Friday, May 30, 2014

244 Undue Strain on A.P. Police

244 Undue Strain on A.P. Police
244 నాయకుల నోటి దురద, గ్రాండియోస్ దురద యేమో కాని పోలీసులు, ప్రజలు చచ్చిపోతున్నారు
చర్చనీయాంశాలు: పోలీసువ్యవస్థ, ప్రజాస్వామ్యం, టిడిపి, చంద్రబాబు, వెంకయ్యనాయుడు

పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా నాయకుల నోటి దురద, గ్రాండియోస్ దురద, తయారయింది. గండిపేట మహానాడు ముగిసింది. మహానేత చంద్రబాబు గారి నోటి దురద కొంతమేరకు తీరింది. విరాళాలూ భారీగానే సమకూరాయి. ధర్మరాజుగారి మయసభలాగా గ్రాండియోస్ కోరిక కూడ తీరింది.

కానీ కోరికలు అగ్ని శిఖలలాంటివి. మనం నెయ్యి పోస్తున్నకొద్దీ అవి విజృంభిస్తాయి. చివరికి అవి మనల్నే కబళించినా ఆశ్చర్యపోనవసరంలేదు.

ఇపుడు చంద్రబాబుగారి కోరిక ఏమిటంటే తన సామంతరాజ్య పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరగాలి. దానికి మోడీ చక్రవర్తి హాజరు కావాలి. పాలెగాళ్ళు, పరివార జనం కైవారాలు చేయాలి.

నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు స్థలంలో జూన్ 8 వ తారీకున తలపెట్టిన ఐదు లక్షల జనాన్ని పోగు చేస్తున్న పట్టాభిషేక మహోత్సవం కూడ ఈతరగతికి చెందినదే. అసలే కోతి, కల్లు తాగింది. నిప్పు తొక్కింది, అన్నట్లుగా చంద్రయ్యగారికి వెంకయ్య కూడా తోడయ్యాడు. ఇంక రాజు తలుచుకుంటేదెబ్బలకు కొదువనా అన్నట్లుగా పోలీసులు, కలెక్టర్లు, ఎస్ పీలు, ఏర్పాట్లు చేయలేక చస్తున్నారు. పాపం, ఈమధ్యనే నిద్రాహారాలు మానేసి ఎన్నికలను పూర్తిచేసి మన ప్రజాస్వామ్యరథాన్ని బాగానే ముందుకు తోసారు. ఇపుడు మరల ఎండలో చావాల్సి వస్తున్నది.

ఇపుడు పులి మీద పుట్రలా రాలీలు, సభలు. కుక్కలను తీసుకువెళ్ళి నేలను వాసన చూపించటం. గ్రౌండు చదును చేయించటం. చలువ పందిళ్ళు వేయించటం. శ్రీరామ పట్టాభిషేకం కోసం నాటి అయోధ్య పౌరులు, దశరధుడి మంత్రులు చేసిన హడావిడి కన్నా ఎక్కువగా ఉన్నది. దీనంతటికి కనీసం ఒక రెండు కోట్లు ఖర్చయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

చివరికి నాయకుడు గారు ఏమి చెప్తాడు? వడ్లగింజలో బియ్యపు గింజ. విగుంతే ని సింగపూరు చేస్తాం. మెట్రోరైలు మీ ఇంటి ముందుకే వస్తుంది.

ఈలోగా విగుంతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదిగో పులి అంటే అదిగో తోకలాగా విగుంతే భూములను కొని పారేస్తున్నారు, అమ్మి పారేస్తున్నారు.

నాయకులు గారు తాము చెప్పదలుచుకున్న దానిని, ఒక ఏ 5 కాగితం పై అచ్చు వేయించి, పాల ప్యాకెట్ లను అందులో ర్యాప్ చేయిస్తే , వారు అందించ దలుచుకున్న సందేశం ప్రజలకు చేరుతుంది. కాక పోతే, ప్రజలలో పోయిన చదవటం అనే అలవాటును పునరుధ్ధరించటం ఎలా అనేదే కీలక ప్రశ్న అవుతుంది.


వాల్మీకి రామాయణం, అయోధ్యాకాండ, మూడవ సర్గ, శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు
suvarNaadiini ratnaani baliin sarvaushhadhiirapi || 2-3-8
సువర్ణాదీనీ రత్నాని బలీన్ సర్వౌషధిరపి
పూజకోసం బంగారం మొ|| తెండి. హోమానికి ఓషధులను తెండి.

shuklamaalyaaMshcha laajaaMshcha pR^ithakcha madhusarpishhii |
శుక్లమాల్యాంశ్చా లాజాశ్చ పృథక్చ మధు సర్పిషిః
తెల్లటి పూలమాలలను తెండి. ధాన్యం (మరమరాలు మొ||) తెండి. తేనె నేయి విడిగా తెండి.

ahataani cha vaasaaMsi rathaM sarvaayudhaanyapi || 2-3-9
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి
కొత్త బట్టలు, రథం, ఆయుధాలు తెండి.

chaturangabalaM chaiva gajaM cha shubhalakshaNam |
చతురంగ బలం చైవ గజం చ శుభలక్షణం
రధ గజ తురగ పదాతులు అనే చతురంగ బలాన్ని తెండి. మంచి శుభ లక్షణాలున్న ఏనుగును తెండి.

