231 మనం భారతీయులం ఎక్కువగా లైనక్స్ ఓఎస్ వాడటం శ్రేయస్కరం.
చర్చనీయాంశాలు: 231, విండోస్, లైనక్స్, ఉబుంటూ, కంప్యూటర్లు, వైరస్ లు
కంప్యూటర్ లలో అధిక సమస్యలు విండోస్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) మరియు విండోస్ ఆధారిత సాఫ్ట్ వేర్ల వల్ల వస్తాయి. విండోస్ లో వైరస్ లు ఎక్కువ. మనకు మనశ్శాంతి ఉండదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మన తప్పులేక పోయినా, కొన్నిసార్లు వైరస్ లు అంటుకొని సిస్టం బూట్ అవదు.
అపుడు మనం డేటాను బ్యాకప్ చేయించి, హార్డ్ డిస్కును ఫార్మాట్ చేయించి, మరల ఓఎస్ ను ఇన్స్టాల్ చేసుకుంటే గాని ముందుకు పోలేము. ఈపని మనం చేసుకోవాలంటే మన దగ్గర విండోస్ ఓఎస్ ఇన్స్టాలేషన్ సీడీ ఉండాలి. ఇన్స్టాల్ చేసేటపుడు అది సీరియల్ నంబర్ అడుగుతుంది. ఇన్స్టాలేషన్ సీడీ సంపాదించుకునేటపుడు మనం సీరియల్ నంబర్ కీని కూడ సంపాదించుకోవాలి. భారతీయులలో , ప్రైవేటు వ్యక్తులలో, విండోస్ ఒరిజినల్ ఓఎస్ లను సీడీ మరియు ఓఎస్ లతో కొనేవాళ్ళు తక్కువ.
మనం కొనే వస్తువులు అవి డెస్క్ టాప్ పీసీ లయినా, లాప్ టాప్ లయినా, మనకు షాపుల వాళ్లు ఒరిజినల్ ఒఎస్ ఉన్న సీడీలు, వాటి సీరియల్ నంబర్ కీలు ఇవ్వరు. మనం అడగాలని తెలియక అడగం. అడిగినా వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే, వారు ఒకే సీడీకి కాపీలు తీసి ఎన్నో కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. మనం బలవంతం చేస్తే మనకు కూడ ఒక నకలు సీడీ, సీరియల్ నంబరుతో ఇస్తారు. అంటే, దేశంలో జరుగుతున్న పైరసీలో మనకు తెలియకుండా మనం భాగస్వాములమవుతామన్న మాట.
పీసీ ని కొని ఇంటికి తెచ్చుకున్నాక, కొద్దినెలలలోనే అది సరిగా బూటింగు కాకపోటమో, విండోస్ సరిగా లోడ్ కాకపోటమో, జరిగితే ప్రాణం ఉసూరు మంటుంది.
అమ్మినవాళ్ళు పెద్ద కంపెనీల ఆథరైజ్డ్ డీలర్లైనా, అసెంబుల్ డ్ పీసీల అమ్మకందారులైనా షాపుల వాళ్ళకి అమ్మేటపుడు ఉండే శ్రధ్ధ , సర్వీసింగు చేయటంలో ఉండదు. వాళ్ళ మెకానిక్ (సర్వీస్ ఇంజనీర్ అని ముద్దుపేరు) ఇదిగో వస్తున్నాడు , అదిగో వస్తున్నాడు అని మనం కళ్ళకు వత్తులు వేసుకొని ఎదురుచూడాలి. అయిదో అంతస్తులోనో, నాలుగో అంతస్తులోనో ఉండే అపార్టుమెంటుల్లో ఉండే వాళ్ళకి ఈబాధ మరీ ఎక్కువవుతుంది.
వారంటీ ఉన్న కంపెనీ మెషిన్లయినా, వారంటీ లేని కేవలం నోటి మాట ఉన్న ఆర్నెల్ల గ్యారంటీ అసెంబుల్డ్ మెషిన్లయినా, సర్వీసు ఇంజనీర్లకు మనం ఎంతో కొంత ముట్ట చెప్పాలి. లేకపోతే రెండోసారి పిలిస్తే సరిగా రారు.
లాప్ టాప్ ల విషయంలో కొంత పరిస్థితి మెరుగు. మనం లాప్ టాప్ ను ఒక బ్యాగ్ లో వేసుకొని, ఆషాపు వాడిదగ్గరకి తీసుకెళ్ళి, వాడి దగ్గర పారేస్తే, చిన్నచిన్న సమస్యలయితే సరిచేయిస్తాడు. పెద్ద సమస్య లయితే, లాప్ టాప్ లలో అసెంబుల్డ్ ఉండవు కాబట్టి, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళమని అడ్రెస్ ఇస్తాడు. సర్వీస్ చేయించుకోటం విషయంలో, కొన్నిసార్లు లాప్ టాప్ లే మెరుగు.
విండోస్ ఓఎస్ లకు తెగులు అంటుకొని లోడ్ కానపుడు, లేక సిస్టమ్ బూట్ కానపుడు ఏమి చేయటం?
