307 మగవాళ్ళ నోట్లో కూడ నువ్వు గింజ నానకూడదని, శపించాలా?
చర్చనీయాంశాలు: 307, కట్జూ, న్యాయవ్యవస్థ అవినీతి, సుప్రీం కోర్టు, Supreme Court, తిక్కన, మహాభారతం
విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ మార్కండేయ కట్జూగారు యథావిధిగా ఒక చిన్నబాంబు పేల్చారు. దాని ప్రకారం, శ్రీ కట్జూగారు మద్రాసు హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఉండగా, తమిళనాడులో అవినీతి ఆరోపణలకు గురియైన ఒక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగారికి, ఇంటెలిజెన్సు బ్యూరో వారు వ్యతిరేక రిపోర్టు ఇచ్చినప్పటికీ, ఆనాటి తమిళనాడులోని ఒక ముఖ్య రాజకీయపార్టీ వత్తిడికి, కేంద్ర ప్రభుత్వ వత్తిడికి గురి అయ్యి, ఆనాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగారు ఆ ''అన్యాయమూర్తి '' పదవిని ఏడాది పొడిగించారు. ఈసంగతి నాటి ప్రధాని శ్రీమన్మోహన్ సింగు గారికి , న్యాయశాఖామంత్రికి కూడ తెలుసుట. తరువాత వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు అదే న్యాయమూర్తిని హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించి, ఆంధ్రప్రదేశ్ కి బదిలీ చేశారుట.
ఈవిషయాన్ని బయట పెట్టటానికి, శ్రీ కట్జుగారికి పదేళ్ళు పట్టింది. సదరు అవినీతి న్యాయమూర్తిగారు దివంగతులయ్యారు.
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు అని కాంగ్రెసు అంటున్నది. మన్ మోహన్ సింగు గారు నా దృష్టికి రాలేదన్నారు. ఇంకా నయం, తన దిగ్భ్రాంతిని ప్రకటించి, అదేదో పేలుడు మరణమనుకొని, ప్రధాన మంత్రి సహాయనిధినుండి, ఒక పదిలక్షల రూపాయలు కట్జూగారికి పరిహారంగా ప్రకటించలేదు.
కట్జూగారు పరిశీలించతగిన ఒక విషయం చెప్పారు. నేను చెప్పింది సత్యమా, ఆసత్యమా అనేది ముఖ్యం గానీ ఎన్నాళ్ళ తరువాత చెప్పాను అనేది ముఖ్యం కాదు.
అన్నా ద్రముక వారికి డి.ఎమ్.కే. ని కొట్టటానికి ఒక కొరడా దొరికిందని, వదలకుండా, లోక్ సభలో హడావుడి చేశారు.
వైబీరావు గాడిద ఊహలు
విశ్రాంత సుకోన్యామూ శ్రీమార్కండేయ కట్జూగారికి క్షమాపణలు చెప్తు ఒక చేదు నిజాన్ని వ్రాయక తప్పటంలేదు. వారు దేశక్షేమం, న్యాయ వ్యవస్థ మంచిని కోరే, ఈనిజాన్ని బయటపెట్టి ఉండ వచ్చును.
కానీ, శ్రీ కట్జూగారిని మహాభారతం లోని కుంతీదేవితో పోల్చక తప్పటం లేదు. సూర్యుడి దయతో తనకు జన్మించిన కర్ణుడిని లోకాపవాద భీతితో ఒక పెట్టెలో ఉంచి, గంగానదిలో వదిలేసిన రహస్యాన్ని కుంతి తన కడుపులో భద్రంగానే దాచుకున్నది.
భారత యుధ్ధం ముందు శ్రీకృష్ణుడు కర్ణుడికి ''నీవు కుంతి కొడుకువి, కనుక కౌంతేయుడివి, ధర్మరాజుకి అగ్రజుడివి, '' అని చెప్పి పాండవ పక్షానికి మళ్ళించటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
తరువాత కుంతి కర్ణుడి దగ్గరకు వెళ్ళి ''నీవు నా కొడుకువే రా నాయనా, '' అని కర్ణుడి ముందు ఏడుస్తుంది. కర్ణుడు తల్లిపై జాలి పడి, అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు.
భారత యుధ్దం అంతా అయిపోయి, ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాక, ఆయనకు కుంతి చేసిన దాపరికం నారదుడు చెప్తే, తెలిసింది. కడుపులో మండి, కుంతిని శపించాడు.
తిక్కన విరచిత ఆంధ్రమహాభారతం, శాంతిపర్వం, ప్రధమాశ్వాసం, 40 వచనం, మరియు 41 వ పద్యం.
వచనం:--
అనుటయు నవ్వచనంబులు దనకు నసహ్యంబు లైనం గటకటంబడి యద్దేవి నాలోకించి వదీయ మంత్ర కార్య గోపనంబునం గాదె యింత పుట్టెనని పలికి యంత నిలువక,
తేటగీతి.
అంగనా జనమ్ములకు రహస్య రక్ష
ణంబు నందలి శక్తి మనంబు లందుఁ
గలుగ కుండెడు మెల్ల లోకముల నని శ,
పించె నా ధర్మ దైవతా ప్రియ సుతుండు.
వ్యాసుడు. సంస్కృత మహాభారతం, పన్నెండవది అయిన శాంతి పర్వం, 6వ ఆధ్యాయం, 10, 11 శ్లోకాలు.
భవత్యా గూఢమంత్రత్వాద్వంచితాః స్మ తదా భృశం
శశాప చ మహాతేజాః సర్వలోకేషు యోషితః
న గుహ్యం ధారయిష్యంతీత్యేవం దుఃఖసమన్వితః.
జస్టిస్ కట్జూ గారు ఇంత ముఖ్య విషయాన్నిపది సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టినట్లు? అందుకే పురుషులకు కూడ నోట్లో నువ్వు గింజ నానకుండా శాపమీయటం అవసరం.
ఇంకో ప్రధాన సమస్య
ఈ అవినీతి ఆరోపణలకు గురియైన జడ్జీ గారి పేరు జస్టిస్ అశోక్ కుమార్ ట. ఆ అవినీతి న్యాయమూర్తిగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడ పనిచేశాడుట. ఎన్నేళ్లు చేశాడో ఏమిటో, మరి అయ్యవారు ఇచ్చిన తీర్పులలో, ఎన్నితీర్పులు ఎన్ని లంచాలు తీసుకుని ఇచ్చిన తీర్పులో? ఈయన (ముఖ్యంగా సింగిల్ జడ్జీగా ఇచ్చినవి, అపీల్ లేక రివిజన్ చేయబడనివి) ఇచ్చిన తీర్పులకు ఎంతమంది అభాగ్యులకు అన్యాయం జరిగిందో మనకు తెలియదు. నిజంగా న్యాయం జరగాలంటే, ఆతీర్పులన్నిటినీ, ముఖ్యంగా సింగిల్ జడ్జీగా ఇచ్చిన తీర్పులను తిరగతోడాల్సిన అవసరం ఉంది. సైధ్ధాంతికంగా ఇది అవసరం. కానీ ఆచరణాత్మకంగా ఇది అసాధ్యం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.