతీరే!
bifurcation, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర
image courtesy gisserver.nic.in

సీమాంధ్ర నేతలు ఎవరి కోణంలో నుంచి వారు చూడటంలో తప్పు లేదు. కానీ అందరూ కలసి ఐకమత్యంగా వ్యవహరించాలి కదా.

ఉదాహరణ: శ్రీకాకుళ నేత, కేంద్ర మంత్రి,కిషోర్ చంద్ర దేవ్ సార్. రాష్ట్రానికి రాజధానికి భౌగోళికంగా మధ్యలో ఉండనక్కర లేదుట. విశాఖను రాష్ట్ర రాజధానిగా చేయాల్సిందేట. వీరు రాయలసీమ వారిపై కొంత దయ దలిచారు. కావాలనుకుంటే రాయలసీమ వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుకో మన్నారు.

కేంద్రమంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి లకు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య కావాలిట. రాయలసీమ, విశాఖ నివాసుల అభిప్రాయాలతో వారికి నిమిత్తం లేదు.

రాజధాని విషయంలో, కర్నూల్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డి గారి అభిప్రాయం ఇంతవరకు బయటికి రాలేదు. దివాకర్ రెడ్డి గారు రాయల తెలంగాణ అంటున్నారే తప్ప రాజధాని విషయం చెప్పటంలేదు. శ్రీ దివాకర హృదయం, హైదరాబాదునుండి బెంగుళూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఎలా లాభదాయకంగా నడపవచ్చా అనేదానిపై లగ్నం అయి ఉంటుంది. రాయలసీమ నేతలు రాయలసీమ భవిష్యత్ గురించి కాకుండా, హైదరాబాదులో తమ ఆస్తుల భవిష్యత్ గురించి, ఆలోచించటం మానేయటం అవసరం. విశాఖలో, విజయవాడలో పాగా వేయటం ఎలాగా అని ఆలోచించే కన్నా, సీమ భవిష్యత్ గురించి, ఆలోచించటం అవసరం.

రాయలసీమ ఫౌండేషన్ కి చెందిన శ్రీ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి గారు ,ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-11-2013 సంచికలో 'శ్రీబాగ్: నేటి కర్తవ్యాలు' అనే సంపాదక పేజీ వ్యాసం ద్వారా, రాయలసీమ భవతవ్యం పై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

వీటన్నిటిని బట్టి మనకు తేలేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజ్వరిల్లుతుంది. రాయలసీమలో రాజధానిని పెట్టినా, పెట్టక పోయినా, ఇది అనివార్యం. ఎందుకంటే, రాయలసీమలో రాజధానిని పెట్తే, కర్నూలైనా, ఇంకో నగరమైనా, కోస్తానుండి వచ్చే లక్షలాది మంది ఉద్యోగార్ధులను , వాణిజ్య వేత్తలను, పారిశ్రామికులను తట్టుకోలేదు. రాజధానిలో తమ పొట్ట నిండే మార్గాలు దొరుకుతాయని వారాసించటం తప్పు కాదు. 1953 నుండి కర్నూలే రాష్ట్ర రాజధానిగా కొనసాగి ఉన్నా ఇది జరిగేదే. కర్నూలుకి జరగాల్సిన మేలుకీళ్ళు హైదరాబాదుకి చేరాయి.

పైవన్నీ పరిశీలించటం ద్వారా మనం గుర్తించాల్సిన విషయాలు.

ముద్దొచ్చి నప్పుడే చంకకెక్కాలి. కేంద్రం, కాంగ్రెస్, బిజేపి, ఆంధ్రప్రదేశ్ ను 2 రాష్ట్రాలుగా చేయటానికి కత్తులు నూరుతున్నప్పుడు, తెలుగు వాళ్ళకు కలిసి ఉండే శుభ లక్షణాలు లేనప్పుడు, మెరుగయిన పధ్ధతి ఏది? అందరూ కలసి 4 లేక 5 రాష్ట్రాలను కోరటం మంచి దారి. అస్సాం 7 ఈశాన్య రాష్ట్రాలుగా విభజించ బడ్డప్పుడు, లేని అభ్యంతరం,ఇప్పుడు ఉండ నవసరం లేదు.

కాబట్టి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని పార్టీలు, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హైదరాబాదును Union Territory కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, హైదరాబాదు లోని ఎన్ జీ వో లకు నగరంలో ఉండటానికి అవసరమైన ఆప్షన్లను ఇవ్వటం, నదీజలాల పంపిణీ, ప్రాజెక్టులకు నీటి విడుదలకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పరిపాలక వ్యవస్థను ఏర్పరచటం, కొత్తరాజధానుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం, మొ|| డిమాండ్లకు ఈ నాలుగు లేక అయిదు రాష్ట్రాల డిమాండు అదనం గా ఉండాలి.

కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికీ, బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకి, భవిష్యత్ దృష్టి అవసరం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కలాగ ఉండరు. ఏనేతలైనా విజృంభించి, సీమాంధ్రప్రదేశ్ ని, మరో కాశ్మీర్ గానో, శ్రీలంకగానో, మార్చే అవకాశం ఉంది. హైదరాబాదుని మరొక పాకిస్థాన్ గా టీలీడర్లు తీర్చి దిద్దే అవకాశాలున్నాయి. సీమాంధ్ర మరియు తెలంగాణ మధ్య అంతర్యుధ్ధాలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక దౌర్భాగ్యపు ఆదర్శం గా తయారు అయ్యే అవకాశాలు పుష్కలం.

ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశ హితం కాకుండా, పార్టీల స్వల్పకాలిక రాజకీయ లాభాల కొరకు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అశాంత చెలరేగి, దేశఐక్యతకే భంగకరం కావటం అనివార్యం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.