
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా విజయవాడలో కోర్టుల గేట్లకు తాళాలు వేయటం సమంజసం కాదు.
న్యాయవాద వృత్తి ఒక ప్రత్యేక తరగతికి (classical) చెందినది. న్యాయవాదం, న్యాయమూర్తిత్వం, పత్రికా రచన (న్యూస్ ఛానెల్స్ తో కలిపి), చిత్ర నిర్మాణం, ఉపాధ్యాయ వృత్తి, రాజకీయ నేతృత్వం, రాజకీయ కార్యకర్తృత్వం, కళాకారులు, మొ|| ఈ ప్రత్యేక తరగతి లోకి వస్తాయి. ఈ వృత్తులన్నీ మేథోసంపత్తితో నిండి ఉండాల్సినవి. సమాజానికి దారి చూపాల్సినవి. సమాజం తప్పు దారిలో వెళ్తూ, ఈవృత్తిలోని వారిని అవమానించినా , దరిద్రంలో ముంచెత్తినా, తమ నిజాయితీని, నిర్భీతిని, నిబధ్ధతను, కోల్పోకూడదు.
రోజులు గడవటం క ష్టంగా మారితే, వేరొక వృత్తిలోనికి మారే స్వేఛ్ఛను వినియోగించుకొని, బయట పడ వచ్చు. ఆత్మ వంచన చేసుకుంటూ, ఇతరులను వంచిస్తూ, కొనసాగవలసిన నిర్భంధమేమీ లేదు.
సమాజంలోని ఇతర వర్గాలకూ, మేథోవర్గాలకు ఉన్న బంధం మాతాపితలకు, పసిపిల్లలకు ఉండే సంబంధం వంటిదే. పసిపాప తల్లిపైనో, తండ్రిపైనో, తనను ఎత్తుకున్న వారిపైనో ఉచ్చపోస్తుంది. అలాచేశారని వారిని శిక్షించటం కుదరదు. ఐదేళ్ళపిల్లవాడు, నాన్నా నిన్ను తంతానంటాడు. తండ్రి వాడిని ప్రోత్సహించనూ లేడు, తిట్టనూ-కొట్టనూ లేడు. వాడికి మెల్లగా నచ్చచెప్పి దారికి తెచ్చుకుంటాడు.
ఈ సందర్భంగా మనం భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని కూడ, గుర్తుకు తెచ్చుకోటం అవసరం. గీతలో, ఈశ్లోకాన్ని కులధర్మంగా చెప్పినా, దీని సారం వృత్తి ధర్మానికి కూడ వర్తించుకోవచ్చు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః 0335.
బాగుగా ఆచరించబడ్డ ఇతరుల విధులకంటే, కొంత లోపాలతో కూడినప్పటికి, స్వంత ధర్మాన్ని ఆచరించటమే మేలు. స్వధర్మం కొరకు ప్రాణాలు విడువటమైనా శ్రేయస్కరమే. పరధర్మం భయంతో నిండినది.
న్యాయవాదుల ప్రాధమిక స్వధర్మం, న్యాయస్థానానికి, న్యాయ మూర్తులకు సత్యనిర్ధారణ లో సహాయం చేయటం. ఫీజుతీసుకొని చేసేటప్పుడు, కనీసావసరాల కొరకే కాకుండా, ఇళ్ళు, కార్లు, బంగారం వంటివి సమకూర్చుకోటానికి వృత్తిని వినియోగించుకుంటున్నపుడు, ఈవిధి, బాధ్యత రెట్టింపు అవుతుంది. న్యాయస్థానానికి, న్యాయ మూర్తులకు సహాయం చేయక పోగా, వారి స్వధర్మనిర్వహణకు అడ్డుకుంటు, కోర్టులకు తాళాలు వేయటం , ఘోరం, ధర్మ విఘాతకరం.
ఉద్యమాలను చేపట్టటం తప్పుకాదు. లక్ష్యాలే కాకుండా, లక్ష్యసిధ్ధికి అవలంబించ వలసిన మార్గాలు కూడ, సరిగా ఉండాలి. ఉద్యమాలను, ర్యాలీలను, నిర్వహించుకోటానికి శని,ఆదివారాలను వాడుకోవచ్చు. ప్రాతఃకాలాన్ని, సాయంకాలాలను, వాడుకోవచ్చు. ఈమెయిళ్ళు , బ్లాగులు, ఫేస్ బుక్ లు, వెబ్ సైట్లు వంటి వాటిని వినియోగించుకోవచ్చు. కోరిక ఉంటే న్యాయమైన, స్వధర్మ విఘాతం కాని, సృజనాత్మకమైన మార్గాలెన్నో దొరుకుతాయి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.