268 భూస్వామ్య వ్యవస్థలు, పెట్టుబడి దారీ వ్యవస్థలు భారత్ కు పనికిరావు
చర్చనీయాంశాలు: 268, నరేంద్రమోడీ, రిజర్వుబ్యాంకు, భూస్వామ్య వ్యవస్థ, ఇందిరాగాంధీ, ఢిల్లీ యూనివర్సిటీ
శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత పబ్లిసిటీ స్పృహ అదే స్థాయిలో కలిగిన ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోడీ. శ్రీమతి ఇందిర పాలించిన కాలంలో, మీడియా మొత్తం శ్రీమతి ఇందిరా వాక్కులతో, యాత్రావివరాలతో, నిండి ఉండేవి. శ్రీ నరేంద్రమోడీ గారు ఎంత చిన్న పనిచేసినా, ఆఫొటో, ఆవార్త, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వెంటనే దర్శనమిస్తుంది. శ్రీమోడీని దర్శించటానికి వచ్చిన వాళ్ళు కూడ పబ్లిసిటీ కాన్షస్ అయితే ఇంక డబుల్ ధమాకా.
శ్రీమతి ఇందిరా గాంధీ emergency అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో ఉద్యోగులు ఎన్నింటికి వస్తున్నారు అనే విషయంపై కొంతకాలం కొంత హడావుడి చేసారు. అత్యవసర స్థితి కాలంలోనే, ఆహడావుడి అవసరం తీరిందని పాలకులు అనుకోగానే, కుక్కతోక వంకరలాగా పరిస్థితి మొదటికి వచ్చింది.
శ్రీ నరేంద్రమోడీ పాలనకు పగ్గాలు తీసుకోగానే, ఉద్యోగులను ఏదో క్రమశిక్షణలో పెట్టేస్తున్నారు అనే మీడియా ప్రచారం మొదలయింది. ఉద్యోగులలో కొంత భయాన్ని నయా పాలకులు ప్రవేశ పెట్టటం తప్పుకాక పోయినా, ఆతరువాత ఆభయాన్ని లూజ్ చేసినపుడు, క్రమశిక్షణా రాహిత్యం రెట్టింపు అవుతుంది.
ఉద్యోగులు, నౌకర్లను తాము 24 గంటలు పర్యవేక్షిస్తేగానీ వారు పని చేయరనుకోటం, పెట్టుబడిదారీ విధానపు మూఢ నమ్మకాలలో ఒకటి.
ప్రాధమికంగా ప్రతి మనిషీ , ముఖ్యంగా ప్రతి భారతీయుడూ, పని చేయాలనుకుంటాడే తప్ప, పని ఎగ్గోట్టి ఉచితంగా జీతం తీసుకోవాలనుకోడు. అదేసమయంలో, కొంత పనిచేశాక, ఉష్ణమండల దేశం కాబట్టి, సులభంగా అలిసిపోయి, కొంత విశ్రాంతి , విరామం కోరుకోటం జరుగుతుంది. దీనిని సోమరి తనంగా యజమానులు భావిస్తారు. పెట్టుబడిదారీ విధానంలో, తాము ముల్లుకర్రతో పొడిచి టాప్ మేనేజర్లు, మిడిల్ మేనేజర్లు, ఎకౌంటెంట్లు, గుమాస్తాలు, నౌకర్లు, కార్మీకులు, కూలీలు, అందరినీ తాము పర్యవేక్షించి దారిలో పెట్తున్నామని యజమానులు అనుకుంటూ ఉంటారు. అది ఒక భ్రమ. ఈభ్రమ వల్ల వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అందు వల్ల టాప్ మేనేజర్లు, కూడ ఆత్మగౌరవం లేకుండా, కేవలం తమకు వచ్చే క్యాష్ పై దృష్టి పెట్టి తాము కూడ వేధింపులలో పాల్గొనటం జరుగుతుంది.
ప్రైవేటు రంగంలో హైర్ అండ్ ఫైర్ పధ్ధతిలో పధ్ధతిలో పనిచేయటానికీ, ప్రభుత్వరంగంలో జీవితకాలం పని చేయటానికీ చాల తేడా ఉంది. ప్రభుత్వం రంగంలో ఉద్యోగులు, సంస్థలు తమవి అనుకుంటారు. టాప్ ఎగ్జిక్యూటివ్ ల వలె తాము కూడ యజమానుల మనుకుంటారు. మధ్య మధ్య శ్రీమతి ఇందిరా గాంధీ, శ్రీ నరేంద్రమోడీ వంటి వారు అవతరించి మీరు కేవలం టైమ్ ప్రకారం వచ్చి పోయే టెంకయ్యలే అని గుర్తుచేసి టైముకి రా అని కొరడాలు ఝళిపిస్తు ఉంటారు. ఈ పధ్ధతిలో ఉద్యోగులు టైమ్ ప్రకారం వచ్చి పోతుంటారే తప్ప, వారిలో జీవం చచ్చి పోతుంది. వారిలో చొరవ అంతరిస్తుంది.
