Saturday, November 9, 2013

050 Part 1 of Shiva's Role in Vishnu Scriptures పోతన శ్రీమద్భాగవతంలో శివ వర్ణనలు Encomia of Lord Siva in Srimad bhAgavatam of Potana

#050 పోతన శ్రీమద్ భాగవతంలో శివ వర్ణనలు Encomia of Lord Siva in Srimad bhAgavatam of Potana పోతన, భాగవతం, పటేల్, అద్వానీ, నెహ్రూ

శ్రీమద్ భాగవతం ప్రాధమికంగా విష్ణుకావ్యం. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల చరిత్రను వర్ణించటం, ఇందలి ప్రధాన కథాంశం.

పోతనగారు చేసిన భాగవతానువాదం, సంస్కృతంలో వ్యాసుడు వ్రాసినది. వ్యాస భాగవతం రూపొందేనాటికే, శివ వైష్ణవాల మధ్య కొంత మేరకు విభేదాలు తగ్గి, వైష్ణవ గ్రంధాలలో, శంకరుడి గొప్పతనాన్ని అంగీకరించటం ప్రారంభమయ్యింది.

వేరొకచిత్రాన్ని కూడ మనం ఊహించుకోవచ్చు. ఆదినుండి హైందవంలో శివ వైష్ణవులకు సమాన ప్రాధాన్యత ఉండేది. ఇతిహాసాల కాలంలో దేవాలయాల నిర్మాణంలేదు. నిర్గుణ బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా సంభావించటం మొదలయినా, దేవాలయాల నిర్మాణం ఇంకా మొదలు కాలేదు, లేక మొదలయినా ప్రారంభ దశలో ఉండి ఉండ వచ్చు.

దేవాలయాల నిర్మాణం ప్రారంభమయ్యి, దేవాలయాలు, పూజారులలో కొందరు బంగారం పోగుచేసుకోటం ఎక్కువయ్యాక, తమతమ గుళ్ళలోని దేవుళ్ళ గొప్పలను, మహిమలను, పెంచుకోటం కొరకు, వారిని సర్వ శక్తి మంతులుగా చూపటం, వారు ఇతర దేవతలను రక్షించి నట్లుగా చూపటం ఎక్కువయ్యింది.

పోతన గారి భాగవతానువాద కాలానికి, ఓరుగల్లులో దేవాలయాల నిర్మాణం, పక్వస్థాయికి చేరుకుంది. వేయి స్థంభాల దేవాలయం, రామప్పగుడి, వీటికి ప్రబల సాక్ష్యాలు.

పోతన్నగారు శ్రీరామభక్తి తత్పరుడే అయినా త్రిమూర్తులకు సమగౌరవం ఇచ్చాడు. శ్రీమద్ భాగవతంలో, పోతన్నగారి ఇష్టదైవతా ప్రార్ధనంలో త్రిమూర్తులూ ఉన్నారు.శ్రీకైవల్య పదంబు చేరుటకునై నేను చింతించెదన్, లోకరక్షైకారంభకు అనే పద్యం శ్రీమహావిష్ణువుని ఉద్దేశించినది. ఇందులో, విష్ణుదేవుడి పాత్ర , సృష్టి, స్థితి, లయాల్లో, స్థితి == పోషణ,రక్షణ సుస్పష్టం.

ఇప్పుడు, పోతన్న గారి శివ స్తుతిని చూద్దాం.
ఉత్పలమాల పద్యం.
వాలిన భక్తి మ్రొక్కెద(న్) న (అ)వారిత తాండవ కేళికి దయా
శాలికి శూలికి శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహహాళికి.
అంత్యప్రాసా వైభవం చూడండి. కేళి, శాలి, శూలి, మాలి, మౌళి, కపాలి, ఉన్మూలి, సరసీరుహ అళి.

కేళి== ఆట. శాలి== కలవాడు. శూలి== బల్లెం ధరించినవాడు. మయూఖమాలి== కిరణాలు కలిగిన సూర్యుడు. మౌళి== కొప్పు. కపాలి== కపాలం ధరించేవాడు. ఉన్మూలి== నిర్మూలించినవాడు. ఆళి== వరుస.

అహో! బతా! ఆధునిక నాగరికతా వేగంలో మనకిట్టి పద్యాలు నోటికి రాకుండా పోతున్నాయే.

వైష్ణవ గ్రంధమైన శ్రీమద్ భాగవతంలో ఈశ్వర స్తుతి శిఖరాగ్రానికి చేరుకోటం, మనకు దక్ష యజ్ఞం ఘట్టంలో చక్కగా కనిపిస్తుంది. హాలాహాల భక్షణం ఘట్టంలో ఎంతో సత్యం, శివం,సుందరంగా, దర్శనమిస్తుంది. ఈపద్యాలు చూడండి.

