230 ఇంటర్వ్యూయర్లు వెర్సస్ ఇంటర్వ్యూయీలు, రచయితలు వెర్సస్ ఎడిటర్లు
చర్చనీయాంశాలు: మీడియా, పత్రికలు, టీవీ ఛానెళ్ళు, స్వాతంత్ర్యాలు
కొద్దిరోజుల క్రితం, భాభాప్ర ప్ర శ్రీ నరేంద్ర మోడీ గారికి దూరదర్శన్ అనగా ప్రసార భారతి వారికి మధ్య జరిగిన వివాదాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
ఆ ఇంటర్వ్యూ 30 నిమిషాల సమయానికి ఉద్దేశించినదిట. కానీ, కారణాలేమైనప్పటికీ, మూల వీడియో 45 నిమిషాలదాకా పాకిందిట. ఇలా జరిగినపుడు, సాధారణ వ్యక్తుల విషయంలో నయితే దూర దర్శన్ వారు విచక్షణా రహితంగా కత్తిరించి ఇంటర్వ్యూని 30 నిమిషాలకు కుదించేసి, కనీసం ఇంటర్వ్యూ చేయబడిన వ్యక్తులకు చెప్పకుండా, ఏచీకటి రాత్రో ప్రసారం చేసుండే వాళ్ళేమో.
అధికార పార్టీ అగ్రనేతలైతే, అసలు కత్తిరించే ప్రసక్తే ఉండదు. అరగంటకని ఉద్దేశించింది, రెండు గంటలకు దేకినా, మిగిలిన కార్యక్రమాలను ప్రక్కన పెట్టో, లేక బహుళ ప్రచారంతో సీరియల్లాగో ప్రసారం చేసే వాళ్ళు తప్ప కత్తిరించి పారేయటం జరిగేది కాదు.
సరే, దూరదర్శన్ వారి నిబంధనలు, వారికా అధికారాన్ని కల్పిస్తూ, టైలర్ మేడ్ గా చేయంబడి ఉంటాయి కాబట్టి , వారిని వారు ఎలాగైనా సమర్ధించుకోగలరు.
కత్తిరించిన తరువాత ఆ ఇంటర్వ్యూ సత్యనాశ్ అయిపోయినా వారు పట్టించుకోరు. కానీ ఇంటర్వ్యూ చేయబడ్డవాడికి కడుపులో మండి పోతుంది. కానీ ఏమి చేయగలరు?
ఇంటర్వ్యూ చేయబడ్డ వ్యక్తి భాభాప్రప్ర శ్రీనరేంద్రమోడీ వంటి ప్రతిపక్షాగ్రనేత అయినపుడు ఊరుకుంటారా? ఊరు కోరు. భాభాప్రప్ర కాస్తా అసలు ప్రధానే అయ్యారనుకోండి. కొత్త సూచనా ఔర్ ప్రసార్ మంత్రీజీ వస్తారు. ప్రసార్ భారతికి కొత్త అధ్యక్షుల వారు వస్తారు. ఎడిటర్ల పని పట్టిస్తారు. కొందరిని ఏరికార్డురూములో దుమ్ము దులపటానికో, మ్యూజియంలో టిక్కెట్లమ్ముకోటానికో పంపిస్తారు.
ఇంటర్వ్యూలో శ్రీమోడీ గారు చెప్పిన , కత్తిరించి వేయబడ్డ ''ప్రియాంక నా కూతురు లాంటిది వంటి '' వాక్యాలలో వివాదాలకు దారి తీసేవో, చెత్త విషయాలో ఏమీ లేవు. ఒక విధంగా, ఆమాటలు స్నేహ హస్తం లాంటివే. ఇంటర్వ్యూను ఒక పావుగంట పొడిగించి ప్రసారంచేసినా పెద్ద నష్టం కలిగించనివే. ప్రసార్ భారతి వారు ఆపని ఎందుకు చేయలేదనేది అర్ధం కావటం లేదు. వారు అధికార పార్టీ వత్తిడికి గురి అయి ఉండచ్చు. లేదా స్వంత అహంకారం వల్లే ఆపని చేసి ఉండ వచ్చు.
పెట్టుబడిదారీ ప్రైవేటు ఛానెళ్ళయితే పరిస్థితి భిన్నంగా ఉండేదా?
