Tuesday, November 5, 2013

042 వోల్వో బస్సుకు 45 మంది ఆహుతి Volvo bus consuming 45 people in Andhra Pradesh

#042 వోల్వో బస్సుకు 45 మంది ఆహుతి Volvo bus consuming 45 people in Andhra Pradesh
అక్టోబర్ 2013 లో మహబూబ్ నగర్ జిల్లా , పాలెం సమీపంలో జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాదం 45 మందిని బలి తీసుకున్న దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి తనదేమీ బాధ్యతలేదని చెప్పి రాజీనామా చేయటానికి తిరస్కరించటం మన మంత్రులు ఏస్థాయిలో ఉన్నారో నిరూపిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా వోల్వో బస్సులు అత్యవసర ద్వారాలు లేకుండా తిరుగుతున్నాయని రవాణా మంత్రి గారికి తెలుసా తెలియదా? ఆయన ఎప్పుడైనా ఏదైనా వోల్వో బస్సును ఎక్కి అక్కడి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారా? వాటిని తక్షణమే ఏర్పాటు చేయమని దిశానిర్దేశం చేశారా? పోనీ రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులెవరికైనా ఈ పని చేయమని ఆదేశించి, వారా పని చేశారా లేదా అని సమీక్షించారా? ఉన్నతాధికారులు, మంత్రిగారు, వేలాది రూపాయల జీతాలు, పెర్కులు తీసుకంటున్నారు. తానంటే జోడు పదవుల రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్నాడు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఉన్నతాధికారులు దేనితో తలమునకలై యున్నారు?

వోల్వో బస్సులలో అత్యవసర ద్వారాలు లేనందు వల్ల అవి ప్రమాద భరితాలని రాష్ట్ర రవాణా మంత్రి గారు , ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంలోని ఆటోమోబైల్ డిజైన్లకు ఆమోదాన్ని తెలిపే శాఖకు అత్యవసర పత్రాన్ని వ్రాశారా? రకరకాల వ్యాపారాలలో తలమునకలై ఉన్నందు వల్ల కుదరలేదా? రవాణా శాఖ మంత్రి గారికి తీరిక లేకపోతే తీరిక ఉండే శాఖకు మారవచ్చు. లేదా జోడు పదవులలో ఒకదానిని వదిలి వేయవచ్చు.

వోల్వో బస్సులో నిర్దేశించ బడిన భద్రతా ఏర్పాట్లను చూస్తుంటే నవ్వు రాకమానదు. ప్రతి మూడు కిటికీలకు ఒక సుత్తి పెట్టాలిట. దీనితో ప్రయాణీకులు అద్దాలను పగులగొట్టుకొని బయటకు రావాలిట! ఇంకా నయం, ప్రయాణీకులను టార్చిలైట్లతో పాటు ఒకసుత్తిని కూడా చంకలో పెట్టుకొని రమ్మనలేదు. ఇప్పటికైనా ప్రయాణీకులు ఈ అలవాటును మొదలు పెట్టుకోటమే కాకుండా, అద్దాలను పగులకొట్టటం పగులకొట్టటం, కిటికీల్లోంచి దూకటం , అభ్యాసం చేయాలి. ఈసూత్రాల రైలు ప్రయాణాలకు కూడ వర్తిస్తాయి. రైలు ప్రయాణాలకు అదనంగా మరొక సూత్రం కూడా ఉంది. ఒక హ్యాక్ సా బ్లేడ్ ను కూడ వెంట తీసుకు వెళ్ళి కిటికీ చువ్వలను కోయటం అభ్యసించాలి.


ఇప్పటికైనా, రవాణా మంత్రిగారు , బాధ్యులైన రవాణా శాఖ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తారా, చేయరా?

వోల్వో బస్సులు అఖిల భారత స్థాయిలో , బహుశా ఎగుమతులకుకూడా, తయారవుతాయి. అత్యవసరద్వారాలు ఉంటే శీతల యంత్రాలు సరిగా పనిచేయవని వాహన డిజైనర్లు భావించి సుత్తుల ఏర్పాటు సూచించి ఉండవచ్చు. వోల్వో బస్సుల ధరలు, ఛార్జీలమోతా చాలా ఎక్కువే. ఆ బస్సుల డిజైన్లను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ ఆధికారులపై చర్యలు అవసరం. ఇది కేంద్రంలో ఏశాఖ పరిధి లోకి వస్తుందో తెలియదు. ఉపరితల రవాణా శాఖ కిందికి రావచ్చు. లేదా పరిశ్రమల శాఖ పరిధిలోకి రావచ్చు.

మత తత్వ ఉగ్రవాద పేలుళ్ళను, విద్రోహచర్యలను ఎలాగూ నిరోధించలేక పోతున్నాం. కనీసం, వాణిజ్య అశ్రధ్ధనైనా సరిదిద్ద లేక పోతే ఎలా.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.