చర్చనీయాంశాలు: Telangana Bill, Rajya Sabha, Andhra Pradesh, Seemandhra, BJP, తెలంగాణ, రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్, సీమాంధ్ర

ఊహించినట్లుగానే తెలంగాణ బిల్లును ముందుకి త్రోశారు. వాయిస్ వోట్ తోనే పాస్ అయిందని రాజ్యసభ డెప్యూటీ స్పీకర్ ప్రకటించారు. సోనియా కాంగ్రెస్ స్వార్ధం గురించి కొత్తగా వ్రాయవలసినది ఏమీలేదు.

ఇపుడిది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగారి దగ్గరకి ఆమోదానికి వెళ్తుంది. ఆయన స్వార్ధాలు ఆయనకుంటాయి. బెంగాల్లో వాళ్ళబ్బాయికి కాంగ్రెస్ టికెట్ కావాలి. ఢిల్లీలో కానీ, మరొక భద్రమైన ప్రదేశంలో వాళ్ళమ్మాయికి కాంగ్రెస్ టికెట్ కావాలి. ఇంక ఆయన సంతకం పెట్టక ఏమి చేస్తాడు?
సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంలో పన్నుల మినహాయింపు
దీన్ని బిజెపి, కాంగ్రెస్ లు ఘన కార్యంగా చెప్పుకోవచ్చు కానీ, దీనిలో కూడ రెండు పార్టీలకు బయట కనిపించని స్వార్ధం ఉంది.
పారిశ్రామిక వేత్తలేవో పరిశ్రమలు పెడ్తారు, అబ్బో ఎక్కడ చూసినా ఉద్యోగాలే అని సీమాంధ్రు పొంగి పోనవసరంలేదు. ప్రాధమికంగా పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టేది తమ లాభ నష్టాలను ఒకటికి రెండు సార్లు అంచనాలు వేసుకొని తృప్తిచెందాకే. తేరగా చవకగా భూములు వస్తాయని లెక్కలేసుకున్నాకే. పరిశ్రమలు పెట్టేది దేశసేవకు, ప్రజాసేవ అనే భ్రమలుండకూడదు. పెట్టుబడిదారీ విధానం లో దేశ సేవలను, ప్రజాసేవలను మనం ఆశించకూడదు. సీపీఐ, సీపీఎం కు చెందిన నేతలు పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టినా ఈ కఠోర వాస్తవానికి లోబడే వ్యాపారాలు చేసుకుంటారు.
ఈపరిశ్రమలు పెట్టే వాళ్ళలో విదేశీ పారిశ్రామికులుంటారు. ఇతరరాష్ట్రాల పారిశ్రామికులుంటారు. స్వారాష్ట్రానికి చెందిన వారుంటారు. నానా పార్టీల పెద్ద పెద్ద మంత్రులు, ఎం.ఎల్.ఏ, ఎంపీలు, వారి బంధువులు, బినామీలు, ఛోటామోటా నేతలు, ఉంటారు. కాబట్టి పన్నుల మినహాయింపుల లాభం ప్రజలకా? వ్యాపారులకు-పారిశ్రామికులకా? మంత్రులు, ఎం.ఎల్.ఏలు, ఎంపీలకా?
నిజంగా గొప్పలాభాలు వస్తాయనుకుంటే, శ్రీ రాబర్ట్ వధేరా గారే వచ్చి శేషాంధ్రలో పరిశ్రమలు పెట్టరా?
రాజధాని కోసం కుమ్ములాటలు
ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఇపుడు మొదలవుతుంది. ఇది ఒకేసారి అవుట్ డోర్, ఇండోర్, పలువురు డైరక్టర్లు, హీరో, హీరోయిన్లతో జరుగుతుంది.