Thursday, November 19, 2015

605 Part 1 of How to make Telugu an International Language? तॆलुगु भाषा को एक अंतर्जातीय भाषा कैसा बनाना. భాగం 1, తెలుగు భాషను ఒక అంతర్జాతీయ భాషగా గ్లోబలైజ్ (ప్రపంచీకరణ) చేయటం ఎలా?

Link to part 2 of this post: Click to go to Part 2 (post No. 627).
తెలుగును అత్యంత గాఢంగా ప్రేమించే తెలుగు మిత్రుడు ఒకరు ఈ రోజు నన్ను కలిసి తెలుగులో వ్రాయమని కోరగా , నాలో చెలరేగిన అలల అక్షర రూపమే ఈ బ్లాగ్ పోస్టు.


తెలుగు భాష నిజంగా అంతర్జాతీయ భాష కావాలంటే మనకు ఏమి అవసరం అనే విషయం పై నేను గతంలో వార్త దినపత్రికలో ఒక వ్యాసాన్ని వ్రాసినట్లు నాకు గుర్తు. ఇపుడు నేను దాని లింకును ఇవ్వలేను కానీ, అందులో వ్రాసిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. పూర్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు శ్రీ చంబానా గారికో లేక శ్రీ వైరాశే రెడ్డిగారికో ఈ ప్రార్ధనలను పంపాను. అవి చెత్తకుండీకి వెళ్ళిఉంటాయని వేరే వ్రాయనక్కర లేదు.


వాటిలో కొన్నిటిని ఇక్కడ క్లుప్తంగా వ్రాస్తాను. పాఠకులు నాతో ఏకీభవించాలనే నిర్బంధమేమీ లేదు. పైగా తీవ్ర విమర్శలు కూడ చేయ వచ్చు. పాఠకులు నన్ను తీవ్రంగా విమర్శించాలనుకుంటే ఇక్కడ కామెంట్లను వ్రాస్తే అవి నాకు మాత్రమే కాక ఇతర తెలుగు వారికి కూడ చేరతాయి. వారు కూడ మీతో కానీ నాతో కానీ ఏకీభవించాల్సిన పనిలేదు. ప్లూరలిజం అనే మన బహుళత్వంలో ఒకళ్ళ అభిప్రాయాలను మరొకరు తీవ్రంగా విమర్శించుకుంటూనే మన్నించుకోటం ఒక మంచి సంప్రదాయమని నేను నమ్ముతాను.

సూచనలు.


౧. తెలుగును రోమన్ స్క్రిప్టు (ఇంగ్లీషు ఏబీసీడీల లిపిలో వ్రాయాలి). దీర్ఘాలకు, రెట్రోఫ్లెక్స్ ట, డ లకు, ణ కు, ళ కు, మొ|| వాటికి ఆంగ్ల పెద్ద అక్షరాలను వాడుకోవచ్చు. దీని వల్ల ఇతర భారతీయులకు, ఇతర అన్నిఖండాల వాసులకు తెలుగు లిపిని అంటే 56 x 14 x 38 అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు నేర్చుకునే బాధనుండి తప్పించి వారంతా తెలుగు నేర్చుకోటాన్ని ప్రోత్సహించినవాళ్మవుతాము. దీనిని తెలుగు భాషా ప్రేమికులు అంగీకరించినా , అంగీకరించకపోయినా, అమలు చేసినా చేయక పోయినా, యూనికోడ్ యూటిఎఫ్ ౮ రాక ముందు **పోర్నో శృంగార ప్రేమికులు ఏచర్చలు లేకుండానే చక్కగా అమలు చేశారు**. వారు వ్రాసిన బూతు కథలు గూగిల్ అన్వేషణలో చక్కగా ప్రతిఫలించి తెలుగును అంతర్జాతీయ భాషగా చేశాయి.

అయితే యూటీఎఫ్ ౮ వచ్చాక తెలుగు ను టైప్ చేయటం తేలికయింది. వెబ్ పేజీలు కూడ తేలికగా తెలుగును గార్బేజీలాగా కాకుండా సుందరమైన గుండ్రటి అక్షరాలలో చూపిస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని బ్రౌజర్లు గుణింతాలను ఒత్తులను సరిగా చూపటం లేదు. ఇపుడు తెలుగు వాళ్ళు యూటీఎఫ్ ౮ కి అలవాటు పడి రోమన్ లిపిలో తెలుగును నెట్ లో పెట్టటానికి స్వస్తి చెప్పటం నాకు కొంత విచారాన్ని కలిగించింది.