chaamaravyajane shvete dhvajaM chhatraM cha paaNDuram || 2-3-10
చామర వ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం
విసనకర్రలు (చామరం అనే జంతువు జుట్టునుండి చేసినవి, రవివర్మ రామపట్టాభిషేకం చిత్రం చూడండి) , తెల్ల గొడుగులు తెండి.

shataM cha shaatakumbhaanaaM kumbhaanaam agnivarchasaam |
శతం చ శాతకుంభానాం కుంభానాం అగ్ని వర్చశామ్
ఒక వంద అగ్నిలాగ మెరిసే బంగారు (గోల్డెన్) కుండలు తెండి.

hiraNyashR^iN^gamR^ishhabhaM samagraM vyaaghracharma cha || 2-3-11
హిరణ్యశృంగమృ షాభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ
బంగారు కొమ్ములున్న ఎద్దును తెండి. పులి చర్మం తెండి.

upasthaapayata praatar agnyagaaraM mahiipateH.
ఉపస్థాపయత ప్రాతర్ అగ్న్యాగారం మహీపతే.
అన్నీ తెచ్చి రాజుగారి అగ్ని ఆగారం (హోమ శాల) లో పెట్టండి.

yachchaanyatkiJNchideshhTavyaM tatsarvamupakalpyataam | 2-3-12
యఛ్ఛాన్యత్ కించిత్ ఏష్టవ్యం తత్ సర్వం ఉపకల్ప్యతాం
ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే అన్నీ సమకూర్చండి.

antaHpurasya dvaaraaNi sarvasya nagarasya cha
అంతః పురస్య ద్వారాని సర్వస్య నగరస్య చ
నగరంలో అన్ని ద్వారాలను, అంతఃపుర ద్వారాలను అన్నిటిని

chandanasragbhirarchyantaaM dhuupaishcha ghraaNahaaribhiH || 2-3-13
చందన స్రగ్భిరర్చ్యంతామ్ ధూపైశ్చ ఘ్రాణహారిభిః
చందనం పొడి పూసి , పూలమాలలతో అలంకరించి ధూపం వేయండి.

prashastamannaM guNavad dadhi kshiiropa sechanam |
ప్రశస్తం అన్నం గుణవద్ దధి క్షీరోప సేచనం
మంచి అన్నం, పెరుగు పాలతో చిలకరించినది సేకరించండి.

dvijaanaaM shatasaahasre yatprakaamamalaM bhavet || 2-3-14
ఒక లక్ష మంది బ్రాహ్మణులకు సరిపోయేలా ఏర్పాటు చేయండి.

satkR^itya dvijamukhyaanaaM shvaH prabhaate pradiiyataam |
సత్ కృత్య ద్విజ ముఖ్యానాం శ్వః ప్రభాతే ప్రదీయతాం
బ్రాహ్మణ ముఖ్యులను సత్కరించి రేపు ప్రొద్దున పెట్టండి.

ghR^itaM dadhi cha laajaashcha dakshiNaashchaapi pushhkalaaH || 2-3-15
ఘృతం దధి చ లాజశ్చ దక్షిణాశ్చాపి పుష్కలః.
నెయ్యి, పెరుగు, మరమరాలు, పేలాలు, పుష్కలమైన దక్షిణ ఇవ్వండి.

suurye.abhyuditamaatre shvo bhavitaa svastivaachanam |
సూ

braahmaNaashcha nimantryantaaM kalpyantaamaasanaani cha || 2-3-16
బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతాం ఆసనాని చ
బ్రాహ్మణులను ఆహ్వానించండి. ఆసనాలను కల్పించండి.

diirghaasibaddhaa yodhaashcha sannaddhaa mR^ishhTavaasasaH || 2-3-19
దీర్ఘాసిబధ్ధా యోధాశ్చ సన్నధ్ధ మృష్టవాససః
పెద్ద పెద్ద కత్తులు ధరించిన యోధులను (ఆధునిక కాలంలో ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ లాగా) చక్కగా ఉతికిన బట్టలు ధరించిన వాళ్ళని (ఆధునిక కాలంలో బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన డ్రెస్ ధరించిన పోలీసులని)

mahaaraajaaN^gaNaM sarve pravishantu mahodayam |
మహారాజాంగణం సర్వే ప్రవిశంతు మహోదయం
యోధులని అందరిని మహారాజు గారి అంగణంలో ఉదయాన్నే నిల్చోమనండి. (రాష్ట్రపతి భవనం ముందు భాగం ఆవరణంలో ఇటీవల జరిగిన మోడీ పట్టాభిషేకోత్సవాన్ని గుర్తుకు తెచ్చుకోండి). జూన్ ఎనిమిదో తారీకు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జరిగి హెలీపాడ్ లో జరిగే జాతరలో ఇలాగే నిల్చోవాలి.


పోలీసు ఐజీలకు,డీఐజీలకు, ఎస్పీలకు, డీఎస్పీలకు, సీఐలకు, ఎస్ ఐలకు, ఎఎస్ఐలకు, హెడ్ కాన్స్టెబుల్స్ కి, కాన్ స్టేబుల్స్ కి , హోమ్ గార్డులకి, గుంటలు తవ్వేవాళ్లకి, గుంటలుపూడ్చే వాళ్ళకి, ఇతర సేవకగణాలకు నాహృదయ పూర్వక సానుభూతి.

చరిత్ర పునరావృత్తం కాదని ఎవరన్నారు? భారత దేశంలో పటాటోపం అంతరించి పోతుందని పగటి కలలు కనకండి, తెలుగు వాళ్ళల్లారా.

1 comment:

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.