Tuesday, March 4, 2014

167 Supreme Court has become unpredictable

167 Supreme Court has become unpredictable సర్వోచ్చ న్యాయస్థానం ఊహాతీతంగా తీర్పులిస్తున్నది
చర్చనీయాంశాలు: సుప్రీం కోర్టు, ప్రకటనలు, హేట్ స్పీచెస్, హైకోర్టు, 2014 ఎన్నికలు, 2014 elections
దేశంలోని పలు సంస్థలు, వ్యవస్థలు విఫలం కావటంతో ప్రజలు హైకోర్టు, సుప్రీం కోర్టులపై (క్రింద కోర్టులపై కాదు) కారు చీకటిలో కాంతి రేఖలా ఆశలు పెట్టుకున్నారు. ఫలితంగా ఉన్నత న్యాయస్థానాలపై, సర్వోచ్చ న్యాయస్థానాలపై పనిభారం పెరిగి పోయింది. కేంద్ర ప్రభుత్వంనుండి రాజకీయ వత్తిడులు ఎక్కువవుతున్నాయి. సర్వోచ్చ న్యాయస్థానం లోని కొద్దిమంది న్యాయమూర్తులపై అవనీతి, లైంగిక అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలు కూడ వచ్చాయి. వీటన్నిటినుండి సర్వోచ్చ న్యాయ స్థానం ఫ్లైయింగ్ కలర్స్ తో బయట పడుతుందని ఆశించక తప్పదు.

ఈమధ్య సర్వోచ్చ న్యాయస్థానం వెలువరిస్తున్న నిర్ణయాలు ఒకటి రెండు సమంజసమైనవి కావేమో నన్న అభిప్రాయం కలుగు తున్నది. దీనిని వివరించాలంటే ముందుగా ఒక చిన్న కథ వ్రాయాలి.

ఒక ముని ఉండే వాడు. అతడికి ఒక శిష్యుడు. వాళ్ళు ఉండేది ఒక గడ్డిపాక. దానికి పైకప్పుకి చిల్లిపడింది. కురుస్తూ ఉండేది.

ఒకరోజు ముని తన శిష్యుడిని పిలిచి ''మన కుటీరం కప్పు వాన నుండి రక్షణకు పనికి రాకుండా అయిపోయింది. నీవు పాక పైకి ఎక్కి దానిని సరి చేయటానికి ప్రయత్నించు. నేను క్రిందనుండి నీకు సహాయం చేస్తాను. '' అన్నాడు.

శిష్యుడు: ''గురువు గారూ, ఇప్పుడు ఇంకా ఎండా కాలమే. వానా కాలానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇపుడు మనం ఆ కప్పును సరిచేసినా గాలికి నిలవదు. వానాకాలం ప్రారంభం అవుతున్న మొదటి రోజులలో మనం దానిని సరిచేద్దాం'', అన్నాడు.

గురువు గారు ఇది కూడ బాగానే ఉందిలే అని వానాకాలం వచ్చేదాకా ఆగాడు.

వానాకాలం వచ్చింది. ఢమఢమల పిడుగులతో, ఉరుములతో వాన మొదలయ్యింది. గురువు శిష్యుడిని పిలిచి ''ఇపుడు నీవు ఇంటి పైకెక్కు. మనం కప్పును సరిచేద్దాం. '' అన్నాడు.

శిష్యుడు హుహు హుహూ అని వణుకుతూ, ''గురూ గారూ, ఇపుడు కప్పు బాగా తడిసి ఉన్నది. జారుతున్నది. తాటాకులు కూడ నాని ఉన్నాయి. ఇపుడు పైకెక్కితే తాటాకులు చినిగి చిల్లులు పెద్దవి అవుతాయి. వాన తగ్గాక సరి చేద్దాం. '' అన్నాడు.

గురువు సరేలే అని మిన్నకున్నాడు. వాన తగ్గాక శిష్యుడిని మరల అడిగాడు. ఈసారి శిష్యుడు

''వాన తగ్గింది కదా గురువుగారూ. మనం జైసల్మేర్ ఎడారిలో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడోకానీ వానలు రావు. ఎప్పుడో వచ్చే వాన కోసం మనం ఇప్పుడే ఎందుకు బాధ పడటం? '' అన్నాడు.

శిష్యుడికి ఒళ్ళు వంగదని గురువు గారికి అర్ధం అయ్యింది. తానే ఇంటి పైకి ఎక్కి కప్పును సరిచేసుకున్నాడు.

