Monday, July 7, 2014

291 Left leaders can never behave like Regional leaders


291 వామ పక్షనేతలు ప్రాంతీయనేతల వలె మాట్లాడటం వామపక్ష సిధ్ధాంతాలకు వ్యతిరేకం.
చర్చనీయాంశాలు: 291, వామపక్షాలు, రాయలసీమ, సిపిఎమ్, సిపిఐ, కోస్తా, రామ్ టెక్


ఆంధ్ర ప్రదేశ్ సీపీఎమ్ ప్రధానకార్యదర్శి, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ బివిరాఘవులుగారు ''ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు '' అనే సభలో అన్నట్లుగా పత్రికలలో వచ్చిన వార్తను చూడండి.''...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే అయినప్పటికీ, అక్కడి ప్రజలకు సమన్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ...''

English gist: "...Though Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Opposition Leader Jaganmohan Reddy, both belong to Rayalaseema, there is no faith that justice will take place to those people. ..."వైబీరావు గాడిద అభిప్రాయాలుఈ మాటలు ఒక ప్రాంతీయ పార్టీ నేత మాట్లాడవలసినవే కానీ, అఖిల భారత పార్టీకి చెందిన నేత మాట్లాడవలసినవి కాదు. ముఖ్యంగా వామ పక్షనేతలు మాట్లాడ వలసినవి కాదు.

అఖిలభారత పార్టీల నేతలు ప్రాంతీయ సమన్యాయం కొరకై కృషి చేయటంలో, వాదించటంలో తప్పు లేదు. కానీ, ముఖ్యమంత్రులు ఒక ప్రాంతానికి చెందిన వారు కాబట్టి వారు ఆప్రాంతానికి దోచిపెట్టటం, అభివృధ్ధి ప్రాజెక్టులను మళ్ళించటం సరియైన పధ్దతి కాదు. ఇలాంటి తమ నియోజక వర్గాలకు నిధులను , ప్రాజెక్టులను దోచిపెట్టే పధ్ధతిని అమలు చేసి, మనకి ఆదర్శంగా ఉండాల్సిన అగ్రనేతలైన సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు, తమతమ నియోజక వర్గాలలో తమ విజయాలను ఖాయం చేసుకున్నారు , కానీ తాము చేస్తున్న విద్రోహం తమను ప్రాంతీయ నేతల స్థాయికి దిగజారుస్తున్న సంగతి మర్చిపోయారు.
ఈ పధ్ధతులకు స్వర్గీయ పివి నరశింహారావు కొంత మినహాయింపు గా ఉండేవారు. అందుకే, ఆయన ఒకే నియోజక వర్గం నుండి రెండు సార్లు గెలవటం కష్టమైపోయి మహారాష్ట్ర రామ్ టెక్ నుండి పోటీ చేసినట్లు గుర్తు.


నిజంగా అఖిల భారత నేతగా జీవించటం వేరు, నటించటం వేరు


శ్రీ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండగా, కొందరు తెలంగాణ నేతలు ఆయనను కలిసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అడుగగా, నేను భారత దేశానికి మంత్రిని కానీ, తెలంగాణకు మంత్రిని గాను అన్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత ఆమహనీయుడే, తనకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బంగారు పళ్ళెంలో లభిస్తుందనే ఆశ కలిగే సరికి ప్రాంతీయనేతగా మారిపోయి ప్లేటు మార్చేశాడు.