కొద్ది నెలల క్రితం 21.౩.2014 ప్రాంతంలో, మూడు నెలల ముందే రాజీనామా చేసిన విశ్రాంత రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ కమలేష్ చంద్ర చక్రవర్తి అనుకుంటాను, తన వీడ్కోలు సందర్భంగా , రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాలో, భూస్వామ్య సంస్కృతి నెలకొని ఉన్నది అన్నట్లు, నాకు గుర్తు.
“Ours is a very feudal system. I have no agenda. We (deputy governors) propose certain things and they become the governor’s agenda.”
తెలుగుసారం: ''...మాది ఒక చాల భూస్వామ్య వ్యవస్థ. నాకు ఎజెండాలేదు. మేము (డెప్యూటి గవర్నర్లము) కొన్ని విషయాలను ప్రతిపాదిస్తాము మరియు అవి గవర్నర్ యొక్క ఎజెండా అవుతుంది....''
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
రిజర్వుబ్యాంకు గవర్నర్ల మనసు నొచ్చుకోకుండా, తన మనసులోని విషయాన్ని స్పష్టంగా, నిర్మొహమాటంగా, చెప్పినందుకు శ్రీ కె.సీ. చక్రవర్తి గారికి అభినందనలు చెప్పాలి.
భూస్వామ్య వ్యవస్థలు కేవలం రిజర్వు బ్యాంకు కే పరిమితం కావు. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నిటిలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి. క్లోజ్ లీ హెల్డ్ కంపెనీలలోనూ ఉన్నాయి. వైడ్ లీ హెల్డ్ కంపెనీలలోనూ ఉన్నాయి.
రిజర్వుబ్యాంకులో ఉన్న భూస్వామ్య వ్యవస్థ కొంత మేరకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలలో కన్నా, ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో ఉన్నదానికన్నా మెరుగైనదనే చెప్పాలి. ఎలా అంటే, డిప్యూటి గవర్నర్లు ప్రతిపాదించిన విషయాలు గవర్నర్లకు ఎజెండా కావటం, నియంతృత్వానికి కాకుండా పార్టిసిపేటివ్ మేనేజిమెంటుకి సంకేతం అవుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలలో ఉండే ఆశించే పని పధ్ధతి ఏమిటంటే, అధికారులు, ఉద్యోగులు, తమ మెదళ్ళను ఇంటి దగ్గర వదిలేసి కార్యాలయానికి రావాలి. ఈరోజు బాస్ కి ఏమి కావాలి? ఏమి చేస్తే నాకు బాస్ అనుగ్రహం కలుగుతుంది? ఏమి చేస్తే, లేక ఏమిచేయకపోతే బాస్ నాపై అందరి ముందు విరుచుకు పడతాడు? అభిమానం పొందటానికి, అవమానం తప్పించుకోటానికి ఎంతమేరకు అవసరమో, అంతమేరకే వారు పని చేస్తారు.
అసలు అధికారులు, ఉద్యోగులనుండి నేతలు, ఉన్నతాధికారులు ఆశించాల్సింది ఏమిటి? అవినీతికి, ఒత్తిడులకు లొంగకుండా, చట్టప్రకారం పనిచేయటం. చట్టవిరుధ్ధమైన ఆజ్ఞలు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎవరిచ్చినా, వారు చేయటానికి నిరాకరించే ధైర్యాన్ని చూపాలి. ఒక రాష్ట్రం లో పని చేస్తున్న పోలీస్ అధికారిని, నీవు మరో రాష్ట్ర రాజధానిలో నివసిస్తున్న ఒక అమ్మాయి యొక్క సెల్ ఫోన్, కదలికలపై నిఘా ఉంచమని ఆజ్ఞాపించబడినపుడు, అతడు అది చట్టబధ్ధమా కాదా అని ఆలోచించే ధైర్యం చేయాలి.
గుడ్డిగా బాసుల ఆజ్ఞలను అధికారులు పాటించినపుడు, ప్రజలకు బాధలు కలుగ వచ్చు. ఉదాహరణకి, ఢిల్లీ యూనివర్సిటీలో మూడేళ్ళడిగ్రీ స్థానంలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సును ప్రవేశ పెట్టటం, నాటి కేంద్ర మంత్రి శ్రీ కపిల్ సిబాల్ గారిని ఆనందింపచేయటానికి జరిగిందట. ఇపుడు శ్రీ స్మృతి ఇరానీ గారు వచ్చి నాలుగేళ్ళు కాదు మూడేళ్ళే అంటే, యూజీసీ వాళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గొంతు పైకూర్చొని, నాలుగేళ్ళ స్కీముని ఎత్తేయటం మొదలైంది.
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సుని ప్రవేశ పెట్టటం, అమెరికాలో ఉన్న విద్యా వ్యవస్థకు మ్యాచ్ అవటం కొరకు జరిగిందిట. చేసింది ఒక్క ఢిల్లీ యూనివర్సిటీలోనే. దేశంలోని అన్ని యూనివర్సిటీలలో చేసి ఉంటే, ట్యూబ్ లోంచి బయటకు ప్రెస్ చేసిన టూత్ పేస్టును లోపలకి పంపమనటం లాగా, పెద్ద చాకిరీ అయ్యేది.
ఇంకా ఉంది. వ్రాసిన దానిని కూడ సంస్కరించాల్సింది ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.