259 ఉచితానుచితాలు తెలియని రాజకీయ వేత్తలతో ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాలు పడుతున్నది, పడబోతున్నది
చర్చనీయాంశాలు: 259, చంద్రబాబు, వ్యవసాయ ఋణాలు
తమ స్వార్ధమే తప్ప, ప్రజలకు కలిగే లాభనష్టాలను గురించి పట్టించుకోని రాష్ట్ర రాజకీయనేతలలో అగ్రపీఠం శ్రీచంద్రబాబు నాయుడు గారికివ్వాలా, శ్రీజగన్ కి ఇవ్వాలా అనే విషయాన్ని నిర్ధారించటం కష్టం.
ఉదాహరణ: శ్రీచంద్రబాబుకి, తాను అధికారంలోకి రావాలి, అని కోరిక. ఆకోరిక తీరాలంటే, వ్యవసాయ ఋణాల రద్దు అనే ఎర వేయాలి, కాబట్టి వెంటనే వేసేసి సీమాంధ్రప్రదేశ్ వోట్ల చెరువును కొల్లగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. వ్యవసాయ ఋణాలను రద్దుచేయటానికి నిధులు లేవని శ్రీచంద్రబాబుకి ముందే తెలుసు. రాహుల్ గాంధీ కూడ, కొంత ఆలస్యంగానైనా ఈవాగ్దానాన్ని చేశాడు కాబట్టి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, శ్రీ చంద్రబాబుకి కేంద్రం మద్దతుతో తన వాగ్దానాన్ని నెరవేర్చటం తేలికయ్యేది. శ్రీనరేంద్రమోడీ, వ్యవసాయ ఋణాల రద్దు వాగ్దానాన్ని చేయలేదు. బిజెపికి ఆకాశమంత మెజారిటీ రాకుండా ఉంటే, వాళ్ళకి శ్రీచంద్రబాబుగారి పదహారు ఎంపీల మద్దతు అవసరమయ్యేది. కింగ్ మేకర్ లాగా ప్రవర్తించి ఉండేవాడు. ఢిల్లీనుండి నిథులను సాధించి ఋణాల రద్దుచేసి ఉండేవాడు. ఇపుడు శ్రీనరేంద్రమోడీని,శ్రీ అరుణ్ జైట్లీలను అడుక్కోటం తప్ప, శ్రీచంద్రబాబు చేయగలిగిందేమీ లేదు.
రైతులను లోన్లు కట్టద్దని చెప్పటం ఘోర తప్పిదం
నేను అధికారంలోకి వచ్చాక మీ ఋణాలను రద్దు చేస్తాను, కాబట్టి వాటిని కట్టద్దని రైతులకు బోధించటం, చంద్రబాబు చేసిన ఘోరమైన తప్పిదం. మీలో అప్పు పుట్టించుకోగల శక్తిఉన్నవాళ్ళు ఎక్కడో అక్కడ డబ్బు తెచ్చుకుని, ఋణాలను కట్టి, ఇంకా ఎక్కువ మొత్తంలో బ్యాంకులనుండి ఋణాలను పొందండి. నేను అధికారంలోకి వచ్చాక, మీరు కట్టి రెన్యూ చేయించుకున్న ఋణాలను కూడ నేను మాఫీ చేయిస్తాను, అని శ్రీ చంద్రబాబు చెప్పి ఉంటే నేడు అందరు రైతులు త్రిశంకు స్వర్గంలో వ్రేలాడటం తప్పేది.
ఇపుడు శ్రీచంద్రబాబు నియమించిన కమిటీ ఏమి సిఫార్సులు చేస్తుందో, నిథులను ఎక్కడినుండి తెమ్మని చెప్తుందో, వాటిని ఎప్పుడు ఎలా తెస్తారో, ఆదేవుడికే తెలియాలి. బ్యాంకుల ఋణాల రెన్యుయల్స్ ఆగిపోయి, వాటి ఎన్ పీ ఎలు పెరిగిపోయాయి. రికవరీ పర్సెంటేజీ సున్నాగా మారింది. మామూలుగా రైతులలో ఒక సాంప్రదాయ పధ్ధతి ఏమిటంటే వాళ్ళు ఎక్కడో అక్కడ నాలుగైదు రోజులకి వడ్డీపై అప్పు తెచ్చుకుని, బ్యాంకు అప్పులను కట్టి, నాలుగైదు రోజుల తరువాత తమ అప్పును రెన్యుయల్ పధ్ధతిలో తిరిగి తీసుకుని, ఆసీజన్ కి మంచి ఋణగ్రహీతగా గట్టెక్కుతారు. అలాంటి రైతుల ఎడల బ్యాంకర్లుకూడ కొంత ఉదారంగా ఉండి కనీసం వడ్డీ మేరకైనా ఋణ పరిమితినిపెంచి, రైతుకు ఎంతో కొంత ఊరట కలిగించటం జరుగుతుంది. ఇపుడు చంద్రబాబు సంప్రదాయ పధ్ధతి డొక్కలో ఒక్క పోటు పొడిచాడు. ఋణాలను తిరిగి ఇవ్వమని ఒక స్టేట్ మెంటు పారేసి, బ్యాంకర్లు జుట్టు పీక్కునేలాగా చేస్తున్నాడు.
చిన్నయ సూరి వ్రాసిన ఒక వాక్యం కరెక్టు వర్డింగు నాకు గుర్తుకు రావటం లేదు. చిన్నయ సూరి మిత్రలాభం లేక మిత్రభేదం గుర్తుకు ఉన్న పాఠకులు ఆవాక్యాన్ని కామెంట్లో వ్రాస్తే కృతజ్ఞుడనై ఉంటాను.
'' గ్రావంబును గ్రావాగ్రంబునకు ఎక్కించుట కష్టం. క్రిందికి త్రోయుట సులభం.'' అంటే ఒక బండను కొండ శిఖరంపైకి ఎక్కించటం కష్టం. పైన ఉన్నదానిని క్రిందికి తోసేయటం తేలిక.
క్రొత్త దుష్ట సాంప్రదాయం
చంద్రబాబు నెలకొల్పిన క్రొత్త దుష్టసాంప్రదాయం ఏమిటంటే, ఇప్పటి వరకు జరిగిన వ్యవసాయ ఋణ మాఫీలన్నీ, కేంద్రప్రభుత్వ బాధ్యతతో, కేంద్ర ప్రభుత్వనిధులతో జరిగాయి. మొదటిసారిగా రాష్ట్రప్రభుత్వ నిధులతో మాఫీ చేయటాన్ని శ్రీచంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఫలితంగా ఏమి జరగచ్చంటే, భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం కాడిని పక్కన పారేసి తప్పించుకునే అవకాశం ఉంది. ఋణ మాఫీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పాస్ ఆన్ ది బక్ చేసేటందుకు కేంద్రం వెనుకాడదు. కేంద్రప్రభుత్వ ఆర్ధిక శక్తి ఇంచుమించు అపరిమితం (రిజర్వు బ్యాంకు చేత కొత్త నోట్లు ప్రింటింగు చేయించ గలదు) కాగా, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక శక్తి పరిమితం కావటం వల్ల అవి ప్రజలకు నరకాన్ని చవి చూపే అవకాశం ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.