వామ పక్షాలకు వామ పక్షాల సిధ్ధాంతాలు ప్రాధాన్యం కావాలి, ప్రాంతీయ రెచ్చ గొట్టుడులు కాదువామ పక్ష పార్టీల ప్రధాన సిధ్ధాంతం సామ్యవాదం. ఇందులో కీలకం ప్రైవేటు ఆస్తిని నిర్మూలించటం. ధనం యొక్క పాత్రను సమూలంగా పెరికి వేయటం. అసమానతలను కూకటి వేళ్ళతో పెకలించటం. ప్రాంతీయవాదం పై దృష్టి పెరిగిన కొద్దీ మూలసిధ్ధాంతం మూల పడుతుంది. దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్ వలెనే, కమ్యూనిస్టులు కూడ మైనారిటీ వోట్లకోసం తహతహలాడుతూ కొంత మతాన్ని నెత్తిన రుద్దుకోటం జరుగుతున్నది. ఫలితంగా, హిందువులందరు, బిజెపి దిశగా వెళ్ళటం జరిగింది. కమ్యూనిజం ప్రకారం మతం అనేది పేదలు తమ బాధలను మర్చిపోవటానికి పెట్టుబడిదారులు వాడే మత్తు మందు. భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తులు, గుడులు, చర్చీలు, మశీదులు మొ|| ప్రార్ధనా మందిరాలు కట్టిస్తుంటే, పేదలు వాటిలోకి వెళ్ళి ఉన్నాడో లేడో నిర్ధారించబడని దేవుడిని ఎలుగెత్తి ప్రార్ధించుకుంటూ, తమ కష్టాలు ఏనాటికైనా తీరతాయిలే అనే ఆశతోనే చివర రోజులు గడపటం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు మతాన్ని ఇంటిలోపల జరిగే ప్రార్ధనలకే పరిమితం చేయించే దిశలో ప్రజలకు నచ్చచెప్పాలి. దీని వల్ల సామూహిక స్థలాలలో మతవైషమ్యాలు పెరగవు.

ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేది కూడ భూస్వాములు, పెద్ద వర్తకులు, పారిశ్రామిక వేత్తలు, ఘరానా డాక్టర్ లాయర్ యాక్టర్ వంటి ప్రొఫెషనల్సే. వామపక్షాలు వీటికి దూరంగా ఉండాలి. ఉదాహరణకు, సిపిఐ శ్రీనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో అతిగా పాల్గొని చివరికి ఏమి సాధించారు? ఆంధ్రలో వామ పక్షాల స్థితి ఎలా ఉందో తెలంగాణలో కూడ అలానే ఉంది. శ్రీరాఘవులు గారు ఈ సత్యాన్ని గ్రహించక పోతే ఎండమావులలో నీళ్ళున్నాయనుకుని పరుగెత్తి సృహ కోల్పోయి నట్లవుతుంది. శక్తియుక్తులను ప్రాంతీయ, కుల, మత, స్థానిక సమస్యలపై వృధా చేసుకోకుండా, ఏకోన్ముఖంగా కృషి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న: వామ పక్షాల ఐక్యత అవసరమా?


దేశంలో ఒకటే వామ పక్షం (లేక వామ పక్షాల ఫ్రంటు) ఉంటే ప్రజలు దానితో అసంతృప్తి చెందితే ఎవరికి పట్టం కట్టాలి? బెంగాల్ లో జరిగిందిదే. ప్రధాన ప్రతి పక్షం కూడ వామ పక్షమే అయితే, ఎవరు గెలిచినా కర్షక కార్మిక వర్గమే అధికారంలోకి వస్తుంది కాబట్టి, శ్రామిక వర్గ నియంతృత్వం (dictatorship of proletariat) సాక్షాత్కారమవుతుంది. అందుకని శ్రీ ప్రకాశ్ కారత్ గారు, శ్రీ సీతారాం ఏచూరి గారు, శ్రీరాఘవులు గారు, శ్రీ నారాయణ గారు, ఈ వామ పక్షాల ఐక్యత, ఒకే తాటి క్రిందికి రావాలి అనే అరిగిపోయిన రికార్డును వదిలేసి వామపక్షాలమధ్యే ప్రధానపోటీ అనే కొత్త సిధ్ధాంతానికి ఊపిరి పోయాలి. భూస్వామ్య పార్టీలను, పారిశ్రామికవేత్తల పార్టీలను, రంగంనుండి తప్పుకునేలాగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి.

