చర్చనీయాంశాలు: బంగారం, చండీగఢ్, ఘజినీ , లోక్ సభ, పంజాబ్, అక్షయతృతీయ
216 భారత్ పై దాడి చేయమని ఘజినీ మొహమ్మద్ ను ఎవరు ఆహ్వానించారు?
ఈ ప్రశ్నను స్కూళ్ళ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఒక స్కూల్ టీచరు విద్యార్ధిని అడిగాడట.
ఆ విద్యార్ధి తలగోక్కొని ''నేను కాదండీ '' అన్నాట్ట.
టీచరు ఆవిద్యార్ధిని కొట్టబోతే, స్కూళ్ళ ఇన్స్పెక్టర్ నవ్వి వాడి మొహం, వాడి కేమి తెలుసులే, వాడేలే ఆహ్వానించింది, కాకపోతే పూర్వ జన్మలో, అన్నాట్ట.
భారతీయులకి పూర్వ జన్మ మీద, రాబోయే జన్మమీద నమ్మకం ఎక్కువ.
క్రీస్తు శకం 1000 ప్రాంతంలో ఘజినీ ముహమ్మద్ భారత్ మీద దండెత్తాడు. ఈస్కూలు పిల్లాడు, క్రీస్తుశకం 1000 లో ఏజన్మ ఎత్తి ఉంటాడని ఆ స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అన్నాడు? అసలు తాను క్రీస్తు శకం 1000లో ఏజన్మ ఎత్తి ఉంటానని ఆస్కూళ్ళ ఇన్స్పెక్టర్ అనుకున్నాడు?
ఘజినీ మహమ్మదును భారత్ పై దండెత్తమని ఆహ్వానించింది, భారత్ వద్ద, ముఖ్యంగా భారతీయ దేవాలయాల్లో బంగారం, నవరత్నాల మూటలున్నాయనే బహిరంగ రహస్యమే. అంతే కాని పిల్లకాయలు కాదు.
ఘజినీ ఒకసారితో ఊరుకోలేదు. 17 సార్లు దండెత్తాడు. వచ్చిన ప్రతిసారీ గాడిదలపై మణుగులకొద్దీ బంగారాన్ని కొల్లగొట్టుకెళ్ళాడు. ప్రతిసారీ గుజరాత్ సోమనాధ దేవాలయ పూజారులు మా దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అని వాడిని శపిస్తూ ఉన్నారు, కానీ వాడికేమీ జరగలేదు. ఒకసారి ఘజినీని రాజస్థాన్ థార్ ఎడారిలో దారి తప్పిద్దామని ప్రయత్నించారు. వాడు జరిగింది గ్రహించి వెనక్కి వచ్చి, తలా నాలుగు తగిలించి, ఇంకా ఎక్కువ బంగారాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళాడు.
నాటినుండి నేటి వరకు భారతీయులకి బంగారం పిచ్చి తగ్గలేదు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బంగారం కొనుగోలుదారు, దిగుమతిదారు. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం వర్తకులకు పండుగే.
2014 ఎన్నికలలో అభ్యర్ధులు ఎన్నికల కమీషన్ కు సమర్పించిన నామినేషన్లలోని అఫిడవిట్లను చూడండి. ఎవరి దగ్గరా 500 గ్రాములకి తక్కువ ఉండదు. అగ్రస్థానం ఉక్కు దిగ్గజం, బొగ్గు మశి నిందితుడు నవీన్ జిందాల్ గారిదే, వీరు కురుక్షేత్ర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారుట. 10కిలోల పైన బంగారం, 50 కిలోల పైన వెండి ఉన్నవారు కూడ పలువురు ఉన్నారు. దైనికభాస్కర్ అనే హిందీ పత్రిక వారు ఇట్టి బంగారుతండ్రులు, బంగారు తల్లుల లిస్టులను, ఫొటోలను నెట్ లోపెట్టారు. ఆపత్రిక వారికి మనం జేజేలు చెప్పాలి. ప్రఖ్నాతనటి, లోక్ సభ సభ్యురాలు శ్రీమతి జయప్రదగారి రక్షకుడు శ్రీ అమర్ సింగు గారు కూడ స్వర్ణపురుషుడే.
పైచిత్రంలోని బంగారు తల్లి ఎవరో మీరు కనుక్కోవాలంటే, దైనికభాస్కర్ పత్రికలో పై వార్తకు అనుబంధంగా ఉన్న ఫొటోలను చూస్తే గుర్తుపట్టచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.