Friday, February 21, 2014

151 Jennifer Lopez's inner fears and inhibitions

151 Challenges of fears జెన్నిఫర్ లోపెజ్ గారి భయాలు
చర్చనీయాంశాలు: jennifer lopez, జెన్నిఫర్ లోపెజ్, భర్తృహరి, భయాలు, ఫోబియాలు, మానసిక ఆరోగ్యం, పని వాతావరణం, work environment

ఈనాటి చిత్రంప్రఖ్యాత హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ గారు రోజుకి 24 గంటలు పని చేస్తారుట.

రాత్రంతా ఫోన్ చేస్తూ ఉంటుందట.

కారణం: భయంట.

ఏమి భయం: తన స్థానం కోల్పోతాననే భయంట.

స్థానం ఎందుకు కోల్పోటం?

జెన్నిఫర్ లోపెజ్ గారికి 44 ఏళ్ళుట. ఈసంవత్సరం ''అమెరికన్ ఐడల్'' అనే షో కి న్యాయ నిర్ణేతగా ఆమె పునఃప్రవేశం చేసిందట. శలవు, విశ్రాంతి తీసుకుంటే ఆనౌకరి, గౌరవస్థితి పోతుందని భయంట.

ఈనాటి శ్లోకం


భర్తృహరి వైరాగ్య శతకం 31వ పద్యం

భోగే రోగభయం కులే చ్యుతిభయం విత్తే నృపాలాద్భయం
మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్‌ ।
శాస్త్రే వాదిభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్భయం
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్య మే వాభయమ్‌

తెలుగు సారం


భోగిస్తే రోగం వస్తుందని భయం(ఉదా: హెచ్ ఐ డీ ఎయిడ్స్). కులంలో ఉంటే వెలి వేస్తారనే భయం. డబ్బు ఉంటే రాజునుండి భయం (నాటి కాలంలో రాజు గుంజుకోటం, నేటి కాలంలో పన్నులు లేక ఏసీబీ అధికారులు లేక ఆదాయపు పన్ను అధికారులు). గౌరవం ఉన్నవాడికి ఆ గౌరవం పోయి దీనుడనౌతాననే భయం, బలం కలవాడికి శత్రువుల భయం. అందగాడికి ముసలితనం భయం (అందుకే జుట్టుకి రంగు వేసుకోటం మొ||). శాస్త్ర జ్ఞానం కలవాడికి వాది భయం (ఆకాలంలో ఎవరైనా వాదించి తనను ఓడిస్తారనే భయం. ఈకాలంలో సెమినార్లలో తను చెప్పిందాన్ని ఎవరైనా ఛాలంజి చేస్తారనే భయం). సజ్జనుడికి దుష్టుల వలన భయం. శరీరం ఉన్నవాడికి ఆశరీరం నాశనం అవుతుందన్న భయం (అంటే చావు భయం). ఇలాగా ప్రతి వస్తువూ భయంతో నిండి ఉంటుంది. ఈభూమి పై భయం కలిగించని వస్తువు ఒకటే, వైరాగ్యం.

వైబీరావు గాడిద వ్యాఖ్య


వైరాగ్యం కలవాడికి ఆవైరాగ్యం పోతుందనే భయం ఉంటుంది. మహాత్మా గాంధీగారికి ఈభయం ఉండేది. అందుకే ఆయన యువతీ మణుల ప్రక్కన నగ్నంగా పండుకొని తన వైరాగ్యాన్ని పరీక్షించుకునేవాడు, అనే అభిప్రాయం ఉంది. ఈభయం గాంధీగారికే గాక చాలా మంది మునులకు సాధువులకు ఉండేది. అందుకే '' ఇనుప కచ్చడాల్ కట్టిన ముని ముచ్చులైన '' అనే సామెత ఉంది. అలాగా ఇనుప కచ్చడాలు కట్టుకోని పరాశరుడు, చ్యవనుడు, విశ్వామిత్రుడు వంటి మునులు అతివల ముందు డౌన్ అయి పోయారు. కొందరు పాశ్యాత్యులు, విరాగులకుండే ఈభయాన్ని అర్ధం చేసుకోకుండా గాంధీజీని తాంత్రీకుడిగా అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది.

