Tuesday, July 1, 2014

281 There is the tiger, here is the tail.

281 There is the tiger, here is the tail.
281 అదిగో పులి , ఇదిగో తోక
చర్చనీయాంశాలు: 281, రాజధాని,Capital of AP, అమరావతి, చంద్రబాబు, వికేంద్రీకరణ, శాసనమండలి,సినిమాహాళ్ళు

అదిగో పులి అంటే, ఇదిగో తోక అని వంత పాడటంలో తెలుగు వాళ్ళకు సాటి రాగల వాళ్ళెవరూ లేరు. ఇదివరకు రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య మంగళగిరి సమీపంలోని నాగార్జున యూనివర్సిటి ప్రాంతంలో అంటే, వెంటనే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఏరియా మొత్తాన్ని దున్నేశారు.

ఇపుడు అధికారులు ఎవరో, రాజధాని అమరావతి, తాడికొండ, అచ్చంపేట (గుంటూరు జిల్లా) సమీప ప్రాంతాల్లో అని ఈనాడు దినపత్రిక ప్రథమ పృష్ఠము పతాక శీర్షికకు అందించారు. ఇపుడు రియల్ ఎస్టేట్ వారు అమరావతికి ఎగిరిపోతారు.

ఈ వార్తలన్నీ చూస్తుంటే, పాపం చిత్తూరు జిల్లేతర రాయలసీమ నేతలలో గుండెలలో ములుకులు గుచ్చినట్లుగా ఉంటుంది. దీనికంతటికీ కారణం, చిత్తూరు జిల్లా నేతలైన శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆప్రక్క జిల్లా వారైన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మొ|| రాయలసీమ పెత్తందార్లే. వీరికి రాయలసీమలో తమ జిల్లాలపై పెత్తనంతో పాటు, రాయలసీమ బయట ఏదైనా నగరంలో భూకబ్జా పెత్తనం కావాలి. గతంలో, వారాపనికి హైదరాబాదులో పూనుకుంటే, కెసీఆర్ & కో తిరుగుబాటు చేయించింది. హైదరాబాదుపై తమ పెత్తనాన్ని వదులుకోటానికి ఇష్టం లేక, వెంటనే రాయల తెలంగాణ ప్రతిపాదనను , తెరపైకి తెచ్చారు. ఆలుంగీ వాలా పాలెగాళ్ళు మాకొద్దని టీఆర్ ఎస్ నేతలు మొండికేయటంతో ఆప్రతిపాదన బెడిసి కొట్టింది.

ఇపుడు శేషాంధ్ర ప్రదేశ్ కొత్తరాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య నెలకొల్పి, ఆచుట్టుపక్కల భూములనన్నిటినీ బినామీ పేర్లతో కొనిపించి, ఒక భూసామ్రాజ్యాన్ని స్థాపించటం మన నేతల లక్ష్యం. అందుకే, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాదుకి యూనియన్ టెరిటరీ డిమాండు చేయలేదు. యూనియన్ టెరిటరీలో కేంద్ర పెత్తనం ఉంటుంది తప్ప, తమ పెత్తనం ఉండదు. ఏదో ఒకరోజు తెలంగాణ ప్రజలు కెసీఆర్ తో అసంతృప్తి చెందుతారు, అప్పుడ తాము టిడిపిని బహురాష్ట్ర పార్టీగా ముందుకు నెట్టి హైదరాబాదుని గుప్పెట్లో పెట్టుకోవాలనే కోరిక పోలేదు. ఎంతకీ నగరాలపై పెత్తనం చేయాలనే యావ తప్ప, గ్రామీణ ప్రజలగురించిన ఆలోచనలు మన వెన్నుపోటు సార్వభౌమ గారికి కలుగక పోవటం దురదృష్టకరం.

ప్రస్తుతానికి తాత్కాలిక రాజధాని చాలుశేషాంధ్ర రాష్ట్రంలోని వివిధ జిల్లాల, వివిధ ప్రాంతాల ప్రజలకు, రకరకాల ఆకాంక్షలున్నాయి. అలా ఉండటం తప్పుకాదు. భౌతికంగా శేషాంధ్రకి మధ్యలో ఉన్నాయి అనే నెపంతో ప్రతి దాన్నీ విజయవాడ గుంటూరు చుట్టుప్రక్కలకు తెచ్చి పెట్తే, గతంలో హైదరాబాదులో ప్రతిదాన్నీ తీసుకువెళ్ళి పాతిపెట్టిన తప్పే మరల చేసినట్లవుతుంది.

