ఈ ఫొటోను చూడండి. సీమాంధ్ర ప్రజలు (నాతో కూడ కలిపి) వేలం వెర్రి గాళ్ళు అని అర్ధం అవుతుంది. ఇది స్వర్గీయ వైయస్ ఆర్ గారి 2009 నాటి ఒక వెబ్ సైట్ నుండి సేకరించింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట. (నాకు గుర్తుకు ఉన్నంత వరకు ఇది రాజోలు వెళ్ళే దారిలో , వశిష్ఠ నదికి ఉత్తర తీరంలో ఉంది. దక్షిణాన నది కవతల పశ్చిమ గోదావరి. అక్కడ ఒక వంతెన కూడ ఉన్నట్లు కూడ గుర్తు.
ఈ ఫొటో 2008లో శ్రీమతి సోనియా గాంధీ గారి జగ్గంపేట సందర్శన సందర్భం. జనాన్ని చూడండి, నేల ఈనినట్లుగా ఉంది కదా.
2014 ఎన్నికలలో గొంతు పిసికే విభజన వల్ల, సీమాంధ్రులకు కోపం వచ్చిందని వెనుకాడిందో, లేక భద్రతా కారణాల వల్లో, లేక తీరిక లేకో సోనియాజీ సీమాంధ్రలో ఒకటి రెండు ప్రదేశాలే సందర్శించింది. ఆమె గుంటూరు సందర్శనలో తరలి వచ్చిన జనాన్ని చూసి నివ్వెర పోయిందిట. తనపై జనానికి ఆగ్రహం కలుగ లేదని సంభావించి ఉంటుంది. ఈసారి అగ్రశ్రేణి తెలుగు పత్రికలన్నీ ఆమె పై కత్తి కట్టినట్లుగా ఆమె గుంటూరు విజిట్ వార్తను ఒక మూలన ప్రచురించాయి. అలాగనుకుంటే, మన అగ్రశ్రేణి తెలుగు పత్రికలు, పాపం మాజీ ముఖ్యమంత్రి కిరణుడిని కూడ పేపర్లో మూలకీడ్చాయి. పత్రికలు, ఛానెళ్ళు అన్నీ పెయిడ్ న్యూస్ కి అంకితమై పోయాయనటంలో సందేహం లేదు. ఓక పక్క మోడీగారి బిజెపి, ఇంకో పక్క శ్రీనాయుడి గారి టీడీపీ పెయిడ్ ఎడ్వర్టైజ్ మెంట్లు దంచుతుంటే, పత్రికల్లో మిగిలిన భాగాలను కూడ వారి వార్తలనే ప్రచురించి తరించపోటమే కాక , టిడిపీ బిజెపి పవన్ కళ్యాణ్ లకు విజయం తథ్యం అని బాదేశాయి. మామూలుగా ఒక సినిమాకి కనీసం మూడు నాలుగు కోట్లు తీసుకునే శ్రీ పవన్ కల్యాణ్ వంటి నటులు శ్రీ మోడీకి, శ్రీచంద్రబాబు కి ఉచిత సేవ చేసి పెట్తున్నారంటే నమ్మటం కష్టంగా ఉంది. శ్రీ మోడీ వారో, శ్రీ బాబు గారో, ఇద్దరో అధికారంలోకి వచ్చి తమను ఆదాయపు పన్ను అధికారుల నుండి రక్షిస్తారనో, భూములను చవకగా ఇస్తారనో, హీరోలు ఆశ పడటం జరగచ్చు.
గాంధీ గారికీ సీమాంధ్రులకీ ఏమిటీ పోలిక?
గాంధీ గారు ఏమి చెప్పారు? ఒక చెంప మీద కొట్తే రెండో చెంప చూపమన్నారు. శ్రీ జగన్ గారు ఇప్పటికే జనానికి ఒక చెంప మీద కొట్టి లక్ష కోట్లదాకా సంపాదించుకున్నారు. ఇపుడు జనానికి రెండో చెంప మీద కొట్టి ఇంకో లక్ష కోట్లు కుమ్ముకోటానికి సిధ్ధం అవుతున్నారు. జనం ఆయన సభలకు తండోప తండాలుగా వచ్చి, ఆయన పార్టీకి వోట్లేయటం ద్వారా, తమ రెండో చెంపను జగన్ జీ కి ఒప్పగించటం జరుగుతున్నది. అంటే గాంధీ గారి కన్నా గొప్పాకాదా?
