చర్చనీయాంశాలు: bifurcation, విభజన, బిజెపి, రాయలసీమ, నదీజలాలు, కడప, చిత్తూరు
కేంద్ర బిజెపి స్వభావం, ఉచ్చలగుంటల్లో చేపలు పట్టే తత్వం లాగా తయారు అయ్యింది. ఈసామెత అనాగరికం అనుకుంటే, అత్తగారూ మీకొంగు తొలగిందన్నా తప్పే, తొలగలేదన్నా తప్పే అన్నట్లుగా తయారు అయ్యింది.
లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ను చూడండి. ఆమె సీమాంధ్రలో విస్తృతంగా పర్యటించిన నేత కాదు. అసలు సీమాంధ్ర ప్రజలు అనేవాళ్ళు 5కోట్లమంది ఉన్నారో లేదు ఆమెకు తెలియదు. ఉండిరిపో వారి సమస్యలేమిటో ఆమెకు తెలియదు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె వెంట పడుతున్నది. నిజంగా కేంద్రం తెలంగాణా బిల్లును శీతాకాలం లోక్ సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టినా, బిజెపి ఏదో ఒక అభ్యంతరాన్ని లేవదీస్తుంది. కాంగ్రెస్ ను ఏదో విధంగా దుయ్యబట్టి ఆపార్టీని గద్దె దించటమే వారి లక్ష్యం తప్ప న్యాయాన్యాయాల ప్రసక్తి లేదు.
అలాగని బిజేపి వారు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేయక పోవచ్చు. ఎందుకంటే, బిజెపి కేంద్రనేతల మెడ గొలుసు, సర్వశ్రీ కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయల చేతిలో ఉంది.
నదీజలాల వ్యవహారం
కెసిఆర్ రాయల తెలంగాణను అభ్యంతరం చెప్పటానికి రెండు ముఖ్యకారణాలను ఊహించ వచ్చు. 1. హైదరాబాదు పై పెత్తనాన్ని రాయలసీమ భూకులం నంబర్ 1 తో పంచుకోటం ఇష్టం లేకపోటం. 2. కెసీఆర్ కోరిక అయిన జూరాల నుండి కృష్ణా జలాలను మెదక్ కు, గోదావరి నది వరకు పంపింగ్ చేసుకోటానికి రాయలసీమ నేతలు అభ్యంతరం చెప్పవచ్చు. క్రింద శ్రీశైలం నుండి కడపకు, చిత్తూరుకు కృష్ణా జలాలను తరలించుకు వెళ్ళాలన్న రాయలసీమ నేతల కోరికకు కెసీఆర్ కోరికకు సంఘర్షణలు అనివార్యం.
జైపాల్ రెడ్డి గారు రాయల తెలంగాణను అభ్యంతరం చెప్పటానికి రెండు ముఖ్యకారణాలను ఊహించ వచ్చు. 1. సోనియా ముఖ్యమంత్రులను నిర్ణయించేటపుడు రాయలసీమ భూకులం నంబర్ 1 కి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. కిరణ్ కు ఆఅవకాశం ఇవ్వటం, కోట్లకు ఆఅవకాశాన్ని ఇవ్వచూపటం, మనకు దృష్టాంతాలు. 2.జైపాలుడికి స్వంత నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పై ఎంత ప్రేమ ఉందో మనకు తెలియదు. నల్గొండ దిగువ ప్రాంతాలవారికి కొంత సాగర్ నీటి రుచి తెలిసినా, ఎగువవారికి, మహబూబ్ నగర్ తూర్పు వారికి ఇంతవరకు ఆరుచి లభించలేదు. శ్రీశైలం ఎడమకాలం సొరంగం , లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏడుస్తున్నాయి. రాయలతెలంగాణా ను నెత్తినేసుకుంటే, ఆయన నీటినీ కడపకు పంపించాల్సి ఉంటుంది. నల్గొండ, మహబూబ్ నగర్ వారికి న్యాయం చేయలేడు.
