Monday, April 7, 2014

197 Narendra Modi and China

197 Narendra Modi and China

Topics for discussion: Narendra Modi, నరేంద్రమోడీ, చైనా, రక్షణ వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలు
శ్రీనరేంద్ర మోడీగారికి , శ్రీ మన్మోహన్ సింగు గారికి వలెనే , చైనా యందు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో స్పష్టత లేనట్లు కనిపిస్తున్నది. శ్రీవారు 25.2.2014 నాడు ఈశాన్యరాష్ట్రాలలోని పాసీఘాట్ వద్ద ఒక ఎన్నికల ర్యాలీ లో ప్రసంగిస్తూ అనవసరంగా చైనాను గిల్లారు.
“...No power on earth can take away even an inch from India ... China should give up its expansionist attitude and adopt a development mindset. ... I swear by this land that I will not let this nation be destroyed, I will not let this nation be divided, I will not let this nation bow down,”

తెలుగు సారం: ''... ఈభూమిపై ఏ శక్తికూడ భారత్ నుండి ఒక అంగుళాన్ని కూడ తీసుకు వెళ్ళలేదు. ... చైనా తన విస్తరణవాద దృక్పథాన్ని వదిలేసి వికాసభరితమైన మైండ్ సెట్ ను ప్రవేశ పెట్టుకోవాలి. ... నేను ఈ జాతిని వినాశం కానివ్వనని, నేను ఈ దేశాన్ని విభజించబడనివ్వనని, ఈదేశాన్ని లొంగి ఇతరుల పాదాక్రాంతం కానివ్వనని ఈ నేల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ప్రతిజ్ఞలు వేరు, ఆచరణలు వేరు. 2002 లో గుజరాత్ లో మత కలహాలు చెలరేగి వేలమంది హతమైతే ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్రూప్సు ను పంపలేదని శ్రీవారు చూస్తూ ఊరుకున్నారు. కనీసం, మతకలహాలు జరుగుతున్న చోటికి వెళ్ళి పోలీసు అధికారులు ఏమీ చేస్తున్నారు అనేది గమనించటం కూడ చేయలేకపోయారు. ఇలాంటి నిస్సహాయ వ్యక్తి, తాను చాల బాధ పడ్డానని చెప్పే పాలకుడు, చైనా నిజంగా దాడి చేస్తే ఏవిధంగా అడ్డుకుంటాడు? ఏరష్యానో, అమెరికానో సాయం అడిగి, వారు పంపలేదని చూస్తూ ఊరుకుంటాడా? యుధ్ధం అన్నాకా గెలుపూ ఓటములు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇంగ్లండు వంటి చిన్న దేశం భారత్, చైనా ల వంటి అతి పెద్ద దేశాలనే కాక ప్రపంచం మొత్తాన్నీ జయించింది అంటే అది ఆధునిక ఆయుధాల మహత్తు కావచ్చు, వాటిని వాడటంలో నైపుణ్యం కావచ్చు, యుధ్ధ వ్యూహాలు కావచ్చు, ధర్మాధర్మాలు పట్టించుకోకుండా పిట్టలను కాల్చినట్లుగా కాల్చుకుంటూ పోవటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. విజ్ఞుడైన రాజకీయవేత్త వీలైనంత వరకు యుధ్ధాలను నివారించాలని చూస్తాడు: కయ్యాలకు కాలు దువ్వడు. యుధ్ధం అనివార్యం అయినపుడు తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తాడు తప్ప, వాచాలత్వాన్ని చూపి, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేయడు. కరిచే కుక్క అరవదు, అరిచే కుక్క కరవదు అనే సూత్రం చక్కగా వర్తిస్తుంది.

మోడీ గారి ప్రసంగానికి చైనా తన ధోరణిలో జవాబు చెప్పింది. వారేం జవాబు చెప్పినా, ఫలితం భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఈలోగా అనవసరంగా కవ్వించినట్లయ్యింది.

ముందు చూపులేని వ్యాపారాలు, పెట్టుబడులు

1962లో చైనా భారత్ లో షుమారు 36,000 చదరపుమైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. 20,000 మంది దాకా భారతీయ సైనికులు హతమయ్యారు. వారి భార్యలు విధవలై , పిల్లలు తండ్రులు లేని వారై, కుమిలిపోతున్నారు. అలాటి చైనాతో, కయ్యానికి కాలు దువ్వక పోయినా, సమయం చూచుకొని మన భూభాగాన్ని మనం సామదాన భేద దండోపాయాల ద్వారా తిరిగి సాధించుకోవాలి.