ఈమెయిల్ ఉన్నవాడికి స్పాం భయం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగు ఉన్నవాడికి ఫిస్కింగు, ప్రైవేటు డేటా, ఖాతాల్లో డబ్బులు కొట్టేయటం, భయం ఉంటుంది.

అథర్వణవేద కాలంలోనే కాదు, ఈకాలంలో కూడ తన భర్త|భార్యను ఎవరైనా ఎగరేసుకెళ్తారనే భయం ఉంటుంది. అలాగా భార్యలను, భర్తలను ఇతరులు ఎగరేసుకెళ్ళకుండా, ఇతరుల భార్యలు, భర్తలు మనతో వచ్చేలాగా అథర్వణ వేదంలో మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. ఇటీవల మనమంత్రి శ్రీశశిథారూర్ గారి భార్య ఇటువంటి భర్తృహర్తృ భయం తోనే ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.

ఆధునిక తెలంగాణ, శేషాంధ్రలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కార్పోరేట్ బాదుడు భయం ప్రతి కుటుంబానికీ తగులుకుంటున్నది. తండ్రినో, తల్లినో, పెళ్ళాంనో, మొగుడినో, అల్లుడినో, మామనో, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ లో చేర్చకపోతే ప్రక్కవాళ్ళు, బంధువులు ఏమనుకుంటారో అనే భయం కొత్తగా వచ్చి చేరింది. చేర్చిందగ్గరనుండి వాడు రోజు విడిచి రోజూ ఒక లక్ష కట్టమంటూ ఉంటాడు.
ఒకనాలుగు లైన్ల శ్లోకంలో భర్తృహరి అన్నిభయాలను కవర్ చేయలేక పోయాడని భయపడనక్కరలేదు. కావాలంటే మనం శతకమైనా వ్రాసుకోవచ్చు.

ఈభూమిపై భయాలు లేని వాళ్ళు లేరనే మాట, ముఖ్యంగా పెట్టుబడదారీ విధానంలో నిజం. ఎందుకంటే ఒక క్షణం ప్రమత్తంగా కన్ను మూతపడిందంటే పోటీదారు మన నౌకరీని, ప్రమోషన్ లను, కాంట్రాక్ట్ లను, బిజినెస్ ను గద్దలాగా తన్ను కెళ్తాడు. అందుకని జెనిఫర్ లోపెజ్ గారి భయం నిస్సంకోచంగా సమర్ధనీయమే.

back to Jennifer Lopez
తనకేదైనా ఐడియా వస్తే అది నెరవేరేదాకా నిరంతరాయంగా పని చేస్తుందిట. (వివేకానందా గారు కూడ చెప్పారు కదా, Arise Awake and Stop Not till thy goal is achieved!).

అటువంటి నాన్-స్టాప్ వర్క్ ఎథిక్ (అటువంటి పని నీతి) యే ఆమె విజయానికి కారణంట. కాని ఆమెతో పనిచేసేవారికి కష్టాలు తెస్తుందట.

ఈనాటి పద్యం


ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించి పరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ థృత్యున్నతోత్తాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
తెలుగుసారం
అధములైన మనుష్యులు ఆటంకాలు వస్తాయనే భయంతో పనులను మొదలు పెట్టరు. విఘ్నాలు వస్తే, మధ్యములైన వాళ్ళు పనులను మధ్యలోనే వదలి వేస్తారు. ఉత్తములైన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తమ పనిని పూర్తిచేసే దాకా వదలరు. అలా పని చేస్తూనే ఉంటారు.

వైబీరావు గాడిద వ్యాఖ్య:ఈపద్యానికి కూడ కొన్ని పరిమితులు ఉంటాయి. పూర్తయ్యేదాకా వదలను అని మొండి కేస్తే కొన్ని సార్లు ప్రాణాలు పోతాయి. మన రాజకీయవాదులకి ఈసంగతి తెలుసు. కెసీఆర్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, జగన్, వీరంతా ఇటీవల నిరాహార దీక్షలు చేసిన వారిలో ఉన్నారు. వీరంతా చివరిదాకా కొనసాగించారా? కొనసాగిస్తే పొట్టి శ్రీరాములు లాగా అమరజీవులు అయిపోయే వాళ్ళు. శ్రీరాముడు కూడ సముద్రుడు దారి ఇవ్వలేదని ఒడ్డున ఇసుకలోనే ప్రాయోపవేశం ప్రారంభించాడు. కానీ సముద్రుడు జవాబివ్వలేదు. ఇలాకాదని, బ్రహ్మాస్త్రం సముద్రుడి మీదకి వదలబోయాడు. అపుడు సముద్రుడు వణుక్కుంటూ వచ్చి ఆబ్రహ్మాస్త్రం నామీద కాదు, అక్కడ రాజస్థాన్ లో ఉన్న ఆభీరులమీద వదలమంటే, శ్రీరాముడు ఆబ్రహ్మాస్త్రాన్ని రీడైరక్ట్ చేశాడు.

