Wednesday, March 5, 2014

169 Lok satta

169 Corruption-free parties is a sweet-dream అవినీతి లేని పార్టీలు అనేది ఒక తీయని కల. చర్చనీయాంశాలు: లోక్ సత్తా,జయప్రకాశ్,పవన్ కల్యాణ్,ఎన్నికలు

నైతిక పతనం అంచుల్లో లోక్ సత్తా మరియు దాని నేత జయప్రకాశ్


రాజకీయాల్లోకి ప్రవేశిస్తే లోక్ సత్తాలోకి స్వాగతమని లోక్ సత్తా నేత శ్రీజయప్రకాశ్ నారాయణ్ సినీ హీరో పవన్ కల్యాణ్ ని ఆహ్వానించటం లోక్ సత్తా దిగజారబోతున్నదని సంకేతం ఇస్తుంది.

ఇక్కడ శ్రీపవన్ కల్యాణ్ ఉత్తముడా, మధ్యముడా, అల్పుడా అనేది ముఖ్యం కాదు. లోక్ సత్తా ప్రవచిత రాజకీయ సిధ్ధాంతాలేమిటి? పవన్ కల్యాణ్ ప్రవచిత రాజకీయ సిధ్ధాంతాలేమిటి? రెండిటి మధ్య ఏమైనా పోలికలున్నాయా?

ఎవరు ఎవరిని అప్రోచ్ కావాలి? లోక్ సత్తా సిధ్ధాంతాల మీద గౌరవం ఉంటే శ్రీ పవన్ కల్యాణ్, ఆపార్టీ కేంద్ర కార్యాలయాన్ని తాను పార్టీలో చేరాలనుకుంటున్నాని తెలియచేయాలి. ఆయన లోక్ సత్తా సిధ్ధాంతాలకు అనుగుణంగా ఎంత మేరకు పనిచేయగలడు అనే విషయం పై తగిన వారు దానిని చర్చించాలి. ఆతరువాత శ్రీపవన్ కల్యాణ్ ను దరఖాస్తు చేయమని కోరవచ్చు. లేదా అప్పటికే దరఖాస్తును ఇచ్చి ఉంటే పార్టీలోకి చేర్చుకోవచ్చు.

లోక్ సత్తా పార్టీ శ్రీ పవన్ కల్యాణ్ ను తమ పార్టీలో చేరే విషయాన్ని పరిశీలించమని అర్ధిస్తున్నదంటే మోకరిల్లుతున్నట్లు లెక్క.

నేటి తెలుగు సినీ రంగం దుస్థితి

నేడు తెలుగు సినీరంగం దుస్థితి చూస్తే పాషాణ హృదయులు కాని వారికి మనసు బాధ కలుగక తప్పదు. దీనిని సంస్కరించటం ఏ ఒక్క హీరోకు సాధ్యం కాదన్న మాట నిజమే. అయితే హీరోలలో రెండు రకాల వారున్నారు.

బి కేటగిరీ హీరోలు


ఇంకా నిలదొక్కుకోక బ్రతుకుతెరువుకై బాధలు పడేవారు. వీరు నిర్మాతలు, దర్శకులు చెప్పినట్లు డాన్స్ చేయాల్సిందే. స్వేఛ్ఛ లేని వారు. ఇలా వ్రాయటాన్ని బి కేటగిరి హీరోలు, వారి అభిమానులు అవమానంగా భావించరాదు.

ఏ కేటగిరీ హీరోలు


సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నవారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ మొ|| వారిని రెండవ తరగతిలో వర్గీకరించవచ్చు. దీనికి కొలబద్దలుగా వారు ఒక సినిమాకు ఎంత ఛార్జి చేస్తున్నారు, వారి సినిమా మొదటి వారం ఎన్ని థియేటర్లలో విడుదల అవుతున్నది అనే అంశాలను తీసుకోవచ్చు.

వీరు సినీ రంగాన్ని కొంత మేరకైనా సంస్కరణల బాటను పట్టించ గల సమర్ధులు. కానీ వీరు సినీరంగాన్ని సముధ్ధరించటానికి తమ వంతుగా చేసింది ఏమిటి? ఏమీ లేదు. తామున్న, తమకు బాగా తెలిసిన, సినీరంగంలోనే తమ పాత్ర సరిగా నిర్వహించలేని వారు, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను, కేంద్ర ప్రభుత్వాల పాలనను ఎలా చక్క పెట్టగలుగుతారు.

