Tuesday, February 18, 2014

142 Congress BJP

142 Nothing unexpected happened. అనుకోనిదేమీ జరగలేదు.
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, కాంగ్రెస్, బిజెపి, లోక్ సభ

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


ఈవ్యాసాన్ని నేను హృదయపూర్వకంగా వ్రాయటం లేదు. ఎందుకంటే, నా ప్రియ సిధ్ధాంతమైన మార్క్సిజానికీ, ప్రాంతీయ వాదానికీ కుదరదు. మాప్రాంతానికి అన్యాయం జరిగిన మాట నగ్నసత్యం. ఈవిషయాన్ని పరిశీలిస్తూ నిష్పాక్షికంగా వ్రాయాలంటే, నేను కూడ ఒకతరహా ప్రాంతీయవాదిగా తయారయ్యే ప్రమాదం ఉంది.

ప్రాంతీయ వాదంలో ప్రాంతాలకు జరిగే అన్యాయాలపై దృష్టి ఉంటుంది. ఇది బూర్జువా పధ్ధతి. మార్క్సిస్ట్ పధ్ధతి శ్రామిక వాదాన్ని ఆశ్రయించాలి. శ్రామికులకు జరిగే అన్యాయాలను ప్రస్తావించాలి తప్ప ప్రాంతాలకు జరిగే అన్యాయాలకు కాదు.

ప్రాంతీయవాదం, మత తత్వం వలెనే దుఃఖాన్ని ఇస్తుంది తప్ప సుఖాన్ని ఇవ్వదు.

ఈబ్లాగ్ పోస్టును నేను తరువాత పునఃపరిశీలించి తొలగించటమో, బాగా తిరగ వ్రాయటమో జరగవచ్చు.

ఉన్న పార్టీలలో కొంత మెరుగైన పార్టీ సీపీఎం


లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును వ్యతిరేకించటం, బెంగాల్ కోణంలోంచి ఆలోచించి వ్యతిరేకించిందని నా అభిప్రాయం. అంటే, సీపీఎం వంటి సెమీ బూర్జువా సెమీ మార్క్సిస్ట్ పార్టీ కూడ ప్రాంతీయవాదానికి అతీతం కాదు అనేది విచారకరం.రాష్ట్ర విభజన విషయంలో అనుకోనిదేమీ జరగలేదు. అంతా ఊహించిన ప్రకారమే జరిగింది. సీమాంధ్ర ప్రజలనెత్తిపై విభజనను రుద్దటంలో కాంగ్రెస్ బిజెపిలు పోటీ పడ్డాయి. సీమాంధ్ర ప్రజలపై ఎవరు ఎక్కువ పగబట్టారు అనేది ఇదమిత్థంగా చెప్పలేం. సోనియా కాంగ్రెస్ పగబట్టిందా, సుష్మా బిజెపి పగబట్టిందా, తెరాస పగ బట్టిందా, అంటే వారెవరూ కాదనే చెప్పాలి. నిజంగా సీమాంధ్ర ప్రజలపై పగబట్టింది సీమాంధ్రనేతలే, వారిని గుడ్డిగా అనుసరించే సీమాంధ్ర ప్రజలే.

రెండు మూడు ఉదాహరణలిస్తే చాలు.

రాయల తెలంగాణను రంగం మీదికి తేవటం


రాయల తెలంగాణను పదేపదే రంగంమీదికి తేవటంలో కోస్తాంధ్ర నేతల స్వార్ధం ఏమిటంటే, క్రొత్త శేషాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఎంపిక కాకుండా చూడటం. 1937 శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం నాటి కోస్తాంధ్ర నేతలు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని కర్నూలులో నెలకొల్పటానికి ఒప్పుకున్నారు. 1953లో ఆంధ్రరాష్ట్రాన్ని కర్నూల్ రాజధానిగా ఏర్పరచుకున్నారు. ఇపుడు విడి పోతున్నారు కాబట్టి, సహజ మార్గంగా కొత్తరాజధాని కర్నూలుకు తిరిగి వెళ్ళాలి. అది విశాఖ, వి-గుం-తె లను శేషాంధ్ర రాజధానులుగా కోరుకునే శేషాంధ్ర నేతలకు ఇష్టం లేదు.

ఈవలలో కర్నూలు, అనంతపురం నేతలు ఎలా పడ్డారు?


ఈవలలో పడిన కర్నూలు, అనంతపురం నేతలు అక్కడి గ్రామ పంచాయితీల చేత మేము రాయల తెలంగాణ లోనే ఉంటాం అని తీర్మానాలను చేయించి కాంగ్రెస్ అధిష్ఠానానికి సమర్పించుకున్నారు. దీనికి రెండు మూడు కారణాలు ఉండవచ్చు.
౧. వారికి విశాఖ, వి-గుం-తె ల కన్నా హైదరాబాదు సౌకర్యం. రైలు, జాతీయ రహదారి సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. నల్లమల అడవులను దాటుకుంటూ వి-గుం-తె లను, విశాఖకు దూరాభార ప్రమాద భరిత ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉండదు.
౨. రాజోలి బండ, జూరాల, బీచుపల్లి, శ్రీశైలం మొ|| ప్రాజెక్ట్ లవద్ద కృష్ణా, తుంగభద్రా జలాల షేరింగ్ తేలికవుతుంది.
౩. అన్నిటికన్నా ముఖ్యమైనది: పలువురు కర్నూల్, అనంతపురం నేతలు ఇప్పటికే హైదరాబాదులో భూసెటిల్ మెంట్లలో నిమగ్న మయి ఉన్నారు. రాయల తెలంగాణ ఇస్తే వాటిని కొనసాగించుకో వచ్చు.
కరువు ప్రాంతాలైన కర్నూలు, అనంతపురాలకి సాగునీరు, తాగునీరు రాయల తెలంగాణ ద్వారా తేలికగా అందించ వచ్చనేది ఒక ఆశ.