సహజన్యాయం
ఏనది నీళ్ళైనా ముందు ఆనది సమీప ప్రాంతాల వారి సాగునీటి, త్రాగు నీటి అవసరం తీర్చాలి. ఆ తరువాత, నదికి లంబంకాలువలద్వారా సుదూర ప్రాంతాలకు తరలించటం. అంటే, మొదటి శ్రేణి కాలువలు నదులకు సమాంతరంగానే ఉండాలి. లంబం కాలువలు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. నదీజలాలను సుదూరం తీసుకు వెళ్తున్న కొద్దీ ఇంకుడు నష్టాలు, ఆవిరి నష్టాలు, ఎక్కువవుతాయి. ఇంతచేసినా ఆఖరు లో ఉన్నవాళ్ళకి నీళ్ళు అందవు. అంతేకాదు, కృష్ణాజలాలు పూర్తిగా వరదలపై ఆధార పడినవి. అంటే కర్నాటకలో వరదలు వస్తేకానీ అవి నిండవు.నదీజలాలను ఎన్ని కిలో మీటర్ల వరకు లంబంగా తీసుకు వెళ్ళటానికి అనుమతించవచ్చు అనేదానిపై శాస్త్రీయమైన, సాంకేతిక అధ్యయనాలు జరగాలి. ఆ గరిష్ఠ దూరాన్ని (మాట వరసకు నాగార్జున సాగర్ నుండి లంబంగా 50కిలోమీటర్లు) ఆనదీజలాల పంపిణీ చట్టాల్లో పొందు పరచాలి. కెసీఆర్ ఒకటంటే, జైపాల్ మరొకటంటే, కోట్ల మూడోమాటంటే, దివాకర్ నాలుగో మాటంటే, నదీజలాలను కుక్కలు చింపిన విస్తరి లాగా పంచుకోలేరు కదా.
తెలుగుదేశం వ్యూహం
తెలుగుదేశం పార్టీ, కోస్తాంధ్ర భూకులం నంబర్ 1, మరియు చిత్తూరు జిల్లా భూకులం నంబర్ 2 వారి కుటుంబ నాయకత్వంలో ఉన్న విషయం పాఠకులకు తెలిసిందే. రాష్టంలోని రెండు ప్రముఖ తెలుగు దిన పత్రికలు కూడ తెలుగు దేశం నేతల ప్రభావానికి లోనైయున్న విషయం పాఠకులకు తెలిసినదే. అందరి సమష్ఠి కోరిక ఏమిటంటే, కర్నాటక ఆల్ మట్టీ వద్ద తమ వాటా నీటిని వాడుకోకుండా, మొత్తం నీటిని తొలకరి వానలు పడ్డ మొదటి పక్షంలోనే కృష్ణా డెల్టాకు విడుదల చేయాలి. కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండగా నీరు మిగిలినా మిగిలక పోయినా, చేపల చెరువులు,రొయ్యల చెరువులు నిండాలి. ఎగువ ప్రాంతాలు ఎండి పోయినా తమకు అభ్యంతరం లేదు. ఈకోరిక తీరటంతో పాటు, చంద్రబాబునాయుడు గారి చిత్తూరు జిల్లాకు కూడ సాగునీరు వెళ్ళాలి. సమైక్యరాష్ట్రం అయితే ఇది తేలిక. టీడీపీ బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై (కొంత అతిగా) స్పందించటం, ఈఆవేదనలో ఒక భాగమే. ఇది తప్పా రైటా అనే వ్యాల్యూ జడ్జిమెంటు వ్రాయటం నా పని కాదు. ఎందుకంటే, ప్రజా సమస్యలకు, ప్రాంతీయ సమస్యలకు ఎన్నో కోణాలు ఉంటాయి.జూరాలనుండి గోదావరి వరకు, కృష్ణనీటిని తరలించటాన్ని కెసీఆర్ కల కనటం తప్పనలేం. తన స్వంత జిల్లా కడపకు కృష్ణనీటిని తరలించుకెళ్ళాలనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి తపన తప్పన లేము . కానీ అవి నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం లను మాడ్చకుండా జరగాలి. పోలవరం, దుమ్ముగూడెం, పులిచింతల, సాగర్ టెయిల్ పాండ్ వంటి రాజశేఖర రెడ్డి ప్రణాలికలు కృష్ణాడెల్టా వారికి గోదావరి నీటిని అలవాటు చేసి, శ్రీశైలంనుండి దిగువకి నీటిని పారకుండా చేయటానికే. నేను సూచించినట్లుగా శ్రీశైలం నుండి లంబంగా 50 లేక 100కిలో మీటర్లు వంటి పరిమితులను విధిస్తే ఈకోరిక ఎన్నటికి తీరదు.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కెసీఆర్, జయపాల్ లు, శకుని మామలకు ఏమాత్రం తీసిపోరు.