అవకాశాలను వినియోగించుకోలేక పోతున్న లోక్ సత్తా


బలవంతంగా, అమానుషంగా సీమాంధ్రపై విభజనను రుద్ది కాంగ్రెస్ తన ఉనికినే కోల్పోయే దశకి వచ్చింది. సీమాంధ్రలో బిజెపికి మొదటినుండి ఉనికి లేదు. రాష్ట్రవిభజనలో కాంగ్రెస్ తో కుమ్మక్కైనాక ఆపార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారాలి. ఆరెండు పార్టీల వారూ భారీ పోలీసు రక్షణ లేకుండా, జనంలో తిరిగే పరిస్థితి లేదు. అందుకే, శ్రీ వెంకయ్య నాయుడు గారు వ్యాపార వర్గాలను ఆశ్రయిస్తున్నారు.


ఈఖాళీని నింపటానికి లోక్ సత్తాకు ప్రథమ అవకాశం దక్కాలి. లక్షకోట్ల అవనీతి జగన్, వెన్నుపోట్ల చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు దూరంగా కూర్చో బెట్ట వలసిన సమయం వచ్చింది. వారి స్థానంలో లోక్ సత్తాకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అసంతృప్తులైన సీమాంధ్ర ప్రజలు అవకాశాల నివ్వాలి. శ్రీ పవన్ కల్యాణ్ కి కొన్ని లక్షల మంది వోట్లు వేసే అభిమానులు ఉన్నారనుకున్నా లోక్ సత్తా వంటి పార్టీలలో చేరటానికి కావాల్సిన సైధ్ధాంతిక బలం లేదు.

లోక్ సత్తా కు ఆత్మ పరిశీలన అవసరం


ప్రజలలో లోపం వల్ల వారు లోక్ సత్తాను గెలిపించక పోతుంటే దానికి బాధపడాల్సిన అవసరం లోక్ సత్తాకు ఉండకూడదు. తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించాము అనే తృప్తి కొరకు వారు ప్రయత్నించాలే తప్ప సినీ నటులను ఆశ్రయించి గెలవాలను కోకూడదు. సినీ నటులను ఆశ్రయిస్తే బిజెపికి, కాంగ్రెస్ కి లోక్ సత్తాకు తేడా ఏమి ఉంటుంది?

ప్రజలలో లోపాలను సరిచేయటం లోక్ సత్తా విథి

ప్రజలలో లోపాలను (తాగుడు, మద్యం సీసాలు తీసుకొని వోట్లు వేయటం, పెళ్ళాం పిల్లలను కొట్టటం, కులాల కొట్లాటలు, వినోదం పేరుతో పిచ్చి సినిమాల కోసం డబ్బు వృథా చేసుకోటం మొ||) సరిచేయటం ప్రజల స్వంత బాధ్యతో అయినా, మంత్రసాని తనం ఒప్పుకున్నాక పిల్ల వచ్చినా పట్టాలి, మలం వచ్చినా పట్టాలి అన్నట్లుగా, స్వఛ్ఛంగా ఉండాలనుకునే రాజకీయ పార్టీలకు అదనపు బాధ్యతలు ఉంటాయి.

గుర్రాలకు గాడిదలకు మధ్య ఉండే, ఉండాల్సిన తేడా ఏమిటో నిరూపించుకోవలసిన బాధ్యత లోక్ సత్తా పార్టీపై, ఆ పార్టీనేత శ్రీ జయప్రకాశ్ నారాయణ పై తప్పక ఉంటుంది. లేకపోతే ఆయన గాడిదల జాబితాలో చేరిపోతాడు.

స్పష్టీకరణ

నేనిలా వ్రాస్తున్నాను కాబట్టి లోక్ సత్తా పార్టీనో, ఆమ్ ఆద్మీ పార్టీనో సమర్ధిస్తున్నానని భావించ వలదు. మన లక్ష్యం సత్యశోథన, సత్వసాధన. వేరొండు కాదు.

ఈనాటి పాట

శ్రీ కృష్ణ పాండవీయం. కొసరాజు. టి.వి.రాజు. ఘంటసాల


వచనం: అపాయమ్ము దాటడాని కుపాయమ్ము కావాలీ
అంధకార మలమినపుడు వెలుతురుకై వెదకాలీ
ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
పాట: మత్తువదలరా… నిద్దుర మత్తువదలరా !! మత్తు వదలరా !!
ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదువురా…!! మత్తు వదలరా !!

వచనం: జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు… !! జీవితమున !!
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు…
అతినిద్రాలోలుడు, తెలివిలేని మూర్ఖుడు !! అతినిద్రాలోలుడు !!
పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు !!
పాట: మత్తు వదలరా !!

వచనం: సాగినంత కాలం నా అంతవాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలము తోటే ఘనకార్యం సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు !!
పాట: మత్తు వదలరా !!

పాట: చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట్ బూనుమురా !! చుట్టు ముట్టు !!
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టమురా…
కర్తవ్యము నీవంతు, కాపాడుట నావంతు !! కర్తవ్యము !!
చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీఖర్మం !!
పాట: మత్తు వదలరా !!

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.