298 అత్యధిక భారతీయ ప్రధానమంత్రులు అనంత సముద్రాంతర యాత్రికులే.
చర్చనీయాంశాలు: 297, Prime Ministers,Indira,Nehru,Manmohan,Rajiv,Vajpayee,Narasimha Rao,China,Brazil, Russia, Japan
భారత ప్రధాని శ్రీ మాన్ నరేంద్ర మోడీ గారు, రెండు ప్రత్యేక విమానాల్లో (ఒకటి తనకు, తన ఆంతరంగికులకు, రెండవది మిగిలిన వారి. ఇది భారతీయ ప్రధాన మంత్రుల, రాష్ట్ర పతుల ఆచారం) ఎగురుతూ, బ్రిక్ సమావేశానికి బ్రెజిల్ వెళ్ళారు. పోతూ పోతూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగుగారిని తన సీటును చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు. భారత రైల్వేల జనరల్ కంపార్టుమెంట్లలో తిరిగే వాళ్ళకు అనుభవం ఉండే ఉంటుంది. టాయ్ లెట్ కి వెళ్ళేవాడు, తన సీటుపై తువ్వాల్ వేసుకొని, ప్రక్కన ఉన్నావాడికో, ఎదురుగా ఉన్నవాడికో సీటుకాపలా కాయమని చెప్పి వెళ్తాడు. ఈలోపల, ఈరెండోవాడు, కావాలనుకుంటే, అయిదు నిమిషాలు ఆసీటు పై ముడ్డానించుకోవచ్చు, లేక కాలుపెట్టుకోవచ్చు. వెళ్ళిన వాడు టాయ్ లెట్ నుండి వెనక్కిరాగానే, ముడ్డినీ కాలునూ వెనక్కి తీసుకోవాలి.
బ్రిక్ అంటే విజ్ఞులైన పాఠకులకు తెలుసు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా.
రష్యాకు తాను ఉక్రెయిన్ లో చేస్తున్న ప్రాక్సీ యుధ్ధానికి, బ్రెజిల్-ఇండియా-చైనా దేశాల మద్దతు కావాలి. పాశ్చాత్యదేశాల మీద, వారు శాంక్షన్లు విధించకుండ, వత్తిడి తేవటానికి ఈ మద్దతు ఉపకరిస్తుంది.
చైనాకు, తాను దక్షిణచైనా సముద్రంలో జపాన్ తోతలపెట్టిన కోల్డ్ వార్ పై, రష్యా-భారత్ ల మద్దతు కావాలి.
బ్రెజిల్ ఇలాటి సమస్యలేమీ లేవు. దాని వాంఛ ఒకటే, ఏనాటికైనా ఐరాస భద్రతా సంఘంలో (దక్షిణ అమెరికా ప్రతినిధి?) శాశ్వత సభ్యత్వం కావాలి. దీనికి బ్రెజిల్ కు భారత్-చైనా-రష్యాల మద్దతు కావాలి.
భారత్ కు చైనాతో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ ల సరిహద్దు సమస్యలకు, బ్రిక్ దేశాలు చేయగలది ఏమీ ఉన్నట్లుగా కనపడదు. భారత్ కు కూడ తనకు తీరని కోరిక, భద్రతా సమితి శాశ్వత సభ్యత్వానికి చైనా అడ్డుపడకుండా ఉంటే చాలని కోరుతుందేమో. అంతకు మించి బ్రిక్ నుండి భారత్ ఆశించాల్సింది ప్రాధమికంగా ఉండదు.