మన దగ్గర ఇన్స్టాలేషన్ సీడీ, సీరియల్ నంబర్ ఉంటే, హార్డ్ డిస్కును చక్కగా ఫార్మాట్ చేసుకొని, పార్టీషన్లను తిరిగి విభజించుకొని, ఓఎస్ ను తిరిగి ఇన్స్టాల్ చేసుకోటం మేలు. లేనపుడు, ఈపని చేయటానికి బయట సర్వీస్ మెకానిక్ లు అయితే రూ. ౩50 నుండి రూ. 500 దాకా తీసుకునే అవకాశం ఉంది.
ఎమ్.ఎస్. ఆఫీస్ సంగతి ఏమిటి?
బయటి మెకానిక్ అయితే అతడిని బ్రతిమాలుకొని తిరిగి ఇన్స్టాల్ చేయించుకోవాలి. అతడి దగ్గర సీడీ ఉంటుంది. మనమే మన దగ్గర ఉన్న సీడీతో , విండోస్ ఓఎస్ ను ఇన్ స్టాల్ చేసుకున్నప్పుడు , మరొక ఎమ్. ఎస్. ఆఫీసు సీడీని, సీరియల్ నంబర్ ను, కూడ సంపాదించుకొని సిధ్ధంగా ఉంచుకోవాలి. ఇవే కాదు పోయిన ప్యాకేజీ లనన్నిటినీ తిరిగి ఇన్స్టాల్ చేసుకోవాలి. మెకానిక్ లయితే వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ లలో ఉంటాయి కాబట్టి వాటిని ఇన్స్టాల్ చేసిపెట్తారు.
కొన్నిసార్లు మెకానిక్ లకు అసంతృప్తిగా ఉన్నప్పుడో, బధ్ధకంగా ఉన్నప్పుడో, మనం అడిగిన వన్నీ ఇన్స్టాల్ చేయకుండా, మళ్ళీ వచ్చినపుడు చేస్తాలేండి అని వెళ్తాడు, తరువాత మనం అతడిని వెంటపడాలి.
విండోస్ పలు అప్లికేషన్లు చాల భాగం , వైరస్ స్కానింగు సాఫ్టు వేర్లతో సహా, ఏవీ ఫ్రీ కావు. ప్రతిదానికీ డబ్బులే. ట్రయల్ వెర్షన్లు, డెమోలు, షేర్ వేర్లూ దొరికినా, ఇచ్చే వాడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక మెలిక పెడ్తాడు. కొన్నిటికి నెల కొకసారి మరల మరల రీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎడోబ్ పేజ్ మేకర్ విషయంలోనూ, ఆ గొడుగు బొమ్మ ఉండే యాంటీ వైరస్ సాఫ్టువేర్ విషయంలోను, నాకిది బాగా అనుభవంలోకి వచ్చింది. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను తరచు అప్ టు డేట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది.
నెట్ లోంచి మనం ఏది డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నా, ముందుగా మనం సెటప్ ఫైళ్ళను, ఇఎక్స్ఇ ఫైళ్ళను వైరస్ స్కాన్ పక్కాగా చేసుకున్న తరువాతే ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే మరల సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాక , అనవసరమైన టూల్ బార్లు అంటుకొని మన పనులకి అడ్డం తగులుతూ ఉంటాయి.
ఒక పరిష్కారం
ఈ మధ్య లైనక్స్ ఆధారిత అప్లికేషన్లు కొన్ని విండోస్ వాడకందార్లకి పోర్టబుల్ అప్లికేషన్లుగా లభ్యం అవుతున్నాయి. వీటికి ఇన్స్టాలేషన్ అవసరం ఉండదు. ఇన్స్టాల్,అన్ ఇన్స్టాల్, వైరస్ ల బాధలు ఉండవు కాబట్టి, వీటిని వాడుకోటం నేర్చుకోటం ఒకవిధంగా మేలు.
దీనికి లింకు:
లైనక్స్
పెట్టుబడిదారీ విధానం పైన మార్క్సిజం తిరుగుబాటు చేసినట్లుగా, విండోస్ పై లైనక్స్ తిరుగుబాటు చేసి, కొంతమేరకు విజయవంతమైంది. మార్క్సిజం కూడ ఏనాటి కైనా, తన అర్హమైన స్థానాన్ని పొందక తప్పదు.
లైనక్స్ ఆధారిత ఓఎస్ లలో ప్రతిదీ ఫ్రీ. సోర్స్ కోడ్ ఓపెన్ సోర్స్ అంటే రహస్యంగా ఉంచరు. డబ్బులుకూడ ఛార్జి చేయరు.
లైనక్స్ ఓఎస్ లో వైరస్ ల దాడి చాల చాల తక్కువ. 100% లేవు అనలేము కాని, 99% లేవు అనిచెప్పచ్చు. గత నాలుగేళ్ళుగా నేను ఉబుంటూ వాడుతున్నాను. వైరస్ అనే దానిని నేను చూడలేదు. యాంటీ వైరస్ పెట్టుకోవాల్సిన అవసరమే కలుగలేదు.