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లా లు రాయలసీమ కన్నా ఎక్కువ అభివృధ్ధి చెందాయా?జవాబు: ఇది ఒక భ్రమ. ఈనాలుగు జిల్లాలలో జనాభా వత్తిడి అధికంగా ఉండటం వల్ల, గ్రామాలు దగ్గర దగ్గరగా ఉండటం, గ్రామాలు పట్టణాలుగా మారటం జరిగినందు వల్ల, వీధిలైట్లూ, ఇళ్ళల్లో లైట్లూ ఎక్కువగా వెలుగుతూ ఉండటం, జనాభాకు తగినట్లుగా అధిక సంఖ్యలో దుకాణాలు ఎక్కువగా ఉండటం, రహదారుల వెంట ధాబాలు, వైన్ షాపులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఏదో అభివృధ్ధి జరిగిందన్న భ్రమ కలుగుతుంది. ఇళ్ళు, జనం ఎక్కువగా ఉంటే అభివృధ్ధి జరిగింది, ఇంక ఈప్రాంతంలో పేదలు లేరు, లేక ఈపేదలకు ఏమీ చేయనక్కరలేదు అనుకుంటే, అది ఘోర తప్పిదమవుతుంది.

ఈమధ్య నేను, బాగా అభివృధ్ధి చెందిన జిల్లాలుగా ముద్రబడిన తూగోజీ, పగోజీ లలోని అమలాపురం, తణుకు పట్టణాలలో ఇళ్ళు , అపార్టుమెంట్ల నిర్మాణాలపై ఒక సర్వే చేశాను. దానిలో బయట పడిన విషయం విస్మయకరమైనది.

దేశంలో వ్యవసాయయోగ్యమైన భూమికి కరువుగా ఉన్నందున, అందులోను గోదావరి డెల్టా వంటి గ్యారంటీ సాగునీరు ఉన్న భూములకు డిమాండు విపరీతంగా ఉన్నందున భూముల ధరలకు, కౌళ్ళకు రెక్కలు వచ్చాయి. కొన్ని చోట్ల ఎకరం కోటి రూపాయల దాకా పోయింది. కాని వరిసాగు చేస్తే బురదలోకి తాము దిగాల్సిరావటం భూస్వాములకు, మధ్యస్థాయి రైతులకు రుచించలేదు. వారు తెలివిగా, తమ భూములలో ఒక ఎకరాని అధిక ధరకు అమ్ముకొని కొన్ని లక్షలరూపాయలు వస్తే, వాటిలో ఒక 20 లక్షలు దాకా ఖర్చు చేసి తణుకు, అమలాపురం, భీమవరం, రావులపాలెం, రాజమండ్రి వంటి పట్టణాలలో, ఫ్లాట్లు, ఇండిపెండెంట్లు ఇళ్ళు తీసుకొని పిల్లలను ఘరానా ప్రైవేటు స్కూళ్ళలో చేర్చి , ఇంట్లో ఏసీలు బిగించుకొని ఘరానా జీవనం మొదలు పెట్టారు. పొలం అమ్మిన డబ్బులను వడ్డికి తిప్పుతూ, లేక బ్యాంకుల్లోనో, చిట్ ఫండ్లలోనో వేసి నెలవారీ వడ్డీ తింటం, నెలకు 6 వేలు 7 వేలు వచ్చే ఇస్త్రీ గుడ్డలు నలగని ఉద్యోగాలు, వృత్తుల్లోకి దిగటం జరుగుతున్నది. గ్రామాలలో, మిగిలిన పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలురైతులు కౌలు చెల్లించలేక చస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఋణ మాఫీలు వంటివి ఇస్తే వాటిని కూడ పట్టణాల లోని యజమానులు స్వాహా చేస్తున్నారు.

