299 పది శాతం మంది భారతీయులకు ఇళ్ళలో ఫ్రిజ్ లు లేక పోతే ఏమవుతుంది?
చర్చనీయాంశాలు: 299, ఫ్రిజ్ లు, విద్యుత్, మద్యం, కాలుష్యం, దిగుమతులు, Refrigerators, Electricity, Pollution, Imports
ఫొటో కేవలం రిఫ్రిజిరేటర్ యొక్క బొమ్మ కొరకు మాత్రమే
కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, భారత్ లో కేవలం పది శాతం గృహాలలో మాత్రమే రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. 90% ఇళ్ళల్లో లేవు.
నా అదృష్టం ఏమిటంటే, ఆ 90% ఇళ్ళల్లో మాఇల్లు కూడ ఉన్నది.
తప్పో రైటో, నేను ధైర్యం చేసి, ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రిజ్ కొనకూడదనే నిర్ణయం తీసుకున్నాను. ఈనిర్ణయం తీసుకుని 20 ఏళ్ళయింది. మాఇంటికి వచ్చిన ప్రతివాళ్ళూ మీఇంట్లో ఫ్రిజ్ నీళ్ళు లేవా, అయ్యో అని నా పై జాలి చూపుతుంటే, నవ్వకుండా, ముఖం మాడ్చుకోకుండా, రాయిలాగా ఉండటం నాకలవాటు అయ్యింది. కుండలో నీళ్ళు ఆఫర్ చేయటం, అతిథులు వాటిని తాగినట్లుగా నటించి వదిలేయటం, దానిని చూడలేక తలదించుకోటం నాకలవాటయింది. వచ్చిన బంధువులు ఫ్రిజ్ లేక పోవటాన్ని ఏదో ఘోరమైన లోపంగా చూడటాన్ని నేను చూడలేక, అసలే స్కెప్టిక్ గా , సినిక్ గా, పెసిమిస్టిక్ గా ఉండేవాడిని, ఇంకాస్త ముదిరిపోయాను.
డిటో, డిటో, ముటాటిస్ ముటాండిజ్ ఎయిర్ కూలర్లకు కూడ వర్తిస్తుంది.
కారణాలు
1. చాలా ఫ్రిజ్ లు రోజుకి రెండు యూనిట్లదాకా కరెంటు ఖర్చు చేస్తాయి. నెలకి 60 యూనిట్ల దాకా బిల్ అవుతుంది. సరే, సలహాలు, టిప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు. బిల్లును మనమే కట్టినా, విద్యుత్ ను అధికంగా ఉత్పత్తి చేయాల్సిన భారాన్ని మనం ప్రభుత్వం పై వేసిన వాళ్లమవుతాం. మనం దేశానికి సేవ చేయలేం బాగానే ఉంది, కాని దేశంపై భారం వేయకుండా ఉండటం కూడ ఒక దేశసేవే అని నేను నమ్ముతాను.
2. ఫ్రిజ్ లను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. ఇది పని భారాన్ని పెంచుతాయి. అవి మనకు సేవ చేయటం పోయి వాటికి మనం సేవచేయాల్సి వస్తుంది.
3. నా మూఢవిశ్వాసం ఏమిటంటే, నేను విన్నది ఏమిటంటే, ఫ్రిజ్ లు క్లోరో ఫ్లూరో కార్బన్ లు అనే కాలుష్యకారకాలను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
4. ఈ ఫ్రిజ్ లకు , ఎయిర్ కూలర్లకు, కావాల్సిన విద్యుత్ ను ఉత్పత్తి చేయటానికి బొగ్గును, లేక సహజవాయువును దిగుమతి చేసుకోవాలి.
5. నాన్-వెజ్ బాగా తినే వాళ్ళకి, బాగా మందు కొట్టే వాళ్ళకి ఫ్రిజ్ లు బాగా ఉపయోగిస్తాయని నా నమ్మకం. బీరు, సోడాలు, మొ||| వాటిని శీతలీకరించుకొని, అర్ధరాత్రి మూడ్ వచ్చినపుడు లాగించటానికి పనికి వస్తాయని, శాకాహారులకి ఉపయోగించవని నా మూఢ నమ్మకం.
6. కొత్తిమీర కట్టలకోసం ఫ్రిజ్ అవసరమా అనిపిస్తుంది. సాంబారు వంటి వాటిని ఫ్రిజ్ లో పెట్టి వారం రోజులు తింటున్నారని , అందువల్ల జీవితాలు యాంత్రికంగా తయారు అవుతున్నాయని ఒకఅభిప్రాయం ఉంది.
7. ఈరోజుల్లో, రెఫ్రిజిరేటర్లలో, ఏసీల్లో, టీవీల్లో, కార్లలో, దిగుమతి చేసిన కాంపోనెంట్లు ఎక్కువగా వాడటం వల్ల, ఎస్ కె డీ లు (సెమీ నాక్ డ్ డౌన్ కిట్లు) ఉపయోగించటం వల్ల, దిగుమతుల బిల్లు పేలిపోయి, బ్యాలెన్సు ఆఫ్ పేమెంట్ సమస్యలు విషమించటం, కాడ్ (కరెంట్ ఎకౌంట్ డెఫిషిట్) ఆందోళనకరంగా తయారవుతున్నది. మనం ఇంపోర్టు సబ్-స్టిట్యూషన్ ను సాధించేదాకా, దేశంలో ఫ్రిజ్ లను, ఏసీలను, టీవీలను, కార్లను ఉత్పత్తి చేయటాన్ని, అమ్మటాన్ని నియంత్రించటం మేలేమో నని నా చిన్నబుర్రకి అనిపిస్తుంది.
8. ఫ్రిజ్ వాటర్, నిలవున్న సాంబార్ మొ|| త్రాగటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయేమోనని, నా మూడ నమ్మకం.
9. ఈ నానా విధ యంత్రాలకు రిపేర్లు వచ్చినపుడు, సర్వీస్ ఇంజనీరునో, మెకానిక్ నో పిలవటం, వాడి రాక కోసం నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాధ వేచేనురా అని ఎదురు చూడటం, వచ్చినవాడు పార్టులు పోయినాయి, ఇవి వారంటీ లో కవర్ కావనటం, లేక ఏ చెన్నయి నుండో తెప్పించి వచ్చాక వేస్తామనటం, ఇవన్నీ మన పనులను , యాంగ్జయిటీనీ పెంచుతాయి.
నమస్సులు
ఫ్రిజ్ లు, ఎయిర్ కండీషనర్లు, కార్లు లేని 90% ప్రజలకు నా నమస్సులు. దరిద్రంలో గ్లోరీ ఉందని చెప్పటం నా ఉద్దేశ్యం కానే కాదు. చేతుల్లోకి అన్యాయంగానో, న్యాయంగానో, క్యాష్ వచ్చిపడుతున్నది కాబట్టి లేక ఇన్స్టాల్ మెంటు పధ్ధతిలో అమ్ముతున్నారు కాబట్టి వస్తువులను కొనేయటం ఉత్తములకు శోభించదు. చెల్లియుండియు సైరణ చేయటం వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.