Friday, November 8, 2013

#048 SUGGESTION OF SHRI KISHORE CHANDRA DEV శ్రీ కిషోర్ చంద్రదేవ్ గారి సూచన పరిశీలన

#048 SUGGESTION OF SHRI KISHORE CHANDRA DEV శ్రీ కిషోర్ చంద్రదేవ్ గారి సూచన పరిశీలన కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు తమ లేఖలో ప్రస్తావించారని చెప్పబడుతున్న రెండు మూడు విషయాలు మనం తప్పక చర్చించ వలసినవి:--

సీమాంధ్రుల మధ్య అత్యంత కలహకారకమైనది: రాజధాని ఎక్కడ అనే ప్రశ్న.కిషోర్ చంద్రదేవ్ గారి ప్రకారం రాష్ట్ర రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండనవసరం లేదు. ఈభావం సరి యైనది కాదు. రాష్ట్ర రాజధానులైనా, దేశరాజధానులైనా, వీలైనంత వరకు, భౌగోళికంగా మధ్యలో ఉండి, రవాణా సౌకర్యాల కలిగి ఉండాలి.

ఎందుకంటే సామాన్య ప్రజలకు కార్లు, హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. వారు బస్సుల్లో, రైళ్ళల్లో తిరగాలి. వీలైనంత వరకు రాజధానిలో అదేరోజు పనిని పూర్తి చేసుకొని రాత్రి 11 గంటలలోపున కనీసం తన స్వంత మండల కేంద్రానికి వచ్చిపడి, అక్కడ ఏమడత మంచమో అద్దెకు తీసుకొని తెల్లారి లేచి తన పొలం లోకి పనికి వెళ్ళ గలగాలి. గ్రామీణులు, నగరాల్లో హోటళ్ళగదుల కిరాయిలను భరించ లేరు.

అనంతపురం వారికి విశాఖ షుమారు 700 km. వారు నల్లమల అడవులలో బడి విశాఖ వెళ్ళేదెలా, తిరిగి వచ్చేదెలా. అందు వల్ల రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం తప్పనిసరి.

కేంద్ర మంత్రిణిలు పురందరేశ్వరి, పనబాక లక్ష్మి మొ|| విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పాట అందుకున్నారు. గుంటూరు విజయవాడ నగరాలు ఇప్పటికే అతిగా పెరిగి భూకబ్జాలకు అడ్డాలుగా మారాయి. ఇంక అక్కడ రాజధానిని నెలకొల్పితే, ఆహా సొగసు చూడతరమా!

ఒంగోలు లో కూడా భూధంధాలు మొదలయ్యాయి.

కర్నూలును మొత్తం సీమాంధ్ర రాజధానిగా పెట్టటంలోనూ రెండు ప్రధాన సమస్యలు వస్తాయి.

మొదటిది. గుంటూరు కర్నూలు రోడ్, రైలుమార్గం దుస్థితి.

రెండవది. కర్నూలు లోకి కోస్తాంధ్రుల వలసలు తప్పదు. దీనికి తట్టుకోలేక రాయలసీమ ప్రజలు కూడా భవిష్యత్ లో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరవలసి ఉంటుంది. ఆ పనేదో ఇప్పుడు చేయటం లాభం. క్రొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాలను విడదీయటం అనేది రోజూ జరగవు. 10 ఏళ్ళకో, 25 ఏళ్ళకో గానీ ఆఅవకాశాలు రావు. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి. వీలైనన్ని ప్రత్యేక రాష్ట్రాలను రాబట్టుకోవాలి. వీలైనన్ని ప్రత్యేక ప్యాకేజీలను, కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాబట్టుకోవాలి.

ఒక చివర ఉండటాన విశాఖ కోస్తాంధ్ర మొత్తం రాష్ట్రానికి రాజధానిగా పనికి రాదు. అలాగని మనం ఉత్తరాంధ్ర వారి న్యాయపూరితమైన కోరికలను త్రోసిపారేయకూడదు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, వంటి ప్రదేశాలు కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గా అవతరించటం అభిలషణీయం.

ఒంగోలు కేంద్రంగా దక్షిణాంధ్ర కూడ వాంఛనీయమే.

పెద్ద నగరాలు ఉగ్రవాద పేలుళ్ళకు స్థావరాలుగా మారుతున్న విషయం మనకు ఆఖరు సారిగా పాట్నా గాంధి మైదానం పేలుళ్ళు రుచితో తెలిసింది. కేంద్రం ఇంటెలిజెన్సు సమాచారం పంపించామంటుంది. రాష్ట్రాలు అందలేదంటాయి. 15 లక్షలు జనాభా దాటిన నగరాల నన్నిటిని కేంద్రం తన అధీనంలోకి తీసుకొని, ప్రత్యేక పోలీసు, నిఘా, దర్యాప్తు సంస్థలను ఏర్పరుచు కోవటం అవసరం. ఈవిధానంలో భాగంగా, హైదరాబాదును UT గా మార్చి తెలంగాణాకు వరంగల్ లేక సంగారెడ్డి లను రాజధానిగా పెట్తే, నగర వివాదం పరిష్కారం అవుతుంది.

రాష్ట్రాన్ని పలు చిన్నరాష్ట్రాలుగా విభజించే విషయాన్ని నేను సీమాంధ్ర ఎంపీలు పలువురికి ఈమెయిళ్ళుగా పంపాను. దురదృష్ట వశాత్తు వారినుండి ఏ స్పందనా లేదు.

చిన్న రాష్ట్రాలను ఏర్పరచేటపుడు, కనీస వైశాల్యం, కనీస జనాభా ఎంతఉండాలి అనే విషయాలపై శాస్త్రీయ అధ్యయనాలు అవసరం.

తెలుగు వాళ్ళకు ఇంకో 50 సంవత్సరాల అశాంతి పొంచి ఉన్నట్లే కనిపిస్తుంది. ఇదంతా చెన్నారెడ్డి, ఇందిర, సోనియా, కెసీఆర్, రాజశేఖర్, జగన్, బాబు, చిరు , వంటి నేతల స్వార్ధ రాజకీయాల ఫలితమే కాదా?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.