కోస్తా జిల్లాలలోని (కొందరు) భూస్వాములకి, వ్యాపారులకి, పారిశ్రామిక వేత్తలకి మన చంద్రబాబు నాయుడిగారాలాగా, నరేంద్రమోడీగారి లాగా '' షో '' ఎక్కువ, కోతలు ఎక్కువ, పని చేయటం తక్కువ. సినిమా రంగంలోకి వాళ్ళు ప్రవేశించి, థియేటర్లను గుత్తగా కొని, లేక కిరాయికి తీసుకోటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం, ఏసీ నాన్ వెజ్ హోటళ్ళు, ఫిలిమ్ సిటీలు, హోయ్ హోయ్ ఎమ్యూజ్ మెంటు పార్కులు కట్టటం, రీయింబర్స్మెంటు కాలేజీలు కట్టటం, డొనేషన్లు కట్టి పిల్లలను డాక్టర్లు చేయించటం, మొ|| నానావిధ టక్కుటమార విద్యలలో వాళ్ళు రాటు తేలిపోయారు. అందు వల్లనే చంద్రబాబుగారు ఇలాగా 'రాజధాని విజయవాడ సమీపంలో ఉంటుంది' అనగానే భూములు నాలుగు రెట్లుపెరిగాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే లక్షణం ఎక్కువ.

ఈ లక్షణాలన్నీ పేట్రేగి పోయినపుడు కోస్తా జిల్లాలలో అందరూ ధనవంతులే, అనే అభిప్రాయం కలగక మానదు. సత్యం తత్ విరుధ్ధం. రాయలసీమలో వలెనే, ఉత్తరాంధ్రలో వలెనే, తెలంగాణలో వలెనె, మధ్యాంధ్రలో, దక్షిణాంధ్రలో కూడ దరిద్రం తాండవిస్తున్నది. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అనే స్వభావం వల్ల, ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత బయట పడటం లేదు.

కాబట్టి వామ పక్షాలు తమ కమ్యూనిస్టు సిధ్ధాంతాల కనుగుణంగా ప్రైవేటు ఆస్తి నిర్మూలనకు, అన్ని వ్యాపారాలను, పరిశ్రమలను ప్రభుత్వరంగంలోనే నడిపి, ప్రతి పౌరుడికి తిండి, గుడ్డ, క్వార్టర్స్, ఫ్రీ ప్రయాణం, వృధ్ధాప్యంలో భద్రత, పని చేసే శక్తి ఉన్నవారందరికి పని గ్యారంటి, ఖాళీగా ఉండకుండా పనిచేయాల్సిన బాధ్యత (పెట్టుబడి దారీ విధానంలో డబ్బుంటే సోమరిగా తిరగచ్చు) వంటి సరియైన సిధ్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి.

ప్రభుత్వం ప్రతిదీ ఉచితంగా ఇస్తే, ధరల పెరుగదల అనే ప్రసక్తే ఉండదు. అసలు ధరలే ఉండవు. ఇంక ధరల పెరుగదలకి వ్యతిరేకంగా ఉద్యమాల అవసరం ఉండదు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కా?ముందుగా కొంత చరిత్ర. తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలి అనే ఉద్యమం షుమారు 1913 ప్రాంతంలో బాపట్లలో ప్రారంభం అయినపుడు, రాయలసీమ వారికి చెన్నై దగ్గరగా ఉండేది కాబట్టి, వారు ఉద్యమంలో పాల్గొనటానికి ముందుకు రాలేదు. నాటి రాయలసీమ నేతలు రాయలసీమకు రాజధానిని డిమాండుచేయటం వల్ల, శ్రీబాగ్ ఒప్పందం జరిగి, రాయలసీమకు రాజధానిని వాగ్దానం చేయటం జరిగింది. దానిని నిలుపుకోటం కొరకు కర్నూలు లో రాజధానిని, గుంటూరులోహైకోర్టును నెలకొల్పుకోటం జరిగింది. నిన్ని మొన్న పేపర్లో వచ్చిందాన్ని బట్టి ఆకాలంలో కూడ భూస్పెక్యులేటర్లు రాజధాని ఉంటుందనుకున్న విజయవాడ, గుంటూరు, కర్నూలుల లో ధంధాలకు దిగి భూముల రేట్లను పెంచి వేయటం జరిగిందట.

