263 జైట్లీ మహాత్మా!! మేము ప్రపంచ స్థాయి రైలు సౌకర్యాలను మరియు ప్రపంచ స్థాయి రైలు ఛార్జీలను భరించలేము.
చర్చనీయాంశాలు: రైలు ఛార్జీలు, అరుణ్ జైట్లీ, ప్రపంచీకరణ, బిజెపి, ధన మదం
జైట్లీ సార్!! మేము మామూలు మనుషులము. సాదా సీదా జనాలం. కిలోల కొద్దీ బంగారం ఉన్న వాళ్ళం కాము. మమ్మల్ని ఆం ఆద్మీ లు గానే బ్రతకనివ్వండి. ప్రపంచ స్థాయి రైలు సౌకర్యాలను భరించలేము. ప్రపంచ స్థాయి ఛార్జీలను చెల్లించలేము.
ఈసారి రైలు ఛార్జీలను పెంచితే పెంచారు. 2019 లోగా మరల పెంచబోమని హామీ ఇవ్వండి.
ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఎవరైనా కోరితే, వారికి ఆ సౌకర్యాలను అంద చేయండి, వారి వద్ద ప్రపంచ స్థాయి ఛార్జీలు వసూలు చేసుకోండి. అదే సమయంలో, వారికి ప్రపంచ స్థాయి సౌకర్యాలను డిమాండు చేసే ఆర్ధిక మదం ఎలా వచ్చిందో కనుక్కొని దిద్దుబాటు చర్యలు మీరు తీసుకుంటారని మేము అనుకోలేము. ఎందుకంటే, ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళే ఆర్ధిక మదం ఉన్న వాళ్ళు.
ఎక్స్ ప్రెస్ రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంట్లు
మావి చిన్న కోరికలే. ప్రపంచ స్థాయి కోరికలు కావు. ఎక్స్ ప్రెస్ రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంట్లలో ప్రయాణించేటపుడు 1'.5" x 1'.5' ఒకటిన్నర అడుగులు పొడుగు, ఒకటిన్నర అడుగులు వెడల్పు ఉన్న బల్ల కూర్చోటానికి (కొబ్బరిపీచు లేక స్పాంజి లేక దూది కుషన్ దేవర వారి దయ) మేము నిశ్చిత్ తౌర్ పర్ కోరుకుంటున్నాము.
మా దురదృష్టమేమంటే, రైళ్ళలో ఏడాదికోసారైనా జనరల్ కంపార్టుమెంట్లలో ప్రయాణించే రైల్వే మంత్రులు, సహాయమంత్రులు మాకు దొరకటంలేదు. అందరూ ఛార్టర్ విమానానాల్లోనో, ప్రైవేటు విమానాల్లోనో, హెలీకాప్టర్లలోనో ప్రయాణించే వాళ్ళు కావటంతో ఇక్కడ జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణీకులు ఎలా తన్నుకుంటున్నారో అమ్మహనీయుల కంట పడదు, చెవులకు సోకదు.
ప్రపంచ స్థాయి నిర్వచనం ఏమిటి?
జైట్లీ మహాత్మా!! మీ దృష్టిలో ప్రపంచ స్థాయి అంటే ఏ అమెరికాలోనో, యూరప్ లోనే రైళ్ళలో ఉండే భోగాలు కావచ్చు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా రైళ్ళను మీరు చూసి ఉండక పోవచ్చు కాబట్టి ఆ సొగసులు కాక పోవచ్చు.
మా బోటి హాయ్ పొల్లాయ్ ల దృష్టిలో, ప్రపంచ స్థాయి అంటే ప్రపంచ జనాభాలో ఐదవ వంతు ఉండే భారత దేశం ప్రజల స్థాయే. మీరు భారతీయ జనరల్ కంపు రైలు ప్రయాణీకులకు 2.25 చదరపు అడుగుల భూమిని హామీ ఇచ్చారంటే, ప్రపంచ స్థాయిని పై స్థానానికి పారడిమ్ షిఫ్ట్ గా లేపినట్లే.
2.25 చదరపు అడుగుల భూమిని హామీ ఇవ్వటం ఎలా?
కోరిక ఉంటే కష్టం కాదు. ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకి ప్రస్తుతం ముందు వెనుక, తగిలిస్తున్న రెండేసి జనరల్ బోగీలకు అదనంగా 3 ప్లస్ 3 ఎదురెదురు సీట్లు ఉండే తరహా బోగీలను రెండేసి జోడిస్తే మొత్తం జనరల్ బోగీలు ఎనిమిది అవుతాయి. కొత్తగా జోడించే నాలుగు బోగీలకు కండక్టర్లను పోస్టు చేసి సీట్ల లభ్యత ఉన్నంత వరకే కూర్చోనివ్వాలి. కంప్యూటరైజ్డ్ బుకింగులు కాబట్టి టికెట్లు జారీ అయేటపుడే సీట్ నంబర్లను ముద్రించే సాఫ్టువేర్లను తయారు చేయటం కష్టం కాదు. కంప్యూటర్లు తప్పు చేయటం, అవినీతికి పాల్పడటం చాల అరుదు కాబట్టి, సీట్లు ఉన్నంత వరకే, టికెట్లను జారీ చేస్తాయి.
ఈనాటి పద్యాలు
జనరల్ కంపు రైలు ప్రయాణీకుల మొరలకు అద్దం పట్టేవి
మహాకవి, సహజ పాండిత్యుడు, తెలంగాణ -ఆంధ్ర భేదాలు తెలియని పామరుడు, బమ్మెర పోతనామాత్యుడు
కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్నిదిశలను
కలడు కలండనెడి వాడు కలడో లేడో.
శార్దూల వృత్తం, వ్రాయటం కష్టం, పులిలాగ నడుస్తుంది.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.