బ్రిక్ దేశాలకు ఒక బ్యాంకు ఉండాలని శ్రీ నరేంద్ర మోడీగారు కోరుకోటం తప్పుకాదు కానీ, ఇవన్నీ విష్ ఫుల్ థింకింగ్ తరగతి లోకి వస్తాయి. చైనా వద్ద విదేశమారక నిధులు భారీగా ఉన్నాయి. అది తన నిధులన్నిటినీ, అమెరికన్, యూరోపియన్ బ్యాంకులలో పెట్టటానికి వెనుకాడుతున్నది. చైనా తన విదేశీ నిధులను బ్రిక్ దేశాల బ్యాంకుకు పెట్టుబడిగా కానీ, డిపాజిట్ గా కానీ సమకూరిస్తే, ఆనంద కరమే కానీ, దేశాలు ప్రాధమికంగా తమకు ఏది లాభమో చూసుకుంటాయి గానీ, స్నేహానికి పెద్ద విలువ ఇవ్వవు.
ఇది ఇలా ఉంటే, ఇపుడు అసలు సమస్యకి వద్దాము.
స్వదేశంలో ఉక్క, భారత ప్రధానులకి విదేశాలే కూలింగ్ సెంటర్లు
భారత జనాభా 129 కోట్లకు చేరుకుంది. మన సమస్యలు ఆహార కొరత, దారిద్ర్యం, ధరల పెరుగుదల, తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదికాక పదవులకోసం, నిధులకోసం, సప్లై కాంట్రాక్టుల కోసం పీక్కుతినేవాళ్ళు చుట్టుముట్టుతూ ఉంటారు. ఈఉక్కకు, ఉష్ణానికి తట్టుకోలేక గతంలో మన్మోహన్ సింగు గారు, నేడు శ్రీమోడీగారు విదేశాలంబటి తిరుగుతున్నారా అనే అనుమానం కలుగక మానదు.
అయితే ప్రధాన మంత్రులు శాశ్వత విదేశీ యాత్రికులయ్యే ఆచారం భారత్ లో ఈనాటిది కాదు. ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి కాలం నుండీ వస్తున్నది. కొంత మేరకు లాల్ బహదూర్ శాస్త్రిగారు మినహాయింపు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, విపి సింగు, అటల్ బిహారీ వాజపేయీ, మన్ మోహన్ సింగు, వీరంతా విదేశీ పర్యటనలలో ఆరితేరిన వారే.
ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత, అన్నట్లుగా ఒక్కోటి వెయ్యేసి కోట్లు ఖర్చుచేసి వివిఐపీ ల ప్రయాణాలకు ప్రత్యేక భద్రతా విమానాలను కూడ కొనుక్కున్నారు.
ఇంగ్లండు, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, జపాన్ మొ|| దేశాల ప్రధాన మంత్రులకు-అధ్యక్షులకు, భారత ప్రధానులకు-రాష్ట్రపతులకు ముఖ్యభేదమేమిటంటే, ఆదేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఏదేశంలో పర్యటించినా, తమదేశాలకు చెందిన సరుకులను అమ్మటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు తెలుసు, ఎక్స్పోర్ట్ ఆర్ పెరిష్ అనే సూత్రం పై తమ దేశాలు బ్రతకక తప్పదు. మన ప్రధానులు రాష్ట్రపతులు ఎక్కడికి వెళ్ళినా దిగుమతుల ఒప్పందాలను, సాంస్కృతిక ఒప్పందాలను మూటగట్టుకొని వస్తారు. వెళ్లిన చోట, గౌరవ డాక్టరేట్లు, పౌరసత్వాలు కాక, గేటు దాక వచ్చి సాగనంపటం కాక, ఏవైనా మత్తెక్కిచ్చే పనులేమైనా చేస్తారేమో, కొన్ని సార్లు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెట్టే వాగ్దానాలను చేసి వచ్చి, ఇండియాలో అమలు పరచటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అణు ఒప్పందం పై, శ్రీమన్మోహన్ సింగు గారు, అమెరికాలో చేసి వచ్చిన వాగ్దానాలు, దీనికి చక్కని ఉదాహరణ. వాటిని భారత్ లో అమలు పరచటానికి, లోక్ సభలో నెగ్గించుకోటానికి, ఆయన పార్టీవారు చివరికి పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేయవలసి వచ్చింది. అమెరికాకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి, ఆయన రాజీనామా చేస్తానని బెదిరించ వలసి వచ్చింది. కాంగ్రెస్ అనవసరంగా సిపిఎమ్ వంటి నమ్మకమైన మద్దతు దారుని కోల్పోయింది. పోనీ, అమెరికాతో శ్రీ సింగు గారు చేసుకున్న అణు ఒప్పందం వల్ల మేలు ఏమైనా జరిగిందా అంటే సందేహాస్పదమే.