ఎయిమ్స్ ఇక్కడేట. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్కడేట. రైల్వే జోన్ ఇక్కడేట. ఇలా రోజుకొకటి విజయవాడ, గుంటూరులలో ప్రకటించుకుపోతే, మిగతా ప్రాంతాల ప్రజలకు గుండెకోత కలుగదా? శ్రీకాకుళం నుండి ఎత్తుకొని అనంతపురం వరకు ప్రతిజిల్లాలో ఒక్కోటి చొ|| ప్రకటించుకెళ్ళాలే తప్ప అన్ని గుడ్లనూ ఒకే బుట్టలో పెట్టకూడదు.

నా నిశ్చితాభిప్రాయం ఒకటే. ఈ రోజు కాకపోయినా, ఏదో ఒకరోజుకి శేషాంధ్రను మూడు రాష్ట్రాలుగా విభజించటం అనివార్యం. కాబట్టి విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని తాత్కాలిక పదేళ్ళ రాజధానిగానే ప్రకటించాలి. శాశ్వత రాజధానిగా ప్రకటించకూడదు. రాజధాని భవనాలను నిర్మించినా, ఐదు జిల్లాలకు (పగోజీ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు లో కొంత భాగం) సరిపడేలాగా , చిన్నస్థాయిలో మాత్రమే నిర్మించాలి.

విజయవాడ గుంటూరు లలో తక్షణ తాత్కాలిక ఏర్పాట్లుహైదరాబాదులో ఇంకా ఎక్కువకాలం శేషాంధ్ర సచివాలయాన్ని, శాసనసభను, ఉండనివ్వటం ప్రమాదకరం. విజయవాడ నగర మధ్యలో ఉన్న స్టేడియంలో తాత్కాలిక సచివాలయ భవనాలను ఏర్పాటు చేసుకోవాలి. తక్కువైన వాటికి గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం లో తాత్కాలిక భవనాలను నిర్మించుకోవచ్చు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాసన సభా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శాసన మండలిని సమావేశ పరుచుకోవచ్చు. మరీ మాట్లాతే, శాసన మండలిని ఎత్తేసుకోవచ్చు.

మూతపడిన విజయవాడ, గుంటూరు సినిమా హాళ్ళను (ఉదా: గుంటూరు వోవర్ బ్రిడ్జీ దగ్గర శేష్ మహల్, రంగ మహల్ అనే సినిమా హాళ్ళు ఆదాయపన్నుశాఖవారి స్వాధీనంలో ఉన్నాయి.) ఇతర సినిమాహాళ్ళ వాళ్లదగ్గరనుండి కూడ టెండర్లను పిలువ వచ్చు. సరిగా నడవని లాడ్జీలు, కాలేజీలు ఉంటాయి. టెండర్లు పిలిస్తే ఎందరో ముందుకు వస్తారు. పదేళ్లకు లీజుకు తీసుకొని, రాష్ట్రస్థాయి కార్యాలయాలను నెలకొల్పచ్చు. ప్రతి జిల్లా కేంద్రానికి, జిల్లాకేంద్రాలు కాని రాజమండ్రి, తాడేపల్లిగూడెం, కావలి , ఆదోని, ప్రొద్దటూరు, వంటి నగరాలకు, పట్టణాలకు కొన్ని కార్యాలయాలను కేటాయించ వచ్చు. కోరిక ఉంటే మార్గం ఉంటుంది.

శ్రీచంద్రబాబు నాయుడు గారు, ఆదాయపు పన్ను శాఖ వారిని సంప్రదిస్తే, వారి స్వాధీనంలో ఉన్న రాష్ట్రంలో వారి స్వాధీనంలో ఉన్న భవనాల, ఖాళీస్థలాల వివరాలు తెలుస్తాయి.

శ్రీ చంద్రబాబు నాయుడు దాగుడు మూతలు మానేసి స్పెక్యులేషన్ ను నిరుత్సాహ పరచటం అవసరం. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తానన్న నిధులను, మూడు ప్రాంతాలలోని ముఖ్యనగరాలలో భవన నిర్మాణాలకు వాడుకొని, భవిష్యత్ లో మూడు రాష్ట్రాల రాజధానులను నెలకొల్పుకోటానికి పునాదులు వేయాలి.

ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.