Sunday, May 11, 2014

233 Visit of the Central team for selecting Seshandhra Capital

233 Visit of the Central team for selecting Seshandhra Capital

233 శేషాంధ్రకు రాజధానిని ఎంపిక చేయటానికి పంపబడిన కేంద్ర అధికారుల బృందం

చర్చనీయాంశాలు: సీమాంధ్ర, శేషాంధ్ర, రాజధాని, విశాఖ, రాయలసీమ, కర్నూలు, విగుంతె
కేంద్ర ప్రభుత్వం వారు పంపిన అధికారుల బృందం వారు మాపులు ముందేసుకుని, విశాఖలో రాజధాని కవసరమైన డేటాకై ఏదో తంటాలు పడ్డారు. ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, వారు విజయవాడకు సింహాద్రి ఎక్స్ప్రెస్ లో వస్తున్నారట. అపుడు కానీ సుమారు 350 కి.మీ. ల ప్రయాణం ఎంతటెడియస్ గా ఉంటుందో అర్ధం కాదు. వీళ్ళు డెల్టాలో తిరిగినంతకాలం అంతా పచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాజమండ్రి కడియంలో పూలతోటలు చూసి సీమాంధ్ర అంతా అభివృధ్ధి చెందింది అని భ్రమ పడే అవకాశం ఉంది. వీరు తమ పర్యటనను రాయదుర్గంనుండో అనంతపురంనుండో మొదలెట్టి దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, గుంటకల్, నాగార్జునసాగర్, కడప, కర్నూలు, లను కూడ చూస్తే బాగుంటుంది. సంపూర్ణమైన అవగాహనకి గ్రీన్ బెల్టులతో పాటు, డ్రై బెల్టులను కూడ చూడాలి.

శేషాంధ్ర అనే పేరు ఎందుకు వాడుతున్నానంటే: 1) శేష అంటే శేషాచలం. తిరుపతిలోని సప్తగిరులలో (ఏడుకొండలలో) ఒకటి. నాదృష్టిలో ఇది రాయలసీమకు సంకేతం. 2) శేష అంటే మిగిలిన. తెలంగాణను కత్తిరించిన తరువాత మిగిలింది కనుక శేషాంధ్ర (Residual Andhra Pradesh). శేషాంధ్ర పాము ఆకారంలో ఉందనుకుంటే, తల అనంతపురం, తోక చివర శ్రీకాకుళం అవుతుంది.

శేషాంధ్ర గరిట ఆకారంలో ఉందనుకుంటే, అనంతపురం గరిట మూతి అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తోక అవుతుంది.

ఏవిధంగా చూసినా ఈచివరనుండి ఆచివరికి 700 కిలో మీటర్ల ప్రయాణం తప్పదు. గుంటూరు కర్నూలు, ఒంగోలు కర్నూలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలు తప్పవు. వీటికి అదనంగా జాతీయ రహదారి నం. 5 పై అనవసరపు ప్రయాణాలు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే విశాఖ శేషాంధ్రకు రాజధానిగా పనికిరాదు. కావాలనుకుంటే, విశాఖ రాజధానిగా, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కలిపి (అవసరం అనుకుంటే బరంపురం, కోరాపుట్ , రాయగఢ్, లను కలిపి మరొక కొత్త రాష్ట్రాన్ని తయారు చేసుకోవచ్చు. లేదు , భారతీయులు , తెలుగు వాళ్ళు వెల్డింగులకు తగరు అనుకుంటే, శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ, తూగోజీ, లతో ఒక రాష్ట్రాన్ని ఏర్పరచ వచ్చు. పూర్వం గోదావరి ఉత్తర ప్రాంతమంతా గజపతులచే పాలించబడింది. విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రలకు వెళ్ళి సింహాచలంలో విజయ స్థంభాన్ని పాతినా, అది కప్పం వసూలు చేసుకోటానికి ఉపయోగ పడిందే కానీ, నిజమైన రాయల పాలన జరగలేదు.

తూర్పు సముద్రానికీ, రాయలసీమకు మధ్యలో నల్లమల అడవులు శేషాచలం కొండలు పెట్టని కోటగోడలులాగా ఉండి ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకంగా ఉంది. ఘాట్ రోడ్ లలో దొంగల బెడద, వానాకాలం వాగులు పొంగి వాహనాలు కొట్టుకుపోటం, ఎత్తు పల్లాలకు ఒళ్ళు హూనం కావటం జరుగుతాయి. అందుకే మానసికంగా రాయలసీమ వారూ, కోస్తావారు కలిసి పోలేదు. రాయలసీమలో చిత్తూరు, కడప జిల్లాల వారికి చెన్నై సౌకర్యం. అనంతపురం, కర్నూలు వారికి బెంగూళూరు సౌకర్యం. అందుచేత, ఆఏడుకొండలవాడిని దర్శించుకోటానికి తప్ప కోస్తా , రాయలసీమల మధ్య రాకపోకలు లేవు. ఆప్రయాణం నెల్లూరు జిల్లా గూడూరుకి పశ్చిమ దిశగా, వెంకటగిరి, కాళహస్తిల మీదుగా జరుగుతుంది. తుంగభద్ర డాం, రాజోలిబండ పథకం వచ్చేక, కొందరు కోస్తాంధ్రులు హోస్పేట, బళ్ళారి, శాంతినగర్ (అలంపురానికి పశ్చిమం, తెలంగాణ) లలో కాలువ ఇరిగేషన్ భూములు కొని అక్కడకి వలసపోయి కాంపులను స్థాపించుకోటం జరిగింది. అక్కడ వాళ్ళు పక్కాగా వెల్డింగ్ అయ్యారని నేను అనుకోలేక పోతున్నాను. రాయలసీమ వారికి చెన్నై, బెంగుళూరు సౌకర్యం కావటం వలననే, వారు ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటానికి ఉత్సాహం చూపలేదు. వారికి నచ్చచెప్పటం కొరకే 1937 లో చెన్నయిలోని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి శ్రీబాగ్ అనే భవనంలో ఆనాటి కోస్తానేతలు, రాయలసీమ నేతలు శ్రీబాగ్ ఒడంబడిక అనే ఒప్పందం చేసుకోటం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రరాష్ట్రానికి రాజధాని రాయలసీమలో ఉండాలి. ఈరోజు రాయలసీమ నేతలు మౌనంగా ఉన్నా, తిరిగి వారు ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని తీవ్రంగా సాగించే అవకాశం ఉంది.