మత్తేభపద్యం.
అమరన్ లోకహితార్ధమంచు అభవుండౌ గాక యంచాడె పో
యమరుల్ భీతిని మ్రింగవే యనిరి వో అంభోజగర్భాదులున్
తము కావన్ హరలెమ్ము లెమ్మనిరి వో తాఁ జూచి కన్గంట అ
య్యుమ ప్రాణేశ్వరునెట్లు మ్రింగుమనె అయ్యుగ్రానల జ్వాలలన్.

వచనం. అనిన శుకుండిట్లనియె.

కందం.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో.

మత్తేభ పద్యం.
తన చుట్టున్ సురసంఘముల్ జయజయ ధ్వానంబులన్ బొబ్బిడన్
ఘనగంభీరరవంబుతో శివుఁడు లోకద్రోహి హుం పోకు ర
మ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలం
బని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.

వచనం.: అయ్యవిరళ మహాగరళ దహన పాన సమయంబున

ఇంకో మత్తేభ పద్యం.
కదలంబారవు పాఁపపేరులొడలన్ ఘర్మాంబు జాలంబు వు
ట్టదు నేత్రంబు లెఱ్ఱగావు నిజజూటాచంద్రుడున్ కందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో జాయుచో
పదిలుండై కడి సేయుచో , తిరుగుచో, భక్షించుచో, మ్రింగుచోన్.
కడి అంటే ముద్ద. నేడు మనం అన్నానికి వాడటం లేదు. పేడకడి అనే పదగుఛ్ఛం గ్రామాల్లో వాడుకలో ఉంది.

కందం.
ఉదరము లోకంబులకును
సదనంబగుటెఱిగి శివుఁడు చటుల విషాగ్నిన్
కుదురుకొన కంఠబిలమున
పదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

మరో కందం.
మెచ్చిన మచ్చిక కలిగిన
ఇచ్చిన ఈవచ్చు గాక , ఇచ్చన్ ఒరులకున్
చిచ్చు కడిగొనగ వచ్చునె
చిచ్చఱ రూపచ్చు పడిన శివునకుఁ దక్కన్.

ఆటవెలది పద్యం.
హరుడు గళమునందు హాలాహలము వెట్ట
కప్పు కలిగి తొడవు కరణి నొప్పె
సాధు రక్షణంబు సజ్జనులకునెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర.

వచనం.
తదనంతరంబ.

కందం.
గరళంబుఁ గంఠబిలమున
హరుఁడు ధరించుటకు మెచ్చి యౌననుచున్
హరియు విరించియు నుమయును
సురనాధుడు పొగడిరి సుస్థిరమతితోన్.

కందం.
హాలాహల భక్షణ కథ, hAlAhala bhakshaNa katha,
హేలాగతి విన్న వ్రాయ నెలమి బఠింపన్ hElA gati vinna nelami paThimpan,
వ్యాళానల వృశ్చికముల vyALAnala vrischikamula
పాలై చెడరెట్టి జనులుభయ విరహితులై. pAlai ceDareTTi janulu bhaya virahitulai.
Briefest gist of this verse: Those who read this story with devotion, will never be bit by snakes, fire and scorpions.
పోతన గారు సాక్షాత్కరింప చేసిన ఈసుందర దృశ్యం మనం ఎన్నటికీ మరువలేము. తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు ఈజన్మ ధన్యమైంది. ఇంక మరణించినా భయం లేదు.

కొన్ని వైబీరావు గాడిద ఆలోచనలు.౧. ఆఖరు పద్యం ఫలశృతికి చెందినది. ఈహాలాహల భక్షణ కథ చదివిన వారికి వచ్చే సత్ ఫలితాలు.
వ్యాళం= పాము. అనలం= నిప్పు. వృశ్చికం=తేలు. అంటే మనం వోల్వో బస్సు ఎక్కబోయేముందు ఈహాలాహల భక్షణ కథ చదివి, నిర్భయంగా బస్సు ఎక్కవచ్చు.

౨. విష్ణువు మరియు శివుఁడి మధ్యలో భేదం పాటించే వారికి , ఈహాలాహల భక్షణ కథ కనువిప్పు కలిగించాలి.

౩. పటేల్ నెహ్రూ లను ఒక విధంగా శివకేశవులతో పోల్చవచ్చు. వారి మధ్య ఏదో భయంకరమైన తీవ్ర అభిప్రాయభేదాలున్నాయని అడ్వాణీగారు ఎంత గిలగిలలాడినా, వారి ప్రయత్నం వృషణాల ప్రయాస అవుతుందేమో. అయితే వృషణాల ప్రయాస అనే పదగుఛ్ఛం కొంత అసభ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి వృధా ప్రయాస అంటే సరిపోతుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.