Wednesday, October 30, 2013

#౦౩౩ ముందు రాజధానుల సంగతి తేల్చాలి

ముందు రాజధానుల సంగతి తేల్చాలి స్వల్పకాలిక దృష్టితో చూసినపుడు, విభజన వల్ల సీమాంధ్ర, తెలంగాణ రెండూ ఎక్కువగా నష్టపోతాయా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూసినపుడు రెండిటికీ లాభమే.

ఇద్దరికీ లభించే లాభాలు


కేంద్రం ఏదైనా ప్రాజెక్టును , పథకాన్ని, రాష్ట్రాని కొకటి చొప్పున ఇవ్వాలనుకు న్నప్పుడు, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, మూడు రాష్ట్రాలు, ముగ్గురికీ మూడు వస్తాయి.
కేంద్ర ప్రభుత్వ శాఖల, సంస్థల, కార్పొరేషన్ల, కంపెనీల, బ్యాంకుల, బీమా కంపెనీల, ప్రాంతీయ కార్యాలయాలు రాష్ట్ర రాజధానుల్లో ఏర్పరుస్తూ ఉంటారు. రాష్ట్రం మూడు లేక నాలుగు చిన్న రాష్ట్రాలుగా విడిపోయినపుడు, మనకు మూడు లేక నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు వస్తాయి. ప్రైవేటు కంపెనీలు, విదేశీ సంస్థలు _కంపెనీలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలతో పైరవీలు చేసుకోటానికి రాష్ట్ర రాజధానుల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఏవిధంగా చూసినా రాష్ట్ర రాజధానులుగా ఉండే నగరాలకు అభివృధ్ధి అవకాశాలు ఎక్కువ. ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఈకారణాల వల్లనే సీమాంధ్ర ప్రజలు హైదరాబాదుకు పరుగెత్తటం జరిగింది. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో, అక్కడ భూమాఫియాలు చెలరేగుతాయి. హైదరాబాదులో భూములపై పట్టు సాధించటానికి తెలంగాణా భూస్వామ్య కులాలకు , కోస్తాంధ్ర భూస్వామ్య కులాలకు, రాయలసీమ భూస్వామ్య కులాలకు, జరుగుతున్న కుమ్ములాటే, తెలంగాణా ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం.

తెలంగాణకు


మూడు ప్రాంతాల గురించి ఆలోచించే బాధ తప్పుతుంది, కాబట్టి తెలంగాణ పై ఏకాగ్రతతో పని చేయచ్చు.
కొన్నాళ్ళ వరకు హైదరాబాదు ఆదాయం పెరుగుదల నెమ్మదించదు. అయితే అది 23 జిల్లాల ప్రజలతో వచ్చే floating population, floating demand, ల మార్కెట్లను కోల్పోతుంది. పాత హైదరాబాదు రాష్ట్రానికి రాయచూర్, గుల్బర్గా, నాందేడ్, పర్భానీ, బీదర్, మొదలగు కర్నాటక, విదర్భ ప్రాంతాల మార్కెట్లు ఉండేవి. 1956లో ఆజిల్లాలను తెలంగాణా కోల్పోయింది. ఇప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర మార్కెట్లను కూడా కోల్పో బోతుంది, కాబట్టి హైదరాబాదు మాల్స్, ఉస్మాన్ గంజి, బేగం బజార్, రాష్ట్రపతి రోడ్, వంటివి నిస్తేజం అవుతాయి.
అయితే హైదరాబాదు నగరంపై ట్రాఫిక్ వత్తిడి తగ్గు తుంది. నీటి సరఫరా మెరుగవుతుంది. సిటీ బస్సులు ఖాళీ అవుతాయి. ధ్వని కాలుష్యం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గుతుంది.

రాయలసీమకు


వాతావరణ సూచన , రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుంది అనేదాన్ని బట్టి ఉంటుంది.

అసలు కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఎక్కడ అనేది పరిష్కరించ కలుగుతుందని నేను అనుకోను. ప్రస్తుతానికి నేతలందరూ గుంభనంగా ఉన్నారు. మంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి మాత్రమే విజయవాడ అన్నారు. విజయవాడ పరిసరాల్లో భూమి కొరత తీవ్రంగా ఉన్నది. గుంటూరు_ కర్నూలు, రోడ్, రైలు మార్గాల దుస్థితిని లెక్కలోకి తీసుకుంటే , కర్నూలు_విజయవాడ_విశాఖల్లో ఏది రాజధాని అయినా రాష్ట్రప్రజలకు నరకయానం తప్పదు.

కర్నూలుని రాజధాని చేస్తే అక్కడికి కోస్తాంధ్రుల వలస తప్పని సరి అవుతుంది. అప్పుడైనా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పైకెగయక మానదు. ఆపనేదో ఇప్పుడే చేసుకుంటే అచ్చమ్మ పెళ్ళి లో బుచ్చమ్మ శోభనంలాగా, తెలంగాణాతో పాటు రాయలసీమ సమస్యలు కూడా పరిష్కార మార్గం పట్తాయి.

కోస్తాంధ్రకు


రాజధాని ఉన్నా, లేకున్నా, కోస్తాంధ్రకు ఒక్క రాష్ట్రం లేక రెండు రాష్ట్రాలు లాభదాయకం. 1.ఉత్తరాంధ్ర, విశాఖ లేక రాజమండ్రి రాజధానిగా. 2.దక్షిణాంధ్ర. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఏవైనా రాజధానికి అర్హమైన ప్రదేశాలే. నెల్లూరును వారు కోరితే రాయల సీమలో కలిపినా వారికి ఇబ్బంది ఉండదు.

కొత్త రాష్ట్రం అభివృధ్ధి పథంలో దూసుకు వెళ్లటం మటుకు నిశ్చయం. హైదరాబాదు చుట్టూ తిరగ వలసిన అవసరం తప్పుతుంది.

సారాంశం
______

ఏది ఏమైనా అన్ని ప్రాంతాల తెలుగు వారు ఏకమై ఐకమత్యంగా చర్చించుకొని చిన్నరాష్ట్రాల దారి పట్టటం మేలు. కెసీఆర్&కో, దానికి దాసురాలైన సోనియా , మరియు కేంద్రాల పెత్తనం నుండి బయట పడాలంటే ఐకమత్యం అవసరం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.