మరి తెలుగు దేశం
శ్రీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో గానీ, తొమ్మిదేళ్ళ పాలనలో గానీ శ్రీవారి ఆస్తి రెండెకరాలనుండి రెండువేల కోట్లకి పెరిగింది. రెండువేల కోట్లు సంపాదించటం నిజంగా ఒక గొప్ప విజయమే. కానీ శ్రీజగన్ లక్షకోట్ల విజయం ముందు దిగదుడుపే. లక్షకోట్ల సంపాదనలో విఫలమైనందుకు శ్రీ చంద్రబాబు గారు ఎంతో బాధ పడుతూ ఉండాలి. కొత్త రాష్ట్రానికి సింగపూర్ చేయటానికి 5 లక్షల కోట్లను కేంద్రంనుండి గుంజితే కాని, లక్షకోట్ల టార్జెట్ నెరవేరదు. దీనికోసం బిజెపి సహాయం, రెండు తెలుగు పత్రికల సహాయం, రెండో మూడో ఛానెళ్ళ సహాయం తీసుకుంటే కానీ ఒక వేవ్ ను పుట్టించటం కష్టం. దీని కోసం నిద్రాహారాలను మాని పనిచేయటం అనివార్యం.
సీమాంధ్రులు శ్రీ చంద్రబాబు పాలనను మర్చి పోయినట్లున్నారు. ఎన్ని కోఆపరేటివ్ పంచదార ఫ్యాక్టరీలు మూత పడ్డాయి? ఎన్ని సహకార డెయిరీలు మూతపడ్డాయి? కరువు వచ్చి రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే, పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికారులు చెప్పిన మాటలను ఏకరువు పెట్టిన పాలన అది.
జగన్ , చంద్రబాబు, చిరంజీవి | రఘువీరుడు తప్ప మరొక దిక్కు లేదా
ఇపుడు ఉన్న పార్టీలలో, జైసపా పార్టీ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మెరుగైనదే అని చెప్పాలి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమర్ధించినట్లే సమర్ధించి చావు దెబ్బ కొట్టిన ఖ్యాతి సీమాంధ్ర నేతలది. పాపం, కిరణుడి చేత పార్టీ పెట్టించిన పితాని సత్యనారాయణ, సాకె శైలజానాధ్ వంటి వారు పడవను నట్టేట ముంచేసి ఈదుకుంటూ వేరే ఓడల్లోకి మారిపోయారు. కిరణుడు పార్టీ పెట్టటానికి చాలా వెనుకాడాడు. ఒత్తిడికి తట్టుకోలేకే ఆయన కొత్త పార్టీని పెట్టారని చెప్పాల్సి వస్తుంది. సమైక్యాంధ్ర పతాకాన్ని ఎగరేయటానికి చివరికి మన ఎంపీ లలో ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం హర్షకుమార్ మాత్రమే మిగిలినట్లున్నారు.
కిరణుడి పైన కూడ అవినీతి ఆరోపణలున్నాయి. చేసినాయన మాజీ డిజిపీ , లక్షకోట్ల జగన్ పార్టీలో చేరిపోయి మల్కాజ్ గిరినుండి పోటీ చేశాడు. త్రాగునీటి పథకం నిధులన్నిటినీ, మిగిలిన జిల్లాలను మాడ్చి చిత్తూరు జిల్లాకి తరలించు కెళ్ళిన ఖ్యాతి కూడ కిరణుడికి ఉన్నది.