అదృష్ట వశాత్తూ యూటీఎఫ్ ౮ లో టైపు చేయబడిన తెలుగు పదాలు, వాక్యాలు, గూగిల్ సర్చిలో కూడ వెతకుడు లో విజయాలు సాధిస్తున్నాయి. అయితే తెలుగు వాళ్ళకు తెలుగు టైప్ చేయాల్సిన ప్రతిచోటా కీబోర్డు సమస్యలు ఉన్నాయి. ప్రక్క ప్రక్కన అక్షరాలను టైపు చేసుకుంటూ పోయే లిపి అయితే, తెలుగును టైప్ చేయటం తేలికవుతుంది. గుణింతాలను, ఒత్తులను వాటి ముందు ఉండే అక్షరాలతో కలపటానికి అదనపు కోడింగు అవసరం కావటం వల్ల తెలుగు కీబోర్డులు ముందుకు వెళ్ళటం లేదు. లేఖిని.కామ్ వంటి వారు జావా స్క్రిప్టులో కొంత కృషిచేసి, దానిని స్థానిక కంప్యూటర్లలో సేవ్ చేసుకోటానికి అనుమతించటం, ఆఫ్ లైన్ లో ఎలాటి ఇన్స్టాలేషన్లు లేకుండానే వాడుకోవటానికి వీలు కలిగించటం, అభినందించాల్సిన విషయం.

వదలని విండోస్ , అనూ ఫాంట్స్ దాస్యం


తెలుగు వాళ్ళలో ౯౫% మంది విండోస్ కు, అనూ ఫాంట్స్ కి దాసులు. విండోస్, అనూ ఫాంట్స్ రెండూ కూడ మనల్ని పైరేటెడ్, పెరేటెడ్ అని బెదిరిస్తూ ఉంటాయి. విండోస్ ౮ లో తెలుగు కీబోర్డు సౌకర్యం ఉన్నా, మన తెలుగు వాళ్ళ పలు ఇళ్ళలో ఇంకా విండోస్ ఎక్స్ పీ నడుస్తున్నది. ఎమ్. ఎస్. వర్డ్ వాడాలన్నా తెలుగు వాళ్ళలో అధిక సంఖ్యాకులు పైరేటెడ్ వెర్షన్లే వాడుతున్నారు. అనూ ఫాంట్లను వాడాలనుకునే వాళ్ళకు డాంగిల్సును కొనుక్కోటం, సంపాదించుకోటం మరొక కష్టంగా పరిణమించింది.


బారాహా, సీ డాట్ వంటి వారివి కొన్ని బహు భారతీయ భాషా సాఫ్ట్ వేర్లు ఉన్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.


గూగిల్ ఈ మెయిల్ లో తెలుగు టైపింగ్ ఒకటి ఉంది. కానీ అది ఆన్ లైన్ లో మాత్రమే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.


మనకి పైరేటింగు మీద ఉన్న ప్రేమ స్వతంత్రం, నీతి, నిజాయితీల మీద లేకపోటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.

ఓపెన్ సోర్స్ లైనక్సు అపరేటింగ్ వ్యవస్థలలో భారతీయ భాషలకు సపోర్టు


లైనక్సును వాడటం వల్ల మనం గరుత్మంతుడు వినతా దాస్యానికి విముక్తి కలిగించినట్లుగా మనం తెలుగు భాషను పైరేటెడ్ సాఫ్టు వేర్లనుండి, అనూ ఫాంట్ల, విండోస్ , ఎమ్ ఎస్. వర్డ్ దాస్యం నుండి విముక్తి కలిగించ వచ్చు. **
ఓపెన్ సోర్సు వల్ల మూడు లాభాలు. ౧. పై**సా ఖర్చులేకుండా అన్నీ నిజంగానే ఫ్రీ (మన్మోహన్ సింగ్ గారి, మోడీ గారి, జైట్లీ గారి సిధ్ధాంతానికి వ్యతిరేకం). విండోస్ లో దొరికే ప్రతిదీ మనకి లైనక్సు లో దొరుకుతాయి.


౨. **కోడ్ కూడ రహస్యం లేకుండా మనకి బహిర్గతం **చేయటం వల్ల తెలుగు భాష అవసరాలకు తగినట్లుగా మన బీ. టెక్కులు దానిని మన తెలుగు అవసరాలకు తగినట్లుగా పునర్నిర్మించి పునః పంపిణీ చేయచ్చు.


౩. లైనక్సులో వైరస్ లు చాల తక్కువ.


౪. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల పాలయి జీతాలివ్వలేని స్థాయికి చేరుకుంది. ఇంకా విండోస్ కి, ఎమ్ ఎస్ వర్డ్ కి, అనూ ఫాంట్లకి వేలు, లక్షలు, కోట్లు ఎందుకు తగలేయటం.

Link to part 2 of this post: Click to go to Part 2 (post No. 627).
ఇంకా ఉంది. భాగం ౨ రేపు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.