చర్చనీయాంశాలు: bifurcation, విభజన, ప్రధానమంత్రి, కేంద్రప్రతిపక్షాలు, బిజెపి, తెలంగాణ
ఈరోజు (4-12-2013) విశేషం ఏమిటంటే, ప్రధాని మన్మోహన్, సుష్మా ఒకే రకంగా ప్రవర్తించారు. వాళ్ల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే, మనకు మాయాబజార్ సినిమాలో వాడిన సత్యపీఠంకావాలి.
తెలంగాణాను వేగవంతం చేయాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారు కోరారు. తెలంగాణాకు తాము కట్టుబడి (వచన్ బధ్ధ్) ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉద్ఘాటించారు. వీళ్ళిద్దరికీ , సోనియామాతకు, తెలంగాణాపై ప్రేమ ఎందుకు కారిపోతున్నది? లేని ఆదేవుడికే తెలియాలి. 2014 మే నెల దాకా ఆగితే ప్రజల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, అఖిల భారత జనం, అభిప్రాయాలు ఏమిటో తెలుస్తుంది కదా. కానీ ఎందుకు ఆగలేక పోతున్నారు? సీమాంధ్ర ప్రజలు చికాగో నగరంలోని కబేళాలో తల నరికే యంత్రాలక్రింద మెడలు పెట్టిన ఆవులు, ఎద్దుల్లాగా ప్రధాని, ప్రతిపక్షనేత మనోఫలకంపై గోచరిస్తున్నారా? కెసీఆర్, జైపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి లు వాళ్ళకి ఆపద్బాంధవుల్లాగా సాక్షాత్కరించటంలో బలవత్తర కారణాలేమిటో ?
దేశంలోని రాజకీయ పార్టీలకు ఉచ్చలగుంటల్లో చేపలు పట్టే లక్షణాలు వంటబట్టాయని కొంత అనాగరికమైనా మరల వ్రాయక తప్పటంలేదు. ఇంతకన్నా సౌమ్యమైన లోకోక్తి కొరకు మనం అన్వేషించాలి. దేశంలో తిండి, బట్ట, ఇల్లు, నిరుద్యోగం, ఆదాయం-సంపద పంపిణీల్లో అసమానతలు,మొ|| ప్రధాన సమస్యలని మెడకాయమీద తలకాయ ఉన్నవాడెవడైనా చెప్తాడు.
వీటన్నిటినీ వదిలేసి, బిజెపి భవిష్యత్ ప్రధాని గాచలామణీచేయించుకుంటున్న నరేంద్రమోడీ గారు, కాశ్మీర్ కు సంబంధించిన రాజ్యాంగం ఆర్టికిల్ 370ని ఎందుకు కెలుకుతున్నట్లు?
తెలంగాణా ఏర్పాటు తెలంగాణా ప్రజల పేదరికం, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆసమస్యలకు పరిష్కారాలను వెతుక్కోవాల్సిందే. వేలు లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, డబుల్ ఇంక్రిమెంట్లు, డబుల్ ప్రమోషన్లు, కుప్పలుగా ఇవ్వచ్చనీ కెసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మభ్యపెట్తుంటే, అది అవాస్తవమని బిజేపి రాష్ట్రనేతలు తెలంగాణా ప్రజలకు చెప్పద్దా? బిజేపి కేంద్రనేతలు కెసీఆర్ తో పొత్తుకు ఆశ పడటం వల్లనే, తెలంగాణా పై శ్రీమతి సుష్మా స్వరాజ్ అతి వేగానికి కారణం. ఒకవేళ కెసీఆర్ జానెడు జాగా ఇవ్వకపోయినా, తాము తెలంగాణా ప్రజలకు ఉధ్ధారకులమని ప్రచారం చేసుకుని, తెలంగాణలోని ఆ 17సీట్లకై ఆరాటపడటం ఒకవింత. సోనియామాతకు, మన్మోహన్ గారికీ గులాబి కండువా మీద మహా నమ్మకం. 2004 లో తమను అధికారంలోకి తెచ్చింది గులాబి కండువాయే నని వారి మూఢ విశ్వాసం.
మరల తిట్లపురాణానికి సిధ్ధం కండి
రాయల్ తెలంగాణాకు వ్యతిరేకంగా కెసీఆర్ గారు మరల యుధ్ధం మొదలు పెట్టారు. ఇంక మనకు నిత్యం తిట్లే ఆహారం. గతంలో శ్రీవారు మన్మోహన్ సింగు గారిని చప్రాసీతో పోల్చారు. ఇప్పుడు ఇంక ఏమంటారో చూడాలి.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారి ఛాంబర్ గేట్ల దగ్గర ప్రాణాచారం పడటం మానలేదు. పాపం, ఆయన తన తప్పు లేకుండా, కుదరదని చెప్తూనే ఉన్నాడు. కొందరు సీమాంధ్ర ఎంపీలనయితే, ఇంచుమించుగా గెంటించి వేశాడు. షిండేగారు నిస్సహాయుడు. అంతా సోనియా అమ్మవారి చేతుల్లో ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాటా, అమ్మగారి ఆజ్ఞ మేరకే.
ఇంటర్వ్యూ దొరకని సోనియా మాత ఇంటి గేట్లవద్ద ప్రాణాచారం పడాలంటే, చలి చంపేస్తుంది. అంతేకాదు, జెడ్ కేటగిరీ భద్రతా ఏర్పాట్లకింద, ఆమె రక్షకులు, ప్రాణాచారం పడే సీమాంధ్రనేతలను చితక బొడిచినా అయ్యో అనే దిక్కు లేదు.
ఈ గందరగోళంలో రాష్ట్రమంత్రి శ్రీ డొక్కా వరప్రసాద్ గారు సీమాంధ్ర రాజధాని గుంటూరు జిల్లా అమరావతిలో పెట్టాలంటున్నారు. అమరావతి వారి స్వంత నియోజకవర్గం తాడికొండలో భాగం. లేదంటే, కొండవీడు కావాలిట. ఇది కూడ సమీప ప్రదేశమే. ఇక గుంటూరు ఎంపీ శ్రీరాయపాటి సాంబశివరావు గారికి సీమాంధ్ర రాజధాని గుంటూరు కావాలి. పనబాక లక్ష్మిగారు, పురందేశ్వరి గారు, విజయవాడ గుంటూరు మధ్య ఉండాలన్నారు.
కేంద్రమంత్రి శ్రీ కిషోర్ చంద్రదేవ్ గారికి రాజధాని విశాఖలో ఉండాలి. శ్రీ బొత్స సత్యనారాయణ,గంటా శ్రీనివాసరావు, చిరంజీవి, మొ|| వారి అభిమతం కూడ అదే కావచ్చు.
శ్రీ కోట్ల సూర్యప్రకాశ రెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు, రాయల తెలంగాణ కుదరకపోతే కర్నూల్ రాజధాని కావాలన్నారు.
అందరి కోరికలు ఒక్క సీమాంధ్రతో ఎలాతీరుతాయి? కనీసం మూడు రాష్ట్రాలు ఉంటేకాని, ఈకోరికలు తీరవు.
2014 మేనెల దాకా ఆగితే, ఈలోగా ప్రజల్లో, నేతల్లో మరింత స్పష్టత పెరిగి కనీసం నాలుగు రాష్ట్రాల దిశగా మనం ప్రయాణించచ్చేమో. చచ్చేమో!
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.