చర్చనీయాంశములు: మహాభారతం, నన్నయ , వివాహాలు, వ్యాసభారతం, పద్యకవిత్వం
నన్నయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం, 194వ వచనం.
ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూర సారణ సాంబ సాత్యకి సహితంబుగా నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతి నుండి యమర సిధ్ధ సాధ్య ముని గణ పరివృతుండై యమరేంద్రుండు వచ్చెనంత బృహస్పతి యిచ్చిన యుత్తమ లగ్నంబున నగ్ని యమ నిరృతి వరుణ వాయు ధన దేశానాది సురవరులు , నత్రి భృగు నారద వశిష్ఠ వామదేవ ప్రభృతి మహామునులు సదస్యులుగాఁ గశ్యపప్రజాపతి హోమకర్తగా నరుంథతియు , శచియు, సత్యభామయు, రుక్మిణియు, అప్సరోగణంబులతోడం పురంధ్రీ కార్యంబులు నిర్వహింప సుభద్రార్జునుల వివాహ మహోత్సవం బతి రమ్యంబయ్యె నంత.
(ఇంద్రుడి ఆనంద బాష్పాలు)
తరువోజ ఛందస్సు.
అనిమిష ప్రభుఁడు నిజాత్మజు ననఘు నర్జునుఁ బ్రీతితో నభిషిక్తుఁ జేసి
మనుజేంద్రుఁ గాంచనమణిమయోత్తుంగ మకుట విభూషణ మస్తకుఁ జేసి
యనుపమ కేయూర హారాది భూషణాభిశోభితుఁ జేసి యప్పుడానంద
జనితాంబు కణికార్ద్ర చక్షు సహస్ర జల రుహంబులు దాల్చె సమ్మదం బెసగ.
ఇక్కడ ఇంద్రుడి ఆనందాన్ని నన్నయ తన తరువోజలో వర్ణించిన విధం మనోజ్ఞంగానే ఉన్నది. ఇంద్రుడికి అహల్య భర్త గౌతముడి శాపం వల్ల 1000 కళ్ళు శరీరమంతా వ్యాపించాయనేది విజ్ఞులైన పాఠకులకు తెలుసు. నన్నయ గారి సొగసైన వర్ణన ఏమిటంటే, ఇంద్రుడి వెయ్యి కళ్లలోంచి కూడ ఆనంద బాష్పాలు వచ్చాయిట. ఊహించండి, వెయ్యి కళ్ళు. వెయ్యి కళ్లల్లోంచీ కన్నీళ్ళు. ఇది నన్నయ నానారుచిరార్థ సూక్తినిథిత్వానికి, ప్రసన్న కథాకలితార్ధయుక్తికి నిదర్శనం.
వ్యాస భారతం, ఆది పర్వం, 211 వఆధ్యాయం , 1 నుండి , 212 వఆధ్యాయం , 10 వరకు శ్లోకాలు.
రైవత పర్వతం వద్ద యాదవులు ఉత్సవం జరుపుకుంటున్నారు. కృష్ణార్జునులతోపాటు, సుభద్ర తండ్రి వసుదేవుడు, పెద్దన్న బలరాముడు కూడ ఉన్నారు. (నన్నయ కథనంలో బలరాముడు నగరంలో ఉన్నాడు).
సుభద్రను చూచిన అర్జునుడు మన్మథ తాపంతో బాధ పడుతున్నాడు.
దీన్ని గమనించిన శ్రీకృష్ణుడు:
వనేచరస్య కిమ్ ఇదం కామేనాలోడ్యతే మనః
17 మమైషా భగినీ పార్ధ సారణస్య సహోదరా
యది తే వర్తతే బుథ్ధిర్ అ వక్ష్యామి పితరం స్వయమ్.
సారం: ఎందుకు కామంతో బాధ పడతావు? నాసోదరిని వివాహం చేసుకోటం నీకిష్టమైతే, నేను మానాన్నగారితో మాట్లాడతాను.
అర్జునుడు:
దుహితా వసుదేవస్య వసుదేవస్య చ స్వసా
రూపేణ చైవ సంపన్నా కమ్ ఇవైషా న్ మోహయేత్
19 కృతమ్ ఏవ తు కల్యాణం సర్వం మమ భవేద్ ధ్రువమ్
యది స్యాన్ మమ వార్ష్ణేయీ మహిషీయం స్వసా తవ
20 ప్రాప్తౌ తు క ఉపాయః స్యాత్ తద్ బ్రవీహి జనార్దన
ఆస్దాస్యామి తదా సర్వం యది శక్యం నరేణ తత్
సారాంశం: వార్ష్ణేయి నాకు మహిషి అవుతందంటే మహదానందమే. ఆఉపాయం కృష్ణా నీవే చెప్పు.
శ్రీకృష్ణుడు :
స్వయంవరః క్షత్రియాణాం వివాహః పురుషర్షభ
స చ సంశయితః పార్ధ స్వభావస్యానిమిత్తతః
22 ప్రసహ్య హరణం చాపి క్షత్రియాణాం ప్రశస్యతే
వివాహ హేతొః శూరాణామ్ ఇతి ధర్మవిదో విదుః
23 స త్వమ్ అర్జున కల్యాణీం ప్రసహ్య భగినీం మమ
హర స్వయంవరే హయ అస్యాః కొ వై వేద్ అ చికీర్షితమ్.
సారాంశం: కన్యలను అపహరించటం క్షత్రియులకు ధర్మమే అని ధర్మ విదులు చెప్తారు. కాబట్టి కల్యాణి, ప్రసహ్య భగిని, అయిన నాచెల్లెలిని నీవు అపహరించుకొని తీసుకుపో.