ప్రఖ్యాత 20వ ప్రథమార్ధ శతాబ్ద ఆంగ్ల రచయిత
జార్జి బెర్నార్డ్ షా గారు Arms and the Man ఆంస్ అండ్ దీ మ్యాన్ అనే ఒక నాటకం వ్రాసారు. అందులో హీరో బ్లంట్ ష్లీ అనే సైనికుడు. ప్రాణ రక్షణ కొరకు యుధ్ధరంగంలో నుండి పారిపోయి హీరోయిన్ ఇంటిలో తలదాచుకుంటాడు. అంతకు ముందు హీరోయిన్ సెర్జియస్ అనే ఒక ప్రతిజ్ఞల వీరుడిని వరిస్తుంది. బ్లంట్ ష్లీ అనుభవాలను విన్నాక తన మనసును మార్చుకొని సెర్జియస్ ని వదలి వేసి ప్లంట్ ష్లీ ని వరిస్తుంది. అతడికి చాకోలెట్ క్రీం సోల్డ్యర్ అని పేరు పెట్టుకుంటుంది.

కాబట్టి పరిస్థితుల తీవ్రతను బట్టి మధ్యలో మానేయటం పాపమూ కాదు , నేరమూ కాదు. ఇలాంటి వాటిలో హార్డ్ అండ్ ఫాస్ట్ సిధ్ధాంతాలను తయారు చేయటం కష్టం.

స్వర్గీయ ఇందిరా గాంధీ గారు, మన షార్జాదా యువరాజు రాహుల్ గాంధీగారు, రాజమాత సోనియా గాంధీగారు, తమ చదువులను మధ్యలో వదలి వేసిన వాళ్ళే. మన కాబోయే వజీరీ ఆజం (ప్రధానమంత్రి) శ్రీనరేంద్రమోడీ గారు తనకు హిందూ సంస్కృతి ననుసరించి జీవితాంతం సహధర్మచారిణిగా ఉండవలసిన జశోదా బెన్ గారిని మొదట్లోనే పక్కన పెట్టేశారు. ఈ మధ్యలో మానేయటం, లేక తెగేదాకా లాగేదాకా సాగదీయటం అనేది సెలబ్రటీలు చేస్తే ఒక్కరకంగా ఉంటుంది. హాయ్ పొల్లాయిలు చేస్తే ఒక్కరకంగా ఉంటుంది.

ఏది ఏమైనా ప్రాణాలు వదలటం అనేది ఏ స్వాతంత్ర్యో పోరాటాల్లోనో, దేశ రక్షణ యుధ్ధాల్లోనో జరగాల్సిందే తప్ప సాధారణ పరిస్థితులలో అవసరం లేదు. కోరికల తీవ్రత, ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రాణాలకు తెగించి కృషి చేస్తాడు అనే దానిని నిర్ణయిస్తుంది.

ప్రారంభించిన లేక ఒప్పుకున్న పనులను మధ్యలో వదలివేయటం అమెరికన్ల ప్రకృతిలోనూ ఉన్నది, భారతీయ ప్రకృతిలోనూ ఉన్నది. ఈగాడిద కూడ ఎన్నో పనులను మధ్యలో వదలి వేసిన వాడే. అయితే ఒప్పుకున్న పనులను మధ్యలో వదిలి వేయటం కానీ, తాత్సారం చేయటం కానీ సమర్ధనీయం కాదు. ఒప్పుకోక ముందే తాము చేయగలమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోటం ఉత్తమం.

కనుక చింతా మాస్తు (చింతించకండి).

తిరిగి వ్రాయవలసి ఉంది. ఇంకా జోడించవలసినది ఉన్నది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.