భారత్ కు ఇద్దరు ప్రధానులు అవసరం
129 కోట్ల జనాభా ఉన్న ఈదేశానికి ఇద్దరు ప్రధానులు ఉండటంలో తప్పులేదు. అధికార వికేంద్రీకరణ కోణంలోంచిచూసినా ఇది అవసరమే. తరచుగా ప్రధాని విదేశ పర్యటనలకు వెళ్తే , ఇక్కడ ఉన్న అసలు సమస్య అవినీతి, దరిద్రం, ఆదాయం-సంపదలలో వ్యత్యాసాలు ఈసమస్యలను ఎవరు పరిష్కరిస్తారు. మితిమీరిన అధికార కేంద్రీకరణ జరిగినందు వల్ల ప్రధాని విదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ, పాలన మూలపడుతూ ఉంటుంది. మంత్రులు , బ్యూరోక్రాట్లు, ఆటవిడుపుగా భావించి , అయ్యగారు వెనక్కి వచ్చేదాకా, తాము చెయ్యాల్సింది ఏమీ లేదనుకొని, విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు.
భారత్ కు మొదటి ప్రధాని Prime Minister-External, రెండవ ప్రధాని Prime Minister-Internal అవసరం.
Prime Minister-External గారికి కొందరు కేంద్ర మంత్రులను తగిలించ వచ్చు. విదేశాంగ మంత్రి, సరిహద్దుల రక్షణ మంత్రి , రక్షణ కొనుగోళ్ళమంత్రి, విదేశ కామర్సు మంత్రి, సార్కు వ్యవహారాల మంత్రి, విదేశీ పెట్టుబడుల మంత్రి, విదేశీ టూరిజం, విదేశీ విద్య మొ|| కేవలం విదేశీ మరియు అంతర్జాతీయ పధ్ధతులయెడల సరియైన అవగాహన కావలసిన శాఖలను Prime Minister-External గారి చేత పర్యవేక్షింప చేసి ఆయనను బాధ్యుడిని చేయ వచ్చు. ఆయన 24 గంటలు విదేశీ పర్యటనలు చేసుకున్నా మనకు ఇబ్బంది ఉండదు.
ప్రస్తుతం రాజ్ నాథ్ సింగు గారికి శ్రీ మోడీ గారు, గుడిసె కాపలా అప్పగించి వెళ్ళారు. శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారి పెద్దరికాన్ని సుష్మా స్వరాజ్, శ్రీ అరుణ్ జైట్లీగారు, ఎంతవరకు మన్నిస్తారో తెలియదు. వారంతా ఒక్కటే అన్నట్లుగా కనిపించినా, సబ్ లిమినల్ గా నేతా సహజమైన కాంక్షలు ఉంటాయి.
ప్రధాని ఇంటర్నల్ గనుక ఉంటే, దేశంలోని ఆంతరంగిక వ్యవహారాలన్నీ ఆయన శ్రధ్ధగా చూసుకోవచ్చు. కేవలంప్రధానమంత్రి విదేశాలనుండి వెనక్కి రావటం కొరకు ఏదీ వేచి ఉండ నవసరంలేదు.
భారతీయ ప్రధానుల ప్రధాన జబ్బు ఏమిటంటే, వారు అధికారాన్ని పంచుకోటంలో వారు ఏకాకులు, పరమ నియంతలు. ఎట్టి పరిస్థితులలోనూ, వారు తమ అధికారాన్ని షేర్ చేసుకోటానికి ఇష్టపడరు.
ఈ సందర్భంగా పోస్టు నంబర్ ౩౧౩ కూడ చూడండి.Click to see 313.
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.