ఆకాలంలో మీటర్ గేజీ గుంటూరు నుండి ధోన్ కి రైలు. అక్కడనుండి ధోన్ నుండి కర్నూలుకి రైలు. అన్నీ పొగబండ్లే. గుంటూరు కర్నూలు మధ్య రోడ్డు ప్రయాణం వాగులు, వంకలు, అడవులు, దొంగలతో భీబత్సంగా ఉండేవి. ప్రజలు, నేతలు, అధికారులు సీమ నుండి కోస్తాకి ప్రయాణాలలో నానా బాధలు పడి ఉంటారు.

మంత్రి పదవుల కొరకు, కీలక శాఖలపై పట్టుకొరకు భూకులాల మధ్య కుమ్ములాట జరిగి ఉండాలి. ఎందుకంటే, చిత్తూరు జిల్లాలోని భూకులానికీ, పగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాలోని భూకులానికి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండాలి. అనంతపురం, కర్నూలు భూకులాల వారు, తెలంగాణ అగ్ర భూకులంతో సంబంధం కలిగి ఉండాలి. మొత్తానికి ఈ కులాల మధ్య ఇంబ్యాలెన్స్ లో ఏమిజరిగిందో గానీ, ఉమ్మడి రాష్ట్ర అగ్ర భూకులం వారు తమ పెత్తందారీ తనం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినట్లు కనిపిస్తుంది. ఆతరువాత తెలంగాణలోని రెండవ అగ్రభూకులానికీ, మొదటి అగ్రభూకులానికీ, చిత్తూరు & మధ్య కోస్తాలోని అగ్రభూకులానికి హైదరాబాదులోని భూముల కబ్జా కొరకు ,సెటిల్ మెంట్ల కొరకు కుమ్ములాటలు మొదలయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేకాంధ్ర ఉద్యమం, మరల రెండవ తెలంగాణ ఉద్యమం లేచాయి. దీనికి సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ల, అరుణ్ జైట్లీల స్వార్ధం తోడయి సయామీస్ కవలలని వాళ్ళు చావుదెబ్బతినేలాగా విడతీసినట్లయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు అనే నినాదం సరియైనది కాదు (శ్రీబాగ్ ఒప్పందమే సరియైనది కాదు). అప్పుడే రెండు రాష్ట్రాలను (ఆంధ్ర, రాయలసీమ) కోరుకొని, ఉద్యమాలు చేసుకొని, కర్నూలు, విజయవాడ రాజధానులుగా రెండు రాష్ట్రాలను ఏర్పరుచుకుని ఉంటే ఎవరికి వారు ఈనాటికి ఎంతో కొంత అభివృధ్ధి సాధించే వాళ్ళు. రెండు రాష్ట్రాల అవతరణలు కొంత ఆలస్యం జరిగినా మొత్తానకి పని అయ్యేది. ఒక భార్యా భర్తలకు ఇద్దరు పిల్లలు ఉండకూడదని లేదు కదా. అలాగే ఒకే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు.

