Tuesday, January 7, 2014

111 Bifurcation discussion

111 What does discussion mean? చర్చించటం అంటే ఏమిటి?
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శాసనసభ

రాష్ట్రవిభజనపై శాసనసభలో చర్చ ప్రారంభం అయ్యిందా కాలేదా అనేది వివాదాస్పదంగా మారింది.


స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చ ప్రారంభం అయ్యింది అంటూ ఉండగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బిల్లును సభలో టేబుల్ చేయటం మాత్రమే జరిగింది, చర్చ ఇంకా ప్రారంభం కాలేదు, అంటున్నారు. ఏది ఎంత వరకు నిజం? ముందుగా

వైబీరావు గాడిద వ్యాఖ్య

మొదటి నుండి శ్రీ నాదెండ్ల మనోహర్ ధోరణి అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఆయన కాంగ్రెస్ అథిష్ఠానం అనుగ్రహం కొరకై పాకులాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయనను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయిస్తున్నది ఎవరు? బహుశా దిగ్విజయ్ సింగ్ కావచ్చు. కొత్త సీమాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కొరకో, లేక 2014లో కాంగ్రెస్ ఢిల్లీలో మరల అధికారానికి వస్తే కేంద్రంలో ఏదో ఒకపదవో ధ్యేయంగా, ఆయన పని చేస్తున్నారనే అభిప్రాయం కలుగక మానదు.

టేబుల్ చేయటం జరిగిందనటం ఎంతవరకు సబబు?

స్థూలంగా చూస్తే ఢిల్లీనుండి వచ్చిన 300 కాపీల బిల్లులను శాసనసభ్యులకు పంచి పెట్టటం, వారికి దానిని చదువుకునేందుకు తగిన సమయాన్ని ఇవ్వటాన్ని మనం టేబుల్ చేయటం అనచ్చు. సభలో జరిగిన ఈకార్యక్రమాన్ని డెప్యూటీ స్పీకర్ శ్రీ భట్టి విక్రమార్క, అప్పటి శాసనసభా వ్యవహారాలమంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ఈకార్యక్రమాన్ని హైజాక్ చేశారు. కాపీలను సభ్యులకు పంచిపెట్టాక ముట్టినట్లు వారి ఎక్నాలెడ్జ్ మెంట్లు తీసుకున్నారో లేదో తెలియదు. ఆక్షణంలో సభలో లేనివారికి కాపీలను అందించారోలేదో తెలియదు. సభ్యులు వాటిని చదవటం, పరిశీలించుకోటం, తమ మనసులలో ఒక అభిప్రాయాలను ఏర్పరుచుకోటం జరగలేదు. ఇవేమీ జరగకుండానే ప్రతిపక్షనేత శ్రీచంద్రబాబునాయుడును మాట్లాడమంటే ఆయన ఏమి మాట్లాడతారు? గందరగోళం తరువాత సభవాయిదా వేయటం జరిగింది. దీనినే, డెప్యూటీస్పీకర్ , శాసనసభా వ్యవహారాలమంత్రి చర్చ ప్రారంభమయినట్లుగా ప్రకటించటం అసంగతం.

శ్రీశ్రీధర్ బాబు చేసిన హైజాక్ చాలా కుట్రతో కూడినది. దీనికి ప్రతిచర్యగానే, కిరణ్ శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాలశాఖను వెనక్కులాక్కోవలసి వచ్చింది.

బిజినెస్ ఎడ్వైజరీ కమీటీ వారు చర్చప్రారంభం కావటానికి ఏతేదీని, ఏ ప్రొసీజర్ ను నిర్ణయించారు? ఈవిషయంలో అస్పష్టతలున్నాయి. ఈకమీటీ సమావేశంలోనే ,సభలో చర్చప్రారంభం అయ్యింది అని మనోహర్ ప్రకటించటం, ఆలూ లేదు చూలూ లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్లుగా తయారయింది.

సభలో చర్చ ప్రారంభం కావటానికి వైయస్ ఆర్ పీ పార్టీ, తెలుగుదేశం వారి అభ్యంతరాలను స్పీకర్ పట్టించుకోకపోవటంతో, వారు సభనడవటానికి ఆటంకం కల్పిస్తున్నారు. సభలో మెజారిటీ సభ్యులు సమైక్యతనే కోరుకుంటున్నప్పుడు, బిల్లుపై చర్చ జరగటం అసందర్భం అవుతుంది. ఈవిషయాన్ని ధృవపరుచుకోటానికి స్పీకర్ రహస్యబ్యాలెట్ ద్వారా వోటింగ్ తీసుకుంటే, అక్కడికా కార్యక్రమం అయిపోతుంది.