భాభాప్రప్ర శ్రీమోడీ గారి పూర్తి ఇంటర్వ్యూని ప్రైవేటు ఛానెళ్ళు ప్రసారం చేశాయిట (నేను చూడలేదు). అవి ప్రసారం చేస్తాయంటే, వారికి తాము దూర దర్శన్ కన్నా తాము గొప్పవారమని నిరూపించుకునే అవకాశాన్ని ఎలా వదులుకుంటారు. సాధారణ వ్యక్తుల విషయంలో అయితే, దూర దర్శన్ కి , ప్రైవేటు పెట్టుబడిదారీ ఛానెళ్ళకీ పెద్ద భేదమేమీ ఉండదు. ఎడిటర్లు అనే వాళ్ళు ప్రైవేటు రంగంలో అయితే యజమానులకి, వారి ఉంపుడుగత్తెలకు, ఉంపుడుగాళ్ళకు, ప్రభుత్వరంగంలో అయితే నేతలకు, వారి ఉంపుడు గత్తె లకు, ఉంపుడుగాళ్ళకు, దాసులు. అంతేకాక తమ స్వంత ఉంపుడు గత్తెలకు, ఉంపుడుగాళ్లకు కూడ దాసులు. రెండు రకాల వారు కూడ, సామాన్యులతో వ్యవహరించే టపుడు నియంతల్లాగానే ప్రవర్తిస్తారు.
పెయిడ్ ఇంటర్వ్యూలకి, అన్ పెయిడ్ ఉచిత ఇంటర్వ్యూలకు, రెమ్యునరేటెడ్ ఇంటర్వ్యూలకి మధ్య ఏమైనా తేడా ఉంటుందా?
పెయిడ్ ఇంటర్వ్యూలు అనేవి ప్రకటనల లాటివి. ప్రకటనదారు తన ప్రకటన మధ్యలో ఇంకో ప్రకటన పట్తే ఊరుకోడు. పెయిడ్ ఇంటర్వ్యూ ల మధ్యలో ఛానెళ్ళు తమ ఇతర వ్యాపార ప్రకటనలను ప్రవేశ పెట్తే ఇంటర్వ్యూలకి డబ్బిచ్చినవాడు ఊరుకోడు.
అన్ పెయిడ్ ఉచిత ఇంటర్వ్యూల విషయంలో, ఆ ఇంటర్వ్యూ ఎవరికి అవసరం అనేదానిపై ఆధార పడి ఉంటుంది. ఛానెళ్ళు , పత్రికలు అనే వాళ్ళు ఫక్తు బేహారులు. అవతలవాడు మనకి ఈ ఇంటర్వ్యూని ఫ్రీ గా ఇస్తున్నాడు కదా అనే దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు. 80% ప్రకటనలు, 20% ఇంటర్వ్యూ తుకడాలతో ఆఇంటర్వ్యూ ప్రసారం అయితే గొప్పే.
రెమ్యునరేటెడ్ ఇంటర్వ్యూల విషయంలో (అంటే, ఇంటర్వ్యూ ఇచ్చినవాడికి ఛానెల్ వాడు డబ్బు చెల్లించి తీసుకున్న ఇంటర్వ్యూల విషయంలో), ఛానెళ్ళ ప్రవర్తన ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన వాడు ఎంత ఘరానా వ్యక్తా, వాడితో మనకి పని ఉందా, లేకా మనకే వాడితో పని ఉందా, అనే విషయం పై ఆధారపడి ఉంటుంది. ఏ సల్మాన్ ఖాన్ లేక కరణ్ జోహార్ వంటి వాడికో, కరీనా కపూర్ లేక దీపికా పాడుకోనే లేక ప్రియాంకా చోప్రా వంటి తారామణులకో కొన్ని లక్షలు చెల్లించి తాము పొందే ఇంటర్వ్యూల విషయంలో వారు వెల్వెట్ గ్లోవ్స్ తోనే (అంటే సున్నితంగానే, శిశువులని హ్యాండిల్ చేసినట్లుగానే ) వ్యవహరిస్తారు.
సహజ న్యాయం ఏమి చెప్తుంది?