17 జిల్లాల సీమాంధ్రకు రాజధాని కావటానికి ఇఛ్ఛాపురం , శ్రీకాకుళం నుండి కల్యాణదుర్గం, రాయచోటి వరకు, తడ, సూళ్ళూరు పేటల వరకు ప్రతి పట్టణానికి అర్హత ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారి, రైలు సౌకర్యం ఉన్నవాటికి ఇంకా ఎక్కువ అర్హత ఉంది. ఈకోణంలోంచి చూస్తే గుత్తి , గుంటకల్, కర్నూలు, రేణిగుంట, కడప, ప్రొద్దటూరు, మైదుకూరు, ఒంగోలు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాజమండ్రీ, తాడేపల్లిగూడెం, ఏలూరు, (ఈలిస్టు నేను పూర్తి చేయలేను) అందరూ అర్హులే. కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతులే కాదు. ఈనాలుగు నగరాలూ ఎందుకు అనర్హాలు అంటే, ఇక్కడ ఇప్పటికే జనాభా విపరీతంగా పెరిగిపోయి ఇసకేస్తే రాలటంలేదు. లక్షరూపాయలకు సూదిమొనంత స్థలం కూడ లభించటం లేదు. లక్షరూపాయలు పెట్తే మనం విజయవాడలో, మంగళగిరిలో, గుంటూరులో ఒక చెట్టును కొనగలమేమో అనే పరిస్థితి వచ్చింది.

లేదా డజన్ల కొద్దీ ఉన్న ఈ నగరాల్లో ఏనగరమూ అర్హం కాకపోవచ్చు.

రాయలసీమలో ఎక్కడ రాజధాని పెట్టినా వలస సమస్య వస్తుందిరాయలసీమలో ఎక్కడ రాజధానిని పెట్టినా లక్షలాది మంది నిరుద్యోగులు ఆపట్టణానికి (మాట వరసకి కర్నూలు) వలసవెళ్తారు. కనీసం ఇడ్లీబండి వేసుకునో, పండ్లమ్మి బతకచ్చనో, అందరూ రాయలసీమ రైళ్ళు ఎక్కుతారు. ఈ వలస దిగుమతులను రాయలసీమ వారు తట్టుకోలేరు. అప్పుడైనా వారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం, కోస్తా ఆంధ్రులు గోబ్యాక్, అని స్లోగన్లు ఇచ్చి మరల కొందరు యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపించవలసి వస్తుంది. తరువాత ఈ కోస్తాంధ్రుల నందరిని కర్నూలునుండి ఎలా గెంటి వేయాలా అని ఆలోచించే, కెసీఆర్, హరీష్ రావు, కెటీఆర్ వంటి ప్రబుధ్దులు తయారవుతారు.

కోస్తా భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కర్నూలు (లేక కడప లేక ఏదైనా) లో విపరీతంగా భూములు కొని, కబ్జాలు చేసి, కొత్త నగరాన్ని నిర్మిస్తారు. కానీ అదే సమయంలో రాయలసీమ భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు గుండెకోత మొదలవుతుంది. ముల్కీలు, పెద్దమనుషుల ఒప్పందాలు, కోర్టుతీర్పులు, వంటివి నాలుక గీచుకోటానికి కూడ పనికిరావు. ఇంక వీళ్ళే కాక, బెంగుళూరు, చెన్నయి, ముంబాయి, ఢిల్లీ నుండి కూడ పెట్టుబడిదారులు కూడ వచ్చి కర్నూలులో వాలతారు. కర్నూలు నగరం , నేటి హైదరాబాదు లాగానే రావణాకాష్టం లాగా మారుతుంది. ఉదాహరణకి కుమారి జయలలిత గారికి హైదరాబాదులో భూములు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆమె కర్నూలులో భూములు కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకోటేమిటంటే, ఈరోజు ఎకరం 20 లక్షలు చేసే భూమిని కర్నూలు రైతు కోటి రూపాయలు వస్తుందని అమ్ముకున్నా తరువాత దుఃఖమే మిగులుతుంది. తరువాత ఆభూమి వందకోట్లు అవుతుంది. అయ్యో నేను కోటికి అమ్ముకున్నానే అని ఆరైతు వంశానికి చెందిన వారంతా బాధ పడాలి.