బిల్లుపై వోటింగ్

కేంద్రం బిల్లులోని అంశాలను మాత్రమే చర్చించమంది, అందులోని ఎంపికచేసిన 10 అంశాల సవరణలపై మాత్రమే వోటింగ్ తీసుకోమంది కాబట్టి అంతకుమించి సభ ఏమీ చేయకూడదు, అనటంలో అర్థం లేదు. బిల్లు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని దానిని ముందుకు తీసుకు వెళ్ళాలా వద్దా అనే విషయంపై వోటింగ్ జరుపుకునే హక్కు శాసనసభకు ఎలాగూ ఉంటుంది. బిల్లులో ఏమి ఉన్నా ఉండకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని శాసనసభ్యులు కోరుకోటంలో తప్పు లేదు. ఆవిషయంలో ముందు వోటింగ్ జరిగినా నష్టమేమీ లేదు. అప్పుడు చర్చించకుండానే, బిల్లును తిప్పి పంపటంకూడ సమంజసమే అవుతుంది.

చర్చవల్ల కూడ నష్టం లేదు

రెండు వోటింగులు జరిగిన తరువాత కూడ బిల్లులోని మేలు కీడులను చర్చించ వచ్చును. సవరణలను ప్రతిపాదించుకోవచ్చు. సవరణలపై వోటింగులు తీసుకోవచ్చు. ముందు జరుపుకున్న సమైక్య తీర్మానం తప్పుఅనిపిస్తే , బిల్లు తిరస్కరణ తీర్మానం తప్పు అనిపిస్తే, ఆరెండు తీర్మానాలను తిరిగి చర్చించుకొని, మరల వోటింగ్ తీసుకోవచ్చు. ప్రతిదానికీ రహస్యబ్యాలెట్ మెరుగుగా ఉంటుంది.

లిఖిత అభిప్రాయాల సేకరణ ఎంతవరకు సమంజసం?

తప్పేమీలేదు. కానీ దీనిని చర్చ అనలేము. అభిప్రాయాల మార్పిడీ జరగాలి. సభలో గందరగోళం వల్ల పావుగంటకూడ సభ నడవనపుడు, అభిప్రాయాల మార్పిడీ ఎలాజరుగుతుంది?

ఆధునిక సాంకేతికను వినియోగించుకోవచ్చు

అసెంబ్లీ వెబ్ సైట్ లో బిల్లుపై చర్చకు ఒకప్రత్యేక థ్రెడ్ ప్రారంభించుకోవచ్చు. ప్రతి సభ్యుడికి యూజర్ ఐడీ, పాస్ వర్డ ఇస్తే సభ్యులు తమ అభిప్రాయాలను ఆథ్రెడ్ లో నమోదు చేయవచ్చు. ఆఅభిప్రాయాలకు ఇతర సభ్యులు ఆథ్రెడ్ లోనే తమ తమ ఐడీలతో జవాబు ఇచ్చుకోవచ్చు. సవరణలు ప్రతిపాదించుకోవచ్చు. వాటిపై సైట్ ఎడ్మినిస్ట్రేటర్ స్పీకర్ వోటింగ్ అక్కడే తీసుకోవచ్చు. హైదరాబాదులో ఇన్ ఫోసిస్, టీసీఎస్, మహేంద్ర, కాగ్నిజెంట్, వంటి ఎన్నో ఐటీ సంస్థలున్నాయి. సాంకేతిక సమస్యలకు వారి సహాయం తీసుకోవచ్చు. ఎన్ఐసీ, సీడాక్, సిఎమ్ సీ వంటి ప్రభుత్వ సంస్థలు, జెఎన్ టీయు వంటి వారి సహాయం తీసుకోవచ్చు. కోరిక ఉంటే మార్గాలు దొరుకుతాయి.

సామరస్యపూర్వక విభజన సాధ్యమా?

సాధ్యమే. మన అదృష్టం ఏమిటంటే, ఇంతవరకు సభలో భారీ కొట్లాటలు, హత్యలు జరగలేదు. బాంబు పేలుళ్ళుకూడ జరగలేదు. కానీ, ఇవి జరగకూడదని ఏమీ లేదు. మార్షళ్ళు, పోలీసు అధికారులు, ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఏదో ఒక సమయంలో, ఇవి జరగచ్చు. నెట్ ద్వారా చర్చలు, సవరణలు, వోటింగులు, ఈసమస్యలను చాలా వరకు పరిష్కరిస్తాయి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.