Friday, November 1, 2013

#034 సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప వాడా, జవహర్ లాల్ నెహ్రూ గొప్ప వాడా

సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప వాడా, జవహర్ లాల్ నెహ్రూ గొప్ప వాడా అనే ప్రశ్న 2014 ఎన్నికల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత సంతరించు కుంటున్నది.

Question: బిజెపీ వాదించి నట్లుగా నెహ్రూ కన్నా పటేల్ గొప్పనా?జవాబు:

ఎవరి గొప్ప తనాలు వారికి ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నది వారసత్వ యుధ్ధము. నెహ్రూ గారి పేరు చెప్పుకొని కాంగ్రెస్ వోట్లు అడుగుతూ, నెహ్రూ వంశాంకురాలను అడ్డుపెట్టుకొని , కొందరు కాంగ్రెస్ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. నెహ్రూ కుటుంబం పేరు చెప్తే వోట్లు రాలవు అనే పరిస్థితి వచ్చినప్పుడు , వారు నెహ్రూను వదిలేసి మరొకరిని పట్టుకుంటారు. ఎందుకైనా మంచిదని, పటేల్ ను కూడా గొప్ప లౌకిక వాదిగా ప్రధాని మొదలగు వారు చిత్రిస్తున్నారు.

పటేల్ వారసత్వానికి తాము హక్కుదారులము, అని బిజెపీ భావిస్తున్నది. బిజెపి ప్రధాని అభ్యర్ధి శ్రీనరేంద్ర మోడీ ఆశిస్తున్న పటేల్ లౌకిక వాదం, తీవ్రవాద హిందూత్వ స్వభావానికి చెందినది. కానీ వాస్తవం ఏమిటంటే పటేల్ తీవ్ర వాద హిందూత్వం యొక్క సమర్ధకుడు కాడు. పటేల్ ఆచరణ వాది , ఆచరణశీలి. నమో గారి వలె కబుర్లరాయుడు కాదు.

Question: మీరు అమాయకుడైన నమో గారిపై అన్యాయమైన కబుర్ల రాయుడు అనే అరోపణ చేస్తున్నారు. నిరూపించక పోతే మీ తల వెయ్యి వక్కలవుతుంది.నెహ్రూగారు స్వాప్నికుడు (కలలు గనే వాడు), పటేల్ గారు ఆచరణవాది అయినట్లే మోడీగారు కబుర్ల రాయుడు అవటంలో వింతేమీ లేదు. ఒక ఋజువు:

రాజకీయనేతలు, సోనియాతో సహా, ఏరోటి దగ్గర ఆ పాటలు పాడటంలో నిపుణులు. మోడీజీ ఒక పాట పాడారు. దేవాలయాల కన్నా శౌచాలయాలు (టాయ్ లెట్లు) ముఖ్యం. శ్రీవారు ఇటీవల అంగరంగ వైభవంగా , అడ్వాణీగారితో కలిసి ఒక శంకుస్థాపన చేశారు. రూ.2500 కోట్ల ఖర్చు. 576 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహం. అహో సొగసు చూడ తరమా!

విగ్రహారాధన గురించి వేరేచోట వ్రాశాను. ఇక్కడ శౌచాలయాలను కవర్ చేద్దాం. రూ.2500 కోట్లకు ఎన్ని శౌచాలయాలు వస్తాయి? ఒక్కో మరుగుదొడ్డి రూ.10,000 అనుకుంటే లక్షకు 10 వస్తాయి. కోటికి వెయ్యి. రూ.2500 కోట్లకు 25 లక్షలు. గుజరాత్ లో 18618 గ్రామాలు ఉన్నాయి. 25 లక్షలను 18618 తో భాగహారం చేస్తే , ప్రతి గ్రామానికి 134 టాయ్ లెట్లు వస్తాయి.

ఒక్కో మరుగుదొడ్డి ఖరీదు రూ.10,000 కాదు, రూ. 20,000 అనుకున్నా ప్రతి గ్రామానికి 67 టాయ్ లెట్లు వస్తాయి.

Question: టాయ్ లెట్ల సంగతి సరే , పటేల్ గొప్పనా, నెహ్రూ గొప్పనా?గుండెకాయ గొప్పదా,కాలేయం గొప్పదా, మెదడు గొప్పదా, ఊపిరి తిత్తులు గొప్పవా మీరు చెప్పండి. అంతేకాదు, మనవాదన మమతా బెనర్జీ గారికి తెలిస్తే ఆమె తోక త్రొక్కిన త్రాచు వలె ఛెంగు మని లేచి , వారిద్దరి కన్నా నేతాజీ బోస్ గొప్పవాడు అంటుంది. ఆక్షణంలో ఏప్రాంతం వోట్లు కావాలా అనేదాన్ని బట్టి నినాదాలు మారుతూ ఉంటాయి.

టంగుటూరి ప్రకాశం గారు, బూర్గుల రామకృష్ణారావు గారు, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు (ఇంకా ఎందరో చరిత్ర కెక్కని వారు), పటేల్, నెహ్రూ, నేతాజీలకు తీసిపోరు. అయితే వారిని జాతీయ స్థాయిలొ ఎందుకు స్మరించరు? ఎందుకంటే వారు జాతీయ స్థాయిలో పదవులకొరకు ప్రయత్నించలేదు కాబట్టి.

అమ్మహనీయులందరూ స్వర్గస్థులై తారామండలాలకు చేరుకున్నారు. అల్డీబెరాన్ (రోహిణి) గొప్పదా, స్పైకా (చిత్త) గొప్పదా, రెగ్యులస్ (మఖ) గొప్పదా అంటే ఏమి చెప్పగలం?

వారి సిధ్ధాంతాల్లో ఉన్న , ఆచరణల్లో ఉన్న , అభిప్రాయ భేదాలను మనం సరిగా అర్ధం చేసుకొని, అవసరమైన సవరణలను చేసుకొని ముందుకు వెళ్ళటం అవశ్యం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.