లుంగీ వాలాల పెత్తనం మాకొద్దని తెరాస మొదటనే తిరస్కరించింది. తెరాస కెసీఆర్ కోరికలను తీర్చటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం దానిని ఎలా ఆమోదిస్తుందని సీమాంధ్ర నేతలు పదే పదే ఆశించారు?

బొత్స సత్యనారాయణ శల్యసారథ్యంవోల్క్స్ వ్యాగెన్ కుంభకోణంలో శ్రీబొత్సను వైయస్ రాజశేఖర్ రెడ్డి కాపాడిన విషయం మనం మరువరాదు. ఈయన కున్న బినామీ మద్యం బెల్ట్ షాపులను కిరణ్ బయట పెట్టటానికి ప్రయత్నించటం, అధిష్ఠానం కిరణ్ ను అదుపులో పెట్టటం మనం మరువరాదు. ఈయన పుత్రిక వివాహ సమయంలో జరిగిన ఆర్భాటాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇలాంటి మహనీయుడిని సోనియా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి ప్రోత్సహించింది అంటే ఆహా సొగసు చూడ తరమా.

ఈయనకి లోపల్లోపల ఏముందో గానీ, రాష్ట్రం విడిపోవాలా, కలిసి ఉండాలా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడు. ఒకసారి ఒకే భాష మాట్లాడే వారికి రెండురాష్ట్రాలు ఉంటే తప్పేమిటి అన్నాడు. శ్రీచంద్రబాబు నాయుడుగారికి వలెనే ఈయనకు కూడ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక రాష్ట్రమైనా రెండు రాష్ట్రాలైనా అభ్యంతరాలు లేవు.

లోకసభ ప్రొసీడింగ్స్ టెలీకాస్ట్ ను బ్లాక్ అవుట్ చేయటం పరాకాష్ఠ


లోక్ సభలో ఏమి జరుగుతున్నదో ప్రజలను చూడనిచ్చే ధైర్యం కూడ కేంద్ర ప్రభుత్వం చేయలేక పోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై లోక్ సభలో మూజువాణీ వోటింగ్ కాదు, డివిజన్ వోటింగ్ జరిగిందని, 2/3 వంతు సభ్యులు సమర్ధించారని కేంద్ర మంత్రి వర్యులు శ్రీజైపాల్ రెడ్డి అన్నారు. అదే నిజమైతే, లోక్ సభ లో జరుగుతున్న అంత గొప్ప కార్యక్రమాన్ని బ్లాక్ ఔట్ చేయటం ఎందుకు, చక్కగా సర్వాంగ సుందరంగా ప్రసారం చేయవచ్చు కదా.

కాంగ్రెస్ విద్రోహం గొప్పదా? బిజెపి విద్రోహం గొప్పదా?


బిజెపి దృష్టిలో సీమాంధ్ర ప్రజలు, ప్రజలే కాదు. భారతీయ సంస్కృతిలో కానీ, హిందూత్వలో కానీ, సీమాంధ్ర ప్రజలు భాగస్వాములు కాదు. బిజెపి ప్రజలకేదో న్యాయం చేస్తామని మధ్యలో టపాకాయలు పేల్చింది. చివరికి తోకముడిచి తుస్సుమనిపించింది.

కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా ఆలస్యం ఎందుకు జరుగుతున్నదో?


ఇంకా పంద్యారాల ఫైళ్ళు సంతకాలు పెట్టటం పూర్తి కాలేదేమో. కిరణ్ చివరి రోజుల్లో సంతకాలు పెట్టిన ఫైళ్ళను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి శ్రీ షబ్బీర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఏమి జరుగుతుందో చూడాలి.

క్రికెట్ వేరు. రాజకీయాలు వేరు. ఇక్కడ ఆఖరు బాల్ దాకా ఆడాల్సిన పనిలేదు. సీ.డబ్లుయూ.సీ ఘోరమైన విభజన తీర్మానం చేయగానే, సీమాంధ్ర ఎంపీలు, సీమాంధ్ర ఎం.ఎల్.ఎ. లు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, సీమాంధ్ర రాష్ట్రమంత్రులు రాజీనామా చేసి ఉండవలసింది. ఎవరి పదవులను వారు పట్టుకొని వేలాడారు. అందరూ పవర్ బ్రోకర్లే కాబట్టి ఎవరి ధంధాలు వారు చేసుకుంటూ, స్లోగన్ లు ఇస్తూ కాలం గడిపారు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.