Monday, April 28, 2014

215 High Court Stay against arrest of Shri K.V.P. Ramachandra Rao శ్రీ కెవిపి రామచంద్రరావు అరెస్టుపై హైకోర్టు స్టే.

శ్రీ కెవిపి రామచంద్రరావు , రాజ్యసభ సభ్యుడిపై, అమెరికాలో లంచం కేసు తెరపైకి రావటం, ఆయన అరెస్ట్ కు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ పంపటం , దీనిపై రాష్ట్రంలో రెండు పత్రికలు ప్రత్యేక శ్రధ్ధచూపటం, ఒక పత్రిక వ్యతిరేక శ్రధ్ధ చూపటం, విజ్ఞులైన పాఠకులకు తెలిసినదే. ఈసందర్భంగా శ్రీ కెవిపి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ జడ్జి గారు స్టే విధించటం నేటి వార్త. ఈపిటీషన్లో నివేదించబడిన శ్రీ కెవిపి తరఫు న్యాయవాది తయారు చేసిన వాదనలు అర్ధవంతంగానే ఉన్నాయి. ఒక విషయం తప్ప. నేరం 2006 కాలానికి సంబంధించినది కాబట్టి దానికి కాలదోషం పట్టిందని.

సరే, న్యాయవాదులు పలువురి నమ్మకం ఏమిటంటే, తాము ఎన్నిరకాల వాదనలైనా చేసి తమ క్లయింటును రక్షించుకోవాలని, ఆయన మెప్పు పొందాలని. అయితే సత్యం ఏమిటంటే, భారత్ లో క్రిమినల్ నేరాలకు కాలదోషం అంటూ ఏమీ ఉండదు. సాక్ష్యాలు రూపు మాసిపోనంత కాలం, అవి నిందితులను వెంటాడే అవకాశం ఉంది. లేదంటే, నిందితులు ఏదో తంటాలు పడి నేరాలకు కేసులు బుక్ కాకుండా కాలదోషం పట్టిస్తూ రోజులు గడిపి, ఆనందిస్తూ ఉంటారు.

ఈసందర్భంగా మరొక విషయం కూడ ప్రస్తావనార్హం. న్యాయం జరగటమే కాకుండా, పారదర్శకం జరిగినట్లుగా ఉండాలి. ఈ కేసును సింగిల్ జడ్జి కాకుండా, కనీసం ముగ్గురు జడ్జీలు ఉన్న హైకోర్టు బెంచి చేపట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే, సింగిల్ జడ్జీల తీర్పులలోకి వ్యక్తిగత నమ్మకాలు అనైఛ్ఛికంగా జొరబడే అవకాశం ఉంది. అంతే కాకుండా, నేడు దేశంలో ఉన్న వాతావరణంలో, నిందితులు న్యాయమూర్తులను ప్రలోభాలకు గురి చేయటానికి ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలో శ్రీ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో, సిబిఐ కోర్టున్యాయమూర్తిని ప్రలోభానికి గురి చేయటానికి ప్రయత్నించటం, ఆ అవినీతి కేసు ఇంకా నడుస్తూ ఉండటం గమనార్హం. ఇలా ప్రతిసారీ జరుగుతుందని కాదు. ప్రతి న్యాయమూర్తి ప్రలోభాలకు గుర అవుతారని కాదు. ముందు జాగ్రత్తల వల్ల అడుసు తొక్కటం , కాలు కడగటం తప్పుతుందని నా గాడిద నమ్మకం. బెంచి సైజు పెరిగినపుడు, ఎక్కువమందిని ప్రలోభ పెట్టటం కష్టమవుతుంది అనేది కూడ కొన్ని సమయాలలో మాత్రమే నిజం.