అర్జునుడు సరే అన్నాక, వారు ధర్మరాజు అనుమతి కోసం వార్తావహులను పంపి, ఆయన అనుమతిని సంపాదించారు.
ఆది పర్వము - అధ్యాయము - 212
1 [వైశంపాయనుడు -అర్జునుడు సుభద్రను అపహరించుకొని వెళ్ళిన విధాన్ని వర్ణించాడు.]
తతః సంవాదితే తస్మిన్న అనుజ్ఞాతో ధనంజయః
గతాం రైవతకే కన్యాం విదిత్వా జనమేజయ
వాసుదేవాభ్యనుజ్ఞాతః కదయిత్వేతికృత్యతామ్
2 కృష్ణస్య మతమ్ ఆజ్ఞాయ ప్రయయౌ భరతర్షభః
3 రధేన కాఞ్చనాఙ్గేన కల్పితేన యదావిధి
సైన్యసుగ్రీవ యుక్తేన కిఙ్కిణీజాలమాలినా
4 సర్వశస్త్రొపపన్నేన జీమూతర్ వనాదినా
జ్వలితాగ్నిప్రకాశేన ద్విషతాం హర్షఘాతినా
5 సన్నథ్ధః కవచీ ఖడ్గీ బధ్ధ గోధాఙ్గులిత్రవాన
మృగయా వ్యపదేశేన యౌగపథ్యేన భారత
6 సుభద్రా తవ అథ శైలేంద్రమ్ అభ్యర్చ్య సహ రైవతమ్
దైవతాని చ సర్వాణి బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య చ
7 ప్రదక్షిణం గిరిం కృత్వా ప్రయయౌ ద్వారకాం ప్రతి
తామ అభిద్రుత్య కౌన్తేయః ప్రసహ్యారోపయద్ రధం
8 తతః స పురుషవ్యాఘ్రస్ తామ్ ఆదాయ శుచిస్మితామ్
రధేనాకాశగేనైవ ప్రయయౌ స్వపురం ప్రతి
9 హర్యమాణాం తు తాం దృష్ట్వా సుభద్రాం సైనికో జనః
విక్రోశన్ పరాద్రవత్ సర్వో ద్వారకామ్ అభితః పురీమ్
10 తే సమాసాద్య సహితాః సుధర్మామ్ అభితః సభామ్
సభా పాలస్య తత్ సర్వమ్ ఆచఖ్యుః పార్ధ విక్రమమ్.
ఇక్కడేమున్నది? సుభద్ర రైవత పర్వతాన్ని పూజించింది. బ్రాహ్మణులు స్వస్తివాక్యాలు పొందింది. సుభద్రను అర్జునుడు బలవంతంగా రథంలో ఎక్కించుకున్నాడు. రైవత పర్వతానికి ప్రదక్షిణంచేసారు. అడ్డు వచ్చిన యాదవులను, అర్జునుడు ఓడించి వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్లి ద్వారకానగరంలో జరుగుతున్న సుధర్మ అనే యాదవ రాజ సభలో మొర పెట్టుకున్నారు.
ఇంద్రుడేడీ? వాడి వెయ్యి కళ్ళేవి? ఆవేయి కళ్లలో ఆనంద బాష్పాలేవి? వశిష్ఠ వామదేవాదులు ఏరి? నన్నయగారు చేసిన కల్పనలు ఇక్కడ కన్పించవేం. వాసుదేవుడు ఎత్తుకెళ్లమన్నాడు. అర్జునుడు ఎత్తుకెళ్ళాడు. అంతే.
తరువాత బలరాముడికి తెలియటం, ఆయన ఉద్రేక పడటం, కృష్ణుడు సముదాయించటం వంటివి మామూలే.
నన్నయ కథను తన ఇష్టం వచ్చినట్లు మార్చేశాడు. ఇతిహాసం అంటే 'ఇదికదా జరిగినది ' అని అర్థం. వ్యాసుడు జరిగింది జరిగినట్లు చెప్పాడో లేదో మనకు తెలియదు కానీ, నన్నయ మటుకు వ్యాసుడు వ్రాసిన దాన్ని తన ఇష్టం వచ్చినట్లు వాడేసుకున్నాడు.
బాధాకరమైన విషయం ఏమిటంటే, గుళ్ళల్లో, టీవీల్లో పురాణాలు చెప్పేవాళ్ళు నన్నయ వర్ణనలు అన్ని నిజంగా జరిగినట్లుగా వర్ణించేస్తారు. జనం అవన్ని నిజం అనుకుంటారు. అసలు వ్యాసభారతంలోనే , పురాణ పండాలు ప్రక్షిప్తం చేసినవి ఎన్నున్నాయో మనకు తెలీదు. నన్నయ అదనంగా జోడించటం, ఒక కావ్యం , కవిత్వం కోణంలోంచి చూస్తే బాగుంటుంది. కానీ దానిని ఇతిహాసం అనలేం.
శ్రీకృష్ణార్జునయుధ్ధం చలన చిత్రం
ఎంతో జనాదరణ పొందిన ఈచలన చిత్రరాజాన్ని ఇంతవరకు నేను, దురదృష్టవశాత్తు చూడలేకపోయాను. అందువల్ల ఏమీ వ్రాయలేక పోతున్నాను. నా నమ్మకం: చిత్ర దర్శకులు కీర్తశేషులు శ్రీ కె.వి.రెడ్డి గారు నన్నయ గారి కథనాన్ని అనుసరించి ఉంటారు.అంటే ఇంద్రుడు, వశిష్ఠ వామదేవాది మునుల సమక్షంలోనే సుభద్రార్జునుల వివాహం జరిగి ఉండవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.