పరస్పర విరుధ్ధవైఖరులు

ఆంధ్ర ప్రదేశ్ విభజనలో కేంద్రం ఘోర అన్యాయానికి పాల్పడుతుంటే, సీమాంధ్ర పౌరులు, నేతలు, హైకోర్టుని, సుప్రీం కోర్టుని తగినంత ముందుగానే ఆశ్రయించారు. ప్రతిసారీ హైకోర్టు, సుప్రీం కోర్టులు ''ఇపుడు తగిన సమయం కాదు, ఇపుడు తగిన సమయం కాదు '' అంటు దరఖాస్తులని త్రోసి పుచ్చాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అంతా కుమ్మక్కై లోక్ సభలో అత్యంత భీకర భీభత్స పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పాస్ చేయటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను ప్రవేశ పెట్టి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసారు. నిజానికి రాష్ట్ర విభజనలో జరిగిన, జరుగుతున్న అన్యాయం సుప్రీం కోర్టు సు మోటు (తనంత తానే) జోక్యం చేసుకో తగినంత గంభీరమైనది, క్లిష్టమైనది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోక పోగా, పౌరులు, నేతలు చేసుకున్న మనవులను కూడ తృణీకరించింది. ఫలితంగా నేడు సీమాంధ్ర ప్రజలు, నేతలు దిక్కు తోచని స్థితిలో పడి పోయారు.

కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల లోని అధికార పార్టీలు తమతమ పబ్బం గడుపుకోటానికి సర్కారీ ఖజానా ఖర్చుతో పెద్ద పెద్ద ఫుల్ పేజీ రంగుల ప్రకటనలు, టీవీ కలర్ ప్రకటనలను ఎడాపెడా విడుదల చేయటం, ఖజానాను ఖాళీ చేయటమే కాక, న్యూస్ ప్రింటును, విద్యుత్ ను, స్పెక్ట్రం తరంగాలను వృధా చేస్తున్నాయి. ఉదాహరణకి నరేంద్రమోడీ గారి గుజరాత్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దక్షిణ భారత్ మొత్తం విడుదల చేసిన ఈపూర్తి పేజీ ప్రకటన చూడండి. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన చూడండి.ఈప్రకటనలను విడుదల చేసిన సమయం గమనార్హమైనది. ఈప్రకటనలు కేవలం వోట్లను కురిపించుకోటానికి ఉద్దేశించినవే. పిఐల్ వేసిన పౌరుడు కోరిన విధంగా సుప్రీంకోర్టు తగిన ఆదేశాలు జారీ చేసి ఉంటే కొన్ని వేల రూపాయలు ఆదా అవటమే కాక అధికార పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో తమ ఎన్నికల ప్రచారాన్ని చేసుకోకుండా అడ్డుకున్నట్లయ్యేది.

కానీ సుప్రీం కోర్టు ఇలెవన్త్ అవర్ లో వస్తే ఎలాగా అని తోసి పుచ్చింది. ముందు వెళ్ళుంటే ప్రీమెచూర్ అని ఉండే వాళ్లేమో. నిజానికి ఇలాంటి వాటిల్లో పౌరులు కోర్టును ఆశ్రయించక ముందే వారు చొరవతీసుకోవటం న్యాయం. ఏది సరియైన సమయమో కోర్టుకు తెలుస్తుంది కాబట్టి సు మోటు చర్య తీసుకోవాలి. ఇందాక నేను వ్రాసిన ముని కథలో, ముని అడుగకుండానే శిష్యుడు ఇంటి పైకెక్కి ఇల్లు కప్పటానికి ప్రయత్నించాలి. అవసరమైతే గురువు సహాయం తీసుకోవాలి. అట్లు చేయలేదు పో, గురువు కోరనప్పుడైనా క్రియాశీలుడు కావాలి.

హేట్ స్పీచ్ లు: ద్వేషపూరిత, హింసను ప్రేరేపించే ప్రసంగాలు

రాజకీయ నేతలు విధ్వంసక విద్వేష పూరిత ప్రసంగాలు చేయటం నేడు నిత్య కృత్యం అయిపోయింది. శ్రీకెసీఆర్ అండ్ కో చేసిన ప్రసంగాల వల్ల తెలంగాణ లో వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలాది ప్రభుత్వ బస్సులు తుక్కు, బూడిద అయ్యాయి. రోడ్లన్నీ రాళ్ళతో నిండి పోయాయి. చివరికి వారు టాంకు బండ్ పై ఉన్న మహాపురుషుల విగ్రహాలను కూడ ముక్కలు చేశారు. తెరాస నేత కెసీఆర్ పుత్రుడు కెటీఆర్ వాటిని అసెంబ్లీలో ప్రసంగిస్తు ''మట్టి బొమ్మలు'' అన్నాడు.
టాంకు బండు పైన ఉన్న విగ్రహాల పేర్లు