సమైక్యాంధ్ర అనే నినాదం కూడ పసలేనిది. ఆంధ్ర ప్రదేశ్ వంటి పెద్దరాష్ట్రం, మధ్యలో నల్లమల కొండలు, అరకుకిరండల్ కొండలు ఉన్న రాష్ట్రానికి దూరాలు పెద్ద సమస్య. హిందూపురం నుండి ఇఛ్ఛాపురానికి ఎంతదూరం? ఏడు వందల కిలోమీటర్ల పైచిలుకే. బస్ ఛార్జీలు పెరిగిపోతున్న ఈరోజుల్లో , లాడ్జింగులు ఫుల్ బుకింగ్ జరిగే ఈరోజుల్లో, ప్లేటు భోజనం 50 రూపాయలకమ్మే ఈరోజుల్లో, రాత్రి పూట రైల్వే స్టేషన్లలో కూడ పండుకోనివ్వని ఈ రోజుల్లో, గ్రామీణులు రాష్ట్ర రాజధానికి ఎలా వెళ్తారు? తమ పనులు ఎలా చేయించుకుంటారు?
కనుక శేషాంధ్రను మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించ వలసినదే. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ.
విచిత్రమేమిటంటే, విశాఖ నుండి పోటి చేస్తున్న అభ్యర్ధులు, పార్టీలు, విశాఖను కొత్తరాష్ట్రానికి రాజధానిని చేస్తామని ప్రచారం చేసుకున్నారు.
విగుంతే నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధులు గుంటూరు సభలో సోనియా గుంటూరును పొగడటాన్ని, ఇక్కడే రాజధానిని పెడ్తారు అనటానికి సంకేతంగా తీసుకుని ప్రచారం చేసుకున్నారు.
కడపలో జైరాం రమేష్ గారు , ముందు కడపలో రాజధాని పెట్టిస్తామని వాగ్దానం చేసితరువాత, అభ్యర్ధనను పంపిస్తామని వాగ్దానం చేసారు.
తిరుపతిలో రాజధాని వస్తుందని అక్కడి ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు.
కర్నూలు, సీమాంధ్ర రాష్ట్రానికి పాత రాజధాని. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధానిని ఇస్తామనే వాగ్దానాన్ని నిలుపుకోవాలన్నా, రాజధానికి కర్నూలుకి వెళ్ళాలి.
అందరి కోరికలు తీరాలన్నా మూడు రాష్ట్రాలు రావాల్సిందే.
ఎలాగో సోనియా గాంధీ గారు విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. కనుక మూడు ప్రాంతాలకూ మూడు రాష్ట్రాలను ఇస్తే, ఈమూడు అంతర్జాతీయ విమానాశ్రయాలనూ సద్వినియోగం చేసుకోవచ్చు.
సోనియా గాంధీ గారు తొమ్మిది సీమాంధ్ర పట్టణాలను అభివృధ్ధి చేస్తామన్నారు. అసలు మే 16 తరువాత ఆమె ఎక్కడుంటుందో , ఎలా ఉంటుందో తెలియదు. బిజెపి వారు చూస్తుంటే, ఆమెను, రాహుల్ ను, ప్రియాంకను, రాబర్ట్ వాద్రాను కలిపి మాయా బజార్ సినిమాలో లాగా, పాండవ వనవాసం సినిమాలో లాగా, ఒక దుప్పట్లో ప్యాకింగు చేసి ఇటలీకి ఎయిర్ పార్సెల్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
మొత్తానికి సీమాంధ్రకు సంబంధించినంత వరకు చాల గడ్డు రోజులు ముందు ఉన్నాయి. ప్రధమంగా, హైదరాబాదు నుండి సీమాంధ్రకు, సీమాంధ్రనుండి హైదరాబాదుకు జరిగే, వస్తువుల రవాణాను అంతర్ రాష్ట్ర రవాణాగా పరిగణించి రెండు రాష్ట్రాల్లో వ్యాట్ , కేంద్ర అమ్మకం పన్ను చెల్లించ మనచ్చు. రెండు రాష్ట్రాల సచివాలయాలు, ఒకే ఆవరణలో ఉండటంతో అక్కడ ఎన్ని కొట్లాటలు జరుగుతాయో.
తెలంగాణ లో తెరాస, సీమాంధ్రలో జగన్ అధికారం లోకి వస్తే సినేరియో ఒక రకం సర్దుబాటుగా ఉండ వచ్చు.
తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో శ్రీ నాయుడు అధికారంలో కి వస్తే సీను మారిపోతుంది.
ఈ వ్యాసాన్ని తిరగ వ్రాయవలసి ఉన్నది. To continue adding/deleting/modifying.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.