చర్చనీయాంశాలు: mahabharata , మహాభారతం, నన్నయ, పద్యకవిత్వం
కొన్ని కథలను,సంఘటనలను చూస్తుంటే, కొన్నిసార్లు మనుష్యులకన్నా పక్షులే నీతిపరులేమో అని పిస్తుంది. పక్షులకు నీతి శాస్త్రం, ధర్మాధర్మాలు తెలుసా అనే విషయాలను ప్రక్కన పెడితే, నన్నయ భారతంలోని సుందర పద్యాన్ని ఒకదాన్ని చూద్దాం.
నన్నయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 308వపద్యం నుండి.
మహాభారతంలో సందర్భం: పాండవులు ఇంకా మయసభను నిర్మించలేదు. ధర్మరాజు ఇంద్రప్రస్థం లో రాజ్యం చేస్తున్నాడు. కృష్ణార్జునులు వాహ్యాళికి ఖాండవ వనానికి వెళ్ళారు. అక్కడ వారు విశ్రమిస్తూ ఉండగా, అజీర్ణంతో బాధ పడుతున్న అగ్నిదేవుడు, వనమూలికలతో కూడిన ఖాండవాన్ని తాను దహనం చేస్తే తన అజీర్ణం తగ్గుతుందని సహాయం చేయమని కృష్ణార్జునులను కోరాడు. కృష్ణార్జునులు దానికి అంగీకరించి అగ్నికి బాసటగా నిల్చున్నారు.
ఖాండవదహనం మొదలయ్యింది. వృక్షాలతో పాటు పశు పక్ష్యాదులు కూడ అగ్నికి ఆహుతి ఆవుతున్నాయి. చుట్టు పొగలు కమ్మేశాయి. అగ్నికి ఆహుతి కావలసిన పక్షులలో జరిత అనే ఆడపక్షి, దాని నాలుగు పిల్లలు ఉన్నాయి. వాటికింకా రెక్కలు రాలేదు. మగపక్షి మందపాలుడు తన మొదటి భార్య అయిన లపితతో ఖాండవం బయట విహరిస్తున్నాడు. బయట ఉన్న మందపాలుడు తన పిల్లలను రక్షించమని అగ్నిదేవుడిని వేడుకున్నాడు. అక్కడ జరిత పిల్లలను ఎలారక్షించుకోవాలో , తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియక కళవళ పడుతున్నది.
తండ్రి బాధ్యతారాహిత్యంవల్ల తల్లి పడే బాధను గమనించండి.
304వ పద్యం, కందం.
వీరలఁ దోడ్కొని పోవగ,
నేరను బాలకులఁ బెట్టి నిర్దయబుధ్ధిన్
వీరల తండ్రి క్రియం జన
నేరను విధికృతము గడవ నేరఁగ లావే.
చంపకమాల.
ఇది ప్రళయాగ్ని వోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫు లింగముల్
వదలక వాయుసారథి జవంబునఁ దానిట వచ్చె ఏమి సే
యుదు సుతులార యీ బిలము నొయ్యెన పోయి చొరుండు దీనిఁగ
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి తాక కుండగన్.
ఇంకో చంపకమాల.
కొడుకుల బ్రహ్మ విత్తములఁ గోరిన యట్టుల వీరి నల్వురం
బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందక యుండఁ బెంచుచున్
నడవుమటంచు నన్ను మునినాథుఁడు మీ జనకుండు పంచి యి
ప్పుడ యెటయేనిఁ బోయె హుత భుక ప్రళయంబు దలంప కక్కటా.
వైబీరావుగాడిద వ్యాఖ్య: ఇందులో కరుణ రసాన్ని గమనించండి. ఆంగ్లకవులు John Milton జాన్ మిల్టన్ వంటి వారు కూడ ఇటువంటి verses వ్రాయలేరు అని నా వ్యక్తిగత అభిప్రాయం.
వచనం.
అని దుఃఖితయైయున్న తల్లిం జూచి యగ్రతనయుండైన జరితారి యిట్లనియె.
తేటగీతి.
బిలము సొచ్చితిమేని నందెలుక చంపు,
నంద యుండితిమేనిఁ దానేర్చు నగ్ని
యెలుకచేఁ జచ్చు కంటె నీ జ్వలనశిఖలఁ,
గ్రాఁగి పుణ్యలోకంబులఁ గాంతు మేము.
వచనం.
మఱియు మాంపిండంబుల మయి యున్న మాకు బిల ప్రవేశంబున మూషక భయంబు నియతం బింద యుండిన నగ్ని భయంబు సంశయితం బెట్లనిన.
కందం.
జ్వలనంబు వాయువశమునఁ,
దొలఁగుడు జీవనము మాకు దరకొనుఁ గృఛ్రం
బుల సంశయ యుతకార్యం
బులు కర్తవ్యములు నియతములు వర్జ్యమ్ముల్.
వచనం
కావున నీవు మెచ్చిన చోటికిఁ బోవనోపము మావలని మోహంబు విడిచి యరుగుము. ఏము దహన క్లేశంబునం బొందినను జీవించి పుత్రులం బడయ నోపుదువు, నీ పుణ్యవశంబున మాకు నగ్ని భయంబు తొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతువని కొడుకులెల్ల మ్రొక్కినం జూచి జరితయు బాష్పపూరిత నయనయై యాసన్న తరు గుల్మ గహన దహన మహోత్సాహుండయి వచ్చు హవ్యవహనుం జూచి ప్రాణభయంబున గగనంబున కెగసి చనెనంత.