కడపకు, చిత్తూరుకి సాగునీటి ఉపాయాలు చెప్పండి
శ్రీశైలం నుండి కర్నాటక వదిలే వరదనీటితో కడప, చిత్తూరుల కడుపు నిండదు. కర్నాటక స్వార్థం, నీళ్ళన్నీ ఎండకి ఆవిరవటం, భూమివేడికి ఇంకి పోటం , కాలువల పూడికలు, డిజైన్ లోపాలు, ఇంజనీర్ల అవనీతి ఎన్నో కారణాలు.సముద్రజలాల శుధ్ధే పరిష్కారం
నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలో, సముద్రజలాల శుధ్ధి కర్మాగారాలను నెలకొల్పుకొని శుధ్ధ జలాలను, విద్యుత్ ను ఏకకాలంలో ఉత్పత్తి చేసుకోవాలి. శుధ్ధిచేసిన జలాలను పెన్నానదిలోకి మళ్ళించి అక్కడనుండి ఎగువకు పంపు చేసుకోవాలి. అవసరాన్నిబట్టి, తూర్పునుండి పడమరకు నీటిని పంపు చేసుకోటానికి వీలుగా, అదనపు కాలువలను, పైపులైన్లను నిర్మించుకోవాలి.ఇవన్నీ పగటి కలలు కావు. సాంకేతిక విప్లవం మనముందుకు తెచ్చిన అభివృధ్ధి ద్వారాలు. వినియోగించుకోవాలా, లేక తన్ను కోవాలా అనేది మన ఇష్టం.
సారాంశం
విభజన అనేది ప్రజల భాగస్వామ్యంలో జరగాల్సిందే తప్ప, ఢిల్లీలో కూర్చొని సోనియాగాంధి, సుష్మా స్వరాజ్ లు చేయాల్సింది కాదు. ఒక పది కంపెనీల సైన్యాన్నో, పెరామిలిటరీ దళాలనో రంగంలోకి దించితే జనాలను అణచి వేయవచ్చు అనుకోటం, ప్రమాదకరం. తాత్కాలికంగా జనం సద్దు మణిగి అణగి ఉన్నా, తగిన సమయంలో వారు పేట్రేగుతారు. ప్రజాస్వామ్యం ప్రజాభిమతానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం కుదరదు.విభజన విషయంలో తక్షణ తాత్కాలిక పరిష్కారం చెప్పండి.
కష్టం. అయినా ఈక్రింది ప్రతిపాదనను పరిశీలించ వచ్చు. తాత్కాలికం మాత్రమే.హైదరాబాదును యూనియన్ టెరిటరీ (కేంద్ర పాలిత ప్రాంతం చేయటం). 10 జిల్లాల తెలంగాణాను ఇవ్వటం. నదీజలాల సమస్యను కేంద్ర అథారిటీల ద్వారా పరిష్కరించటం.
తాత్కాలిక సీమాంధ్ర తాత్కాలిక రాజధానిని విజయవాడ గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల గల మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను వెతికి లీజుకు తీసుకొని వాటిలో నెలకొల్పటం, శాసనసభను, సచివాలయాన్ని అక్కడికి తరలించటం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి కార్యాలయం శాఖను కర్నూలు లో నెలకొల్పి, విజయవాడకుప్రయాణాలను తగ్గించటం. శాసనసభ కొన్ని సమావేశాలను కర్నూలులో నిర్వహించటం. ఆర్ టీ సీని మూడు గా విభజించటం. విజయవాడ హైదరాబాదు బస్సులను తగ్గించటం. విజయవాడ అనంతపురం బస్సులను రాయలసీమ ఆర్టీసీకి అప్పగించటం.
తరువాత, సీమాంధ్రను ఎన్ని చిన్నరాష్ట్రాలు చేయాలి, వాటి రాజధానులు ఎక్కడుండాలి, అనే సమస్యలకు చర్చలద్వారా శాశ్వత పరిష్కారాలను వెతుక్కోటం. ముందు సీమాంధ్రులు కెసీఆర్-కోదండరాం-సోనియా-సుష్మా-కిషన్ రెడ్డి ల కుట్రల నుండి బయట పడాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.