సహజన్యాయం అనేది చట్టాల చేత నిబంధనల చేతా బంధించ బడదు. సహజ న్యాయ సూత్రాలు , ఇంటర్వ్యూ చేయబడ్డ వాడు ఘనుడా, నిర్ధనుడా అనే దానిపై ఆధారపడవు.
ఇంటర్వ్యూ చేయబోయే ముందే ఇంటర్వ్యూ చేయబడే వాడికి గట్టిగా అరగంట పరిమితి గురించి తెలియచేయటం, ఆఅరగంటలో అధికసమయాన్ని ఇంటర్వ్యూకర్త తినేయకుండా చూసుకోటం ముఖ్యం. ఇంటర్వ్యూ దత్తుడి ఎదురుగా ఒక పెద్ద కౌంట్ డౌన్ స్టాప్ వాచ్ ని పెట్టటం. కౌంట్ డౌన్ పూర్తి కాగానే ఇంటర్వ్యూని యాబ్రప్ట్ గా నిలిపేయకుండా (ఇలా చేస్తే రసభంగం అవుతుంది, ఇంటర్వ్యూ దత్తుడికి మూడ్ పోతుంది. ఉద్రేకంలో ఉన్నప్పుడే ఇంటర్వ్యూ దత్తులు నిజాలు చెప్తారు.) సమయాతీతం అయినా, చివరి దాకా కొనసాగించాలి. ఇంటర్వ్యూ పూర్తి అయినాక ఆ వీడీయోను ప్రయోక్త, ఇంటర్వ్యూ దత్తుడు కలిసి పరిశీలించి, ఉభయులకీ ఆమోదయోగ్యమైన రీతిలో ఇంటర్వ్యూని అరగంటకి కుదించుకోవాలి. కత్తిరింపులన్నీ ఉభయులకీ ఆమోదయోగ్యమైన పధ్ధతిలోనే జరగాలి. ఏకాభిప్రాయం కుదరకపోతే ఎడిటింగును, ప్రసారాన్ని వాయిదా వేసుకోవాలే తప్ప ఏకపక్షంగా కత్తిరించి ప్రసారం చేయకూడదు. లేదా, ఇంటర్వ్యూదత్తులపై కొంత దయ వహించి, పూర్తినిడివి వీడియోను ప్రసారా చేయాలి.
మూడవ వ్యక్తులపై వ్యాఖ్యలను చేసినపుడు (నా అభిప్రాయంలో పొగడ్తలైనా సరే) సంబంధించిన వ్యక్తులకి తెలిపి వారి అనుమతి తీసుకోవాలి. వారు అభ్యంతరాలు తెలిపితే, ఇంటర్వ్యూ దత్తుడిని తిరిగి సంప్రదించాలి, తప్ప కత్తిరించి ప్రసారం చేయకూడదు. ఇక్కడ శ్రీ మోడీగారు, ప్రియాంక తన పుత్రిక వంటిది అంటే (పొగడ్తే అయినా), ప్రియాంక అభ్యంతరం చెప్తే, శ్రీ మోడీగారిని సంప్రదించి ఆయన అనుమతి తీసుకున్నాకే దానిని కత్తిరించి ప్రసారం చేయాలి. అయన అనుమతి ఇవ్వకపోతే, ఆయన అభిప్రాయాన్ని ప్రియాంకా గారికి తెలియజేసి ఆమె సర్దుకుంటుందేమో కనుక్కోవాలి. ఆమె సర్దుకోటానికి సిధ్ధపడకపోతే, మోడీ గారు కూడ సర్దుకోటానికి సిధ్ధపడకపోతే, ప్రసారాన్ని వాయిదా వేయటమే మార్గం.
ఈవిధంగా చూస్తే, దూర్ దర్శన్ వారు, శ్రీ నరేంద్రమోడీగారిని సంప్రదించకుండా కత్తిరింపులు చేయటం, ప్రైవేటు ఛానెళ్ళవారు ప్రియాంకాను సంప్రదించకుండా పూర్తి ఇంటర్వ్యూని ప్రసారం చేయటం, రెండూ కూడా, అసమంజసమే అనాల్సి వస్తుంది.
ఇంకా కొంత వ్రాయవలసి ఉన్నది. ఇపుడు వ్రాసినదాన్నికూడ, సరిదిద్ద వలసి ఉన్నది. మిగిలింది ఇంకోసారి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.