Monday, November 4, 2013

041 మతాంతరీకరణలు -మతాంతరీకరణ నిరోధీకరణలు--conversions and prevention of conversions

#041 మతాంతరీకరణలు -మతాంతరీకరణ నిరోధీకరణలు--conversions and prevention of conversions

భారత్ లో కొండల్లో అడవుల్లో వందలాది గిరిజన ప్రాంతాలున్నాయి. అందరిదీ ఒకే సంస్కృతి కాదు. వారు తమకు నచ్చిన స్థానిక దేవతలను తమకు నచ్చిన పధ్ధతులలో కొలుచుకుంటున్నారు. ఈగిరిజనులు ఎన్నో వేల ఏళ్ళ బట్టీ ఈపధ్ధతిలో జీవస్తున్నారు. వారి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు, శాంతి, వారికి ఉన్నాయి.

వారి ప్రధాన సమస్యలు , ఇతర భారతీయులకు వలెనే తిండి,గుడ్డ,గూడు,ఆరోగ్యం,విద్య ,వృధ్ధాప్యంలో భద్రత,రవాణా సమాచార సౌకర్యాలలేమి, ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అవినీతి మయమైన వైనా , ఈ సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తున్నాయి.

పావురాల గూడు లోనికి పిల్లులు దూరినట్లుగా, పక్షులగూడులోనికి పాములు దూరినట్లుగా, గిరిజన ప్రాంతాల్లోకి సేవ నెపంతో విదేశీ, స్వదేశీ మతప్రచారకులులు చొరబడ్డారు. భారత్ లో మతమార్పిడీలు, సేవ స్థానంలో వ్యాపారాలుగా మారాయి. ఎంత మందిని మతం మార్చారు అనే దానిని బట్టి విదేశీ నిధులు వస్తు ఉంటాయి. ఆర్ధిక అవసరాల్లో ఉన్న గిరిజనులను ఆదుకుంటున్నట్లుగా కనిపిస్తూ, విదేశీ నిధుల్లోంచి కొంతభాగాన్ని వారికి అందిస్తూ, మిగిలినవి తాము మింగుతూ, ఈవ్యాపారం మూడు పూవులూ ఆరుకాయలుగా విస్తరిస్తున్నది.

భారత రాజ్యాంగం పౌరులకు మత స్వాతంత్ర్యాన్నీ, మతప్రచారహక్కునూ, హామీ ఇస్తున్న మాట నిజమే అయినా, ఈహక్కు అనంతమైనది కాదు.

గిరిజనుల్లో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులు. ఎన్నో బాధల్లో ఉన్న వాళ్ళు. అలాటి వాళ్ళకు మేం ప్రార్ధనలు చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది, దేవుడు మీ దరిద్రాన్ని పోగొట్టి అన్నీ ఇస్తాడు అని మాయమాటలు చెప్పి మతమార్పిడీలకు పూనుకోటం రాజ్యాంగం ప్రసాదించిన స్వాతంత్ర్యాలను దుర్వినియోగం చేయటమే అవుతుంది.

మతం మారాలనుకునే వ్యక్తి తన మతం లోని మత గ్రంధాలను క్షుణ్ణంగా చదవాలి . ఇతర మత గ్రంధాల్లోని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తనమతంలోని వ్యక్తులతో చర్చించాలి. ఇతరమతాల వ్యక్తులతోనూ చర్చించాలి. గుణదోషాలను బేరీజు వేసుకోవాలి. చాలాసార్లు ఒక జీవితకాలం సరిపోదు. ఆషామాషీగా , వ్యాపారులుగా మారిన మతప్రచారకులు చెప్పే కల్లబొల్లి విషయాలను నమ్మి, చడీచప్పుడు లేకుండా మతం మార్చుకోటం, కుటుంబ సభ్యులను కూడా మారమని బలవంతపెట్టటం , తాముకూడా అరకొర మత జ్ఞానంతో మతప్రచారాలకు దిగటం ఏమాత్రం సమంజసం కాదు. తాము ప్రచారం చేస్తున్న మతం యొక్క పవిత్ర గ్రంధాల్లోంచి గట్టిగా రెండు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేని ప్రచారకులు ఇతరులకు ఎలా దారి చూపగలుగుతారు?

మతం మారిన వారు కొంత మంది , తమ కొత్త మతం విషయాన్ని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. తమ అంతరాత్మలను తామే మోసగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ విషయంలో అట్టి వారిని , వారి దరిద్రాన్ని, నిరక్షరాస్యతను దృష్టిలో ఉంచుకుంటే తప్పు పట్టలేము.

