262 ప్రణాలికా సంఘాన్ని రద్దుచేయటంలో తర్కం, దారితీసిన వాస్తవాలు.
చర్చనీయాంశాలు: 262, ప్రణాలికా సంఘం, బిజెపి, కాంగ్రెస్, ప్రణాలికలు, అర్ధికం
ప్రణాలికా సంఘాన్ని రద్దు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల వెనుక ఉన్న తర్కాన్ని, వాస్తవాలను, ఇబ్బందులను పరిశీలించటం అవసరం.
ప్రణాలికా సంఘాన్ని 15 మార్చి 1950 నాడు స్థాపించారు. ఆకాలంలో రష్యా (నాటి సోవియట్ యూనియన్ USSR) మనకి ఆదర్శంగా ఉండేది. ప్రణాలికా బధ్ధమైన అభివృధ్ధిలో కొన్ని లాభాలు ఉన్నాయి. జాతికి ఎంత ఆహారం కావాలి, ఎన్ని కోట్లమీటర్ల బట్ట కావాలి, ఎన్ని కోట్ల ఇళ్ళు కావాలి, ఎంత సిమెంటు కావాలి, ఎన్ని ఉక్కు కడ్డీలు కావాలి, ఇలా అన్నీ అంచనాలు వేసుకొని, వాటిని ఉత్పత్తి చేసుకోటానికి టార్జెట్లను నిర్ణయించుకుని, ఆ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించటానికి కృషిచేయటం ఇదీ వ్యూహం. సరియైనదే.
సోవియట్ యూనియన్ పధ్ధతిలో పంచవర్ష ప్రణాలికలను కూడ తయారు చేసుకుని వాటిని ఎంతో కొంత అమలులోకి తెచ్చే వాళ్ళం. ఇపుడు కూడ పంచవర్ష ప్రణాలికలను తయారు చేస్తున్నాం కానీ, వాటిని చిత్తుకాయితాలుగా వాడుకుంటూ పకోడీలను, బీర్ సీసాలను పొట్లాలు కట్టుకోటానికి ఉపయోగించుకుంటున్నాం.
ప్రణాలికల విధానాన్ని మన్మోహన్ సింగు గారి ఆర్ధిక సంస్కరణలు ఎందుకు గొయ్యి త్రవ్వి పూడ్చ పెట్టాయి?
మన్మోహన్ సింగు గారి సంస్కరణల్లో ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ పెట్టుబడులకు చోటు లేదు. కేవలం ప్రైవేటు పెట్టుబడులే. అందులో కూడ విదేశీ ప్రైవేటు పెట్టుబడులకే పెద్ద పీట. మరీ మాట్లాడితే విదేశీ ప్రైవేటు ప్రత్యక్ష పెట్టుబడులకన్నా (FDI), విదేశీ సంస్థాగత పెట్టుబడులకన్నా (FII) లకన్నా, విదేశీ ప్రైవేటు పోర్టు ఫోలియో పెట్టుబడులకు ప్రాధాన్యం. ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇదే జరిగింది.
మా పంచవర్ష ప్రణాలికల ప్రకారం మాకు తిండి కోసం ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు అవసరం. మా ప్రణాలికల ప్రకారం మాకు బట్టల ఫ్యాక్టరీలు అవసరం. మాప్రణాలికల ప్రకారం మాకు ఇళ్ళనిర్మాణానికి సిమెంటు, స్టీలు కావాలి, వాటిలో పెట్టుబడి పెట్టండి అంటే విదేశీ ప్రైవేటు పెట్టుబడులు రావు. వాళ్ళు మీకోసం కోబ్రా వైన్ తయారు చేస్తాం. మీకోసం ఆడీ కార్లు తయారు చేస్తాం. మీకోసం సిమ్లాలో ముంబాయిలో బడా హోటళ్ళు నిర్మిస్తాం. గోవాలో జూదగృహాలు నిర్మిస్తాం అంటారు. అంటే మన ప్రణాలికలు అంటే వాళ్ళకి చీపురు పుల్లతో సమానం.
తొమ్మిదవ ప్రణాలిక కాలం నుండి, ప్రభుత్వం తయారు చేసిన పంచవర్ష ప్రణాలికలలో, ప్రైవేటు రంగం వారు ఎన్ని పెట్టుబడులు పెట్టాలో పగటి కలలు కంటూ, గాలిమేడలు కట్టటం మొదలు పెట్టారు. ప్రైవేటు రంగం తనకు లాభం ఎక్కడ ఉంటుందో చూసుకుంటుందే తప్ప దానికి మన ప్రణాలికలతో పని ఏమిటి? ఆవిధంగా పంచ వర్ష ప్రణాలికలు నీరు గారిపోయాయి.
ప్రణాలికా సంఘం ప్రభుత్వ పథకాలకు అడ్డంకుల సంఘం గా తయారయింది. పేదరికం యొక్క తత్వాన్ని అర్ధం చేసుకోలేని మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా వంటి వాళ్ళు రోజుకి 26 రూపాయలు, లేక 32 రూపాయలకన్నా ఎక్కువ ఖర్చుచేసే వాళ్లని ధనవంతులక్రింద లెక్కించే తెలివితేటలకు స్థానం ఏర్పడింది.
కొత్త ప్రభుత్వానికి కూడ పంచవర్ష ప్రణాలికలపై నమ్మకం ఉండే అవకాశం లేదు. ఉన్నా ప్రణాలికల లోని ప్రాజెక్టులకు నిధులు పెట్టుబడి పెట్టమని స్వదేశీయ పారిశ్రామికవేత్తలను గానీ, విదేశీయులను గానీ గట్టిగా అడిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే గతంలో శ్రీ మన్మోహన్ సింగు గారు, చిదంబరం గారూ భిక్షాపాత్ర పుచ్చుకొని విదేశీ పెట్టుబడులకోసం అమెరికా,యూరప్, కెనడా ల్లో తిరుగుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి విమానాలను తుక్కు తుక్కు చేసేవాళ్ళు. ఇపుడు అదే పని, శ్రీనరేంద్రమోడీ, శ్రీ అరుణ్ జైట్లీలు చేయబోతున్నారు. మన నాయకులకు సిధ్ధాంతాలు లేవు. మానావమానాలు లేవు. అక్కడనుండి ఎలాంటి పెట్టుబడులు వచ్చినా స్వాగతమే. మనం వద్దంటే, ఇంకోళ్ళు వాటిని తన్నుకు పోతారు.
కనుక ప్రణాలికా సంఘానికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేసి గోతిలోపూడ్చేయటం, మనం చూడబోయే క్రతువు.
పీపుల్ గెట్ దీ గవర్నమెంట్ దే డిజర్వ్ అంటే ఇదే.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.