Tuesday, November 12, 2013

#055 బిజెపికి వోటు వేస్తే పటేల్ కి వేసినట్లా? కాంగ్రెస్ కి వోటు వేస్తే జవహర్ కి వేసినట్లా?


ఎన్నికలు, అద్వానీ, నెహ్రూ, పటేల్, కాంగ్రెస్, బిజెపి, సోనియా, మోడీ, జగన్, వైయస్
అద్వానీ గారు మరల నెహ్రూగారిని డౌన్ చేయటానికి, సర్దార్ పటేల్ గారిని ఆకాశానికి ఎత్తటానికి మరల బ్లాగింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు.

శ్రీవారు చేస్తున్నది వృధా ప్రయాసేనని, నేను ఒకసారి మనవి చేశాను. మరల వ్రాయవలసి వస్తున్నది. నెహ్రూ కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారిపై ఆధారపడి లేదు. ఎందుకంటే, జవహర్లాల్ నెహ్రూ గారిని నెహ్రూ కుటుంబం మర్చిపోయింది. జనం కూడ మర్చిపోయారు. ఇప్పడు సమాధులపై పుష్పగుఛ్ఛాలు ఉంచటం మాత్రమే మిగిలింది.

శ్రీమతి సోనియా గాంధీగారికి , జవహర్ గురించి పెద్దగా అవగాహన లేదు. అదీగాక జవహర్ ది సహజ మరణం. హత్యలకు గురియైన అత్తగారు ఇందిరా గాంధీ గురించి సోనియాకు, మనుమడు రాహుల్ కు బాగా తెలుసు. అదేవిధంగా, హత్యకు గురియైన తనభర్త రాజీవ్ గాంధీగురించి, సోనియాకు బాగా తెలుసు. తెలియని జవహర్ గురించి ప్రస్తావించే కన్నా, తెలిసిన అత్తగారిని , భర్తను, మృతవీరులుగా ప్రస్తావించి, ప్రజల సానుభూతిని పొందటం తేలిక అని సోనియా అర్ధం చేసుకుంది.

రాహుల్ కి జవహర్ గురించి లోతైన అవగాహన ఉందని అనుకోను. Discovery of India ముత్తాత వ్రాసిన పుస్తకాన్ని, నాయనమ్మ ఇందిరకు జవహర్ జైలునుండి వ్రాసిన లేఖలను ఆయన లోతుగా చదివాడని నేను అనుకోను. నాయనమ్మ ఇందిర, ప్రజలకు అమ్మగా పరిచయం. తండ్రి రాజీవ్ కూడ, ఈకాలం ప్రజలకు తెలుసు. అందుకనే, రాహుల్ సభలలో తన తండ్రి, నాయనమ్మ గురించి మాట్లాడుతున్నాడు. జవహర్ గురించి తక్కువ ప్రస్తావిస్తాడు. జవహర్ గతకాలానికి చెందిన వాడు. చరిత్రలో ఒకభాగం. ఆయన్ని ప్రజలకి గుర్తు చేయటం క ష్టం అని రాహుల్ కి అర్ధం అయినట్లుంది.

ఇందిర, రాజీవ్ లు కూడ, చరిత్రలో భాగంగా మారి, ప్రజలలో సానుభూతి స్పందనలు కలిగించటం తగ్గిపోయే రోజులు దూరంగా లేవు. కాంగ్రెస్ క్రొత్త సానుభూతి కలిగించే అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తుంది. హిందీ బెల్ట్ లో ఇప్పటికే ఇది జరిగింది. సీమాంధ్రులకు, కర్నాటికులకు మాత్రమే ఇది పూర్తిగా వదలలేదు.

పటేల్, నేతాజీలు కూడ గత చరిత్రలో భాగమే. వారి యందు ప్రజలకు ఎంతో ఆదరభావం ఉన్నా, ఆఆదరణ జనం పోలింగ్ బూత్ లకు పరుగెత్తుకెళ్ళి బిజెపికి వోట్లు వేసేందుకు సరిపోదు.

బిజెపికి వోటు వేస్తే పటేల్ గారికి పట్టం కట్టినట్లు, కాంగ్రెస్ కు వోట్ వేస్తే జవహర్ కి పట్టం కట్టినట్లు, టిడీపీకి వోటు వేస్తే స్వర్గీయ ఎన్టీఆర్ కు, జగన్ కు వోటు వేస్తే స్వర్గీయ వైయస్ కి పట్టం కట్టినట్లు , ఎవరైనా భావిస్తే వారు మోసపోయినట్లే.

కాంగ్రెస్ తన మైనారిటీ మతతత్వాన్ని దాచుకుంటూ, లౌకికవాదం అనే మేక తోలును కప్పుకున్నా, ప్రజలు పట్టించుకోటంలేదు. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ చర్చలమిషతో ఎమ్ ఐ ఎమ్ నేతలని తమకు మద్దతు నివ్వమని ప్రార్ధించటం గమనార్హం. బిజెపి కూడ, మైనారిటీ ఓటు బ్యాంకులను సృష్టించుకోవాలనే కోరికను దాచుకోటంలేదు. కొద్దిరోజుల క్రితం గుజరాత్ ఖెడా జిల్లా కేంద్రంలో ఒక మైనారిటీ వర్గీయుల వైద్యశాలను ప్రారంభించే సమయంలో, శ్రీనరేంద్ర మోడీ కోరిక చక్కగానే బహిర్గతం అయ్యింది. ఇరుపార్టీలనూ మనం తప్పు పట్టలేం. అది రాజకీయ అవసరం. అదే సమయంలో వారు తాము పేద ప్రజలను, దిగువ మధ్యతరగతి వారిని, రకరకాల పధ్ధతులలో విడతీసి పాలిస్తున్నామనే విషయాన్ని మరచి పోకూడదు.

సారం: ఎవరైతే తమను వివిధ పధ్ధతులలో విడదీసి వోట్లు గుంజుకోవాలని చూస్తున్నారో వారి యెడల ప్రజలు తూష్ణీంభావాన్ని , ఆగ్రహాన్నీ చూపకపోతే వినాశనం పొంచి ఉంటుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.