కేసు యొక్క విషయం సంక్లిష్టమయినది. భారత్ లోని అవినీతి విషయంలో, భారత్ కన్నా విదేశీయులు శ్రధ్ధ వహించటం గమనార్హం. మనదేశంలో కన్నా విదేశాల్లో శిక్షలు కఠినంగా ఉండటం, విచారణకు తక్కువ సమయం తీసుకోటం, మెడికల్ సర్టిఫికెట్ లు, పేరోళ్ళ పాత్ర తక్కువగా ఉండటం వల్ల, ఎక్స్ట్రాడిషన్ అంటే, భారతీయ నిందితులకు కొంత భయం ఉంది. భారతీయ కోర్టులు, కేవలం నిందితులు భారతీయులు కాబట్టి, వారిని రక్షించాలనే దృష్టితో కాక, న్యాయం యొక్క అంతిమ లక్ష్యం పై దృష్టి పెట్తే బాగుంటుందేమో. భారతీయ కోర్టులు కొంతమేరకు అంతర్జాతీయ న్యాయసూత్రాలను , ఆచారాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి సాంకేతికంగా క్లిష్టమైన పనిని కొన్ని సమయాలలో సింగిల్ జడ్జీ సమర్ధవంతంగా నిభాయించుకోలేక పోవచ్చు. ఎమికస్ క్యూరీ ల (న్యాయస్థానానికి సహాయకులు) అవసరం పడచ్చు.

భారతీయ కోర్టులలో విచారణ జరిగితే ఎక్కువ న్యాయం జరుగుతుంది, విదేశీ కోర్టులలో జరిగితే న్యాయం జరగదేమో అనే అభిప్రాయానికి ఎంతమేరకు వెయిట్ ఇవ్వవచ్చో నేను వ్రాయలేను. ఏది ఏమైనా, ఈవిషయాన్ని మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేక వారి నేతృత్వంలో ని కాలేజియం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు కాలేజియం సు మోటూగా (తమంత తామే ) పరిశీలిస్తే బాగుంటుంది. దీర్ఘకాలిక చర్యగా, కీలక విషయాలలో సింగిల్ జడ్జీల విచారణలను తగ్గిస్తే బాగుంటుంది.

ఈనాటి పాట


చిత్రం: తెనాలి రామకృష్ణ.


చేసేది ఏమిటో చేసేయి సూటిగా
చేసేయి బాగా ఈ కోటలో. చేసేది..|| 2 సార్లు||

ఎన్ని కష్టాలు రానీ, నష్టాలు రానీ,
నీమాట దక్కించుకో బాబయా.. || 2 సార్లు ||
బాబయ్యా.. చేసేది..||

నాటేది ఒక్క మొక్క, వేసేది నూరు కొమ్మ

కొమ్మ కొమ్మ విరబూసి వేలాదిగా, ..ఆ..||2 సార్లు||
ఇక కాయాలీ బంగారు కాయలు
భోం చేయాలి మీ పిల్లకాయలు ..||2 సార్లు|| చేసేది||

రహదారి వెంట మొక్క నాటి పెంచరా,
కలనాడు, లేనినాడూ నిన్ను తలచురా... ||2 సార్లు||
భువిని తరతరాల నీపేరు నిలచురా
పని చేయువాడే ఫలము నారగించురా. చేసేది||


లోక్ సభ అభ్యర్ధులలో బంగారు తండ్రి , వెండి కొండ, ఎవరు?


జవాబు: శ్రీ నవీన్ జిందాల్. కురుక్షేత్ర లోక్ సభ నియోజక వర్గ అభ్యర్ధిగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వీరి వద్ద 17 కిలోల బంగారం, 54 కిలోల వెండి ఉందిట. అంతా వోటర్లకు ఇస్తారని కాదు, నిజంగా ఇస్తే మన వోటర్లకు సరిపోతుందా. శ్రీకృష్ణతులాభారంలో సత్యభామ తన ఏడు వారాలనగలను, తండ్రి ఇచ్చిన రోజుకు ఏడుబారువుల బంగారాన్ని పుట్టించే శమంతకమణిని కాటాలో వేసినా శ్రీకృష్ణుడిని తూచలేక పోయింది. రుక్మిణీ దేవి సమర్పించిన, ఒక తులసీదళం సరిపోయింది.

To continue. सशेष. ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.