వీళ్ళంతా నీచులు, దుర్మార్గులా?
(సికింద్రాబాదు నుండి వరసగా) .. రుద్రమదేవి • మహబూబ్ అలీ ఖాన్ • సర్వేపల్లి రాధాకృష్ణన్ • సి.ఆర్.రెడ్డి • గురజాడ అప్పారావు • బళ్ళారి రాఘవ • అల్లూరి సీతారామరాజు • ఆర్థర్ కాటన్ • త్రిపురనేని రామస్వామిచౌదరి • పింగళి వెంకయ్య • మగ్దూం మొహియుద్దీన్ • సురవరం ప్రతాపరెడ్డి • జాషువ • ముట్నూరి కృష్ణారావు • శ్రీశ్రీ • రఘుపతి వెంకటరత్నం నాయుడు •త్యాగయ్య • రామదాసు • శ్రీకృష్ణదేవరాయలు • క్షేత్రయ్య • పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి • బ్రహ్మనాయుడు • మొల్ల • తానీషా • సిద్ధేంద్ర యోగి • వేమన • పోతనామాత్యుడు • అన్నమాచార్య • ఎర్రాప్రగడ • తిక్కన సోమయాజి • నన్నయభట్టు • శాలివాహనుడు

తెలంగాణ వీరులకు సరియైన ప్రాతినిథ్యం ఇవ్వలేదు అనుకుంటే కెటీఆర్ కెసీఆర్ &కో అధికారంలోకి వచ్చినపుడు అదనపు విగ్రహాలను ప్రతిష్ఠించుకోవచ్చు. ఉన్న వాటిని కూలగొట్టటం ఎందుకు? కూలగొట్టి వాటిని మట్టిబొమ్మలు అని అవమానించటం ఎందుకు?


ఎం ఐ ఎం నేతలు, బిజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం పరిపాటి అయ్యింది. అన్యమత మిషనరీలు హిందూ దేవుళ్ళను తిడుతూ ద్వేష పూరిత ప్రసంగాలు, ప్రచారాలూ చేయటం సాధారణం అయిపోయింది. ఇలాటివి జరిగినపుడు వాక్ స్వాతంత్ర్యం యొక్క హక్కు దుర్వినియోగం అవుతున్నది. 128 కోట్ల జనం ఉన్నారు కాబట్టి 128 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. హేట్ స్పీచ్ ల విషయంలో చొరవ తీసుకోటం అంటే వాక్స్వాతంత్ర్యం పై నిషేధం గా భావించటం న్యాయం కాదు. అదే సమయంలో లక్షలాది పౌరులు నిత్యం ఈరోజు సరియైన సమయం అని కోర్టు ఒప్పుకుంటుందేమో, అనుకుంటూ పిటీషన్లు వేస్తే కోర్టుల పని సరిగా నడవదు. కోర్టులే సు మోటూ గా చర్యలు తీసుకోవటం అవసరం. జనరల్ సెన్సారింగ్ అవసరం లేదు.

ఏది హేట్ స్పీచ్, ఏది కాదు అనే దానిలో స్పష్టత లేదు. మేజిస్ట్రేట్ల, అధికార పార్టీల (ప్రాసిక్యూటర్ల) ఇష్టాయిష్టాలను బట్టి కేసులు నత్త నడక నడుస్తూ ఉంటాయి. రాజకీయాలలో హేట్ స్పీచ్ లు సర్వ సాధారణం, ప్రజలే వీటిని విశ్లేషించుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోర్టులు ఆశించటం సబబు కాదు. ఎందు కంటే, ప్రజలు దాదాపుగా నిరక్షరాస్యులు వారికి సంతకం చేయటం మాత్రమే వచ్చు, చదివి అర్ధం చేసుకునే శక్తి, విచక్షణా శక్తిలేని వాళ్ళు. వారికి వంశ పారంపర్యంగా వచ్చే కుల, మత, భాషా, ప్రాంతీయ అభిమానాలు, దురభిమానాలు హేట్ స్పీచ్ లను నిజాలని భ్రాంతి పడేలా చేస్తాయి. ఫలితంగా హింస ప్రబలుతుంది. అనర్హులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతారు. ఇది ప్రజాస్వామ్యం మనుగడను తీవ్రంగా దెబ్బ తీస్తుంది.

2014 ఎన్నికల సందర్భంగా చర్యలు తీసుకునే సమయం దాటింది అనుకున్నా, తరువాతైనా హైకోర్టులు, సుప్రీం కోర్టులు, తమ నిర్ణయాలను పునరాలోచించాలని పౌరులు ప్రార్ధించాలి.

దీనిలో కోర్టుల యందు అవిధేయత ఉండదని నా నమ్మకం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.