చర్చనీయాంశాలు: bifurcation, విభజన, విద్య
సమైక్యాంధ్ర జాక్ కు చెందిన విద్యార్ధి నేతలు, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడితే భౌతిక దాడులకు దిగుతామని ప్రకటించటం ఘోరం. నిజంగా వారు భౌతిక దాడులకు దిగనక్కరలేదు. బెదిరింపులుకూడ భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హ నేరాలే.
దీని వల్ల వారు అనవసరం కేసుల్లో ఇరుక్కొని విద్యావకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. నిజంగా భౌతికదాడులకు దిగితే, వారు బెయిలుకు కూడ ఇబ్బంది పడే సెక్షన్ల క్రింద ఇరుక్కు పోతారు.
ధనిక కుటుంబాల నుండి వచ్చిన విద్యార్ధులకు ఉద్యోగాల అవసరం లేదు. కాలేజీలు, డిగ్రీలు అనేవి వారికి కాలక్షేపం బఠానీలు, కట్నాలను పిండుకోటానికి సాధనాలు. కానీ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల విద్యార్ధుల పరిస్థితి అలాకాదు. కేసుల్లో ఇరుక్కుంటే జీవితాలు నాశనమవుతాయి. ప్రభుత్వోద్యోగాలు మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రైవేటు ఉద్యోగాలు కూడ రావు.
తెలంగాణలో విద్యార్ధులు కొందరు ఇప్పటికే దెబ్బ తిన్నారు. వారికి కెసీఆర్ హామీలు ఇచ్చి ఉండవచ్చు. కేసులు ఎత్తివేయిస్తామని, ఉద్యోగాలు సృష్టించి ఇస్తామని,పెన్షన్లు, తామ్రపత్రాలు ఇస్తామని చెప్పి ఉండవచ్చు.

సమైక్యాంధ్ర విద్యార్ధులకు ఎవరైనాచాటుగా ఇటువంటి హామీ ఇచ్చారేమో మనకి తెలీదు. హామీ ఇచ్చేవారు తమ రాజకీయ అవసరాలను బట్టి సవా లక్ష హామీలు ఇచ్చినా వారు తమ హామీలను గుర్తుంచుకోటం కష్టం.
నిజానికి సమైక్యాంధ్ర కన్నా ,సరియైన పధ్ధతుల్లో అంటే సమన్యాయంతో, జరిగితే విభజనే లాభం. సమైక్యాంధ్రలో కేవలం హైదరాబాదే అభివృధ్ధి అవుతుంది. హైదరాబాదులో చోటేది? చీమల్లాగా జనం. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయించు కోగలిగితే, చిన్నరాష్ట్రాల పధ్ధతిలో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలను ఏర్పరుచుకోగలిగితే, అన్ని ప్రాంతాలూ అభివృధ్ధి మార్గం పట్తాయి.
సమైక్యాంధ్ర విద్యార్ధులకు నిరసనలు ప్రకటించుకోటానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు: దారుణంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి నిరసన ప్రకటించ దలుచుకున్నవారు, కేంద్ర పన్నుల నిరాకరణోద్యమం ,సహాయనిరాకరణం వంటివి చేపట్టి ప్రజలకు నచ్చచెప్పవచ్చు. గాంధీగారు ఇలాటి ఉద్యమాలతోనే కదా విజయాలను సాధించింది.
వ్యూహాలను అందరూ కలసి నిర్ణయించుకోవచ్చు.
ఎట్టి పరిస్థితులలోను పేదవిద్యార్ధుల బ్రతుకుతెరువు భవిష్యత్ ను పణంగా పెట్టరాదు.
ఆర్టికిల్ 3 ప్రకారం, కేంద్రం రాష్ట్రాలను విభజించాలన్నా, క్రొత్తవాటిని ఏర్పరచాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం లేదంటున్నారు కాబట్టి, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం, చేసే తప్పులను 2014లో వచ్చే క్రొత్త ప్రభుత్వం తేలికగానే సవరించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏవైనా అన్యాయాలు జరిగినా, అన్యాయం చేసిన వారికి ఎన్నికల్లో బుధ్ధి చెప్పి ఇంటికి పంపి, కొత్త ప్రభుత్వం చేత అవసరమైన మార్పులు చేయించుకోవచ్చు.
ఈమాత్రం దానికి కేసుల్లో ఇరుక్కోటం తొందరపాటే అవుతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.