Saturday, July 5, 2014

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?
289 తెలుగు ప్రజల భవిష్యత్ తన్నుకోటమేనా? దానికి మనం ముగింపుపాడలేమా?
చర్చనీయాంశాలు: 289, తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమ, రాజధాని, హరీష్ రావు, కెటిఆర్, కెసిఆర్

సీమాంధ్ర ప్రజలపై శ్రీ కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ లు పగబట్టినట్లుగా కనిపిస్తున్నది. వాళ్ళు నోరు తెరిస్తే సీమాంధ్ర ప్రజలపై విషం కక్కుతున్నారు. వారి ప్రతిచర్య యొక్క గమ్యం, తెలంగాణ అభివృధ్ధి కన్నా, సీమాంధ్ర ప్రజలను వేధించటమే లక్ష్యం గా కనిపిస్తుంది. వారికి, శ్రీచంద్రబాబునాయుడికి మధ్య పాత పదవీ కుళ్ళు ఏదైనా ఉంటే ఉండవచ్చు. అలాంటివేమైనా ఉంటే వాళ్ళూ వాళ్ళూ చూసుకోవాలి. హైదరాబాదులో శ్రీ చంద్రబాబుకి బినామీ ఆస్తులు ఉన్నాయనీ, తాను ముఖ్యమంత్రి అయితే వాటన్నిటినీ బయట పెడతామనీ గతంలో కెసీఆర్ అన్నారు. ఇపుడా పని చేయవచ్చు కదా? జగన్ అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపై చర్య తీసుకోవచ్చు కదా? శ్రీచంద్రబాబు గారు కూడ కెసీఆర్ ధంధాలను బయట పెడతానన్నారు. ఆపని చేసి తెలంగాణ ప్రజలను రక్షించ వచ్చు కదా. చేయరెందుకు?

కెసీఆర్ కుటుంబం, ఒకే ప్రాంతం ప్రజలపై పగబట్టినట్లుగా వ్యవహరించటం సమంజసం కాదు. ఈవిషయంలో, కేంద్ర హోమ్ మంత్రి గారు ఇరు ప్రాంతాల వారిని తన్నుకోవద్దని సలహా ఇచ్చారే కానీ, పార్లమెంటులో తమ రాజకీయ స్వార్ధం కోసం, అతిఘోరమైన తడిగుడ్డతో గొంతును కోసే విభజన బిల్లును పాస్ చేయించి, సీమాంధ్ర ప్రజలను హైదరాబాదులో సరియైన కార్యాలయం లేని వాళ్ళుగా రోడ్డున పడేయటంలో, అఖిల భారత బిజేపి నేతలయైన తమకు, అఖిల భారత కాంగ్రెస్ నేతలకు పాత్ర ఉందని మర్చిపోయారు. ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తనను తెలంగాణకు చిన్నమ్మగా చెప్పుకోటాన్ని మర్చిపోరాదు.

ఇపుడు కెసీఆర్ భారత్ లో తెలంగాణను ఒక నిజాం రాజ్యంగా మార్చేశాడు. భారత దేశం ఒక దేశం, ఈ దేశంలో ప్రజలు ఎక్కడనుండి ఎక్కడకైనా పొట్టకోసం వలస వెళ్ళవచ్చు, పరిమితికి లోబడి చిన్న చిన్న ఆస్తులను సమకూర్చుకోటానికి రాజ్యాంగం అనుమతిస్తున్నది, అని ఆయన మర్చిపోయాడు. నియంత్రించ వలసిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాలు అనేవి స్వతంత్ర దేశాలు కావు. ఒక రాష్ట్రంలో ఉండే భూమి అంత ఆ ఒక్క రాష్ట్ర ప్రజలది కాదు. ఆభూమి మొత్తం భారత దేశానికి చెందినవి. ఒక నగరానికి వచ్చిన వివిధ ప్రాంతాలవారు, అక్కడ వివిధ రకాల పన్నులను చెల్లిస్తున్నప్పుడు, ఆ పన్నులతో చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ఫలితాన్ని అందరూ అనుభవించాలి తప్ప, ఆప్రదేశంలో 1956 కు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. ఈ దేశంలో అందరూ ముల్కీలే. తెలంగాణా ముల్కీలనీ, సీమాంధ్రముల్కీలని, బీహార్ ముల్కీలని, ఉత్తరప్రదేశ్ ముల్కీలని ప్రత్యేకంగా ఉండరు.

కెసీఆర్ -హరీష్ రావు-కెటీఆర్ ల ప్రవర్తన, రైల్లో టవలు పరుచుకొని సీటుని ఆక్రమించుకొని పండుకున్నవాళ్ళు, మిగతావాళ్ళను గెంటి వేయటానికి బోగీతలుపులు వేయటానికి ప్రయత్నించినట్లుగా ఉన్నది.
తెలంగాణలో బండిలాగే కూలి వాడి కొడుక్కి సీమాంధ్రనుండి వచ్చినా, బీహార్ నుండి వచ్చినా, ఝుంజున్ను నుండి వచ్చినా, వాళ్ళు 1956 ముందు వచ్చారా తరువాత వచ్చారా అనేదానితో సంబంధం లేకుండా సర్వసమాన ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వాల్సిందే. అందరూ ముల్కీలే. ఇక్కడ నిజాం రాజ్యంలేదు.

కేంద్ర ప్రభుత్వానికి ఈ మౌలిక సూత్రం మీద విశ్వాసం ఉంటే, వెంటనే కెసీఆర్ దుష్ట చర్యలను నలిఫై చేస్తూ , రాజ్యాంగ పరిస్థితిని స్పష్టం చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి. లేకపోతే , దేశంలో, ప్రతిరాష్ట్రంలోనూ కెసీఆర్ లాంటి నిజాములు తయారయి, స్వంత రాజ్యాలను నెలకొల్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకుంటే, సోవియట్ యూనియన్ వలె , భారత్ కూడ విఛ్ఛిన్నం బాట పట్టే అవకాశం ఉంది.

తోటకూర దొంగిలించిన నాడే పిల్లవాడికి మంచి చెడు నేర్పితే, వాడు మంచి పౌరుడుగా రూపు దిద్దుకునే అవకాశం ఉంటుంది. బాగా చేసావురా అని మెచ్చుకుంటే, తాను చేస్తున్న పని సరియైనదే అనుకొని అతడు మరీ పేట్రేగి పోయే అవకాశం ఉంది.

కేంద్రానికి దేశప్రజలు ఎక్కడినుండి ఎక్కడకైనా స్వేఛ్ఛగా వలస పోవచ్చు, అక్కడి ప్రజలతో సమానంగా జీవీస్తూ, హక్కులను, బాధ్యతలను రెండిటినీ స్వీకరిస్తూ సంచరించే హక్కు ఉన్నది అనే మౌలిక సూత్రం పై నమ్మకం లేక పోతే ఆవిషయమే స్పష్టం చేస్తే బాగుంటుంది. సీమాంధ్ర ప్రజలు ఏనుయ్యో గొయ్యో చూసుకుంటారు.

దీనిని , ఎవరి మనోభావాలైనా దెబ్బతింటున్నాయో గమనించి తిరగ వ్రాయవలసి ఉన్నది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.