మతప్రచారకులు పెట్టే బాధలు చాలనట్లు, గిరిజన ప్రాంతాల్లోకి స్వామీజీలు ప్రవేశిస్తున్నారు. ఈ స్వామీజీల నమ్మకం ఏమిటంటే తాము ప్రచారం చేసే యజ్ఞాల మంత్రాల పూర్ణాహుతుల మతమే సరియైన భారతీయ మతం, మిగిలినవి కాదని. నిజానికి హిందూ మతం భారతదేశంలో నివసించే అందరియొక్క సమష్ఠి జీవన విధానమే తప్ప మంత్రాల మఱ్ఱి కాదు. ఇది ఒక్క వ్యక్తి స్థాపించినది కాదు. రకరకాల పధ్ధతులను, దేవుళ్ళను, దేవతలను, ఆచారాలను ఆమోదించే ఒక సమష్ఠి సంఘం. తాము బోధించేవే సరియైనవి అని జనాలపై తమ నమ్మకాలను రుద్దే హక్కును సంఘం స్వాములకు, పీఠాధిపతులకు ఇవ్వలేదు. వారికి రియల్ ఎస్టేట్లవారు, అవనీతి పరులైన అధికారులు, నల్లబజారు వ్యాపారులు, భారీగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి , తాము ఆప్రోత్సాహాన్ని, ప్రజల్లో విభేదాలు సృష్టించటానికి వినియోగించ వచ్చు అనే అర్ధాన్ని వారు తీసుకొని చెలరేగి పోకూడదు.

స్వమత రక్షణ అంటే పరమత ద్వేషం కారాదు. స్వమత రక్షణ లోని ప్రధాన లక్షణం , స్వమతం లోని లోపాలను సవరించుకోటం. దాన్ని ఇంకా ఆనందకారకంగా మార్చుకోటం. అప్పుడు ఎవరికీ ఇంకో మతానికి వెళ్ళ వలసిన అవసరమే కలుగదు. అక్కడ లభించే సంతోషం ఇక్కడ లభించే సంతోషం కన్నా ఎక్కువగా ఉండదు కాబట్టి.

రెండు మూడు మతాల ప్రచారకులు, వాటి నిరోధకులు, ఒకే చోట దుష్ప్రచారాలకు పూనుకొని కత్తులు దూసుకొటం వల్ల హత్యలు, మతకలహాలు జరుగుతాయి.

ప్రభుత్వం ఇల్లు బూడిదై పోయింతరువాత మొండి గోడలపై నీళ్ళు చల్లినట్లు మొక్కుబడి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతను మరుస్తున్నది.

మత మార్పిడీలను నిషేధించ వలసిన అవసరం లేదు. ఒక నియంత్రణా అథారిటీని నెలకొల్ప వలసిన అవసరం ఉంది. ఇవి కోర్టుల్లాగా పనిచేయాల్సి ఉంటుంది. మతం మార్చుకో దలుచుకున్న వాడు, మతమార్పిడీ అనుమతి కోర్టుకు తన దరఖాస్తును ఇవ్వాలి. న్యాయమూర్తి ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియచేసి అభ్యంతరాలను ఆహ్వానించాలి. మార్పిడీ కోరుతున్న వ్యక్తి పూర్తిగా స్వంత బుధ్ధిని, వినియోగిస్తున్నాడా, అన్ని మతాల సారం తెలిసిన వాడేనా, అన్ని మతాల సారం ఒకటే నని తెలిసి కూడా మతం మారటానికి బలవత్తరమైన కారణమేమిటి, అనే విషయంపై దర్యాప్తు చేయాలి. అవసరమైతే దరఖాస్తుదారుకు, అతడిప్రోత్సాహకులకు, లిఖిత పరీక్షలు నిర్వహించాలి. అతడు తన స్వంత విజ్ఞానంతో, ఏ ప్రలోభాలు లేకుండా , నిర్హేతుక భయాందోళనలకు గురి కాకుండా, మతం మార్పిడీకి నిర్ణయించుకున్నాడని ధృవ పర్చుకున్నాకే, అనుమతి డిక్రీ ఇవ్వాలి.

మతమార్పిడీ 100% వ్యక్తిగత విషయం కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల మతాల్నీ, కులాల్నీ, ప్రభుత్వం, చట్టం, పిల్లలకు అంటగట్టుతున్నాయి. వీటినిబట్టి రిజర్వేషన్లు మొదలగునవి నిర్ణయం అవుతున్నాయి.

పుట్టుక అనేది యాదృఛ్ఛికం. ఏమతంలో , ఏకులంలో పుట్తారు అనేది ఇంకా యాదృఛ్చికం. నిజానికి 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు పిల్లలకు కులం, మతం ఉండకూడదు. తాము ఏకులం, ఏమతం అనేది మానసిక పరిపక్వత, మతాలకు సంబంధించిన సమాచారం సేకరణ, విశ్లేషణలు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులతో సమాలోచనలు, పూర్తి అయ్యాక, విచక్షణతో, యువతీ యువకులు, తమకు అసలు మతం అవసరమా, అవసరమైతే ఏ మతం, ఆమతంలో ఏవర్గం, అనేది నిర్ణయించుకోవాలి.

ముగింపు: విదేశ మతాలు, స్వదేశ మతాలు, గిరిజనుల స్వేఛ్ఛా స్వాతంత్ర్యలలో జోక్యం చేసుకోకుండా, బలహీనులపై మతాంతరీకరణలను రుద్దకుండా, నియంత్రణా చట్టాలను, అమలు కోర్టులను, ఏర్పాటు చేయాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.