చంద్రబాబు గారు కమ్మ, కాపు కులాల మధ్య సమతౌల్యాన్ని సాధించారా?అలాగని పత్రికలలో వచ్చింది. తన కులంవారు లేకపోతే చంద్రబాబు బ్రతకలేడు. అలాగని కాపుల మద్దతు పొంది నిలుపుకోక పోతే, ఈసారి వనవాసమే గతి అవుతుంది. అందుకని ఆయన తనకులానికి, తన మద్దతుదారులకు పెద్దపీట వేస్తూనే, కాపులను సంతృప్తి పరుస్తున్నట్లుగా నటించాడు. నిజానికి చంద్రబాబు పార్టీకి 29.1% వోట్లు వస్తే జగన్ కి 28.9% సీట్లు వచ్చాయి. తేడా కేవలం రెండు శతాంశ పాయింట్లే. కానీ, సీట్లలో 35 సీట్లదాకా తేడా వచ్చింది. అంటే ప్రజాదరణలో ఇరువురికీ పెద్ద తేడాలేదు. అయితే జాగ్రఫికల్ స్ప్రెడ్ లో తేడా ఉంది. నేనేం జగన్ అభిమాని నేమీ కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాగా తయారయిందే అనే చింత కాల్చి వేస్తున్నది. పీపుల్ గెట్ దీ గవర్నమెంట్ దే డిజర్వు అని సర్దుకు పోవాలేమో. పీపుల్ గెట్ దీ ఆపోజిషన్ దే డిజర్వు అని కూడ వ్రాసుకోవచ్చు.

సరియైన స్లోగన్ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు (ఇది కాదు,కింద చూడండి.).
మెరుగైనది:

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాయలసీమకూ హక్కు.

ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితులను చూస్తుంటే, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమలు, బేషరతుగా కలసి ఒకే రాష్ట్రంగా కొనసాగటం దాదాపు అసాధ్యం. వచ్చే పదేళ్లలో మనం ఎన్నో ఉద్యమాలను, బందులను చూడాల్సి రావచ్చు.

ఏ ప్రాంత పట్టణాన్ని రాజధాని చేసినా మిగిలిన వాళ్ళు బందులు మొదలుపెట్తారు. బస్సులను కాలుస్తారు (తెలుగు వాళ్ళకి చేతైన మహావిద్యలలో బస్సులను కాల్చటం గొప్పది).ఏకైక మార్గంపదేళ్ల తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించి స్టేడియాలను ఆక్రమించుకొని, మూసేసిన సినిమా హాళ్ళను, ఇంజనీరింగు కాలెజీలను టెండర్లు పిలిచి లీజుకు తీసుకుని, తక్షణమే, పాలనను నార్మల్ టెంపరేచర్ కి తేవటం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , శాసనమండలి, సమావేశమయి మూడురాష్ట్రాలను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపి, చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి, చిరంజీవి, మొ|| వారందరు ఢిల్లీ వెళ్ళికూర్చుని చెప్పులు అరగతీసుకొని (నేను నా చేతివేళ్ళను, లాప్ టాప్ కీ బోర్డును, స్క్రీన్ ను అరగతీస్తున్నట్లుగా) మూడు ప్రత్యేక రాష్టాల ఏర్పాటు బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో వీలైనంత తొందరగా, గతంలో వాడిన ఆర్టికిల్ 3 ప్రకారమే పాస్ చేయించుకోటం చేయాలి.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమైనా నిధులను విదిలిస్తే, వాటిని మూడు ప్రాంతాల్లో మూడు పట్టణాలకు కొత్త రాష్ట్రాలజనాభా దామాషాలో పంచుకొని నిర్మాణాలను మొదలు పెట్టుకోటం. మూడు పట్టణాలలోనూ, రాష్ట్రస్థాయికార్యాలయాలను ఏర్పాటు చేసుకొని అంతిమ విభజనకు స్నేహపూర్వకంగా, సర్వసన్నధ్ధంగా ఉండటం.

ఈనాటి స్లోగన్కలలో, కథల్లో నైనా కలిసి ఉండటం చేతకాని వాళ్లు, స్నేహపూర్వకంగా, పూర్తి స్థాయి ముందస్తు వ్యూహంతో విడిపోటం నేర్చుకోవాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.