ప్రత్యేక రాయలసీమ అవసరం

కొత్తసీమాంధ్ర రాజధాని నిర్మాణానికి జరిగే వేలకోట్ల నిర్మాణ కాంట్రాక్టులలో వాటా కోసం రాయలసీమ రాజకీయవేత్తలు, గుత్తేదారులు, కోస్తా రాజకీయనేతలు, గుత్తేదారులు తన్నుకోటం నిశ్చయం. ఇది కాక రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, కొత్తరాజధానిలో ఎవరు ఎన్ని ఎక్కువ భూములను చేజిక్కించుకున్నారు అనేదానిపై ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి. దానికి అనుగుణంగానే మాఫియా ముఠాలు చెలరేగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటే, రాయలసీమకు నేడే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటం మేలు. వారు ఎక్కువగా ముంబాయి చెన్నయి రైల్వే లైనుపై, కర్నూలు బెంగుళూరు రైల్వే లైనుపై ఆధారపడతారు. కోస్తావారు దానికి భిన్నంగా కోల్ కత్తా చెన్నయి ట్రంకు లైను పై ఆధార పడతారు.

నాదృష్టిలో క్రొత్త శాసన సభకు అప్పగించ వలసిన బాధ్యతలురాష్ట్రాన్ని మూడు ముక్కలు చిన్నరాష్ట్రాలు సౌకర్యవంతంగా విభజించుకొని, కొత్తజీవితాలను ప్రారంభించుకోటం. శాసనసభలో సభ్యుల సంఖ్య పెంచుకోటం, నియోజకవర్గాల వైశాల్యాన్ని తగ్గించుకోటం, ప్రతిమండలాన్ని ఒకనియోజకవర్గంగా ప్రకటించటం, శాసన సభ్యులకి కొన్నైనా ఎగ్జిక్యూటివ్ ఆధికారాలను, బాధ్యతలను ఇవ్వటం, ఎంఆర్ఓ గది పక్కనే శాసన సభ్యుడి గదిని ఏర్పాటుచేయటం, ఎంఆర్ఓ అధికారాలకి, శాసన సభ్యుడి ఆధికారాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖలను గీయటం, శాసన సభ్యులు అధికార దుర్వినియోగం చేసినపుడు, అవనీతికి పాల్పడ్డప్పుడు క్రిమినల్ లయబిలిటీని నిర్వచించటం, ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించటానికి దోహదం చేస్తాయి. ప్రస్తుతం 86,000 దాకా ఇస్తున్న ఇతర భత్యాలను తగ్గించి, ప్రభుత్వ అద్దె వాహనాలను ఏర్పాటుచేయాలి.

మూడు కొత్తరాష్ట్రాలకు మూడు రాజధానులను నిర్మించుకోటం.ఈపని జగన్, చంద్రబాబు చేయరా?చేయరు. చేస్తే వాళ్ళకేమి వస్తుంది? ఏమీరాదు, కనుక చేయరు. ఆయా జిల్లాల ప్రజలే తమ తమ శాసన సభ్యులపై వత్తిడి తెచ్చుకొని, ఈ 720 కిలోమీటర్ల ప్రయాణ బాదరబందీల నుండి తప్పించుకోవాలి. పెద్ద రాష్ట్రాలయితే ఎక్కువమంది ఎంపీలతో ఢిల్లీలో చక్రాలు తిప్పి , ఎక్కువ నిధులు తెచ్చి, చెరో లక్ష కోట్లు పోగేసుకోవచ్చని వారనుకుంటూ ఉండ వచ్చు. చిన్న రాష్ట్రాలలో అది కుదరదు. చిన్నరాష్ట్రాలలో ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా, అంతర్జాతీయ సమావేశాలూ, ఫెస్టివల్సూ నిర్వహించుకుంటూ, గోల్ఫ్ కోర్సులకి భూములు ధారాదత్తం చేస్తూ, నిమిషానికొకసారి విదేశాలకు వెళ్లటం కుదరదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.