కందం.
నలుగురు నాలుగు వేద,
మ్ముల మంత్రము లొప్ప బ్రహ్మ ముఖములు వోలెన్
వెలయంగ సంస్తుతించుచు,
నలఘులు మాకభయ మభయ మనిరయ్య ననలున్.
వచనం.
అగ్ని దేవుండప్పుడు మందపాలు ప్రార్ధనం దలంచి యన్నలువురు శార్ఙకులు నున్న వృక్షంబు భక్షిపక పరిహరించిన జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకుల యొద్దకు వచ్చి సుఖంబుండెన్.
అంత నక్కడ మందపాలుండు పురందరువనంబు దహనుచేత దగ్ధంబగుట యెఱింగి యందున్న జరితను బుత్రులం దలంచి యతి దుఃఖితుడయి లపిత (మొదటి భార్య) కిట్లనియె.
కందం.
తరుణుల నజాత పక్షులఁ,
జరణంబులు లేనివారి శార్ఙేయుల న
ల్వుర నొక్కతె యెట దోడ్కొని ,
యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్.
ఇంకో కందం.
మఱచు నొకొ మఱవకుండియు,
నెఱుగక యుండు నొకొ యనలుఁ డెఱిఁగి యు నెడనే
మఱునొకొ పుత్త్రులఁ గానక ,
గుఱుకొని నమ్మంగ నగునె క్రూరాత్మకలకున్.
అనిన విని లపిత యిట్లనియె.
కందం.
నా యొద్దన ప్రార్ధించన,
వాయు సఖుండపుడు నీకు వరదుండయి శా
ర్ఙేయుల నలువురఁ గాతును,
ధీయుత యని పలికె మఱచితే ముని నాథా.
(నీకు అగ్ని దేవుడు వాగ్దానం చేశాడు కదా, అని లపిత గుర్తుచేస్తున్నది.)
వచనం.
ఆలికి నెయ్యుండవయి దాని యోగ క్షెమంబరయం దలంచితది పులుఁగెట యేని యుం బఱచుం గా కేమి యయ్యెడు, వగవకుండుము అనిన మందపాలుండు వసిష్ఠునట్టి పురుషునైన నరుంధతి యట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు సంశయింపకుండదిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని ఖాండవంబునకు వచ్చి పుత్ర సహితయయి కుశలిని యయి యున్న జరితంజూచి సంతుష్టుండై నిజేచ్చ నరిగె.
అగ్ని దేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవ వనౌషధంబు లుపయోగించి విగత రోగుండయి కృష్ణార్జునుల దీవించే చనియెన్. అంత.
(ఇంద్రుడు అర్జునునకు ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలను ఇచ్చాడు.)
పక్షి పిల్లల్లో ఇటువంటి ధర్మ బుధ్ధిని చిత్రించటం, భారతీయులకే సాధ్యమేమో. నాన్ ఋషిః కురుతే కావ్యం, అంటే ఋషి కాని వాడు కావ్యం వ్రాయలేడు, అంటారు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
రు అగ్నికి ఆకలెయ్యటం, ఇష్టం వచ్చినట్లుగా తినటం, మళ్ళీ అజీర్ణం తగ్గటానికి వనమూలికలను తినటం కొరకు అడవిని దహించటం, ఈ మొత్తం fantasy అవుతుంది, తప్ప వాస్తవాలను ప్రతిఫలించదు. ఈకథను నిజం అనుకొని చదవటానికి, సత్యాన్వేషణకు పొంతన ఉండదు. ఒక సాహిత్యవిశేషంగానే చదవాలి. రమ్యమైన పద ప్రయోగాలు, సమాసాలు, ఉపమాద్యలంకారాలు, లోకోక్తులు, ఇవన్ని దండిగానే ఉన్నాయి.నన్నయ కన్నా వ్యాసుడు చాల సుదీర్ఘంగా వ్రాశాడు. ఇంచుమించు వంద శ్లోకాల దాకా ఉన్నాయి. నన్నయ క్లుప్తీకరించాడు. మందపాలుడిచేత వ్యాసుడు అగ్నిదేవుడికి చేయించిన స్తుతి ఒకసారి చూద్దాము.
ఆదిపర్వం. 255వ ఆధ్యాయం. 23వ శ్లోకం నుండి.
త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్॥ 1-255-23
త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక। త్వామేకమాహుః కవయస్త్వామాహుస్త్రివిధం పునః॥
త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్। త్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్షయః॥
త్వదృతే హి జగత్కృత్స్నం సద్యో నశ్యేద్ధుతాశన। తుభ్యం కృత్వా నమో విప్రాః స్వకర్మవిజితాం గతిం॥
గచ్ఛంతి సహ పత్నీభిః సుతైరపి చ శాశ్వతీం। త్వామగ్నే జలదానాహుః ఖేవిషక్తాన్సవిద్యుతః॥
దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రంయ హేతయః। జాతవేదస్త్వయైవేదం విశ్వం సృష్టం మహాద్యుతే॥
తవైవ కర్మవిహితం భూతం సర్వం చరాచరం। త్వయాపో విహితాః పూర్వం త్వయి సర్వమిదం జగత్॥
త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్సంప్రతిష్ఠితం। త్వమేవ దహనో దేవ త్వం ధాతా త్వం బృహస్పతిః॥
త్వమశ్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.