కరెంటు పోయినపుడు, యూపీఎస్ పనిచేయకపోయినా, లేక బ్యాటరీలు పని చేయకపోయినా, విండోస్ తిరిగి బూట్ కావటానికి ఏడిపిస్తూ ఉంటుంది. నా బాగా పాతబడిన లాప్ టాప్ లో గత రెండేళ్ళుగా బ్యాటరీ ని పీకి, ఎసి విద్యుత్ తో పని చేస్తున్నా , లేదా బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఛార్జింగు ఒక అరనిమిషం కూడ నిలువక పోయినా, కరెంటు పోతే ఉబుంటూ అసలుట్రబుల్ ఇవ్వదు. ఎన్నిసార్లు కరెంటు పోయినా, తిరిగి స్విచ్ ఆన్ చేసినపుడు ఇబ్బంది పెట్టదు.
లైనక్స్ లో ఒక వందరకాల వెరైటీలు దాకా మనకి దొరుకుతున్నాయి. వీటిల్లో ఉబుంటూ, ఎక్కువ ప్రజాదరణ పొంది, విండోస్ కి పోటీ దారుగా తయారయింది.
ఫెడోరా, లైనక్స్ మింట్, పోర్టియస్, వంటివి కూడ బాగానే వాడకంలో ఉన్నాయి.
వేటి నయినా మనం నెట్ లో ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకుని సీడీలో ఎక్కించుకొని సిధ్ధంగా ఉంచుకుంటే, కావాలనుకున్నప్పుడు స్వేఛ్చగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఓఎస్ లను యూనెట్ బూటిన్ వంటి ప్యాకేజీని వాడి బూటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేసుకోవచ్చు. బూటబుల్ పెన్ డ్రైవ్ కొన్నిసార్లు, సీడీల కన్నా సౌకర్యంగా ఉంటుంది.
ఉబుంటూ 14.04 (2014 ఏప్రిల్ నెల అని అర్ధం) ప్రస్తుతం విడుదల అయ్యింది. దీనిని గురించి ఇంకో పోస్టులో వ్రాస్తాను.
దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి లింకు. http://www.ubuntu.com/download/desktop కు వెళ్లటానికి క్లిక్.
నోట్: నాకు తెలిసిన సమాచారం , వీలైనంత జాగ్రత్తగానే మీకు ఇస్తున్నాను. డిస్క్లైమర్లు వర్తిస్తాయి.
నేను మటుకు నాదగ్గర ఉబుంటూ 13.04 (2013 ఏప్రిల్ నెల అని అర్ధం) ఉన్నా, నేను ఉబుంటూ 10.10 (2010 అక్టోబర్ నెల అని అర్ధం) వెర్షన్ నే వాడుతున్నాను. ఉబుంటు 10.10ని ఆకంపెనీ వారు సపోర్టు చేయటం మానేసినా నేను దానినే పట్టుకొని వేలాడుతున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే వ్యామోహం కావచ్చు. లేదా నా లాప్ టాప్ బాగా పాత పడటాన పాతదయిన 10.10 తో సుఖం అనుభవిస్తూ ఉంటుంది. 13.04 వాడినపుడు, ర్యాం చాలకో ఏమో స్లో అవుతూ ఉంటుంది.
వాస్తవానుభవాలు
ఒక మిత్రుడు కొద్దినెలల క్రితం నేను లాప్ టాప్ కొనుక్కోటం మేలేమో అని సలహా ఇచ్చినా, ఆయన సమస్యలు ఆయనకి ఉండచ్చు, అసెంబుల్ డ్ పీసీని కొన్నాడు. అనతి కాలంలోనే వైరస్ వచ్చి అది చతికిల పడింది. సర్వీస్ మెకానిక్ వచ్చి, విండోస్ ఒఎస్, కొన్ని ఇతర ప్యాకేజీలు తిరిగి ఇన్స్టాల్ చేసి ఒక రూ . 300 తీసుకున్నాడు. కొన్ని తరువాత చేస్తానన్నాడు కాని చేయలేదు.
ఆయన సిస్టంలో డ్యూయల్ బూటింగ్ సిస్టంలో 240 జీబీల పార్టీషన్ల విండోస్ కి అదనంగా, ఒక 10 జీబీ పార్టీషన్ లో ఉబుంటూ 10.10 ఇన్స్టాల్ చేశాము. కానీ అంత తృప్తికరం అనిపించలేదు. ఇలా కాదని 10.10 పీకేసి, దాని స్థానంలో 13.04 ఇన్స్టాల్ చేశాము. ఇపుడు అది చాల బాగ పనిచేస్తున్నది. అతడు 14.04 కొరకు ఆరాట పడుతున్నాడు. వైరస్ భయం పోటం వల్ల ఇంటర్నెట్ లో స్వేఛ్చగా బ్రౌజ్ లు, డౌన్ లోడ్ లు చేయగలుగుతున్నాడు.
దీనిని తిరగ వ్రాయవలసి ఉన్నది. జోడించ వలసినది కూడ ఉన్నది. ఇంకో సారి వ్రాస్తాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.