ఒక సామెత ఉంది, చరిత్ర నుండి పాఠం నేర్చుకో లేని వాడు, గత చరిత్రలలో జరిగిన దురాగతాలనే మరల మరల అనుభవించాల్సి ఉంటుంది. చైనా దురాగతాల చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకున్నాం?

చైనా నుండి ప్రతి ఏటా 50 బిలియన్ డాలర్ల వస్తువులను కొంటూ, చైనా ఆర్ధిక వ్యవస్థకు మహారాజ పోషకులలాగా తయారు అయ్యాం. బిలియన్ డాలర్లు అంటే షుమారు రూ. 6000 కోట్లు. 50 బిడాలు అంటే ఏటా రూ. 3 లక్షల కోట్ల రూపాయలు. 36000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నవాళ్ళకి మనం ఏటా 3 లక్షల కోట్లు చెల్లిస్తున్నామంటే మనం ఎంతటి అర్భకులం? ఎంతటి మూర్ఖులం?

గతంలో భారతీయ నగరం ఆలీఘర్ గొప్ప గొప్ప తాళాల తయారీకి ప్రసిధ్ధి. ఈరోజు ఏఇంట్లో చూచినా చైనా తాళాలు దర్శన మిస్తాయి. గాడ్రెజ్ వంటి గొప్ప కంపెనీ వారు కూడ తమ బ్రాండ్ పేరుతో ముద్రింపచేసుకొని, చైనా నుండి తాళాలను దిగుమతి చేసుకొని , భారత్ లో అమ్ముతున్నారు అంటే ఎంత నికృష్టులం మనం. పోనీ ఈతాళాల నాణ్యత ఎంతో గొప్పదా? పైన పటారం లోన లొటారం లాగా, తాళాలు బాగు చేసే వాడిని అడిగితే వాడు ఒక చిన్న మేకుతో, సుత్తితీసుకొని కీహోల్ లో ఆయువు పట్టైన చోట ఠాప్ అని ఒక దెబ్బ వేస్తే చాలు, చైనా తాళం దెబ్బకి ఊడి వచ్చేస్తుంది. భారత్ తాళాలు అలా రావు.

మోడీజీ, ఏమిటీ బ్రతుకు?

గుజరాత్ లో పెట్టుబడులు పెట్టమని శత్రుదేశమైన చైనా వారిని అడుక్కోటానికి, శ్రీ నరేంద్ర మోడీగారు మూడు సార్లు చైనా పర్యటించి వచ్చారట. గుజరాత్ ను చైనాకు అమ్మటంలో వారు ఎంత మేరకు కృతకృత్యులైనారో తెలియదు.

ఈవిషయంలో కాంగ్రెసాది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ తక్కువేమీ తినలేదు. భారతీయ నౌకాశ్రయాల నిర్వహణను చైనా కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నాలు జరిగాయి కాని, రక్షణ శాఖవారు అభ్యంతరాలు లేవదీయటం వలన కొంచెం స్లో అయ్యాయి.

రివర్సుగా, అంటే చైనాలో భారత్ పెట్టుబడులు

చైనాలో పెట్టుబడులు పెట్టాలని భారతీయ పారిశ్రామికులు ఉవ్విళ్ళూరుతున్నారని వేరుగా చెప్పనవసరం లేదు. భారతీయ పారిశ్రామికులకు భారత్ లో పెట్టుబడులు పెట్టటం కన్నా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని విపరీతమైన దురద.

చైనాలో పెట్టుబడులు పెట్టటానికి భారత్ కు ఎన్నో అవకాశాలున్నాయని మన భావి భారతప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారి నమ్మకంట. అలా చైనాలో భారీగా పెట్టుబడులు పెట్తే చైనా భారత్ పై ఇంక ముందు దాడి చేయదనా? అరుణాచల్ ప్రదేశ్ ను తమ భూభాగంగా చూపించటం మానేస్తుందనా? కాశ్మీర్ నుండి చైనా వెళ్ళే భారతీయులకు స్టేపుల్డ్ వీసాలు జారీచేయటం మానేస్తుందనా?

భవిష్యత్ లో చైనా భారత్ పై దాడి చేస్తే, చైనాతో యుధ్ధం చేయవలసి వస్తే ఆ పెట్టుబడులను ఎలా వెనక్కి తెచ్చుకుంటారు?

(ఇంకా ఉంది, ఇంకో రోజు.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.